NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటి నుంచి కోటి దీపోత్సవం.. తొలిరోజు విశేష కార్యక్రమాలు ఇవే
కార్తీక మాసంలో ప్రతీ ఏటా కోటి దీపోత్సవాన్ని.. అశేష భక్తవాహిణి మధ్య నిర్వహిస్తూ వస్తోంది భక్తి టీవీ.. లక్ష దీపోత్సవంతో ప్రారంభమై.. కోటి దీపోత్సవంగా మారిన ఈ దీపాల పండగను రచన టెలివిజన్‌ లిమిటెడ్‌ ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహిస్తోంది.. ఇప్పటికే ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. ఈ మహా దీప యజ్ఞం.. ఈరోజు ప్రారంభం కానుంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ప్రతీ ఏడాది కోటి దీపాల పండుగ నిర్వహిస్తోన్న విషయం భక్తలకు విదితమే.. కార్తీక మాసంలో కోటి దివ్వెల పండుగ.. నేటి తరానికి సనాతన సంస్కృతి పరిచయం చేస్తోంది.. భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024లో మొదటి రోజు విశేష కార్యక్రమాల విషయానికి వస్తే.. తుని తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ.. నంబూరు శ్రీకాళీ వనాశ్రమాధిపతి యోగిని శ్రీచంద్ర కాళీ ప్రసాద మాతాజీ గార్లచే అనుగ్రహ భాషణం.. బ్రహ్మశ్రీ డాక్టర్ మైలవరు శ్రీనివాసరావు ప్రవచనామృతం.. వేదికపై కాశీస్పటిక లింగానికి శత అష్టోత్తర శంఖాభిషకం.. భక్తులచే స్వయంగా కోటిమల్లెల అర్చన.. ఇక, కోటి దీపోత్సవం వేదికపై కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వరస్వామి కల్యాణం.. అనంతరం హంసవాహనంపై ఆదిదంపతులు దర్శనం ఇవ్వనున్నారు.. సాయంత్రం 5.30 గంటలకు భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది.. ఇక, దీని కోసం టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ సిటీలోని 18 డిపోల పరిధి నుంచి కోటిదీపోత్సవ వేదికకు ప్రత్యేక బస్సులు నడుపుతోన్న విషయం విదితమే.. అందరూ ఆహ్వానితులే.. కోటి దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్.

నేడు సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి శ్రీశైలంకు సీఎం చంద్రబాబు
ఇవాళ ఉదయం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్ ట్రయల్ రన్ ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి, పర్యాటక శాఖామంత్రి, ఇతర స్ధానిక ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొంటారు‌.. పున్నమి ఘాట్‌ నుంచి సీఎం చంద్రబాబు సీ ప్లేన్ లో ప్రయాణిస్తారు.. సీ ప్లేన్ లో విజయవాడ నుంచి శ్రీశైలం చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు.. ఇతర మంత్రులు.. ఉదయం 10:30 గంటలకు పున్నమి ఘాట్ వద్దకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి సీ ప్లేన్ లో శ్రీశైలం చేరుకుంటారు.. ఆ తర్వాత శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోనున్నారు.. అనంతరం శ్రీశైలం‌ నుంచి తిరిగి విజయవాడకు సీ ప్లేన్ లో వెళ్లనున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలంలో పర్యటన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు.. పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్ సర్వీసులను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా శ్రీశైలంలో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. శ్రీశైలం ఫారెస్ట్‌లో గ్రేహౌండ్స్​ బలగాలు జల్లెడ పడుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్​ లో ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు, పోలీసు బలగాలు హై స్పీడ్​ ఇంజన్​ బోట్లతో రెస్క్యూ టీమ్​ ను మోహరించారు.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజీ పున్నమి ఘాట్‌ నుంచి సీ ప్లేన్ లో బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు శ్రీశైలం పాతాళగంగ వద్ద బోటింగ్ పాయింట్ కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు.. శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొని.. తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు.. ఆ తర్వాత తిరిగి విజయవాడకు బయల్దేరి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..

నేడు ముంబైకి సీఎం రేవంత్‌ రెడ్డి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఉదయం 8.30 గంటలకు ముంబై బయలుదేరనున్నారు. అక్కడి నుంచి రేవంత్ మహారాష్ట్రకు వెళ్లనున్నారని గాంధీ భవన్‌ వర్గాలు తెలిపారు.. కాగా.. త్వరలో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రేవంత్ ముందు ముంబై వెళ్లి అక్కడి నుంచి మహారాష్ట్ర చేరుకుంటారని వెల్లడించారు. మహారాష్ట్రలోని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులతో కలిసి ఎన్నికల ప్రచారంతో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడనున్నారు. మీడియా సమావేశం అనంతరం మళ్లీ శనివారం రాత్రికే రేవంత్‌ హైదరాబాద్‌ చేరుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే.. ఇవాళ శనివారం ఉదయం జార్ఖండ్‌ బయలుదేరి వెళ్లనున్నారు.. శని, ఆదివారాల్లో అక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం ఆదివారం రాత్రికి బట్టి విక్రమార్క హైదరాబాద్‌ తిరిగి రానున్నారు.

నేడు యాదాద్రిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన..
నేడు యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటించనున్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిషన్‌ రెడ్డి పరిశీలించనున్నారు. పోచంపల్లి మండల కేంద్రంతో పాటు, రేవన్నపల్లిలో కిషన్‌రెడ్డి పర్యటన కొనసాగనుంది. ఈ రోజు, ఈ నెల 11, 13 తేదీల్లో బీజేపీ బృందాలు వరి కొనుగోలు కేంద్రాల పరిశీలించనున్నారు. కాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రానున్న సందర్భంగా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షడు డబ్బీకార్‌ సాహేశ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. పోచంపల్లిలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు, రేవనపల్లి, గౌస్‌కొండ ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిషన్‌ రెడ్డి సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుల వద్దకు స్వయంగా ఆయన వెళ్లి మాట్లాడుతారని వివరించారు.

కేదార్‌నాథ్ ధామ్‌లో పరిపాలన నిర్లక్ష్యం.. ఆర్టీఐ ద్వారా వెల్లడైన సంచలన నిజాలు
చార్ ధామ్‌లో ఒకటైన కేదార్‌నాథ్ ధామ్‌లో పరిపాలన నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. డ్యామ్‌ చుట్టూ ఉన్న గుంతల్లో టన్నుల కొద్దీ శుద్ధి చేయని చెత్తను వేస్తున్నట్లు ఆర్టీఐ వెల్లడించింది. సున్నితమైన ఈ ప్రాంతంలో చెత్తను వేయడంతో పర్యావరణ ప్రేమికుల్లో ఆందోళన పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన పర్యావరణవేత్త, ఆర్టీఐ కింద అందిన సమాచారం ప్రకారం.. 2022 – 2024 మధ్య కేదార్‌నాథ్ ధామ్‌లోని ఆలయం సమీపంలోని రెండు గుంటలలో మొత్తం 49.18 టన్నుల శుద్ధి చేయని వ్యర్థాలను డంప్ చేసినట్లు చెప్పారు. ఆర్టీఐ నుండి అందిన సమాచారం ప్రకారం.. ఈ కాలంలో చెత్త పరిమాణంలో నిరంతర పెరుగుదల కనిపించింది. 2022లో 13.20 టన్నులు, 2023లో 18.48 టన్నులు, ఈ ఏడాది ఇప్పటివరకు 17.50 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. ఈ కాలంలో 23.30 టన్నుల అకర్బన వ్యర్థాలు కూడా ఉత్పత్తి అయ్యాయి. ఈ వ్యర్థాలన్నింటినీ రీసైకిల్ చేశామని కేదార్‌నాథ్ నగర్ పంచాయతీ ప్రజా సమాచార అధికారిని ఆర్టీఐ కార్యకర్త అమిత్ గుప్తా ప్రశ్నించగా చెప్పారు. చెత్త ఉత్పత్తి, దానిని శుద్ధి చేయకుండా వదిలేస్తున్నట్లు ఆర్టీఐ నుండి అందిన సమాచారం దిగ్భ్రాంతికరమని గుప్తా అన్నారు. దీంతో అక్కడ వ్యర్థాల నిర్వహణకు ఎలాంటి వ్యవస్థ లేదని స్పష్టమవుతోంది.

ఎటూ తేలని కోల్ కతా డాక్టర్ హత్య కేసు.. నేడు మరోసారి వైద్యుల నిరసన
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన జరిగి మూడు నెలలు గడిచింది. అయితే దోషులకు ఇంతవరకు శిక్ష పడలేదు. సీబీఐ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. కానీ ఇప్పటికీ న్యాయం జరగలేదని జూనియర్‌ వైద్యులు పేర్కొంటున్నారు. ఆగస్టు 9న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో నిందితుడైన పౌర వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను జైలు కస్టడీలో ఉన్నాడు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ సిబిఐపై నేరుగా ప్రశ్నలు లేవనెత్తుతూ సివిల్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. న్యాయం చేయాలంటూ నవంబర్ 9న మధ్యాహ్నం 3 గంటలకు కాలేజ్ చౌరస్తా నుంచి ధర్మతాళ్ల వరకు పాదయాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు ఆ రోజు జూనియర్ డాక్టర్ల ఉద్యమ చిత్రాలను కూడా ప్రదర్శిస్తామని తెలిపారు. వీరితో పాటు ఆర్‌జి కార్‌ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించనున్నారు. గత బుధవారం.. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ టార్చ్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ నుండి సిజిఓ కాంప్లెక్స్ వరకు వారు కొవ్వొత్తులతో ఊరేగింపు నిర్వహించారు. ఆ రోజు నిరసనకారులు అనేక ప్రశ్నలు అడిగారు. ఆ రోజు సీబీఐ చార్జిషీటుపై జూనియర్ డాక్టర్లు కూడా ప్రశ్నలు సంధించారు. ఆగస్టు 9న శవపరీక్ష నుంచి శాంపిల్ తీసుకున్నా.. 14వ తేదీనే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారనేది అతని ప్రశ్న. ఇంత ఆలస్యం ఎందుకు? సంజయ్ రాయ్‌ను 9వ తేదీ రాత్రి అరెస్టు చేశారు. అయితే ఆమె రక్తపు మరకలు 12వ తేదీన బ్యారక్ నుండి తీసుకొచ్చారు. మరి ఇంత ఆలస్యమెందుకు అయింది.

బ్రెజిల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కాల్పులు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
బ్రెజిల్‌లోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గ్వారుల్‌హోస్‌లోని సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయంలో నల్లటి కారులో వచ్చిన గుర్తుతెలియని ముష్కరులు కాల్పులు జరిపారని, ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని బ్రెజిల్ పోలీసులు తెలిపారు. బాధితుడిని ఆంటోనియో వినిసియస్ లోప్స్ గ్రిట్జ్‌బాచ్‌గా పోలీసులు గుర్తించారు. ఆంటోనియోకు అంతకుముందు ఒక శక్తివంతమైన అంతర్జాతీయ క్రిమినల్ గ్రూప్ ఆఫ్ కాపిటల్ ఫస్ట్ కమాండ్ నుండి హత్య బెదిరింపులు వచ్చినట్లు చెప్పబడింది. క్రిప్టోకరెన్సీ వ్యాపారాన్ని కలిగి ఉన్న గ్రిట్జ్‌బాచ్ ఇటీవల స్థానిక ప్రాసిక్యూటర్‌లతో క్రిమినల్ ఆర్గనైజేషన్‌తో తన సంబంధాల గురించి మాట్లాడటానికి ఒక అభ్యర్థనను కుదుర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన ముష్కరుల సంఖ్యను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. సోషల్ మీడియా ఫుటేజీలో విమానాశ్రయంలో కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. టెర్మినల్ 2 వద్ద ఒక బాధితుడు నేలపై పడుకుని ఉండడాన్ని చూడవచ్చు. ఈ టెర్మినల్ ప్రధానంగా దేశీయ విమానాల కోసం ఉపయోగించబడుతుంది. మరొకటి టెర్మినల్ వెలుపల యాక్సెస్ రోడ్డుపై ఇరుక్కుపోయి కనిపించింది.

మట్కా కోసం 4 రకాల డబ్బింగ్.. వరుణ్ తేజ్ కష్టం ఫలించేనా..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ . వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పలాస, శ్రీదేవి సోడాసెంటర్ వంటి సినిమాలు తెరకెక్కించిన కరుణ కుమార్  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.  ఇటీవల  మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ‘మట్కా’ టీజర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. హిట్టు కళ కనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు నెటిజన్స్. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ ను ఫినిష్ చేసాడు హీరో వరుణ్ తేజ్.ఈ చిత్రంలో నాలుగు డిఫ్రెంట్ గెటప్స్ లో అలాగే నాలుగు వేరు వేరు వయసు కలిగిన పాత్రల్లో వరుణ్ కనిపిస్తాడు. దీంతో దడబ్బింగ్ కూడా నాలుగు వేరియేషన్స్ లో నాలుగు వివిధ రకాల మాడ్యులేషన్ లో చెప్పాడట మెగా ప్రిన్స్. మట్కా కోసం 4 రకాల మాడ్యులేషన్ తో డబ్బింగ్ చెప్పిన విధానం గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఒక్కో వేరియేషన్ కు ఒక్కోలాగా, దర్శకుడు కోరిన విధంగా తాన పాత్రకు సరిగ్గా సరిపోయేట్టు చెప్పిన విధానం తెరపై చూసినప్పుడు ప్రేక్షకులు వరుణ్ తేజ్ కష్టానికి, డేడికేషన్ ను మెచ్చుకుంటారని యూనిట్ భావిస్తోంది. వరుణ్ తేజ్ డబ్బింగ్ కంప్లిట్ చేసిన వీడియోను రిలీజ్ చేసారు మేకర్స్. నవంబరు 14న రిలీజ్ కానున్న మట్కా సూపర్ హిట్ సాధించి వరుణ తెజ్ ను మళ్ళి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ ఫోటో లీక్
ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్నమోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . ప్రపంచవ్యాప్తంగా అటు బన్నీ ఫాన్స్ తో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తాజగా ఈ సినిమాలోకి స్పెషల్ సాంగ్ షూట్ ను మొదలెట్టారు మేకర్స్. ఈ సాంగ్ కోసం టాలీవుడ్ డాన్సింగ్ డాల్ శ్రీలీలను ఎంపిక చేశారు దర్శకుడు సుకుమార్. దాదాపు గత ఐదు రోజులుగా ఈ సాంగ్ ను షూట్ చేస్తున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ పేరును ప్రకటించారు మేకర్స్. బన్నీ శ్రీలీలపై వచ్చే ఈ పాట ‘కిస్సిక్’ అంటూ రానుంది. మొదటి పార్ట్ లోని ఊ ‘అంటావా మావ’ ఎలాగైతే సెన్సేషన్ అయిందో రాబోతున్న ‘కిస్సిక్’ కూడా అంత పాపులర్ అవుతుంది అని టీమ్ భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ‘కిస్సిక్’ సాంగ్ లోని ఫోటో ఒకటి లీక్ అయింది. పింక్ డ్రెస్ లో బన్నీ, శ్రీలీల ఈ సాంగ్ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ కిస్సిక్ పాటలోని ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.