NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. ఓ వైపు సమీక్షలు.. మరోవైపు క్షేత్రస్థాయి పర్యటనలు కొనసాగిస్తున్నారు.. ఇక, సీఎం హోదాలో తొలిసారి హస్తినకు వెళ్లనున్నారు.. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. ఈ రోజు సాయంత్రం 5.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రాత్రికి అక్కడే బస చేస్తారు.. ఇక, గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా సహా అందుబాటులో ఉన్న మరికొందరు కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు.. ఢిల్లీకి వెళ్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇక, సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి కూడా హస్తినకు వెళ్లనున్నారు.. ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల మంజూరు, అమరావతి రాజధాని లాంటి అంశాలపై ఢిల్లీ పెద్దలతో సీఎం చంద్రబాబు చర్చలు జరపనున్నారు..

రాజధాని నిర్మాణంపై నేడు శ్వేతపత్రం విడుదల..
గత ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆ పనిలో పడిపోయారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసి వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.. ఇక, ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.. గత ఐదేళ్ల కాలంలో రాజధాని అమరావతికి జరిగిన నష్టాన్ని వివరించనున్నారు సీఎం.. రాజధాని పరిధిలో టీడీపీ హయాంలో నిర్మించిన భవనాల పరిస్థితేంటీ..? అనే విషయాన్ని వైట్ పేపర్లో పొందుపరచనున్నారు.. అమరావతి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేందుకు రెడీ అయ్యారు ఏపీ ముఖ్యమంత్రి.. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని తెలియచెప్పనున్నారు.. రాజధాని పునర్ నిర్మాణం కోసం తామేం చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వివరించే అవకాశం ఉంది.. మరోవైపు.. రాజధాని నిర్మాణంపై ఇప్పటికే వివిధ కాంట్రాక్ట్ సంస్థలతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. ముందుగా జంగిల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ పై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం..

పట్టిసీమ నుంచి నీరు విడుదల..
కృష్ణా డెల్టా రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా నీటి విడుదల చేపట్టారు. మొదటి విడతలో పోలవరం కుడి కాలువ నుంచి 1000 క్యూసెక్కుల నీరు కృష్ణ డెల్టాకు విడుదల చేశారు. తాగు, సాగు నీటి అవసరాల మేరకు విడతలవారీగా నేటి విడుదల శాతాన్ని పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అధికారులతో కలిసి నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ఇక, ఇటుకలకోట వద్ద పట్టిసీమ డెలివరీ పాయింట్ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు..! కట్‌ చేస్తే యువకుడి ఆత్మహత్య
ప్రేమ విఫలమైందని అనంతపురంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం శివారు కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలోని ఓ ఇంటిలో వాసుదత్త అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వాసుదత్త అనే యువకుడు ఇంటికి సమీపంలోనే ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి నిన్నటి రోజున పెన్నహోబిలంలో ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన యువతి ఒక్కసారిగా వాసుదత్త తనను ఇబ్బంది పెడుతున్నారని తన ప్రేమను నిరాకరించింది. దీంతో, మనస్థాపం చెందిన వాసుదత్త ఇంటికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్‌.. మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఎవరికి?
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఖరారైంది. జూలై 4న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుంది? విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు..? హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలేంటి..? తాజాగా పార్టీ మారిన వారికి చోటు దక్కుతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎం సహా 12 మంది మంత్రులు ఉండగా మరో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఈ ఆరు మంత్రి పదవులు భర్తీ కానున్నాయి. ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. హైకమాండ్‌తో సంప్రదింపులు జరిపి మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో రెండు బీసీలకు, ఒకటి ఎస్టీలకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయమై మరోసారి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రి ప‌ద‌వి ఆశించిన వారంతా ఢిల్లీ చుట్టూ, సీఎం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

రేపు దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్‌..?
నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ జులై 4న దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్‌కు SIF, AISF, PDSU, PDSO, NSUI విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై నిరసన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి. కాగా, నీట్, నెట్ పరీక్షల లీకేజీపై పార్లమెంట్‌లో మోదీ సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, పీడీఎస్‌వో, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. నీట్, నెట్ మాత్రమే కాదు.. గత కొన్నేళ్లుగా అన్ని పరీక్షల పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యాశాఖపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పరీక్షలు వారి జీవితాలకు సంబంధించినవని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు.

కచ్చతీవును ఇంకెప్పుడు స్వాధీనం చేసుకుంటారు.. ప్రధానిపై స్టాలిన్ ఫైర్..!
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. 1974లో శ్రీలంకకు భారత్ అప్పగించిన కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు మాత్రమే బీజేపీ దీనిపై హడావుడి చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సీఎం మంగళవారం లేఖ రాశారు. ఇటీవల శ్రీలంక నావికాదళం తమిళనాడుకు చెందిన భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన ఘటనలు భారీగా పెరిగిపోయాయని వాపోయారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. అయితే, తమిళనాడు రాష్ట్రానికి చెందిన మత్య్సకారుల హక్కులను కాపాడండి అని విదేశాంగ మంత్రి జైశంకర్ కు రాసిన లేఖలో సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. జూలై 1వ తేదీన శ్రీలంక నేవీ 25 మంది మత్స్యకారులతో పాటు రెండు మోటరైజ్డ్ కంట్రీ క్రాఫ్ట్‌లు, రెండు రిజిస్టర్డ్ ఫిషింగ్ బోట్‌లను పట్టేసుకున్నారని తెలిపారు. తమిళనాడు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మోడీ ప్రభుత్వానికి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

యూపీ తొక్కిసలాటలో 116 మంది మృతి.. నేడు హత్రాస్కు సీఎం యోగి..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం యూపీలోని హత్రాస్ జిల్లా ఫూల్ రాయ్ గ్రామం దగ్గర నిర్వహించిన భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఈ పెను విషాదం జరిగింది. వేలాది మంది హాజరైన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్రమైన రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో దాదాపు 116 మంది మరణించారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉండగా.. 108 మంది మహిళలు ఉన్నారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే బాబా వెళ్లిపోతుండగా ఆయనతో ఫొటో దిగేందుకు.. ఆయన కాళ్లు మొక్కేందుకు జనం ఎగబడ్డారు.. అలాగే, బురద వల్ల నేలపై కొందరు జారిపడటంతో తొక్కిసలాట స్టార్ట్ అయింది అని చెప్తున్నారు. కాగా, తొక్కిసలాటలో మరణించిన 89 మంది డెడ్ బాడీలను హత్రాస్ లోని ఆస్పత్రిలో ఉంచామని ఎస్పీ రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. అలాగే, ఎటాలోని జిల్లా ఆస్పత్రికి 27 మంది డెడ్ బాడీలను తరలించామన్నారు. ఇప్పటి వరకు మృతుల్లో 72 మందిని గుర్తించామని పోలీసులు వెల్లడించారు.

కజకిస్తాన్‌లో ఎస్‌సీవో సమ్మిట్‌కు ప్రధాని మోడీ దూరం
కజకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనికి హాజరవుతారు. ఇక్కడకు వచ్చే ప్రపంచ నాయకులను విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్ కలవనున్నారు. SCO శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌లను ఆయన కలుస్తారు. మేలో పుతిన్ చివరిసారిగా జిన్‌పింగ్‌ను కలిశారు. ఐదోసారి రష్యా అధ్యక్షుడయ్యాక చైనా వెళ్లారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీవో) ఒక రాజకీయ, ఆర్థిక, సైనిక సంస్థ. ఇది 2001లో ఏర్పడింది. దీంట్లో చైనా, రష్యా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇది మొదట 1996లో ‘షాంఘై ఫైవ్’గా ఏర్పాటైంది. 2001లో ఉజ్బెకిస్థాన్ చేరడంతో షాంఘై సహకార సంస్థగా పేరు మార్చారు. దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. టర్కీ ఎస్‌సీవోలో సభ్యదేశం కానప్పటికీ, తరచుగా సమావేశాలలో సంభాషణ భాగస్వామిగా పాల్గొంటుంది. ఎస్‌సీవో సమ్మిట్‌లో పాల్గొనేందుకు భారతదేశం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ అస్తానా చేరుకున్నారు.

నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్స్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ.. తొలిపోరు ఎవరెవరికంటే..?
నేటి నుంచి వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో ఆడతారు. దిగ్గజ క్రికెటర్ల ఆట చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఈ లీగ్ సరికొత్త వినోదాన్ని పంచబోతుంది. నేటి నుంచి జూలై (శనివారం) 13 వరకు లెజెండ్స్ లీగ్ జరగబోతుంది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ పోటీలో మొత్తం 6 దేశాలు పాల్గొంటున్నాయి. ఇంగ్లండ్, ఇండియా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాకు చెందిన లెజెండ్స్ జట్లు 10 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీలో టైటిల్ కోసం పోటీపడనున్నాయి. అయితే, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జూలై 6వ తేదీన జరగనుంది. ఎడ్జ్ బాస్టన్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివబోతుంది. భారత జట్టుకు యువరాజ్ కెప్టెన్సీగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ టీమ్ ను షాహిద్ ఆఫ్రిది లీడ్ చేయబోతున్నాడు. ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు ఒక మ్యాచ్.. సాయంత్రం 5 గంటలకు మరో మ్యాచ్ జరగనుంది. యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, కెవిన్ పీటర్సన్, బెన్ కట్టింగ్, షాన్ మార్ష్, ఇమ్రాన్ తాహిర్, డేల్ స్టెయిన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, షాహిద్ అఫ్రిది, ఆరోన్ ఫించ్, బ్రెట్ లీ లాంటి మాజీ అంతర్జాతీయ క్రికెటర్ల ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అయ్యారు.

పలాస హీరో ఆపరేషన్‌ రావణ్‌ వచ్చేది ఎప్పుడో తెలుసా..?
పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు యంగ్ యాక్టర్‌ రక్షిత్‌ అట్లూరి. కరుణకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమా తెరకెక్కించిన మేకర్స్‌ నుంచి మరో ప్రాజెక్ట్‌ వస్తోంది. సాయి మోహన్‌ ఉబ్బన దర్శకత్వంలో సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న చిత్రం “ఆపరేషన్ రావణ్”. హై ఆక్టేన్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రక్షిత్ సరసన మలయాళ భామ సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే మూవీ కూడా భారత దేశం అంతా గర్వించే దగ్గ సినిమా అవుతుంది. ఏదో డైరెక్షన్ అంటే డైరెక్షన్ చేశారు అని కాకుండా.. అన్ని విషయాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకుని చేశారు. అందరికంటే ముందే ఉదయమే సెట్స్‌లో ఉండేవారు. సినిమా చాలా బాగా వచ్చింది. మా ఈ కాన్ఫిడెంట్ కు కారణం అదే అని హీరో రక్షిత్ చెప్పుకొచ్చారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ‘సైకో స్టోరీ’ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 2న విడుదలకు సిద్ధం అయ్యింది.