NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చ

ఇవాళ ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీఅమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మద్యం పాలసీపై మ ప్రతిపాదనలను కేబినెట్‌ ముందు మంత్రివర్గ ఉపసంఘం ఉంచనుంది. కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదనలపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. అనంతరం నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై మంత్రి వర్గం ఆమోద ముద్ర వేయనుంది. వరద సాయం, ఇసుక పాలసీ అమలు వంటి వాటి పైనా కేబినెట్‌లో ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది.

 

నేడు చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రకటించనున్న సీఎం..
నేడు చిన్న మధ్యతరహా పరిశ్రమ పాలసీని ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మాదాపూర్ శిల్పకళా వేదికలో ఎంఎస్‌ఎం పాలసీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సీఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికాలో వ్యాపార అవకాశాలన్నీ మన రాష్ట్రంలోనే ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఆరు విధానాలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. పారిశ్రామిక అభివృద్ధికి ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే ఆరు కొత్త పాలసీలను ఖరారు చేయాలని గత సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం MSME పాలసీని ప్రకటించబోతోంది.

 

రెండోరోజు కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం..
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణనాథుల నిమజ్జనం రెండోరోజు కొనసాగుతుంది. ఎన్టీఆర్‌ మార్గ్, పీవీ మార్గ్‌లో గణేష్ విగ్రహాలు భారీగా చేరుకుంటున్నాయి. హుస్సేన్‌సాగర్‌ దగ్గరకు వినాయక విగ్రహాలు వేలాదిగా తరలివస్తున్నాయి. గణేష్ నిమజ్జనాలు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా.. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తరువాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లోపై నిమజ్జనం కోసం గణపతులు క్యూలో ఉన్నాయి. నిమజ్జనం పూర్తి కావడానికి సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. రాత్రి ఒంటిగంటకు చార్మినార్‌లో వినాయక నిమజ్జన శోభయాత్ర ముగిసింది. పాతబస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభయాత్ర ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546, ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌ వద్ద 4,730, నెక్లెస్ రోడ్ 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5230, హైదరాబాద్ అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు వెల్లడించారు. గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందని వివరించారు. బుధవారం సాయంత్రంకల్లా నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గణేష్ మండపాల నుంచి తమ వినాయకులను తొందరగా నిమజ్జనం కోసం తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులు.

 

రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రేపు(గురువారం) మరో 75 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. రేపటి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ప్రారంభించనున్నారు. ఈ సారి విశాఖ నగర పరిధిలో 25 క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మొదటి విడతలో ఇక్కడ క్యాంటీన్లను ఏర్పాటు చేయలేదు. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం 100 అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యాంటీన్లలో రూ.15కే మూడు పూటలా ప్రభుత్వం భోజనం పెడుతోంది. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు ఈ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసింది.

 

ప్లాన్ సక్సెస్‌.. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతం
ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద భారీ బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. ఓ భారీ బోటును బయటకు తీయగలిగారు. ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న 40 టన్నుల బరువున్న భారీ బోటును బెకెం ఇన్‌ఫ్రా సంస్థ ఇంజినీర్లు విజయవంతంగా ఒడ్డుకు చేర్చారు. H బ్లాక్‌ ఆపరేషన్ పద్ధతి ద్వారా మొదటి బోటును ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. బోట్ల సాయంతో నీటిలో చిక్కుకున్న బోటును ఒడ్డుకు తరలించే ప్రక్రియలో ఇంజనీర్లు పురోగతి సాధించారు. ఇప్పటివరకు 4 రకాల ప్లాన్లతో శతవిధాలుగా ప్రయత్నించినా నిరాశే ఎదురుకాగా.. 5వసారి సరికొత్త వ్యూహాన్ని అమలు చేసిన ఓ భారీ బోటును ఒడ్డుకు చేర్చారు. డ్రెడ్జింగ్ చేసే రెండు భారీ బోట్లకు గడ్డర్లను అమర్చి చిక్కుకున్న పడవను ఒడ్డుకు తరలించారు. బుధవారం మిగిలిన భారీ బోట్లను ఇదే విధానంలో బయటకు తీసే ప్రక్రియను ఇంజినీర్లు కొనసాగించనున్నారు. గేట్ల దగ్గర చిక్కుకున్న భారీ బోట్‌ను పున్నమి ఘాట్ వద్ద ఒడ్డుకు చేర్చారు. బ్యారేజీ ఎగువన కిలోమీటర్‌ పైగా దూరంలో పున్నమి ఘాట్‌లో ఆ బోట్‌ను ఉంచారు. బోట్‌ను విజయవంతంగా వెలికితీసిన సిబ్బందిన మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. బ్యారేజ్‌కు నష్టం వాటిల్లకుండా 8 రోజుల నుంచి చేస్తున్న కృషి ఫలించిందన్నారు. మిగిలిన రెండు బోట్లను కూడా వెలికి తీస్తామని మంత్రి తెలిపారు.

 

వచ్చే వారం ప్రధాని మోడీని కలుస్తా..
అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వచ్చే వారం సమావేశం అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ తెలిపారు. మిచిగాన్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత ప్రధాని మోడీ ఓ అద్భుతమైన వ్యక్తి అంటూ ప్రసంశలు కురిపించారు. అయితే, మోడీతో భేటీకి సంబంధిచిన పూర్తి వివరాలను మాత్రం ఆయన తెలియజేయలేదు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌.. ప్రధాని మోడీతో సమావేశం అవుతానని ప్రకటించటంపై తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, వచ్చే వారం సెప్టెంబర్‌ 21 నుంచి 23వ తేదీ వరకు ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షతను జరగనున్న నాలుగో క్వాడ్‌ సమ్మిట్‌లో నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. సెప్టెంబర్‌ 21వ తేదీన న్యూయార్క్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. 22వ తేదీన న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌’’లో కూడా ప్రధాని ప్రసంగించబోతున్నారు. ఇక, 2020 ఫిబ్రవరిలో భారతదేశాన్ని సందర్శించిన టైంలో డొనాల్డ్ ట్రంప్‌.. ప్రధాని మోడీతో చివరిసారి కలిశారు.

 

నేడే మొదటి దశ ఓటింగ్.. బరిలో 219 మంది అభ్యర్థులు…
పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో నేటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆర్టికల్ 370ని తొలగించి, లడఖ్‌ను విభజించిన తదుపరి, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత ఇది మొదటి ఎన్నికలు. ఈరోజు (బుధవారం) న మొదటి దశలో మొత్తం 24 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకు గాను బరిలో 219 మంది అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలింగ్‌ బూత్‌ల వద్ద భారీ బందోబస్తు, వాహన ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు ప్రాంతీయ మేజిస్ట్రేట్లు, జోనల్ అధికారులను కూడా రంగంలోకి దించారు. మొదటి దశలో పుల్వామాలో 4, షోపియాన్‌లో 2, కుల్గామ్‌లో 3, అనంత్‌నాగ్‌లో 7, రాంబన్‌లో 2, కిష్త్వార్‌లో 3, దోడా జిల్లాలోని 3 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మరి అభ్యర్థుల ఈ ప్లాన్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా మొదటి దశ ప్రజాదరణ పొందిన అభ్యర్థుల గురించి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇది కాకుండా కేంద్రంలోని అధికార బీజేపీ షగుణ్ పరిహార్ పై పందెం కాసింది. భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు గులాం అహ్మద్ మీర్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి సునీల్ శర్మ, పీడీపీ యువనేత వహీద్ ఉర్ రెహ్మాన్ పారా పేర్లు కూడా బాగా వినిపిస్తున్నాయి.

 

జమ్మూకాశ్మీర్‌లో తొలి విడత ఎన్నికలు.. ప్రధాని మోడీ కీలక సందేశం..
జమ్ముకశ్మీర్‌లో 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతంలో నేడు తొలి విడత ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది. మొదటి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో 219 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కశ్మీర్‌లో 16, జమ్ములో 8 స్థానాల్లో 3 వేల 276 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ అధికారులు ఏర్పాటు చేశారు. 23 లక్షల 27 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎల్‌వోసీ దగ్గరున్న పోలింగ్ స్టేషన్ల దగ్గర అదనపు బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో పాటు అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతంలోని పౌరులు “పెద్ద సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగ”ను జరుపుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలి.. మీరు వేసే ఓటు ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.

 

నేడే ‘ఎన్‌పీఎస్ వాత్సల్య యోజన’ ప్రారంభించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి.. ప్రయోజనలేంటంటే.?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18న ఎన్‌పిఎస్ వాత్సల్య యోజనను ప్రారంభించనున్నారు. దీనిని 2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించారు. దేశంలోని పిల్లలందరికీ బలమైన ఆర్థిక పునాదిని అందించడమే ఈ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రితో పాటు పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎన్‌పీఎస్ వాత్సల్యలో పెట్టుబడి పెట్టేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించనున్నారు. దీంతో పాటు పథకం గురించిన సమాచారాన్ని అందించే పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నారు. మైనర్ సబ్‌స్క్రైబర్‌లకు పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (PRAN) కార్డ్‌లు ఇవ్వబడతాయి. దీన్ని మరింత అందుబాటులోకి తెచ్చి ప్రభావవంతంగా చేయడానికి, భారతదేశంలోని దాదాపు 75 ప్రదేశాలలో ఎన్‌పీఎస్ (NPS ) వాత్సల్య కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ప్రదేశాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యూఢిల్లీలో జరిగే ప్రధాన కార్యక్రమానికి అనుసంధానించబడతాయి. PRAN సభ్యత్వం వారి సంబంధిత ప్రాంతాలలో కొత్త మైనర్ సబ్‌స్క్రైబర్‌లకు కూడా ఇవ్వబడుతుంది. NPS వాత్సల్య యోజన ద్వారా, తల్లిదండ్రులు పెన్షన్ ఖాతాలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారి పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయవచ్చు. ఈ పథకం దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా పెట్టుబడి ఎంపికలను కలిగి ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల పేరుతో సంవత్సరానికి కనీసం రూ. 1,000తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. దీంతో సమాజంలోని అన్ని వర్గాలకు ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. ఈ పథకం సమగ్రతను, ఆర్థిక భద్రతను ప్రోత్సహిస్తుంది. ఈ పథకం కింద, 3 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి తర్వాత, విద్య, తీవ్రమైన అనారోగ్యం, వైకల్యం వంటి అవసరాల కోసం డిపాజిట్ మొత్తంలో 25% విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది గరిష్టంగా మూడు సార్లు చేయవచ్చు. యూనియన్ బడ్జెట్ 2024లో, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు యాజమాన్యం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పిఎస్)లో కోత రేటును ఉద్యోగి జీతంలో 10 శాతం నుండి 14 శాతానికి పెంచాలని ప్రతిపాదించబడింది. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలోని ఉద్యోగులు తమ జీతంలో 14% వరకు తమ NPS ఖాతాకు యజమాని సహకారానికి తగ్గింపుకు అర్హులు. కంట్రిబ్యూషన్ పరిమితి పెంపుదల కార్మికుల సామాజిక భద్రతను బలోపేతం చేస్తుంది. NPS వాత్సల్య యోజన అనేది తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి ఒక గొప్ప అవకాశం. ముందుగానే ప్రారంభించడం, క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారా, కుటుంబాలు తమ పిల్లల కోసం పెద్ద కార్పస్‌ను సృష్టించవచ్చు. ఈ పథకం అన్ని వయసుల వారికి ఆర్థిక భద్రత కల్పించాలనే ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా ఉంది. ఏ భారతీయ పౌరుడైనా అతని/ఆమె బిడ్డ పేరు మీద ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ స్కీంలో పిల్లవాడు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఖాతా నుండి నిధులను ఉపసంహరించుకోవచ్చు. లేదా 60 సంవత్సరాల వయస్సులో పెన్షన్ పొందవచ్చు.

 

మయన్మార్‌లో యాగీ తుఫాన్ విధ్వంసం..226 మంది మృతి
మయన్మార్‌లో యాగీ తుఫాన్ తీవ్ర నష్టం కలిగిస్తుంది. మొన్నటి వరకు వియత్నాం దేశాన్ని వణికించిన ఈ తుఫాన్.. ఇప్పుడు మయన్మార్‌పై ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. యాగీ తుఫాన్ వల్ల కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. భారీ వరదలు వస్తుండటంతో పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 226 మంది మరణించగా.. మరో 77 మంది తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. లక్షలాది మంది ప్రజలు తాము ఉంటున్న ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఈ తుఫాన్ వల్ల ఇప్పటికే 6.30 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ది కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ విపత్తు సంస్థ వెల్లడించింది. కాగా, ఈ యాగీ తుఫాన్ వల్ల ముఖ్యంగా రాజధాని నేపిడావ్ ప్రాంతంతో పాటు కయా, కయిన్ అలాగే షాన్ రాష్ట్రాల్లోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఆహారం, తాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. మయన్మార్ చరిత్రలో ఇంతటి దారుణ తుఫాన్ ఇప్పటి వరకు రాలేదనీ.. అత్యంత దారుణ వరదలు ఇవేని ఐక్యరాజ్యసమితి చెప్పుకొచ్చింది. మయన్మార్‌లో వరదల ధాటికి ఇప్పటి వరకు 2,60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రహదారుల లాంటి మౌలిక సౌకర్యాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. మరోవైపు వరద బాధితులకు సహాయం చేయాలంటే కూడా వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఈ క్రమంలోనే తమకు సాయం చేసేందుకు ముందుకు రావాలని మయన్మార్‌ సైనిక పాలక వర్గం పలు దేశాలని కోరుతుంది. కాగా, యాగీ తుఫాన్ చైనా, వియత్నాం, థాయ్ లాండ్‌, లావోస్‌ దేశాలలోనూ ప్రభావం చూపిస్తుంది. యాగీ తుఫాన్ కారణంగా ఒక్క వియత్నాంలోనే ఇప్పటి వరకు దాదాపు 300 మంది వరకు చనిపోయారు.

Show comments