NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. నేటి షెడ్యూల్‌ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్న నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండో రోజు పర్యటనలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ.. ఇలా పలువురు కేంద్ర మంత్రులను కలిసి చంద్రబాబు.. మూడో రోజు కూడా మరికొందరితో సమావేశం కాబోతున్నారు.. ఈ రోజు ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈఓతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇక, ఉదయం 10 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు.. ఉదయం 10.45 గంటలకు జేపీ నడ్డాతో సమావేశం కాబోతున్నారు.. మరోవైపు.. ఉదయం 11.30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్‌ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం.. ఇక, ఇవాళ్టితో సీఎం చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగియనుంది.. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌ చేరుకోనున్నారు చంద్రబాబు.. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి-ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్న విషయం విదితమే..

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని కస్టడీకి ఇవ్వండి.. కోర్టులో పోలీసుల పిటిషన్‌
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసం సహా మరికొన్ని కేసుల్లో అరెస్ట్‌ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు పోలీసులు.. పల్నాడులో జరిగిన విధ్వంసాలు, పలువురుపై హత్యాయత్నం కేసుల్లో.. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని.. ఈ కేసుల్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తే పూర్తి ఆధారాలు సేకరించే అవకాశం ఉందని.. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు పోలీసులు.. మాచర్ల అదనపు జూనియర్ సివిల్ కోర్టులో గురువారం రోజు దాదాపు ఐదు గంటల పాటు దీనిపై వాదనలు జరిగాయి.. ఇక, ఈ పిటిషన్ పై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును ఈ రోజుకి వాయిదా వేశారు.. ఈ నేపథ్యంలో న్యాయస్థానం, పోలీసుల కస్టడీకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇస్తుందా..? లేదంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నేడు ఎంపీగా అమృతపాల్ సింగ్ ప్రమాణస్వీకారం..
ఇవాళ ఎంపీగా ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ లోక్ సభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ‘వారిస్ పంజాబ్ దే’ అధినేత అయిన అమృత్ పాల్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్ నుంచి విజయం సాధించారు. ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 2లక్షల మెజారిటీతో గెలిచారు. అయితే, జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో అమృతపాల్ ఖైదీగా ఉన్నారు. పెరోల్ దొరకకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎంపీలంతా ప్రమాణం చేసే రోజు చేయడానికి అతడికి సమయం కుదరదలేదు.. తాజాగా ఆయనకు నేటి నుంచి నాలుగు రోజుల పాటు బెయిల్ లభించింది. దీంతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రైవేట్ ఛాంబర్ లో అమృతపాల్ సింగ్ తో ఎంపీగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. అలాగే, ఉగ్రనిధుల కేసులో నిందితుడు, బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్ కూడా ఈరోజు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, అమృత్ సర్ జిల్లా అన్నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్ పాల్ సింగ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అతడు చాలాకాలం దుబాయిలో నివాసం ఉన్నాడు. వారిస్ పంజాబ్ ‘ సంస్థ వ్యవస్థాపకుడు దీపి సిద్ధూ చనిపోవడంతో అమృత్ పాల్ సింగ్ ఆ సంస్థకు తానే నాయకుడినని అంటూ ప్రకటించుకున్నాడు. నాటి నుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబినే స్థావరంగా సింగ్ ఎంచుకున్నాడు. అజ్నాలా ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అజ్ఞాతంలోకి వెళ్లాడు.. చివరికి రోడెవాల్లోని గురుద్వారాలో అతడిని పోలీసులు అరెస్టు చేసి డిబ్రూగఢ్ జైలుకు పంపించారు.

దేశంలో 8 నెలల గరిష్టానికి నిరుద్యోగం.. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ..!
భారతదేశంలో నిరుద్యోగం రోజురోజుకి పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ(CMIE) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మే నెలలో 7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి పెరిగిపోయిందని సీఎంఐఈ తెలిపింది. గత ఏడాది జూన్‌లో 8.5 శాతంగా నిరుద్యోగ రేటు ఉండగా.. ఈ జూన్‌లో 0.7 శాతం పెరిగిందన్నారు. ఇక, మహిళల్లో నిరుద్యోగం మరింత ఎక్కువగా ఉందన్నారు. గత ఏడాది జూన్‌లో 15.1 శాతంగా ఉన్న మహిళల నిరుద్యోగ రేటు ఈసారి జూన్‌లో 18.5 శాతానికి ఎక్కువైంది. కాగా, పురుషుల విషయానికి వస్తే.. గత ఏడాది జూన్‌లో 7.7 శాతంగా ఉండగా ఈ జూన్‌లో 7.8 శాతానికి పెరిగిందని ఈ సర్వేలో తేలింది. అయితే, గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్టు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకనామీ చేసిన సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో 6.3 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూన్‌లో 9.3 శాతానికి పెరిగింది చెప్పుకొచ్చింది. గత ఏడాది జూన్‌లో 8.8 శాతం ఉండగా.. ఇప్పుడు 0.5 శాతానికి ఎగబాకింది. గ్రామీణ ప్రాంతా పురుషుల్లో నిరుద్యోగం మే నెలలో 5.4 శాతం ఉండగా జూన్‌లో 8.2 శాతానికి పెరిగిపోయిందన్నారు. గ్రామీణ మహిళల్లో 12.0 శాతం నుంచి 17.1 శాతానికి పెరిగిపోయిందని సీఎంఐఈ చెప్పుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరుగుదల కాస్త తక్కువగా కనిపిస్తుందన్నారు. మే నెలలో 8.6 శాతం నిరుద్యోగ రేటు ఉండగా జూన్‌లో 8.9 శాతానికి మాత్రమే పెరిగింది.

రిషి సునక్ చరిత్రాత్మక ఓటమి.. ఎగ్జిట్ పోల్‌లో లేబర్ పార్టీకి 410 సీట్లు
బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలకు ముందు గురువారం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దీని ప్రకారం లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని కానున్నారు. ఎగ్జిట్ పోల్స్ పార్లమెంట్ ఎన్నికల్లో రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీ చారిత్రాత్మక ఓటమిని సూచించాయి. 650 సీట్ల పార్లమెంటులో లేబర్ 410 సీట్లు గెలుచుకుంటుందని పోల్ చూపించింది. ఇది 14 సంవత్సరాల కన్జర్వేటివ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముగింపు పలికింది. సునక్ పార్టీకి 131 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా. బ్రిటన్‌లో జరిగిన గత ఆరు జాతీయ ఎన్నికలలో 2015 ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రమే తప్పుగా వచ్చాయి. హంగ్ పార్లమెంట్ వస్తుందని సర్వే అంచనా వేసింది. అయితే, ఆ సయమంలో కన్జర్వేటివ్‌లు మెజారిటీ సాధించారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ మేలో ముందస్తు ఎన్నికలను ప్రకటించారు. పోల్స్‌లో లేబర్ పార్టీ కంటే కన్జర్వేటివ్‌లు దాదాపు 20సీట్ల తేడాతో వెనుకంజలో ఉన్నందున, సునక్ ప్రకటన అతని స్వంత పార్టీలో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఎన్నికలు ఈ స్కోర్‌లలో తేడాను తగ్గిస్తాయని సునక్ ఆశించారు, కానీ అది వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి అందరి దృష్టి కన్జర్వేటివ్ పార్టీతో పాటు లేబర్ పార్టీ అభ్యర్థి, ప్రతిపక్ష నేత కైర్ స్టార్మర్‌పై పడింది.

ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోంది: విరాట్ కోహ్లీ
2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో తాను కనెక్ట్ కాలేకపోయానని, ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెలిపాడు. చాలా కాలంగా టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రయత్నిస్తున్నామన్నాడు. ఇంత మంది అభిమానులను చూస్తుంటే.. తనకు చాలా సంతోషంగా ఉందని విరాట్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టు.. గురువారం స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే. భారత ఆటగాళ్లకు అభిమానులు అపురూపమైన రీతిలో స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ముంబై చేరుకుని విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న భారత జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. రోడ్ షో జరిగిన సమయంలో మెరైన్ రోడ్డు మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. దాదాపుగా గంటన్నరపాటు సాగిన విజయోత్సవ ర్యాలీ భారత క్రికెట్‌ చరిత్రలో అపురూపమైన ఘట్టంగా నిలిచింది. ర్యాలీ అనంతరం భారత ఆటగాళ్లను ముంబైలోని వాంఖడె స్టేడియంలో బీసీసీఐ సన్మానించింది. జట్టుకు రూ.125 కోట్ల నగదు బహుమతిని అందించింది. బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా ప్లేయర్స్ డాన్స్ చేశారు. బీసీసీఐ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘రోహిత్ శర్మ, నేను చాలా కాలంగా టీ20 ప్రపంచకప్‌ కోసం ప్రయత్నిస్తున్నాం. ప్రతిసారి ప్రపంచకప్ గెలవాలని కోరుకున్నాం. చివరికు మా కల నెరవేరింది. వాంఖడె మైదానంకు ట్రోఫీని తిరిగి తీసుకురావడం చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన రోజు కంటతడి పెట్టిన సీనియర్ల భావోద్వేగాలతో నేను పెద్దగా కనెక్ట్ కాలేకపోయాను. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోంది. ఈ 15 ఏళ్లలో రోహిత్‌ను ఇంత ఎమోషనల్‌గా నేను ఎప్పుడూ చూడలేదు’ అని విరాట్ తెలిపాడు.

హార్దిక్, నటాషా విడాకులు పక్కా.. కారణం ఇదేనా?
టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్‌ విడిపోతున్నాడంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం లేకపోలేదు.. నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో హార్దిక్‌తో కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేశారు. కేవలం కుమారుడితో ఉన్న ఫొటోలను మాత్రమే ఇన్‌స్టాలో ఉంచడంతో.. విడాకుల రూమర్స్‌ మొదలయ్యాయి. ఇక టీ20 ప్రపంచకప్‌ 2024 భారత్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన హార్దిక్‌ను నటాషా కనీసం విష్ చేయకపోవడం గమనార్హం. టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మూడు ఓవర్లలో 20 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్స్ పడగొట్టాడు. టోర్నీ ఆసాంతం ఆల్‌రౌండర్‌గా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దాంతో హార్దిక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే హార్దిక్‌ ప్రదర్శనపై నటాషా స్టాంకోవిచ్‌ ఇప్పటివరకు స్పందించలేదు. హార్దిక్‌కు సంబంధించిన ఒక్క పోస్టు కూడా పెట్టలేదు. దీంతో హార్దిక్, నటాషాలు త్వరలో విడాకులు తీసుకుంటారని వస్తున్న వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది. రోహిత్ సతీమణి రితిక, విరాట్ భార్య అనుష్కలు తమ భర్తల ఆటపై సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక నటాషా స్టాంకోవిచ్‌ తాజాగా పెట్టిన ఓ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం. ఎంతో నిరుత్సాహపడతాం. చాలా బాధను అనుభవిస్తాం. అలాంటి సమయంలో ఎవరూ తోడుగా లేరని బాధపడనవసరం లేదు. అన్నింటికీ ఆ దేవుడు ఉన్నాడు. మనకు ఏం కావాలో ఆయనకు తెలుసు. భగవంతుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది’ అంటూ నటాషా ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ పోస్ట్ హార్దిక్‌ పాండ్యా గురించే పెట్టారని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఒకప్పుడు కుర్రాళ్ళ కలల హీరోయిన్ రంభ.. ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అచ్చ తెలుగు విజయవాడ అమ్మాయి, అందాల భామ రంభ. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆమె. వరుస అవకాశాలను చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇంద్ర కుమార్ అనే వ్యక్తిని వివాహమాడి విదేశాల్లో సెటిల్ అయ్యింది. హీరోయిన్ గా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టినా అడపాదడపా స్పెషల్ సాంగ్స్ లో అదరగొట్టింది. అంతేకాకుండా డాన్స్ షోస్ లో జడ్జిగా కూడా వ్యవహరించింది. ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న రంభ.. రీఎంట్రీకి సిద్దమవుతుందని సమాచారం. పెళ్లి తరువాత బొద్దుగా మారిన రంభ.. కష్టపడి బరువు తగ్గి స్లిమ్ గా మారింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రంభ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం రంభ తన పెద్ద కూతురితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె చాలా అందంగా ఉంది అంటూ పొగిడేశారు. ఇక ఇప్పుడు 2010లో తన సినీ జీవితాన్ని ముగించుకున్న రంభ తన కుటుంబంతో కలిసి టొరంటోలో నివసిస్తోంది. పెళ్లి తర్వాత రంభ కొన్ని డ్యాన్స్ రియాల్టీ షోలలో మాత్రమే కనిపించింది. తాజాగా రంభ తన కుటుంబంతో కలిసి కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. ఆమెతో పాటు భర్త ఇంద్ర, ముగ్గురు పిల్లలు, కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ ఉన్నారు. రంభ చాలా సింపుల్ గా చురీదార్ వేసుకుని గుడికి వచ్చింది. దీంతో ఆమె వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కన్నడిగులతోనే తెలుగు సీరియల్స్‌, ఇక మనమెందుకు.. నటి చరిష్మా నాయుడు సంచలన ఆరోపణలు
కన్నడ సీరియల్స్‌లో నెగిటివ్ లేదా సపోర్టింగ్ రోల్స్ చేసిన వారు లేదా అక్కడ అంతగా పాపులర్ కాని వారు తెలుగు, తమిళం, మలయాళం బుల్లితెరపై మెరుస్తున్నారు. అంతే కాకుండా పలువురు ఆర్టిస్టులు అయితే ప్రస్తుతం కన్నడ సీరియల్స్, తెలుగు సీరియల్స్ లో ఒకేసారి నటిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో కన్నడిగులకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతూ దీన్ని తెలుగు నటి చరిష్మా నాయుడు వ్యతిరేకించారు. పవన్ జనసేన పార్టీలో కూడా యాక్టివ్ గా ఉన్న చరిష్మా నాయుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. తెలుగు టెలివిజన్‌లో కన్నడ కళాకారులు ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కళాకారులు విమానంలో వస్తుంటారు ఆ ఖర్చులు తెలుగు నిర్మాతలే భరిస్తున్నారు. వారిని తెచ్చి మంచి పారితోషికం, ఆహార ఖర్చులు -విమాన ఖర్చులు పెట్టుకుంటూ పైపెచ్చు కన్నడిగులకు వసతి ఏర్పాట్లు కూడా తెలుగు నిర్మాతలు చూసుకుంటున్నారు కానీ హైదరాబాద్‌లోని ఆర్టిస్టులకు సీరియల్స్‌లో అవకాశం ఇవ్వడం లేదని ఆమె అన్నారు. పారితోషికం కూడా వారితో పోలిస్తే బాలేదు’’ అని చరిష్మా నాయుడు అన్నారు. “తెలుగు టెలివిజన్ ఇప్పుడు కన్నడిగులకు అడ్డాగా మారిపోయింది. తెలుగు సీరియల్స్ లో కన్నడ ఆర్టిస్టులు ఉండడం తప్పు కాదు కానీ అందరూ కన్నడ ఆర్టిస్టులు అయితే ఎలా? ఇప్పుడు అన్ని పాత్రలకు కన్నడ ఆర్టిస్టులు అవసరమా అని ఆమె ప్రశ్నించారు. చరిష్మా నాయుడు మాట్లాడుతూ ఒక తెలుగు సీరియల్‌లో తెలుగు వారు తక్కువ ఉంటారని, మిగిలిన వారు కన్నడిగులే అని అన్నారు. . “తెలుగు వారికి భాష అర్థం అవుతుంది, కన్నడ కళాకారులు ఎలా మాట్లాడినా డబ్బింగ్ చెప్పుకుని మరీ లిప్ సింక్ సరిగా లేకపోయినా కన్నడ నటీనటులు నటన మాత్రం బాగుందని అంటున్నారు. అదే తెలుగు వాళ్ళు ఎలా నటించినా బాగుండదని అంటున్నారు.