NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లారు.. ఢిల్లీ వేదికగా ఈ రోజు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్నారు సీఎం.. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించబోతున్నారు. వికసిత్ భారత్-2047లో భాగంగా వికసిత్ ఏపీ-2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో ప్రస్తావించబోతున్నారు.. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పబోతున్నారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. జీడీపీ గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్.. చేపట్టనున్న ప్రణాళికలను నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించరున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు.. డిజిటల్ కరెన్సీ అవశ్యకతను నీతి ఆయోగ్ భేటీలో వివరించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ విషయాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబుతో సమావేశమై.. ప్రత్యేకంగా చర్చించారు నీతి ఆయోగ్ సీఈవో సుబ్రమణ్యం.. మరోవైపు.. నీతి ఆయోగ్ సమావేశం ముందు, ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనలో కీలక పరిణామం..
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటన కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఘటనపై 4 బృందాలు ఎంక్వైరీ చేస్తున్నాయి. ట్రాన్స్‌కో సిబ్బందిని పిలిపించి ఆరా తీస్తున్నారు. గత ఆరు రోజులుగా పోలీసుల అదుపులో ఆర్డీవో హరిప్రసాద్‌, మాజీ ఆర్డీవో మురళి, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ తేజ్‌, వీఆర్‌ఏ రమణయ్య ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది, అనుమానితుల కాల్‌ డేటాను సీఐడీ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న మాధవరెడ్డి ఇప్పటికే పరారీలో ఉన్నాడు. ఫొరెన్సిక్‌ నివేదిక రాగానే అన్ని నిజాలు తెలుస్తాయని దర్యాప్తు బృందం చెబుతోంది. కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపైనా సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. త్వరలోనే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడుతుందని చెబుతున్నారు. ఇక, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. జిల్లా ఎస్పీ ఆధ్వర్యం లో DSP కార్యాలయంలో ఆరో రోజు కొనసాగుతుండగా.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ జింకా వెంకటా చలపతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మరో అనుచరుడు బాబ్జాన్ ఇంటివద్దకు పోలీసులు చేరుకున్నారు.. మరికొందరిని అరెస్ట్‌ చేసే అవకాశముందని తెలుస్తోంది. మంటల్లో దగ్ధమైన రికార్డుల రికవరీకి ప్రయత్నం చేయొచ్చని భావిస్తున్నారు. కలెక్టరేట్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో లావాదేవీల రికార్డులను పరిశీలించారు. 20 ఏళ్ల తర్వాత డీ పట్టాలు ఫ్రీహోల్డ్‌ అవుతాయనే అనుమానంతోనే నిందితులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 21.16లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్‌ అయ్యాయి. అందులో 4,400 ఎకరాలకు రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఫ్రీహోల్డ్‌పై ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ చేపట్టారని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌ ఆర్పీ సిసోడియా తెలిపారు. అంతకు ముందు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి ఆర్పీ సిసోడియా అర్జీలు స్వీకరించారు. గురువారంతో గడువు ముగిసినప్పటికీ కొందరు పడిగాపులు కాశారు. అది చూసినా సిసోడియా.. వెళ్లబోతూ కారు ఆపి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అన్నింటినీ పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.

తడి చేతులతో సెల్‌ ఫోన్‌కు ఛార్జింగ్.. విద్యుత్‌ షాక్‌తో బాలిక మృతి
పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్లు వాడేస్తున్నారు.. ఛార్జింగ్‌ అయిపోతే.. ఇంట్లో ఉన్న పిల్లలకు ఫోన్‌ ఇచ్చి.. ఛార్జింగ్‌ పెట్టు అని పురమాయిస్తూ ఉంటారు.. అలాంటి వారు కాస్త ఆలోచన చేయాలి.. ఎందుకంటే.. సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెడుతూ.. బాలిక మృత్యువాతపడింది.. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి 8 ఏళ్ల బాలిక మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన కటికాల రామకృష్ణ -సుధారాణి దంపతులకు అంజలి కార్తీక(8) అనే కూతురు ఉంది.. ఆ చిన్నారి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది.. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే, అప్పుడే టాయ్‌లెట్‌కి వెళ్లి వచ్చిన ఆ బాలిక.. తన తండ్రి దగ్గర ఉన్న సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.. చిన్నారి చేతులు తడిగా ఉండటంతో కరెంటు షాక్ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక స్థానిక ప్రభుత్వం పాఠశాలలో 4 వ తరగతి చదువుతుంది. 8 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచిన చిన్నారి మృతి చెండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు అయినా.. పెద్దవాళ్లు అయినా.. చార్జింగ్‌ పెట్టేటప్పుడు.. చేతులు తడిగా లేకుండా చూసుకోవడం మంచిది.. అసలే వర్షాకాలం కాబట్టి.. మరింత జాగ్రత్తగా ఉంటే మేలు.

28, 29 తేదీల్లో హైదరాబాద్ లో వైన్ షాపులు పూర్తిగా బంద్..
మద్యం ప్రియులకు ఇది కాస్త చేదు వార్తే. హైదరాబాద్ నగరంలో ఆది, సోమవారాల్లో వైన్ షాపులు మూసివేయనున్నారు. మహంకాళి బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ వ్యాప్తంగా నాన్‌ ప్రాప్రయిటరీ లేని క్లబ్బులు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులను మూసివేయనున్నట్లు సీపీ కోట శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జులై 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు అన్ని వైన్ షాపులు బంద్ చేయనున్నారు. చాంద్రాయణగుట్ట, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు అంటే సోమవారం సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని తెలిపారు. . ముఖ్యంగా నగర సౌత్ జోన్‌లోని చార్మినార్, హుస్సేనీ ఆలం, ఫలక్ నుమా, మొగల్‌పురా, చైటినాక, శాలిబండ, మీర్‌చౌక్‌, డబ్బీర్‌పుర ప్రాంతాల్లో 28న ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, వైన్‌షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, మద్యం విక్రయ కేంద్రాలను మూసివేస్తున్నట్లు నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. కల్లు దుకాణాలు కూడా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులు 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఆషాడమాసం ప్రారంభం నుంచి నగరంలో బోనాల పండుగ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

రైతులను ఢిల్లీకి కాకపోతే.. లాహోర్కు పంపాలా ఏంటి..?
పంజాబ్‌ సీఎం, ఆప్‌ నేత భగవంత్‌ మాన్‌ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హర్యానాలో జరిగిన బహిరంగ సభలో మాన్‌ మాట్లాడుతూ.. శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో నిరసన తెలియజేస్తున్న రైతులను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోకి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఛాన్స్ లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది.. వారు ఢిల్లీకి వెళ్లకపోతే, లాహోర్‌కు పంపించాలా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) నేతృత్వంలోని పంజాబ్‌ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13వ తేదీన స్టార్ట్ చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వాలనే తమ డిమాండ్లను ఆమోదించాలని రైతు సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర (MSP) కోసం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. హస్తినకు వెళ్తున్న రైతు సంఘాల నేతలను అంబాలా- న్యూఢిల్లీ జాతీయ రహదారిపై సిమెంటు దిమ్మెలతో సహా బారికేడ్లను ఏర్పాటు చేసిన హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అప్పటి నుంచి రైతులు శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల దగ్గర నిరసన తెలియజేస్తున్నారు.

డెమోక్రటిక్‌ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ ఫిక్స్..!
డెమోక్రటిక్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ పేరు దాదాపు ఖరారు అయింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ (ఎక్స్‌)లో అధికారికంగా తెలిపింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేసినట్లు చెప్పుకొచ్చింది. అన్ని ఓట్లూ సాధించేందుకు కృషి చేస్తా.. నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుంది అని హారిస్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవల అధ్యక్ష రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో కమలా హారిస్‌ వివిధ పక్షాల సపోర్టు కూడ గట్టి డెమోక్రటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరోవైపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులు మద్దతు ఇచ్చారు. అధికారికంగా ఇంకా అభ్యర్థిత్వం ఫిక్స్ కాకపోయినా.. పార్టీలో కీలక నేతలంతా ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు. అయితే, తొలుత ఒబామా రియాక్ట్ కాలేదు.. దీంతో కమల అభ్యర్థిత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటికి తెరదించుతూ కమలా హారిస్‌తో ఒబామా దంపతులు ఫోన్‌లో మాట్లాడుతూ.. అమెరికాకు అధ్యక్షురాలు అవుతారని మేం భావిస్తున్నాం.. మా పూర్తి మద్దతును హారిస్ కే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబరు 5వ తేదీన జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలుపుకు కృషి చేస్తామని ఒబామా వెల్లడించారు.

నేడు శ్రీలంకతో తొలి టీ20.. భారత తుది జట్టు ఇదే! ఆ ఇద్దరికి మొదటి పరీక్ష
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ నేటి నుంచి ఆరంభం కానుంది. పల్లెకెలె స్టేడియం వేదికగా శనివారం రాత్రి 7 గంటలకు మొదటి టీ20 ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ, జింబాంబ్వే సిరీస్ గెలిచిన టీమిండియా.. లంకపై కూడా గెలవాలని చూస్తోంది. వరుస ఓటములు ఎదుర్కొంటున్న లంక ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. ఇక రోహిత్‌ శర్మ వారసుడిగా వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి హెడ్‌ కోచ్‌ పగ్గాలు అందుకున్న గౌతమ్ గంభీర్‌కు శ్రీలంక సిరీస్‌తో మొదటి పరీక్ష ఎదురుకానుంది. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారు. మూడో స్థానంలో రిషబ్ పంత్‌, నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ వస్తారు. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె ఆడనున్నారు. అక్షర్‌ పటేల్ సహా మరో ఇద్దరు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌ తుది జట్టులో ఉండొచ్చు. అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్‌ పేస్‌ బాధ్యతలు పంచుకుంటారు. మరోవైపు లంకకు బ్యాటింగ్‌లో అసలంక, నిశాంక, కుశాల్‌ మెండిస్, శానక.. బౌలింగ్‌లో పతిరన, హసరంగలు కీలకం కానున్నారు.

ఇంజిన్ మారిందంతే.. టీమిండియా రైలు మాత్రం దూసుకెళ్తూనే ఉంటుంది!
శనివారం పల్లెకెలె వేదికగా శ్రీలంకతో భారత్ తొలి టీ20 ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో భార‌త జ‌ట్టు టీ20 కెప్టెన్ సూర్య‌కుయార్ యాద‌వ్ తొలిసారి ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు. మీడియాతో మాట్లాడిన సూర్య టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. తనకు ఇష్టమైన కెప్టెన్ రోహిత్ అని.. ఆటగాడిగా, కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. కెప్టెన్సీ మార్పు గురించి మాట్లాడుతూ కేవ‌లం ఇంజిన్ మాత్రమే మారిందని, టీమిండియా రైలు మాత్రం దూసుకెళ్తూనే ఉంటుందని సూర్య తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కాదని.. సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎంపిక చేశాడు. శ్రీలంక పర్యటనలో సూర్య పగ్గాలు చేపడుతున్నాడు. మీడియా సమావేశంలో సూర్యకుమార్ మాట్లాడుతూ… ‘2014 నుంచి రోహిత్ శర్మతో కలిసి ఆడుతున్నా. ఇద్దరం కలిసి దాదాపుగా 10 ఏళ్లు ఆడాం. రోహిత్ నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కెప్టెన్ అంటే ఎలా ఉండాలని హిట్‌మ్యాన్ సారథ్యం చూసే నేర్చుకున్నా’ అని చెప్పాడు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ హీరో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాదించడంతో పాటు ప్రస్తుత క్యాబినెట్ లో మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ పవర్ స్టార్ ను మరో సారి సిల్వర్ స్క్రీన్ ఫై చూడాలని ఫ్యాన్స్ ఈగర్ గ ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఈ హీరో నటిస్తున్న సినిమాల సంగతి అయోమయంలో ఉన్నాయి. పవన్ సినిమాల్లో నటిస్తాడా లేదా అన్న డైలమా అందరిలోనూ నెలకొంది. వినిపిస్తున్న సమాచారం మేరకు త్వరలోనే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసారట నిర్మాత DVV దానయ్య. పవన్ తో OG చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత దానయ్య. దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ కు సంబంధించి కేవలం పది లేదా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందని టాక్. కాగా OG సినిమా కచ్చితంగా పూర్తి చేస్తానని నిర్మాత డివివి దానయ్యకు హామీ ఇచ్చారట పవన్ కళ్యాణ్. ఈలోగా పవన్ ఇలా వస్తే సినిమాలోని కీలక సన్నివేశాలను చక చక పూర్తి చేసేందుకు అటు నిర్మాత దానయ్య , దర్శకుడు సుజిత్ ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే OG సెట్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ తో ఫ్యాన్స్ అంచనాలు తార స్థాయికి చేరాయి.