Site icon NTV Telugu

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

అప్పుడే సంక్రాంతి రష్..! బస్సులు, రైళ్లన్నీ ఫుల్‌..
సంక్రాంతి పండగ దగ్గరపడుతుండటంతో విజయవాడ నుంచి రాకపోకలు సాగించే రైళ్లు, బస్సుల్లో భారీ రష్ మొదలైంది. పండుగకు కనీసం రెండు వారాల ముందు నుంచే రాకపోకలపై విపరీతమైన డిమాండ్ పెరగడంతో రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయి. సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవడంతో, జనవరి 10 నుంచి 14 వరకు అన్ని రైళ్లలో సీట్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జనవరి 15, 16 తేదీల్లో మాత్రమే కొన్ని సీట్లు అందుబాటులో ఉండగా, 17, 18, 19 తేదీల్లో తిరిగి పూర్తి హౌస్‌ఫుల్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో స్పెషల్ రైళ్లను నడిపితే మాత్రమే ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. క్రిస్మస్ తర్వాత స్పెషల్ రైళ్లపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇవాళ్టి నుంచి మంత్రి నారా లోకేష్‌ విదేశీ పర్యటన.. ఏపీకి పెట్టుబడులే లక్ష్యం..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం కృషి జరుగుతూనే ఉంది.. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి.. వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి.. తమ ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు.. తమ రాష్ట్రంలో ఉన్న వనరులను వివరిస్తూ.. పెట్టుబడి పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు.. మంత్రి నారా లోకేష్‌ బృందం పలు దేశాల్లో పర్యటించగా.. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు.. ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు విదేశీ పర్యటనకు కొనసాగనుంది.. ఈ నెల 10 వరకు అమెరికా మరియు కెనడాలో ఆయన పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, కీలక సంస్థలతో సహకార అవకాశాలను పరిశీలించడం ఈ టూర్ ప్రధాన ఉద్దేశ్యం. తన పర్యటనలో భాగంగా ఇవాళ డల్లాస్‌లోని తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. స్థానిక తెలుగు సంఘాలు, ఐటీ ప్రొఫెషనల్స్‌తో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలపై ఆయన చర్చించనున్నారు. ఇక, ఈ నెల 8, 9 తేదీల్లో మంత్రి లోకేష్ శాన్‌ఫ్రాన్సిస్కోలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. టెక్నాలజీ, స్టార్టప్‌లు, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే ఈ సమావేశాల లక్ష్యం. అమెరికాతో పాటు కెనడాలోనూ పర్యటించనున్నారు మంత్రి నారా లోకేష్‌.. తన పర్యటన చివరి రోజు అయిన ఈ నెల 10న టోరంటో నగరంలో లోకేష్ పర్యటించనున్నారు. కెనడా-ఆంధ్రప్రదేశ్ వ్యాపార సంబంధాలను మెరుగుపరచడంపై చర్చలు జరిగే అవకాశం ఉంది.

నగరంలో అర్ధ రాత్రి నుంచి ‘ఆపరేషన్ కవచ్’.. గల్లీల్లోకి 5వేల మంది పోలీసులు..
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా నాకాబందీని నిర్వహిస్తున్నారు. ​హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బందితో పాటు అయన పాల్గొంటున్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ​ఈ ప్రత్యేక డ్రైవ్‌లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి.​ ప్రజా భద్రత కోసం చేపట్టిన కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కమిషనర్ సజ్జనార్ కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం అందించాలని తెలిపారు. చాంద్రాయణ గుట్టలో జరిగిన ఆపరేషన్ కవచ్ లో ఆడిషనల్ కమిషనర్ టఫసీర్ ఇక్బల్ పాల్గొన్నారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందడం విషాదాన్ని నింపింది.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామేశ్వరం నుంచి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల కారును మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందినవారిలో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న కీజక్కరై పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.. ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి..

విమాన ప్రయాణికుల కష్టాలకు రైల్వే శాఖ చెక్.. ప్రత్యేక ట్రైన్ సర్వీసులు ఏర్పాటు
దేశ వ్యాప్తంగా మూడు, నాలుగు రోజులుగా విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో నరకయాతన పడుతున్నారు. ప్రయాణాలు ముందుకు సాగక కటిక నేలపైనే నిద్రపోయారు. ఇలా అన్ని ఎయిర్‌పోర్టులోనూ వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కూడా పరిస్థితులు చక్కబడలేదు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం అయింది. విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా 114 అదనపు ట్రిప్పులను నడుపుతోంది. అంతేకాకుండా 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. సబర్మతి-ఢిల్లీ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుందని ప్రకటించింది. అదనపు కోచ్‌లు, ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అహ్మదాబాద్-ఢిల్లీ మార్గంలో ‘ట్రైన్ ఆన్ డిమాండ్’ పథకం కింద సబర్మతి నుంచి ఢిల్లీకి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఛార్జీలతో తక్షణమే ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. రైలు నెంబర్ 09497/09498 సబర్మతి-ఢిల్లీ సూపర్‌ఫాస్ట్ నాలుగు ట్రిప్పులు తిరగనుంది. ఈ రైలు డిసెంబర్ 7-9 తేదీల్లో 10:55 గంటలకు సబర్మతి నుంచి బయల్దేరి మరుసటి రోజు 3:15 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఇలా ఆ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

పుతిన్ విందుకు రాహుల్, ఖర్గేలకు ఆహ్వానం లేదు.. శశి థరూర్‌కి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ విందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానించలేదు. కానీ.. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్‌ను ఈ విందుకు ఆహ్వానించారు. ఆహ్వానాన్ని మన్నించి ఆయన సైతం ఈ విందుకు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ ఎంపీ హాజరైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రపతి భవన్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో థరూర్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను విందుకు ఆహ్వానించక పోవడంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పుతిన్ విందుకు థరూర్ ఆహ్వానాన్ని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ప్రశ్నించారు. ఆహ్వానం అందడం.. థరూర్ హాజరుకావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ మనస్సాక్షి ఉంటుందని ఎద్దేశా చేశారు. మన నాయకుడిని ఆహ్వానించనప్పుడు.. మీరు ఎలా వెళతారని ప్రశ్నించారు.

పాకిస్థాన్ పార్లమెంట్‌లోకి దూసుకొచ్చిన గాడిద.. ఎంపీలను పరుగులు పెట్టించిన డాంకీ..!!(వీడియో)
పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఒక అప్రత్యక్ష అతిథి ఆశ్చర్యపరిచింది. సభా కార్యక్రమాలు సవ్యంగా కొనసాగుతుండగా, ఎవరూ ఊహించని విధంగా ఓ గాడిద హాల్‌లోకి చొరబడింది. మొదట్లో అది ఎలా వచ్చిందో అర్థంకాక సభ్యులు ఒక్కసారిగా తికమకపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించినప్పటికీ, గాడిద మాత్రం వారికి గడ్డి పెట్టింది. సభలో పరుగులు పెట్టడం, కొంతమంది ఎంపీలను ఢీకొనడం వంటి హాస్యాస్పద దృశ్యాలు కాసేపు గందరగోళంలా కనిపించాయి. చివరకు పలు ప్రయత్నాల తరువాత సిబ్బంది దాన్ని బయటకు తీసుకెళ్లగలిగారు. ఈ చిన్న ఎపిసోడ్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఒక దేశ పార్లమెంట్ హాల్‌లోకి జంతువు ఇంత సులభంగా రావడంతో అంతర్జాతీయంగా కూడా భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు మొదలయ్యాయి. నెటిజన్లు దీనిని సరదాగా తీసుకుంటూ కామెంట్లు కురిపించారు. కొందరు గాడిద తన “తోటి వారిని” కలవడానికి వెళ్లిందని రాస్తే, ఇంకొందరు దాని సీటు దొంగిలించారని కోపంగా హాల్‌లోకి దూసుకెళ్లిందని చమత్కరించారు. అనేకమంది ఇది అసలు వీడియోనా లేక ఏఐ జెనరేట్ చేసినదా అనే సందేహం వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు ట్రంప్‌కు అవార్డు.. ‘ఫిఫా శాంతి బహుమతి’ ప్రకటన
హమ్మయ్య.. మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవార్డు దక్కింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నోబెల్ శాంతి బహుమతిపై గంపెడాశలు పెట్టుకున్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది యుద్ధాలు ఆపి నాకు.. నోబెల్ శాంతి బహుమతి నాకు తప్ప ఇంకెవరికి వస్తుంది’’ అని భావించారు. కానీ చివరికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మచాడో తన్నుకుపోయారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది. దీంతో ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఏదైతే ఏమైంది కొంచెం ఆలస్యమైనా 2025లోనే ట్రంప్ తీపికబురు అందుకున్నారు. తాజాగా ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్‌ఫాంటినో.. తొలి ఫిఫా శాంతి బహుమతిని ట్రంప్‌కు అందించబోతున్నట్లు ప్రకటించారు. 2026లో జరగనున్న ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలకు సంబంధించి వాషింగ్టన్‌ డీసీలోని కెన్నడీ సెంటర్‌లో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచకప్‌ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ట్రంప్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలి ‘ఫిఫా శాంతి బహుమతి’ని ట్రంప్‌కు అందజేయబోతున్నట్లు ఫిఫా అధ్యక్షుడు ప్రకటించారు. దీంతో ట్రంప్ చాలా సంతోషం వ్యక్తం చేశారు.

మూడో వన్డేలో కెప్టెన్ రాహుల్ ఏమైనా మార్పులు చేస్తాడా?
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే చివరి వన్డే మ్యాచ్ డిసెంబర్ 6వ తేదీ శనివారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు సిరీస్‌ను గెలుచుకుంటుంది. రాంచీలోని మొదటి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా రాయ్‌పూర్ వన్డేలో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో వన్డే నేడు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్‌లను అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. భారత్ గతంలో ఓడిపోయినప్పటికీ, కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఎటువంటి మార్పులు చేసే అవకాశం లేదు. నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మలను మరోసారి బెంచ్‌లో కూర్చోబెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో భారత జట్టు తరపున బలమైన ప్రదర్శన ఇవ్వాలని చూస్తున్నాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కూడా బ్యాట్‌తో సందడి చేయడానికి ఆసక్తిగా ఉంటారు. రాయ్‌పూర్ వన్డేలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతని ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఆడే విధానానికి దాదాపు సమానంగా ఉంది. రుతురాజ్ షాట్లు క్లాసిక్, నియంత్రణలో ఉన్నాయి. గత మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ 85 పరుగులు ఇచ్చాడు.. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే భారత జట్టులో స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ లేడు. కాబట్టి భారత జట్టు అతన్ని తొలగించి ఆల్ రౌండర్‌ను చేర్చే సాహసం చేయదు.

అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన.. రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ..!
అఖండ 2 నిర్మాణ సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. అఖండ2 ని పెద్ద స్క్రీన్లపైకి తీసుకురావడానికి మేము మా వంతు ప్రయత్నం చేశాము.. మా అవిశ్రాంత ప్రయత్నాలు ఉన్నప్పటికీ, కొన్నిసార్లు, అత్యంత ఊహించని విషయాలు దురదృష్టవశాత్తు జరుగుతాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులందరికీ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం.. ఈ సవాలుతో కూడిన సమయంలో మాకు తోడుగా నిలిచినందుకు నందమూరి బాలకృష్ణ, బోయపాటిశ్రీనుకు మేము ఎప్పటికీ కృతజ్ఞులం. అఖండ 2 ఎప్పడు వచ్చినా గురి చూసి కొడుతుంది.. త్వరలో కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం..” అంటూ 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేసింది. కాగా.. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ తాండవం’ కోసం తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన ఈ సినిమా… నాల్గో తేదీ ప్రీమియర్స్‌తో ప్రారంభమై, ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే, అభిమానుల అంచనాలను నిరాశపరుస్తూ, చివరి నిమిషంలో ఈ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది. ‘అఖండ తాండవం’ సినిమాను 14 రిల్స్ ప్లస్ (రామ్ ఆచంట, గోపి ఆచంట) సంస్థ నిర్మించింది. ఈ సంస్థకు, హీరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు మధ్య ఉన్న ఫైనాన్షియల్ అగ్రిమెంట్ల కారణంగా, సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది.

Exit mobile version