NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు కలెక్టర్ల సదస్సు.. సాయంత్రం ఎస్పీలతో సమీక్ష.. కీలక సూచనలు చేయనున్న సీఎం, డిప్యూటీ సీఎం..!
ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు వరుస సమీక్షలతో బిజీబిజీగా గడపనున్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా అధికారులతో సమావేశం కానున్నారు. ఉదయం పది గంటలకు కలెక్టర్లతో భేటీ కానున్నారు. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోత్సవం చేయనున్నారు సీసీఎల్‌ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. కలెక్టర్లను ఉద్దేశించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడనున్నారు. ఆతర్వాత ప్రాధాన్యతను బట్టి ముందుగా వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలు, ఆక్వా, అటవీశాఖలపై సమీక్ష జరపనున్నారు. అనంతరం గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించనున్నారు. ఆ తర్వాత గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయల కల్పనపై సమీక్ష జరపనున్నారు. లంచ్ తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య, పురపాలక శాఖలపై చర్చించనున్నారు. చివరిగా రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు, శాంతి భద్రతలపై సమీక్ష చేయనున్న సీఎం. సాయంత్రం ఎస్పీలతో శాంతి భద్రతలపై చర్చించనున్నారు. సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, HODలు మినహా ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం పేషీ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ , హోం శాఖల మంత్రులు, డీజీపీ, సీఎస్ సిబ్బంది మినహా మరెవరూ కలెక్టర్ల సదస్సు సమావేశ హాలుకు అనుమతి లేదని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత ప్రజెంటేషన్లను వారే తెచ్చుకోవాలని సూచించారు. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పెట్టుకోవాలని సూచనలు చేశారు.

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటర్ల తుది జాబితా సిద్ధం
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఓటరు జాబితా సిద్ధమైంది. ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో ఓటు హక్కు కల్పించారు. రాజ్యసభ సభ్యులు సహా 16 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎక్స్ అఫిషియో ఓటు ఉంటుంది. మొత్తం 838 మంది ఓటర్లున్నారు. ఇందులో 636 మంది ఎంపీటీసీలు, 36 మంది ZPTCలు ఉన్నారు. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు 97 మంది ఉన్నారు. 28 మంది నర్సీపట్నం కౌన్సిలర్లు, 25 మంది ఎలమంచిలి కౌన్సిలర్లు ఉన్నారు. ఖాళీలు పోను 822 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు రేపు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రేపట్నుంచి ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆగస్టు 30న విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో కూటమి నాయకత్వం విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తోంది. టీడీపీ నుంచి ఇద్దరి మాజీ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రంలోగా అభ్యర్థిపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

శ్రీశైలంలో నేటి నుంచి శ్రావణ మాసోత్సవాలు.. భక్తులకు కీలక సూచనలు
ఆషాఢ మాసం ముగిసింది.. శ్రావణ మాసం ప్రారంభంమైంది.. ఈ నేపథ్యంలో నేటి నుండి శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు.. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్‌ 4వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.. నేటి నుండి శ్రావణమాసమంతా అఖండ శివనామ భజనలు చేయనున్నారు.. అయితే, ఈ ఉత్సవాల సమయంలో శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.. శ్రావణమాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా.. పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.. ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు శ్రీస్వామివారి స్పర్శదర్శనం నిపుదల చేయనున్నట్టు వెల్లడించారు.. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.. మరోవైపు.. భక్తుల రద్దీ దృష్ట్యా.. శ్రావణ శని, ఆది, సోమ, పౌర్ణమి రోజులలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు, ఆర్జిత సేవలు రద్దుచేశారు.. శ్రావణామాసం రద్దీ రోజులు మినహా మిగిలిన రోజుల్లో 4 విడతలు సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నారు.. రెండవ, నాల్గవ శుక్రవారాలలో ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేసుకునే వెలుసుబాటు కల్పించింది ఆలయ కమిటీ.

మరో శాఖలో అవకతవకలపై ఏపీ సర్కార్‌ ఫోకస్‌.. ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక..
గృహ నిర్మాణం పేరిట కేంద్ర నిధులు దుర్వినియోగమయ్యాయా.. అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఏపీ హౌసింగ్ శాఖలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు. గృహ నిర్మాణ శాఖలో అవకతవకలు జరిగాయని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ చేపడతామని అప్పట్లోనే హెచ్చరించారు. అధికారంలోకి రావడంతో.. హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నిధుల దుర్వినియోగం, పక్కదారి పట్టిన నిధుల విషయమై లెక్కలు తీస్తోన్న గృహ నిర్మాణ శాఖ అధికారులు.. వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నిధుల దారి మళ్లింపు జరిగిందని గుర్తించారు. కేంద్రం నిధుల్లోనూ అవకతవకలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. గృహ నిర్మాణ శాఖలో సుమారు 3 వేల 183 కోట్ల రూపాయల వరకు.. కేంద్రం నిధుల దుర్వినియోగం అయినట్టు లెక్కగట్టారు. ఇళ్లు నిర్మించకున్నా.. లెక్కల్లో చూపించి మభ్యపెట్టారంటూ నివేదిక ఇచ్చారు.

గోదావరి దోబూచులాట.. 33.5 అడుగులకు నీటిమట్టం..
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం దోబూచులాడుతుంది. ఒకరోజు పెరిగి మరో రోజు తగ్గటం మళ్ళీ పెరగడం తగ్గటం జరుగుతుంది. గత నెల 21 నుంచి గోదావరికి వరద రావటం ప్రారంభించింది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి పెరిగి మళ్ళీ తగ్గటం ప్రారంభించింది. సుమారు 12 రోజులపాటు గోదావరి వరద ప్రభావం భద్రాచలం వద్ద కనిపించింది. నిన్న గోదావరి మరో మూడు అడుగుల పెరిగి మళ్ళీ ఈరోజు తగ్గటం ప్రారంభించింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33.5 అడుగులకు చేరుకుంది. గోదావరి నీటిమట్టం తగ్గుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 33.5 అడుగులుగా ఉంది. నిన్న ఒక్క రోజే మళ్ళీ ముడు అడుగులు గోదావరి పెరిగింది. ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల అదే విధంగా దిగువన వున్న శబరి దగ్గర కూడా వరద లేకపోవడం నిలకడగా వుండడం వల్ల గోదావరిలో నీరు వేగంగా పోలవరం వెళ్తుంది. పోలవరం నుంచి ధవళేశ్వరం. మీదుగా సముద్రంలో కలుస్తోంది.. గత నెల 21వ తారీకు నుంచి గోదావరి పెరగటం ప్రారంభించింది. ఏటా జూలై, ఆగస్టు నెలలో గోదావరి వరదలు వస్తుంటాయి. అయితే ఆగస్టులోనే ఎక్కువగా గోదావరి వరదలు వస్తుంటాయి ..కానీ ఈసారి జూలై నెలలో వరదలు వచ్చాయి. గత నెల 23వ తేదీన 51.5 అడుగులకు వచ్చిన గోదావరి ఆ తర్వాత తగ్గుముఖం పట్టి 44 అడుగుల దగ్గర కు తగ్గి మళ్లీ పెరిగింది 53.9 అడుగులకి గత నెల 27 వ తేదిన గోదావరి పెరిగింది. దీంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆ తరువాత గోదావరి నీటిమట్టం పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. మళ్ళీ గత వారం రోజుల నుంచి గోదావరి తగ్గడం పెరగడం జరుగుతుంది.. 33 అడుగులకు తగ్గి మళ్లీ 37 అడుగులకు పెరిగింది.. నిన్న పెరిగిన గోదావరి మళ్ళీ ఈ రోజు తగ్గడం ప్రారంభించింది. 43 అడుగుల చేరుకుంటే మొదటి ప్రమాదం జారీ చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక కి ఇంకా ఆరు అడుగుల దూరంలో ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం ఉంది. గోదావరికి ప్రస్తుతం వరద వచ్చే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.

మొట్టమెదటి సారి రాజన్న ఆలయంలో బ్రేక్‌ దర్శనాలు.. నేటి నుంచి అమలు..
రాజన్న సన్నిధిలో మొట్టమెదటి సారిగా నేటి నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ విప్ ఏడీ శ్రీనివాస్ చేతుల మీదుగా బ్రేక్ దర్శనాలు ప్రారంభించనున్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయంలో బ్రేక్ దర్శన విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ అధికారులు రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావడంతో ఆలయ అధికారులు ఆలయంలో బ్రేక్‌ దర్శనానికి ఏర్పాట్లు చేశారు. బ్రేక్ దర్శనాల కోసం ఆలయంలో ప్రస్తుతం ఉన్న శీఘ్ర దర్శన క్యూ లైన్‌ను వినియోగిస్తూ శీఘ్ర దర్శనానికి వచ్చే భక్తులను నేరుగా ఆలయ తూర్పు ద్వారం నుంచి పంపించేందుకు క్యూ లైన్లను సిద్ధం చేసినట్లు ఈఈ రాజేష్, డీఈ రఘునందన్ తెలిపారు. దీని నుండి ప్రారంభమయ్యే బ్రేక్ దర్శనాలు క్రమం తప్పకుండా రెండుసార్లు నిర్వహించనున్నారు. బ్రేక్ దర్శనాలు ఉదయం 10.15 నుంచి 11.15 వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కొనసాగుతాయి. ఇందుకోసం రూ.300 టికెట్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో టికెట్‌కు ఒక లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తారు. శ్రావణమాసం కావడంతో ఆలయానికి విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నేటి నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల రోజులుగా భక్తుల రాకతో రాజన్న క్షేత్రం సందడిగా మారనుంది. స్వామివారికి ప్రతి సోమవారం ఉదయం ఏకాదశ రుద్రాభిషేకం, రాత్రి మహాలింగార్చన నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న మహాలక్ష్మి ఆలయంలో ప్రతి శుక్రవారం చతుష్షష్టి పూజలు నిర్వహిస్తారు. శ్రావణమాసంలో ఐదు సోమవారాలు, నాలుగు శుక్రవారాలు వస్తున్నాయని అర్చకులు తెలిపారు.

నేడు పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు..!
వక్ఫ్ బోర్డులను శాసించే 1995 చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీంతో వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకత ఉంటుందని కేంద్ర అభిప్రాయపడుతుంది. అయితే వక్ఫ్ చట్టాన్ని సవరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు చెబుతోంది. వక్ఫ్ బోర్డు అధికారాల్లో కోత పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపిస్తోంది. ఒకవేళ ఈ బిల్లుకు చట్ట బద్ధత కల్పిస్తే..వక్ఫ్ బోర్డులు మునుపటిలాగా ఏ ఆస్తిని స్వచ్ఛందంగా తమ ఆస్తిగా ప్రకటించలేవు. వారు తమ బోర్డులలో మహిళల భాగస్వామ్యాన్ని కూడా నిర్ధారించుకోవాల్సి వస్తుంది. వక్ఫ్ బోర్డు చట్టం-1954 సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే బిల్లు ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బిల్లును ప్రవేశపెట్టకముందే బీజేపీ తన మిత్రపక్షాలను ప్రలోభపెట్టడం ప్రారంభించిందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు జేడీ-యూ, ఎల్‌జేపీ (ఆర్‌), హెచ్‌ఏఎం, అప్నాదళ్‌ (ఎస్‌)తో చర్చలు జరిగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అతి పెద్ద మిత్ర పక్షం టీడీపీని కూడా సంప్రదించారు.

ఆస్ట్రా క్షిపణి తయారీకి భారత వైమానిక దళం ఆమోదం..ఇక శత్రువులకు చుక్కలే..!
అతి త్వరలో భారత వైమానిక దళం బలం మరింత పెరగనుంది. సుఖోయ్-30, తేజస్ వంటి యుద్ధ విమానాల కోసం వైమానిక దళం ఆస్ట్రా మార్క్-1 క్షిపణులను ఉపయోగిస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ క్షిపణులు భారతదేశంలోనే తయారు చేయబడతాయి. భారత వైమానిక దళం భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌కు 200 దేశీయంగా తయారు చేసిన ఆస్ట్రా మార్క్ 1 క్షిపణులను తయారు చేయడానికి ఆమోదించింది. ఈ క్షిపణి గాలిలోనే శత్రువును హతమార్చగలదు. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందించింది. దీనిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) ఉత్పత్తి చేస్తుంది. క్షిపణి తయారీకి వైమానిక దళం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇటీవల భారత వైమానిక దళ డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సమయంలో ఆయన క్షిపణుల తయారీకి బీడీఎల్‌కు అనుమతి ఇచ్చారు. 2022-23లో రూ. 2,900 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ ప్రాజెక్టుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని రక్షణ వర్గాలు తెలిపాయి. అన్ని పరీక్షలు, అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఉత్పత్తి ఇప్పుడు ఆమోదించబడింది.

వయనాడు ఘటనలో 308కి చేరిన మృతుల సంఖ్య..చైనా ప్రధాని సంతాపం
కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 308కి చేరింది. ఇప్పటికీ చాలా మంది శిథిలాల కింద కూరుకుపోయినట్లు అంచనా. తప్పిపోయిన వారిని అన్వేషించేందుకు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోంది. వయనాడ్‌లో రెస్క్యూ ఆపరేషన్ వివరాలను తెలియజేస్తూ.. రెస్క్యూ ఆపరేషన్ శరవేగంగా కొనసాగుతోందని కలెక్టర్ మేఘశ్రీ తెలిపారు. ఆదివారం..1300 మందికి పైగా సైనికులు సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారు. వాలంటీర్లు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు. శనివారం రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన వాలంటీర్లు చిక్కుకుపోయారని, దీనిని దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. చురల్‌మల, ముండక్కైలో రాత్రి సమయంలో పోలీసులు గస్తీ నిర్వహించారని పేర్కొంది. కొండచరియలు విరిగిపడిన ఈ రెండు ప్రాంతాల్లోనూ ఖాళీగా ఉన్న ఇళ్లలో చోరీ ఘటనలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసు అనుమతి లేకుండా, సహాయక చర్యల కోసం కూడా ఎవరూ ఈ ప్రాంతాల్లోకి ప్రవేశించడం నిషేధించబడింది. అనుమతి లేకుండా ఎవరైనా ఇళ్లలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, శిథిలాల నుంచి ఇప్పటివరకు 215 మృతదేహాలు, 143 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు . వీటిలో 98 మంది పురుషులు, 87 మంది మహిళలు, 30 మంది పిల్లల శరీరాలు, అవయవాలు ఉన్నాయి.

బాధితులకు చైనా ప్రధాని సంతాపం
వయనాడ్ కొండచరియలు విరిగిపడి మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ చైనా ప్రధాని లీ చియాంగ్ ప్రధాని నరేంద్ర మోడీకి సందేశం పంపారు. భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఆగస్టు 3న కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోడీకి సంతాప సందేశం పంపినట్లు ప్రధాని లీ చియాంగ్ తెలిపారు. మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

అతడి వల్లే మ్యాచ్‌లో ఓడాం: రోహిత్ శర్మ
బ్యాటింగ్‌‌ వైఫల్యం కారణంగానే శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో ఓడిపోయాం అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. శ్రీలంక స్పిన్నర్ జెఫ్రె వండర్సే (6/33) అసాధారణ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడని, అతడే తమ పతనాన్ని శాసించాడని పేర్కొన్నాడు. మిడిలార్డర్ వైఫల్యంపై చర్చించాల్సిన అవసరం ఉందని రోహిత్ చెపుకొచ్చాడు. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. వాండర్సే (6/33) ధాటికి 42.2 ఓవర్లలో 208 పరుగులకే కుప్పకూలింది. మొదట లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 240 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘మ్యాచ్ ఓడినప్పుడు ప్రతీది బాధిస్తుంది. జెఫ్రె వాండర్సే వేసిన 10 ఓవర్లు మాత్రమే కాదు, మ్యాచ్ మొత్తం నిరాశ కలిగిస్తుంది. నిలకడగా రాణించడం చాలా ముఖ్యం. ఈ రోజు జట్టుగా విఫలమయ్యాం. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది కానీ పరాజయాలు సహజమే. విజయం లేదా ఓటమిని స్వీకరించాలి. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ ఉంటే స్ట్రైక్ రొటేట్ చేయడానికి సులువు అయ్యేది. 6 వికెట్లు తీసిన వాండర్సేదే ఈ గెలుపు క్రెడిట్’ అని అన్నాడు.

నేను 6 వికెట్లు తీసినా.. ఈ గెలుపు క్రెడిట్‌ మాత్రం వారిదే: వాండర్సే
ఆదివారం కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. లంక యువ బౌలర్ జెఫ్రీ వాండర్సే 6 వికెట్లు తీసి రోహిత్ సేనను దెబ్బ కొట్టాడు. తన కోటా 10 ఓవర్లలో 33 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్స్ పడగొట్టాడు. రోహిత్, గిల్, విరాట్, దూబే, శ్రేయాస్, రాహుల్ వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మంచి ఆరంభం ఇచ్చిన ఓపెనర్లు వాండర్సే రంగంలోకి దిగగానే పెవిలియన్ చేరారు. టీమిండియా టాప్ బ్యాటర్లు అందరూ వాండర్సే బౌలింగ్‌లోనే అవుట్ అవ్వడం విశేషం. 6 వికెట్లు తీసిన జెఫ్రీ వాండర్సేకు ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విజయం వెనుక తన స్పెల్‌తో పాటు శ్రీలంక బ్యాటర్ల పోరాటం ఉందన్నాడు. ‘నేను బౌలింగ్‌ చేసే సమయానికి మా జట్టుపై బాగా ఒత్తిడి ఉంది. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగాను. జట్టు కోసం ఏదైనా చెలనుకున్నా. ఆరు వికెట్లు తీసినందుకు క్రెడిట్‌ తీసుకోవచ్చు కానీ మా విజయం వెనుక బ్యాటర్లదే కీలక పాత్ర. 240 చేసి మేం పోరాడేందుకు అవకాశం కల్పించారు. మా బ్యాటింగ్ బౌలింగ్ బాగుంది’ అని వాండర్సే అన్నాడు.

తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమకు కన్నీళ్లొస్తున్నాయి: చియాన్ విక్రమ్
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ “మీరు చూపిస్తున్న ఎనర్జీ, క్రేజ్ బంగారంలా అనిపిస్తోంది. తెలుగు సినీప్రియులు ఎంతో ప్రత్యేకం. మాకు మీ సపోర్ట్, ఎంకరేజ్ మెంట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తంగలాన్ టీజర్, ట్రైలర్ మీకు బాగా నచ్చాయని ఆశిస్తున్నా. మీరు నా గురించి, మా తంగలాన్ సినిమా చెప్పిన ప్రోత్సాహాన్నిచ్చే మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. తంగలాన్ వందేళ్ల క్రితం జరిగిన కథ. తంగలాన్ ఒక మంచి సినిమా. ఈ స్టేజీ మీద నా సినిమాల్లోని పర్ ఫార్మెన్స్ లు చూపించారు. అవన్నీ చూసినప్పుడు ఎమోషన్ అయ్యాను. ఇవన్నీ చేశానా అనిపించింది. ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే స్ఫూర్తి కలిగింది. రంజిత్ గారు నా డ్రీమ్ డైరెక్టర్. తంగలాన్ గురించి ఆయన చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. మీకు సర్ ప్రైజ్ గా ఉండాలని సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. ఇది నాకు దొరికిన ది బెస్ట్ రోల్ అని అనుకుంటున్నా. మీరు థియేటర్స్ కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కంటెంట్ తో కనెక్ట్ అవుతారు. మీరు తంగలాన్ కు చూపిస్తున్న రెస్పాన్స్ కు థ్యాంక్స్. ఈ నెల 15న థియేటర్స్ లో కలుద్దాం” అని అన్నారు

సాయం చేయడంలోనూ ‘మెగాస్టార్’ అని నిరూపించుకున్న చిరంజీవి.. సాయం ఎంతంటే..?
కేరళలోని వయనాడ్ జిల్లాలో అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగావారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఊహించని ఈ పరిణామం దేశప్రజలను త్రీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు సినీతారలు తమ వంతుగా ముందుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదార మనుసును చాటుకున్నారు. కార్గిల్ వార్ సంద‌ర్భంలో కానీ, గుజరాత్ భూకంపం సంభ‌వించిన‌ప్పుడు, సునామీ వ‌చ్చి ప్ర‌జ‌లు ఇక్క‌ట్లు ప‌డుతున్న‌ప్పుడు, ఉత్త‌రాఖండ్ వ‌ర‌ద‌లు, కోన‌సీమ వ‌ర‌ద‌ల స‌మయంలో కానీ, వైజాగ్‌లో హుదూద్ వ‌చ్చిన‌ప్పుడు, కోవిడ్‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న‌ప్పుడు.. ఇలా ఒక‌టేమిటి ప్ర‌కృతి వైప‌రీత్యాల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే వారికి అండ‌గా నిల‌బ‌డుతూ త‌న‌దైన స్పంద‌న‌ను తెలియ‌జేసే మొట్టమొదటి వ్య‌క్తి మెగాస్టార్ చిరంజీవి. ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు తన భాద్యతగా సాయం చేసేందుకు ఎప్పుడు ముందుంటారు మెగాస్టార్.