మరో ఘోర ప్రమాదం.. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..
మరో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. ఎర్రాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం జరిగింది.. టాటానగర్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వైపు వెళ్తున్న.. టాటానగర్–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం. 18189)లో ఈ రోజు తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా, ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలోని దువ్వాడ–ఎలమంచిలి మధ్య ప్రాంతంలో జరిగింది. రైలు ప్రయాణంలో ఉన్న సమయంలో AC కోచ్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైలు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 గంటల సమయంలో మంటలు వ్యాపించడం ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. తొలుత B1 కోచ్‌లో మంటలు చెలరేగి, క్షణాల్లోనే పక్కనున్న మరో కోచ్‌కూ వ్యాపించాయి. లోకో పైలట్ మంటలను గమనించి వెంటనే ఎలమంచిలి స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారు. ప్రయాణీకులు అప్రమత్తమై చైన్ లాగి రైలును ఆపేందుకు సహకరించారు. అయితే, అగ్ని ప్రమాదంలో రైలులోని M1, B2 అనే రెండు ఏసీ కోచీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని వేగంగా వ్యాపించినప్పటికీ, రైల్వే సిబ్బంది తక్షణ చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్క వృద్ధుడు ఈ ఘటనలో సజీవ దహనం కాగా.. మిగతా ప్రయాణీకులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం వృద్ధుడు సజీవ దహనం అయ్యారు.. మిగతా ప్రయాణికులు ఎలాంటి గాయాలు లేకుండా అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.. ఇక, సమాచారం అందుకున్న వెంటనే యలమంచిలి, అనకాపల్లి నుంచి ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మొత్తం 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి సుమారు 80 శాతం మేర మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ, రెండు కోచీలు మాత్రం పూర్తిగా కాలిపోయాయి.
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. మంత్రివర్గం ముందు కీలక అజెండా..
ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే ఈ భేటీలో.. రాష్ట్రానికి కీలకమైన పలు అభివృద్ధి, పరిపాలనా అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో పరిపాలనను మరింత వికేంద్రీకరించి ప్రజలకు సేవలు వేగంగా అందించాలన్న లక్ష్యంతో.. 3 కొత్త జిల్లాలు, పలు రెవిన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో రూ.103.96 కోట్ల వ్యయంతో అధునాతన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇది రాష్ట్రాన్ని టెక్నాలజీ, రీసెర్చ్ హబ్‌గా మార్చే దిశగా మరో ముందడుగు కానుంది. సచివాలయ పరిధిలో ఉన్న అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు రూ.109 కోట్ల నిధుల కేటాయింపుకు ఆమోదం ఇవ్వనున్నారు. అమరావతి పరిధిలోని శాఖమూరు గ్రామంలో 23 ఎకరాల భూమిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల నిర్మాణం చేపట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెంచేలా.. తుళ్లూరులో 6 ఎకరాల భూమిని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా.. 8400 క్యూసెక్కుల సామర్థ్యంతో రూ.444 కోట్ల వ్యయంతో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
ఇవాళ అర్ధరాత్రి తెరుచుకోనున్న వైకుంఠ ద్వారాలు..
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు ఇవాళ అర్ధరాత్రి 12:01 గంటలకు తెరుచుకోనున్నాయి. ఈ పవిత్ర దర్శనాల కోసం ఇప్పటికే వేలాదిమంది భక్తులు తిరుమలకు చేరుకుని క్యూలైన్లలో వేచి ఉన్నారు. అయితే, రాత్రి 12:01కి వైకుంఠ ద్వారాల తెరుచుకోనుండగా.. వేకువజామున 1 గంట నుంచి వీవీఐపీ దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు.. ఆ తర్వాత టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ రోజు నుంచి జనవరి 8 వరకు సిఫార్సు లేఖలపై జారీ చేసే VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.. 10 రోజుల పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.. మరోవైపు, ఆలయ పరిసరాల్లోని 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.. నిన్నటి రోజు 85,823 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.. 23,660 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.. హుండీ ఆదాయం రూ.4.8 కోట్లుగా ప్రకటించింది టీటీడీ..
గ్రామ పంచాయతీల విభజన, విలీనానికి తాత్కాలిక బ్రేక్..!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీల విభజన, విలీన ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియకముందే విలీన ప్రతిపాదనలపై కీలక సవరణలు తీసుకురావాల్సిన పరిస్థితి.. కానీ, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు, అలాగే రాబోయే జనగణన ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.. అయితే, పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఇంకా కొనసాగుతుండటం వల్ల మధ్యలో విలీనాలు చేపట్టడం సరైంది కాదన్న అభిప్రాయం.. గ్రామాల విభజన, విలీనంపై కోర్టుల్లో పెండింగ్ కేసులు ఉండటం.. త్వరలో చేపట్టనున్న జాతీయ జనగణన కారణంగా గ్రామాల జనాభా, సరిహద్దులు, భౌగోళిక వర్గీకరణలో మార్పులు వచ్చే అవకాశం ఉండటం కూడా ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోవడానికి కారణంగా చెబుతున్నారు.. పలు పరిపాలనా, చట్టపరమైన సవరణలు పరిశీలనలో ఉండటం.. ఈ అన్ని అంశాలను సమీక్షించిన తర్వాతే.. విభజన లేదా విలీన ప్రక్రియను కొంతకాలం నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు ఈ రోజు ( డిసెంబర్ 29న) ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మొదట దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి, మాగంటి గోపినాథ్ లకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. అలాగే, జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనంతో పాటు జీహెచ్ఎంసీ పరిధి పెరిగడంతో వార్డుల సంఖ్య పెంపు, లోకల్ బాడీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన రెండు ఆర్డినెన్సులు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ కి సంబంధించి గెజిట్ ప్రచురణలను ఈ అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించే ఛాన్స్ ఉంది. ఇక, టీఎస్ఎస్ ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు, తదితర పత్రాలను శాసన సభలో ప్రవేశ పెట్టనున్నారు. తొలిరోజు సమావేశాలు ముగిసిన తర్వాత.. ఉభయ సభలు జనవరి 2వ తేదీకి వాయిదా పడే అవకాశం ఉంది. 30న వైకుంఠ ఏకాదశి, 31న ఆంగ్ల సంవత్సరం చివరి రోజు.. జనవరి 1ని పురస్కరించుకొని సమావేశాలు నిర్వహించడం లేదని సమాచారం. ఇవాళ ఉభయ సభల వాయిదా తర్వాత.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ ( బీఏసీ) సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్ని రోజుల పాటు సభలు నిర్వహించాలి అనేది నిర్ణయించనున్నారు.
కొత్త జంట షాకింగ్ నిర్ణయం.. వెయ్యి కి.మీ ప్రయాణం చేసి ఏం చేశారంటే..!
కొత్త సంసారంలో ఏం కలహాలు వచ్చాయో.. ఏమో తెలియదు గానీ ఓ నూతన జంట షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకోగా.. గంటల వ్యవధిలో భర్త కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన టెక్ సిటీ బెంగళూరులో చోటుచేసుకుంది. గన్వి (26), సూరజ్ శివన్న (36) భార్యాభర్తలు. అక్టోబర్ 29న బెంగళూరులో వివాహం జరిగింది. అనంతరం హనీమూన్ కోసం శ్రీలంక టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ప్రయాణం అర్థాంతరంగా రద్దైంది. వివాదం కారణంగా గత వారం తిరిగి బెంగళూరు చేరుకున్నారు. భార్యాభర్తల మధ్య ఏం సంఘర్షణ జరిగిందో ఏమో తెలియదు గానీ గత మంగళవారం గన్వి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటిలేటర్‌పై రెండు రోజులు చికిత్స అందించారు. గత గురువారం వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.
మెక్సికోలో రైలు ప్రమాదం.. 13 మంది మృతి
దక్షిణ మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన ఓక్సాకాలో ఆదివారం ఇంటర్ ఓషియానిక్ రైలు పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా పేర్కొన్నారు. రైల్లో తొమ్మిది మంది సిబ్బంది, 241 మంది ప్రయాణికులు సహా దాదాపు 250 మంది ఉన్నారని మెక్సికన్ నేవీ తెలిపింది. 193 మంది ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం. తొంభై ఎనిమిది మంది గాయపడ్డారని, 36 మంది వైద్య చికిత్స పొందుతున్నారని నేవీ తెలిపింది.
ట్రంప్-జెలెన్స్కీ భేటీ.. చివరికి ఏం తేలిందంటే..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అవుతోంది. నాలుగేళ్ల నుంచి రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చాలా రోజుల నుంచి విఫలమవుతున్న చర్చలు.. మొత్తానికి ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఆదివారం ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశమై శాంతి ఒప్పందంపై చర్చించారు. 20 పాయింట్ల ప్రణాళికపై ఇరువురి నేతలు చర్చించారు. అయితే ఉక్రెయిన్ భద్రతాపై ట్రంప్ హామీ ఇవ్వడంతో శాంతి చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. భేటీ తర్వాత జెలెన్స్కీ-ట్రంప్ మాట్లాడుతూ.. శాంతి చర్చలు 90-95 శాతం కొలిక్కి వచ్చాయని.. వచ్చే నెలలో పూర్తి పరిష్కారం దొరుకుతుందని జెలెన్స్కీ అన్నారు. కాదు.. కాదు.. వచ్చే వారమే శాంతి ఒప్పందం జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒక్క డాన్బాస్ దగ్గరే పంచాయితీ తెగలేదని.. అది కూడా పరిష్కరింపబడితే వచ్చే వారమే రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం జరగవచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నేటి డిజిటల్ యుగంలో దూసుకెళ్లాలంటే 5 బెస్ట్ AI టూల్స్ మీకోసం..!
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవలు ఎంత దగ్గరయ్యయ్యో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందులోకి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండడంతో డిజిటల్ ప్రపంచం దూసుకెళ్తుంది. గుండుసూది నుండి కారు కొంగులు ఇలా అనేకపనులు ఆన్ లైన్ లోనే చకచకా జరిగిపోతున్నాయి. ఒక గత కొద్దీ కాలంగా AI వచ్చాక ఈ డిజిటల్ ప్రపంచం మరింత దూసుకెళ్తుంది. మరి AI ప్రపంచంలో మన రోజువారీ అవసరాలను తీర్చే కొన్ని ఉచిత బెస్ట్ వాటిని చూసేద్దామా.. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఉచిత AI టూల్స్‌లో ఒకటి ChatGPT. దీని సహాయంతో ప్రొఫెషనల్ రిజ్యూమ్ తయారు చేయడం, ఈమెయిల్స్ రాయడం, ఆర్టికల్స్ క్రియేట్ చేయడం, రోజువారీ పనులను ప్లాన్ చేయడం చాలా సులభం అయ్యింది. అంతేకాదు సోషల్ మీడియా కంటెంట్, స్క్రిప్ట్స్, ఇన్విటేషన్ కార్డుల టెక్స్ట్, ఐడియాస్ కూడా ఇది అందించగలదు. సహజమైన, స్పష్టమైన భాషలో సమాధానాలు ఇవ్వడం ChatGPT ప్రధాన ప్రత్యేకతగా చెప్పవచ్చు. మరిన్ని ఫీచర్లు కావాలంటే ఇందులో డబ్బులు చెల్లించి వాటిని కూడా పొందవచ్చు.
క్రికెట్ సౌతాఫ్రికాకు షాక్.. కోర్టులో గెలిచిన తబ్రేజ్ షంషి.. అసలు మ్యాటరేంటంటే..?
దక్షిణాఫ్రికా స్టార్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తబ్రేజ్ షంషికి జోహన్నెస్‌బర్గ్ హైకోర్టులో భారీ విజయం లభించింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) తో సాగుతున్న వివాదంలో కోర్టు షంషికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో షంషి విదేశీ టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు ఉన్న అడ్డంకులు తొలిగాయి. ఈ గొడవ SA20 వేలంతో మొదలైంది. వేలంలో షంషిని ‘ఎంఐ కేప్ టౌన్’ ఫ్రాంఛైజీ 5 లక్షల రాండ్లకు కొనుగోలు చేసింది. అయితే షంషి ఆ ఫ్రాంఛైజీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి నిరాకరించారు. అదే సమయంలో ఆయన ఇతర అంతర్జాతీయ లీగ్‌లైన ILT20 (UAE), బిగ్ బాష్ లీగ్ (AUS) లలో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. అయితే విదేశీ లీగ్‌లలో ఆడాలంటే సొంత దేశ బోర్డు (CSA) నుంచి NOC తప్పనిసరి. అయితే SA20 వేలంలో అమ్ముడైన ఆటగాడు ఖచ్చితంగా ఆ లీగ్‌లోనే ఆడాలనే నిబంధనను సాకుగా చూపుతూ CSA షంషికి NOC ఇవ్వడానికి నిరాకరించింది.
ప్రభాస్ ‘స్పిరిట్’లో మరో ఊహించని లుకా.. సందీప్ వంగ ప్లానింగ్ మామూలుగా లేదుగా!
రెబల్ స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందనే దీనిపై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే రీసెంట్గా ప్రభాస్ కాస్త సన్నబడి, మీసకట్టుతో కనిపించిన లుక్ చూసి అభిమానులు ఇదే ఫైనల్ అంటున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ ఫ్యాన్స్‌కు అసలైన షాక్ ఇంకా ముందే ఉందట. ఈ సినిమాలో ప్రభాస్ కేవలం ఒకే రకమైన మేకోవర్‌తో కాకుండా, మరో క్రేజీ వేరియేషన్లో కూడా కనిపిస్తారని తెలుస్తోంది. అదేలా ? అంటే సందీప్ రెడ్డి వంగకు ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంది.. సినిమా తీస్తున్నప్పుడు తన హీరో లుక్ ఎలా ఉంటుందో, తను కూడా దాదాపు అదే స్టైల్‌ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. గతంలో ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల టైంలో ఇది ప్రూవ్ అయ్యింది. ఇటీవల సందీప్ క్లీన్ షేవ్ చేసి కేవలం మీసాలతో కనిపించడంతో, ప్రభాస్ ‘స్పిరిట్’ లో సరికొత్త పోలీస్ ఆఫీసర్ లుక్‌లో కనిపించడం ఖాయమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ వంటి కీలక నటులతో షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే ప్రభాస్ మరో మేకోవర్‌లోకి మారనున్నారట. ఈ మ్యాడ్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడిన ‘దళపతి విజయ్’
అభిమానుల అత్యుత్సహం రోజురోజుకి హద్దు మీరుతోంది. ఇటీవల టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు అందరికి తెలిసిందే. కొద్దీ రోజుల క్రితం సమంతకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అభిమానం పేరుతో ఫ్యాన్స్ నటీనటులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఫ్యాన్స్ తీరుతో అసహనం వ్యక్తం చేశాడు. మలేషియాలో జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ ముగించి తమిళనాడు చేరుకున్నాడు విజయ్. ఈ నేపధ్యంలో విజయ్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దళపతి విజయ్ రాక కోసం భారీగా అభిమానులు చేరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీ జనసందోహం మధ్యలో విజయ్ తన కారులో ఎక్కేందుకు వెళుతుండగా అభిమానుల తోపులాట మధ్య విజయ్ కాలుజారి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విజయ్ ను చుట్టుముట్టి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు.అదృష్టవశాత్తూ విజయ్‌కు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదు. ప్రస్తుతం ఆయన పూర్తిగా సేఫ్‌గా ఉన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారణంగా తగిన స్థాయిలో క్రౌడ్ కంట్రోల్ లేకపోవడమేనని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అలాగే “తలపతి సేఫ్” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ట్రెండింగ్ చేశారు. అదే సమయంలో ఇలాంటి సందర్భాల్లో విజయ్ భద్రతపై మరింత దృష్టి పెట్టాలని ఆయన ఫ్యాన్స్ అభిమానులు కోరుతున్నారు. ఏదేమైనా అభిమానం కొంత వరకు ఉంటె ఓకే కానీ ఇలా వారిని ఇబ్బంది పెట్టడంకరెక్ట్ కాదు.
