NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మూడు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్..
కొద్దిరోజులుగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా మూడు ఇండిగో విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపుకాల్‌ రావడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. గోవా నుండి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో.. అలర్ట్‌ అయిన పైలెట్‌ వెంటనే శంషాబాద్‌ అధికారులకు ఎమర్జెన్స్‌ ల్యాండింగ్‌ చేస్తున్నట్లు వెళ్లడించారు. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ అధికారులు ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కు పర్మిషన్‌ ఇచ్చారు. దీంతో గోవా నుండి కలకత్తా విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బెంగళూరు నుంచి హైదరాబాద్ ఇండిగో విమానానికి, హైదరాబాద్ టు పూనా ఇండిగో విమానానికి, మొత్తం మూడు ఇండిగో విమానాలు, ఒక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానాలను ఐసోలేషన్ తరలించి తనిఖీలు నిర్వహించారు. ఫేక్ కాల్ గా నిర్ధారించారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

 

ఉచిత ఇసుక విధానం మ‌రింత పార‌ద‌ర్శకంగా అమ‌లు చేయాలి..
పంచ గ్రామాల స‌మ‌స్యకు టైం బాండ్ పెట్టుకొని ప‌రిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియ త్వరిత‌గ‌తిన పూర్తి చేయాలన్నారు. విశాఖ జిల్లా క‌లెక్టరేట్‌లో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స‌మీక్ష నిర్వహించారు. న‌గ‌రంలో గుంత‌ల రోడ్లు ఉండ‌టానికి వీలు లేదు.. ఎక్కడైనా ఉంటే అధికారుల‌పై చ‌ర్యలు త‌ప్పవన్నారు. తాగునీటి ప్రాజెక్టుల రూప‌క‌ల్పన, పైపులైన్లు, కుళాయిల ఏర్పాటు మార్చి నాటికి పూర్తి కావాలన్నారు. జిల్లాలోని జ‌ల‌శ‌యాల సామ‌ర్ధ్యాల‌ను గుర్తించి నీటి నిల్వ సామార్థ్యం పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోట‌ళ్లు మ‌రిన్ని రావాలి… అభివృద్ధి చేయాలి… గ్రే హౌండ్స్ భూముల‌ను హోట‌ళ్లకు వినియోగించుకోవ‌చ్చన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వ‌చ్చే నాటికి.. జిల్లాలోని అభివృద్ధి ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావాలన్నారు. శాంతిభ‌ద్రత‌ల ప‌రిర‌క్షణ‌కు మ‌రిన్ని చ‌ర్యలు చేప‌ట్టాలి.. సీసీ కెమెరాల సంఖ్య పెంచాలి.. సాంకేతిక ప‌రిజ్ఞానం స‌హాయంతో వాహ‌నాల వేగాన్ని నియంత్రించాలి.. ప్రమాదాల‌ను త‌గ్గించాలన్నారు. విజిబుల్, ఇన్విజిబుల్ పోలీసింగ్ విధానం పెర‌గాలన్నారు. సూర్యఘ‌ర్ పథ‌కంలో భాగంగా రూప్ టాప్ సోలార్ ప్లాంటులు ఏర్పాటు చేయాలి.. ప్రజ‌ల‌ను మ‌రింత ప్రోత్సహించాలన్నారు. ఆయుష్మాన్ భార‌త్, అపార్ ఆవ‌శ్యక‌త‌ను తెల‌పాలి.. ఫ‌లాలు ఎక్కువ మందికి అందేలా చ‌ర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత ఇసుక విధానం మ‌రింత పార‌ద‌ర్శకంగా అమ‌లు చేయాలన్నారు. అన‌కాప‌ల్లి – అచ్యుతాపురం రోడ్డుకు త్వరిత‌గ‌తిన చ‌ర్యలు తీసుకోవాలి.. పీపీపీ విధానాన్ని అనుస‌రించాలన్నారు. సుగ‌ర్ ఫ్యాక్టరీల ద్వారా కేవ‌లం పంచ‌దార ఉత్పత్తి మాత్రమే కాకుండా.. ఇథ‌నాల్, డిస్టిల‌రీ ఉత్పత్తిపై దృష్టి సారించాలి.. రైతులకు ప్రయోజ‌నాలు వ‌చ్చేలా చ‌ర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్యవ‌స్థను గాడిన పెట్టాలి… ఉపాధ్యాయులకు శిక్షణ‌.. భ‌వ‌నాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. టూరిజం అభివృద్ధికి ఊతం ఇస్తూ… గిరిజ‌న యువ‌తను గైడ్లుగా మార్చాలి.. త‌గిన శిక్షణ ఇప్పించాలన్నారు. ఏజెన్సీల్లో డోలీమోత స‌మ‌స్యకు చెక్ పెట్టాలన్నారు. ప్రభుత్వంపై సానుకూల దృక్పథం వ‌చ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవ‌హ‌రించాలన్నారు. అభివృద్ధి విష‌యంలో… ప‌రిపాల‌న వ్యవ‌హారాల్లో ప్రజాప్రతినిధులు అధికారుల‌కు పూర్తి స‌హ‌కారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

 

ఢిల్లీలో పూర్తిగా క్షీణించిన గాలి నాణ్యత.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే
దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) 500 పాయింట్లుగా నమోదై కాలుష్య తీవ్రత రికార్డు స్థాయికి వెళ్లిపోయింది. గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీ నగరం అంతటా దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 507 పాయింట్లకు చేరితే ప్రమాదకర స్థాయి కాలుష్యంగా అధికారులు పరిగణిస్తారు. ఈ గాలి పీల్చితే ప్రజలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏక్యూఐ 500 పాయింట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి 65 రెట్లు ఎక్కువ కావడం గమనార్హంగా చెప్పొచ్చు. అయితే, శనివారం రాత్రి 9 గంటలకు 327గా ఉన్న ఏక్యూఐ కేవలం 10 గంటల్లో ఆదివారం ఉదయానికల్లా 500 పాయింట్లు దాటడం ఢిల్లీ వాసులను తీవ్ర కలవరపరుస్తోంది.

 

శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల ఉచిత బీమా
కేరళ ప్రభుత్వం శబరిమలకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది మండలం- మకరవిలక్కు యాత్రా సీజన్‌లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఉచిత బీమా కల్పించనుంది. ఆలయ నిర్వహణను పర్యవేక్షించే ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్‌ వాసవన్‌ తెలిపారు. ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే యాత్రా సీజన్‌లో స్వామి వారి దర్శనం సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. ప్రమాదవశాత్తు మరణించే భక్తులను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను టీడీబీ చేస్తుందని చెప్పుకొచ్చారు. కాగా, గత ఏడాది యాత్రా సీజన్‌లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ ఏడాది శబరిమల యాత్రా సీజన్ లో 13,600 మంది పోలీసులు, 2,500 ఫైర్, రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించనున్నారు. అలాగే, టీడీబీ రైల్వే స్టేషన్ల దగ్గర అదనపు పోలీస్ సిబ్బందిని, అటవీ శాఖ 132 సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1500 ఎకో గార్డ్స్ శబరిమలకు వచ్చే భక్తులకు సహాయం చేయనున్నారు. వీటితో పాటు ఇరుముడితో శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కొన్ని రోజుల కిందట పౌర విమానయాన శాఖ రూల్స్ సడలించింది. సెక్యూరిటీ స్కానింగ్ తర్వాత అయ్యప్ప భక్తులు ఇరుముడితో నేరుగా విమాన క్యాబిన్ లోనే ప్రయాణించే ఛాన్స్ కల్పించింది.

 

నేటి నుంచి ఆరు నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయం మూసివేత
ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేదార్‌నాథ్ గుడి తలుపులు శీతాకాలం కోసం నవంబర్ 3న మూసివేయబడతాయి. శీతాకాలం కోసం ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. శనివారం ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలో కేదార్‌బాబా పంచముఖి డోలీని ప్రతిష్టించనున్నారు. తదుపరి ఆరు నెలల పాటు, ఉఖిమఠ్‌ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం జరుగుతాయి. అదే సమయంలో బద్రీ – కేదార్ ఆలయ కమిటీ ఆలయ తలుపులు మూసివేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. కేదార్‌నాథ్ కొండపై ఉన్న భైరవనాథ్ తలుపులు మంగళవారం మూసివేయడంతో.. ఇప్పుడు కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మూసివేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. శనివారం బాబా కేదార్ పంచముఖి భోగ్ విగ్రహాన్ని ఉత్సవ్ డోలీలో ప్రతిష్టించనున్నారు. సంప్రదాయం ప్రకారం నవంబర్ 3న భయ్యా దూజ్ సందర్భంగా.. తెల్లవారుజామున 2 గంటల నుంచి 3.30 గంటల వరకు భక్తులను జలాభిషేకానికి అనుమతిస్తారు. దీని తరువాత గర్భగుడిని శుభ్రపరిచిన తరువాత ఉదయం 4.30 గంటలకు బాబా కేదార్‌నాథ్ పూజ, అభిషేకం, హారతితో పాటు నైవేద్యాలు సమర్పిస్తారు. సమాధి పూజ అనంతరం భగవంతుడికి ఆరు నెలల పాటు సమాధిని చేస్తారు. సరిగ్గా ఉదయం ఆరు గంటలకు గర్భగుడి తలుపులు మూసి వేయబడతాయి. ఆ తర్వాత సభా మండపంలో ఏర్పాటు చేసిన బాబా కేదార్ పంచముఖి డోలీ ఉదయం 8:30 గంటలకు ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత, ఆలయ ప్రధాన తలుపుతో పాటు వెనుక తలుపును మూసివేసి పౌరాణిక ఆచారాలతో మూసివేస్తారు. అదే రోజు, బాబా కేదార్ ‘చల్ ఉత్సవ్’ విగ్రహ డోలి రాత్రి బస కోసం దాని మొదటి స్టాప్ రాంపూర్ చేరుకుంటుంది. నవంబర్ 4న, కేదార్‌నాథ్ చల్-విగ్రహ డోలీ ఉదయం రాంపూర్ నుండి ఫటా, నారాయణకోటి మీదుగా బయలుదేరి విశ్వనాథ్ టెంపుల్ గుప్తకాశీకి చేరుకుంటుంది. నవంబర్ 5 న చల్-విగ్రహ డోలి విశ్వనాథ్ టెంపుల్ గుప్తకాశీ నుండి బయలుదేరి శీతాకాలపు గమ్యస్థానమైన శ్రీ ఓంకారేశ్వర్ టెంపుల్ ఉఖిమత్ ఉదయం 11.20 గంటలకు చేరుకుంటుంది.

 

3 నెలల్లో 2000 మందిపై దాడులు.. భద్రత కల్పించాలంటూ హిందువులు డిమాండ్
భారతదేశం పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు ప్రభుత్వం నుండి రక్షణ కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వం దాడులు, వేధింపుల నుండి తమను రక్షించాలని అలాగే హిందూ సమాజ నాయకులపై దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేయడానికి హిందూ సమాజానికి చెందిన సుమారు 300 మంది శనివారం ఢాకాలో సమావేశమయ్యారు. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి హిందూ సమాజంపై వేలాది దాడులు జరిగాయని హిందూ సంఘాల ర్యాలీ పేర్కొంది. హిందువులపై దాడులకు సంబంధించి, దేశంలోని మైనారిటీ గ్రూప్ బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యత కౌన్సిల్ ఆగస్టు 4 నుండి హిందువులపై 2,000 కంటే ఎక్కువ దాడులు జరిగాయని తెలిపింది. మొదటి విద్యార్థి ఉద్యమం బంగ్లాదేశ్‌లో జరిగింది. ఆ తర్వాత దేశంలో తిరుగుబాటు జరిగింది. దాంతో షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. తిరుగుబాటు తరువాత, దేశంలో మరోసారి క్రమాన్ని పునరుద్ధరించడానికి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడింది. ఈ మధ్యంతర ప్రభుత్వానికి మహ్మద్ యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో దేశంలో మానవ హక్కులపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల అధికారులు, ఇతర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనారిటీ కమ్యూనిటీలు మధ్యంతర ప్రభుత్వం తమకు తగిన రక్షణ కల్పించలేదని అన్నారు. షేక్ హసీనాను అధికారం నుండి తొలగించిన తర్వాత రాడికల్ ఇస్లాంవాదులు మరింత ప్రభావం చూపుతున్నారని వారు అన్నారు. పొరుగు దేశంలో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ పరిస్థితిపై భారత్ మాత్రమే కాదు అమెరికా కూడా వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా పదవీ నుంచి వైదొలిగినప్పటి నుండి మానవ హక్కులను తాను పర్యవేక్షిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. అలాగే, ఇటీవలి ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు ఇతర మైనారిటీలపై జరుగుతున్న అనాగరిక హింసను నేను తీవ్రంగా ఖండిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

 

హెజ్బొల్లా టాప్ కమాండర్ను లేపేసిన ఇజ్రాయెల్
వైమానిక, భూతల దాడులతో హెజ్ బొల్లాను ఇజ్రాయెల్ ఉక్కిబిక్కిరి చేస్తోంది. మరోసారి ఆ సంస్థను కోలుకోలేని దెబ్బకొట్టింది టెల్ అవీవ్. హెజ్ బొల్లా టాప్ కమాండర్ ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. నాసర్ బ్రిగేడ్ రాకెట్ మిస్సైల్స్ యూనిట్ కు చెందిన కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ ను దక్షిణ లెబనాన్ లో హతమార్చినట్లు పేర్కొనింది. ఇజ్రాయెల్ పై చోటు చేసుకున్న పలు రాకెట్ దాడుల వెనక.. జాఫర్ హస్తం ఉన్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఆరోపించింది. కాగా, ఇజ్రాయెల్ పై జరిగిన పలు దాడుల వెనక నాసర్ బ్రిగేడ్ రాకెట్ మిస్సైల్స్ యూనిట్ కు చెందిన కమాండర్ జాఫర్ ఖాదర్ ఫార్ ఉన్నాడని ఐడీఎఫ్ అనుమానించింది. మాజ్ దల్ షామ్స్ పై రాకెట్ దాడి ఘటనలో 12 మంది చిన్నారులు మృతి చెందడం.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతవారం మెటులా ఘటనలో.. ఐదుగురు ఇజ్రాయెలీలు చనిపోయిన ఘటన వెనకుంది జాఫరేనని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. అంతేకాకుండా గతేడాది అక్టోబర్ 8వ తేదీన తూర్పు లెబనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులను హెజ్‌బొల్లా చేపట్టగా.. జాఫర్ ఆధ్వర్యంలోనే ఆ దాడులు జరిగినట్లు ఐడీఎఫ్‌ చెప్పుకొచ్చింది. ఈ దాడులకు ముందు తూర్పు లెబనాన్‌లో సీనియర్‌ హెజ్‌బొల్లా ఆపరేటివ్‌ను బంధించినట్లు ఇజ్రాయెల్‌ నేవీ అధికారులు చెప్పారు. అయితే, అదుపులోకి తీసుకున్న హెజ్‌బొల్లా ఆపరేటివ్‌ ఎవరనేది ఇప్పటి వరకు వెల్లడించలేదు. మరోవైపు శుక్రవారం బాత్రూన్ లెబనాన్‌కు చెందిన నేవీ కెప్టెన్‌ను కొందరు దొంగలించారు. ఈ ఘటన వెనక ఇజ్రాయెల్‌ పాత్ర ఉందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు లెబనీస్‌ అధికారులు తెలిపారు.

 

మా అధికారులపై కెనడా నిఘా పెట్టిందని ఆరోపించిన భారత్..
భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒట్టావా ఇండియన్ కాన్సులర్ సిబ్బందిపై నిఘా పెట్టిందని భాతర ప్రభుత్వం ఆరోపించింది. మా కాన్సులర్ అధికారులపై కెనడా ఆడియో, వీడియో రూపంలో నిఘా పెట్టిందని.. ఇలాంటి చర్యలకు పాల్పడి వారిని ‘వేధింపులకు గురి చేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. అలాంటి చర్యలు స్థాపించడం కష్టతరం చేశాయని చెప్పుకొచ్చారు. కాగా, ఈ చర్యలు సంబంధిత దౌత్య- కాన్సులర్ ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు తాముభావిస్తున్నాం.. కాబట్టి కెనడియన్ ప్రభుత్వానికి అధికారికంగా నిరసన తెలియజేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పుకొచ్చారు. కెనడా ప్రభుత్వం బెదిరింపులకు దిగడాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టబోమన్నారు. మా దౌత్య- కాన్సులర్ సిబ్బంది ఇప్పటికే తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో పని చేస్తున్నారని జైస్వాల్ ఆరోపించారు. సెప్టెంబరు 2023లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై దర్యాప్తులో ఒట్టావాలోని భారతీయ దౌత్యవేత్తలపై ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఇక, నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో భారతీయ రాజబారుల ప్రమేయం ఉందని ఆరోపణలు చేశారు. దీనిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కెనడా ప్రభుత్వ ప్రకటన గత నెలలో ఒట్టావాలోని తన హైకమిషనర్‌తో పాటు ఇతర దౌత్యవేత్తలను వెనక్కి తీసుకొచ్చింది. అలాగే, కెనడా సర్కార్ ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.

 

లోకేష్ కనగరాజ్.. ప్రభాస్ ఫిక్స్.. షూట్ ఎప్పుడంటే..?
ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. డార్లింగ్ స్పీడ్ ను చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు ప్రభాస్. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ చేసిన ప్రభాస్ ఘోస్ట్ లుక్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది, ఈ సినిమా తో పాటు ప్రేమకథలను తెరకెక్కించడంలో మాస్టర్ డిగ్రీ చేసిన హను రాఘవపూడి సినిమాలోను ప్రభాస్ నటిస్తున్నాడు. తాజాగా రెబల్ స్టార్ లైనప్ లో మరో దర్శకుడు వచ్చి చేరినట్టు ఇండస్ట్రీ లో హాట్ చర్చ నడుస్తుంది. ఇద్దరి మధ్య ఇటీవల కథ చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. అందుకు ప్రబాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. డార్లింగ్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్రభాస్ తో మాస్ యాక్షన్ సినిమాను లోకేష్ ప్లాన్ చేస్తునట్టు తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. కానీ ఇక్కడా ఓ విషయం చర్చనీయాశం గా మారింది. డార్లింగ్ ఈ సినిమా షూట్ ఎప్పుడు   అనేది టాపిక్. వచ్చే ఏడాది చివరి వరకు రెబల్ స్టార్ డైరీ ఫుల్ అయింది. ఇప్పడు చేస్తున్న రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ ఉంది. ఈ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ కల్కి -2 ఎలాగూ ఉండనే ఉంది.

 

నేడు తేలనున్న మూడో టెస్ట్ ఫలితం.. టీమిండియా విజయం బాట పడుతుందా?
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ముంబై టెస్టు మ్యాచ్ ఫలితం మూడో రోజే తేలే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 2 రోజుల ఆట మాత్రమే పూర్తి అవ్వగా, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. దింతో మూడో రోజు ఆట ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 9 వికెట్లకు 171 పరుగులు చేసి 143 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతానికి ఆధిక్యం తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాల్గవ ఇన్నింగ్స్ గణాంకాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇది ఇప్పుడు టీమ్ ఇండియా అభిమానులకు పెద్ద టెన్షన్‌గా నిలుస్తోంది. మూడో రోజు ఆటలో, న్యూజిలాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో ఒక్కవికెట్ మాత్రమే ఉన్న గరిష్టంగా పరుగులు చేయాలనీ చూస్తోంది. అదే సమయంలో, న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను వీలైనంత త్వరగా ముగించడానికి టీమిండియా ప్రయత్నం చేస్తుంది. రెండో రోజు ఆటలో పిచ్‌పై చాలా మలుపులతో కూడిన పరిస్థితి కనపడింది. కాబట్టి మూడో రోజు కూడా స్పిన్నర్లు మ్యాచ్‌పై ఆధిపత్యం చెలాయిస్తారు. కానీ, టీమిండియా టెన్షన్ విషయమేంటంటే.. ఇప్పటివరకు ఈ గడ్డపై నాలుగో ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగుల లక్ష్యాన్ని ఒక్కసారి మాత్రమే ఛేదించడం విశేషం. దక్షిణాఫ్రికా జట్టు వాంఖడే స్టేడియంలో అతిపెద్ద ఛేజింగ్ రికార్డు సృష్టించింది. 2000లో టీమిండియాపై దక్షిణాఫ్రికా ఈ ఘనత సాధించింది. అప్పుడు టీమిండియా కెప్టెన్ సచిన్ టెండూల్కర్. హాన్సీ క్రోంజే నాయకత్వంలో దక్షిణాఫ్రికా 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. అలాగే 1980లో ఇక్కడ టీమిండియాపై ఇంగ్లండ్ 98 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దింతో వాంఖడే స్టేడియంలో నాలుగో ఇన్నింగ్స్ టీమిండియాకు చాలా భారం కానుందని. మ్యాచ్ గెలవాలంటే భారత్ ఈ చరిత్రను ఎలాగైనా మార్చాల్సిందేనని స్పష్టం అవుతోంది. ఇకపోతే, ముంబైలోని వాంఖడే స్టేడియంలో గత 12 ఏళ్లలో భారత జట్టు ఏ టెస్టులోనూ ఓడిపోలేదు. ఈ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత టీమిండియాపై ఉంది. టీమిండియా చివరిసారిగా నవంబర్ 2012లో వాంఖడేలో ఇంగ్లండ్ చేతిలో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లను ఈ గడ్డపై టెస్టుల్లో భారత్‌ ఓడించింది.