NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు రాష్ట్ర బడ్జెట్‌.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క, శాసనమండలిలో శ్రీధర్‌బాబు..

నేడు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో 2024-25 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ఆమోదించేందుకు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో కేబినెట్ సమావేశం కానుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సొంత ఖాతా బడ్జెట్‌ గడువు జూలై నెలాఖరుతో ముగుస్తుంది. దీంతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ చర్చల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా కేంద్ర బడ్జెట్‌ను సవరించాలని, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలతో కలిసి కేంద్రానికి నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేంద్రంపై పోరాటానికి ప్రతిపక్షాలు తమతో కలిసి రావాలన్నారు. కాగా.. జూలై 26న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. జూలై 27న బడ్జెట్‌పై చర్చ జరగనుండగా.. జూలై 28 ఆదివారం కావడంతో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 29, 30 తేదీల్లో పలు బిల్లులు ప్రవేశపెట్టనుంది.జూలై 31న ద్రవ్యవినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.ఆగస్టు 1,2 తేదీల్లో వివిధ బిల్లులను ప్రవేశపెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై చూపుతున్న వివక్షను నిరసిస్తూ రాష్ట్ర శాసనసభ బుధవారం తీర్మానం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. కేంద్ర బడ్జెట్‌లో అవసరమైన సవరణలు చేయాలని శాసనసభ కోరింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ విమర్శలు గుప్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం అన్ని రాష్ట్రాల యూనియన్. అన్ని రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఈ సమాఖ్య స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే ఒరవడి కొనసాగుతోందని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.

 

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. పోలవరం విషయంలో కీలక చర్చ
నేడు మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పోలవరం విషయంలో కీలక చర్చ జరపనున్నారు. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు, డయాఫ్రం వాల్ స్థితిగతులపై కేబినెట్‌లో కీలక సమీక్ష జరగనుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాయం ప్రకటిస్తామని తెలిపారు. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తామన్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులతో చర్చించాల్సిన అంశాలపై సీఎం చంద్రబాబు కేబినెట్‌లో చర్చించనున్నారు. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌2024-25ని ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. యూనియన్‌ బడ్జెట్‌లో ఏపీ మంచి కేటాయింపులే దక్కాయి.. బడ్జెట్‌ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై వరాల జల్లు కురిసింది. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు చెప్పారు. అంతేకాదు అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సంపూర్ణ సాయం చేస్తామని తెలిపారు. ఏపీ రాష్ట్రం, రైతులకు పోలవరం జీవనాడి అని పేర్కొన్నారు. భారత ఆహార భద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని నిర్మలమ్మ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం.. పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు. హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం చేస్తామని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న విషయం విదితమే. అయితే, ఈ కేటాయింపులపై విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి.. మరోవైపు.. ఏపీ పాలిటిక్స్‌ ఢిల్లీ చేరాయి.. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..

 

రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేడు అసెంబ్లీలో గత 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. అనంతరం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి.
శాసన సభలో ప్రశ్నోత్తరాలు
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ , ప్రత్యేక అవసరాల విద్యార్థుల పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, సంఘ విద్రోహశక్తుల నియంత్రణ, విశాఖపట్టణం లో ని ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాలలో సౌకర్యాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులపై ప్రశ్నలు-మంత్రుల సమాధానాలు
శాసన సభలో ప్రశ్నోత్తరాలు
ఎస్సీ ఎస్టీల సంక్షేమ పథకాల రద్దు, రాష్ట్రంలో టిడ్కో గృహాలు, సుప్రీం కోర్టులో కేసులు ,ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేసీ కెనాల్ మల్లింపు, బదిలీ చేయదగిన అభివృద్ధి హక్కులపై ప్రశ్నలు – మంత్రులు సమాధానం
శాసనమండలిలో నేడు
శాసనమండలిలో గత 5ఏళ్ల పాలనలో అదుపుతప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం హోం మంత్రి వంగలపూడి అనిత విడుదల చేయనున్నారు.
శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు
ప్రైవేటు ఏజన్సీలకు మోనజైట్ సిలికాన్‌ల అనధికార విక్రయం, రాష్ట్రంలో ఇ -వ్యర్థాల తొలగింపు, 2023 – 2024 మధ్యకాలంలో ధాన్యం సేకరణ, నిత్యావసరాల ధరల పెరుగుదల, పంటల భీమా బకాయిల చెల్లింపుపై ప్రశ్నలు- మంత్రుల సమాధానం
శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు
రైతులకు పెట్టుబడి సాయం, మంగంపేట బెరైటీస్ గనులలో అక్రమాలు, రాష్ట్రంలో నూతన విద్య కళాశాలలు, పులివెందుల గృహనిర్మాణ ప్రాజెక్టులో అనర్హులైన లబ్ధిదారులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రశ్నలు- మంత్రుల సమాధానం

 

నేడు తెలంగాణ బడ్జెట్‌.. ప్రతి పక్షనేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్‌..?
మూడో రోజు శాసనసభ సమావేశాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా దాదాపు ఏడు నెలల తర్వాత తొలిసారిగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఆశక్తికరంగా మారింది. అసలు అధికార పార్టీని కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. బడ్జెట్ సమావేశాల రోజు కేసీఆర్ హాజరు కానున్నడంతో మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారో, మైక్ ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న ఆయన అసలు సభలో ఉంటారో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ తొలిసారి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలు బీఆర్‌ఎస్‌ను చతికిలపడేలా చేశాయనే చెప్పాలి. అనారోగ్యం కారణంగా గత రెండు సమావేశాల్లో పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కాలేదు. విడివిడిగా ప్రమాణం కూడా చేశారు. ఈ అధికార పార్టీకి ఆయుధం కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి స్పీచ్ ఇవ్వాల్సిందేనని విమర్శించేవారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రాకపోవడంపై పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇటీవల బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రెండు రోజులు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అయితే ముందుగా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు వస్తామని ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం నేడు శాసనసభ సమావేశానికి మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బడ్జెట్ పై ప్రసంగించన్నారు.

 

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో.. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి దిశలో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 10-12 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలు. గాలి తేమ 85 శాతంగా నమోదైంది. ఇక దక్షిణం వైపు 21 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 4.5 మరియు 7.6 కి.మీల మధ్య కదులుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలోని దిగువ ట్రోపో జోన్‌లో మరింత నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు జూలై 24న వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

 

లారీని వెనుకనుంచి ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాందేడ్- అఖోలా నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కంది మండలం తునికిళ్ళ తండా వద్ద జరిగింది. కంది మండలం తునికిళ్ళ తండా వద్ద లారీని ఒక పక్కకు లారీని ఆపాడు డ్రైవర్. వర్షం కురుస్తుండటంతో పక్కకు లారీని పక్కకు ఆపి కాసేపు తరువాత బయలు దేరుదామని అనుకున్నాడు. ఇంతలోనే లారీ వెనుక నుంచి పెద్ద శబ్దం. ఏమైందని లారీ డ్రైవర్ కిందికి దిగి చూసే సరికి యుగ్గురు యువకులు లారీ వెనుకల రోడ్డుపై చెల్లా చెదురై పడి వున్నారు. డ్రైవర్ షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. కానీ పోలీసులు చేరుకునే సరికి ముగ్గరు యువకులు అప్పటికే మృతి చెందారు. అయితే డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు యువకులు అతి వేగంతో బైక్ నడపడం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృత దేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ముగ్గురు యువకులు ఎవరు? వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారా? లేక స్నేహితులా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులను ఈ సమాచారం అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అసలే వానాకాలం ఈపరిస్థితుల్లో వాహనదారులు దారుల్లో వెల్లేప్పుడు జాగ్రత్తగా బండ్లను నడపాలని సూచించారు. వర్షాకాలంలో వాహనాలు స్పీడ్ గా నడపరాదని, రోడ్డుపై నడిపేటప్పుడు తగు జాగ్రత్తగా నడపాలని తెలిపారు. రోడ్డులపై పక్కకు వాహనాలు ఉంటాయని దానిని గమనించి ప్రయాణించాలని సూచించారు.

 

టెంపుల్‌ సిటీలో సంచలనం రేపుతున్న ట్రిపుల్ మర్డర్‌.. అన్నపై కోపమే కారణమా?
టెంపుల్‌ సిటీ అయిన తిరుపతిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి పద్మావతి నగర్‌లో కలకలం రేపుతోంది. అన్నమీద కోపంతో ఓ తమ్ముడు.. వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కిరాతకంగా నరికి చంపిన ఘటన పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం ఆ వ్యక్తి కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గుడిమెట్ల మోహన్(36) ఈ దారుణానికి పాల్పడ్డాడు. నెల్లూరుకు చెందిన గుడిమెట్ల తిరుపతిదాస్ రెండేళ్ల క్రితం కుటుంబంతో వచ్చి తిరుపతి పద్మావతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తిరుపతి దాస్‌ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న మోహన్‌కు అన్నావదినలు కలిసి 2019లో పెళ్లి చేశారు. . పెళ్లై ఓ కుమార్తె పుట్టిన తర్వాత మోహన్‌కు, అతని భార్యకు మధ్య గొడవలు జరగడంతో 2021లో అతని భార్య పుట్టింటికి వెళ్లి పోయింది. అనంతరం వారి మధ్య రాజీ కుదిర్చి.. తమ్ముడి భార్య తల్లిదండ్రులతో మాట్లాడి ఇద్దరూ కలిసి కాపురం చేసుకునేలా చేశాడు తిరుపతిదాస్‌. రాజీ చర్చల సమయంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేసి, మనశ్శాంతి లేకుండా చేశావంటూ అన్నపై తమ్ముడు దాడి చేశాడు. ఆపై రాజీ కుదరడంతో మోహన్‌ భార్య కాపురానికి వచ్చింది. కాపురానికి వచ్చిన కొన్ని రోజులకే మళ్లీ గొడవలు ప్రారంభం కావడంతో మళ్లీ తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో చెన్నైలో ఉద్యోగం చేస్తున్న మోహన్ అప్పుడప్పుడు తిరుపతిలోని అన్న ఇంటికి వచ్చి ఉండేవాడు. 2 రోజుల క్రితం మోహన్. చెన్నై నుంచి తిరుపతి వచ్చాడు. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి పిల్లలను ఇంటికి తీసుకువచ్చాడు తిరుపతిదాస్. ఈ క్రమంలోనే పిల్లలను ఇంట్లో దించిన తర్వాత దాస్ బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్న ఇంట్లో లేని సమయంలో ఇంటికి కత్తితో వచ్చి వదిన, పిల్లలపై దాడి చేశాడు. వదిన సునీతను హత్య చేసిన మరిది మోహన్‍.. ఆపై 8, 6వ తరగతి చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు దేవీశ్రీ, నీరజలను హతమార్చాడు. అనంతరం మోహన్‍ ఆత్మహత్య చేసుకున్నాడు. కొంచెం సేపటికి ఇంటికి తిరిగొచ్చిన తిరుపతి దాస్.. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో బయటకు వెళ్లి ఉంటారని భావించాడు. గంట తర్వాత కూడా వారు రాకపోవడంతో అనుమానంతో ఇంటి వెనుక నుంచి చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్న భార్యా పిల్లల్ని చూసి కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో దాస్ భార్య సునీత(35), కుమార్తెలు దేవిశ్రీ(13), నీరజ(11) హత్యకు గురయ్యారు. నిందితుడు మోహన్‌ హత్యలు చేసిన అనంతరం అక్కడే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని ఏఎస్పీ కులశేఖర్‍ తెలిపారు. పెళ్లై ఓ బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలతో విడిపోవడం, అన్న కుటుంబం సంతోషంగా ఉండటంతో వారిపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేశాడని తరచూ అన్నతో గొడవ పడేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.

 

పదో తరగతి చదువుతున్న బాలిక పై వృద్ధుడి అత్యాచారయత్నం
అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా నైతికత విషయంలో రోజు రోజుకీ దిగజారిపోతున్నాం. రోజు రోజుకు సమాజంలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు, బాలికలు, మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కామాంధులు దేహదాహానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఎన్ని చట్టాలొచ్చినా.. అస్సలు భయపడకుండా హద్దు మీరుతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలతో దేశం అట్టుడికిపోతోంది. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా బాలికల సంరక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఇక మరో ఘటన సైతం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి చదువుతున్న బాలికపై వృద్ధుడి అత్యాచారయత్నంకి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్ళినట్లయితే.. ప్రకాశం జిల్లా అయిన టంగుటూరులో ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న బాలిక పై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరు లేని సమయంలో బాలిక తన ఇంట్లో చదువుతూ ఉండగా చాటుగా వచ్చి అత్యాచారం చేయబోయాడు. వెంటనే బాలిక కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు గమనించి కామాంధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకి అప్పగించారు.. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.

 

బయటికి రావొద్దు… రాజధానిలో మూడు గంటల పాటు దంచికొట్టనున్న వాన
దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. పలుచోట్ల ఉరుములు, మేఘాలతో కూడిన వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా వర్షాలు పెరిగాయి. తేమ చాలా వరకు తగ్గింది. ఈరోజు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉదయం నుంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. బుధవారం మాదిరిగానే ఈ రోజు కూడా తెల్లవారుజామునే మేఘాలు కమ్ముకోవడంతో చీకటిగా ఉంది. కొద్ది సేపట్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది తేమను మరింత తగ్గించవచ్చు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం…
ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బహ్రైచ్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఫరూఖాబాద్, కన్నౌజ్, ఎటా, ఆగ్రా, బిజ్నోర్, అమ్రోహా, మొరాదాబాద్, షాజహాన్‌పూర్, బదౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు నగరాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ద్రోణి మధ్యప్రదేశ్ వైపు మళ్లింది. దీని కారణంగా తూర్పు యూపీతోపాటు పశ్చిమ యూపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా. వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గే అవకాశం ఉంది.
హిమాచల్ ఉత్తరాఖండ్ లో వాతావరణం
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి కొండ ప్రాంతాలలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన తుఫాను ఉంటుంది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం పెరిగింది. బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. చమోలి జిల్లాలో కొండ చరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో జూలై 25, 26 తేదీల్లో ఆకస్మిక వరదలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చంబా, కాంగ్రా, మండి, సిర్మౌర్ జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. డిపార్ట్‌మెంట్ ప్రకారం, వచ్చే 3 రోజుల పాటు పసుపు అలర్ట్ కొనసాగుతుంది.
ఉత్తరాఖండ్‌లోని నాలుగు జిల్లాల్లో వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇందులో నైనిటాల్, చంపావత్, యుఎస్‌నగర్, బాగేశ్వర్ ఉన్నాయి. రానున్న రెండు రోజుల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది కాకుండా, తెహ్రీ, పౌరి, డెహ్రాడూన్, చమోలి, రుద్రప్రయాగ్, హరిద్వార్‌లలో భారీ వర్షాల పసుపు అలర్ట్ జారీ చేయబడింది.
ఈరోజు ఢిల్లీలో వాతావరణం ఎలా ఉంటుంది?
రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం ఇక్కడ 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు 50 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ 74 శాతం ఉంటుందని, గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెరుపులతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల పరిస్థితి
జూలై 25, 26 తేదీలలో ఒడిశా, కొంకణ్-గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్‌లలో అతి భారీ వర్షాలు (12 సెం.మీ కంటే ఎక్కువ) కురిసే అవకాశం ఉంది. తూర్పు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ వర్షాలు (7 సెం.మీ. వరకు) కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూకశ్మీర్, లడఖ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడులో పిడుగులు పడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లో మరో 10 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి.
మరో వారం రోజులు
ఈ వర్షం వచ్చే వారం వరకు కొనసాగవచ్చు. రుతుపవనాల ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం, ఉరుములతో కూడిన జల్లులు ఎక్కువ సమయం రాత్రి లేదా తెల్లవారుజామున సంభవిస్తాయి. మధ్యాహ్నం కొంత సేపు వర్షం కురిసే అవకాశం ఉంది. జూలై 27 ,28, 29 మధ్య వర్షం పెరగవచ్చు.

 

 

అమెరికా పౌరులకు భారత్‎లోని ఈ రాష్ట్రాలకు వెళ్లవద్దని హెచ్చరిక
భారత్‌లో జరుగుతున్న ఉగ్రవాద ఘటనల దృష్ట్యా అమెరికా తన పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దీని ప్రకారం మణిపూర్, జమ్మూకశ్మీర్, భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలు, దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. దీనితో పాటు నక్సలైట్లు చురుకుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని కూడా సలహా ఇచ్చింది. అమెరికా తన పౌరుల భద్రతకు సంబంధించి ఈ సలహాను జారీ చేసింది. భారతదేశం కోసం ప్రయాణ సలహాలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లకూడదని సూచించింది. నేరాలు, ఉగ్రవాదం, నక్సలిజం కారణంగా భారత్‌లో మరింత అప్రమత్తంగా ఉండాలని సలహాలో పేర్కొంది. దీనితో పాటు, కొన్ని ప్రాంతాల్లో ప్రమాదం గణనీయంగా పెరిగిందని పేర్కొంది. మొత్తంమీద, భారతదేశం రెండవ స్థానంలో నిలిచింది. అయితే జమ్మూ కాశ్మీర్, భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులు, మణిపూర్, మధ్య తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలతో సహా దేశంలోని అనేక ప్రాంతాలు నాలుగో స్థానంలో ఉన్నాయి.
మణిపూర్, జమ్మూ కాశ్మీర్‌లకు వెళ్లవద్దని సలహా
నక్సలిజం, తిరుగుబాటు, మధ్య ప్రాంతాలకు వెళ్లవద్దు. ఉగ్రవాదం, అశాంతి కారణంగా జమ్మూ కాశ్మీర్ (తూర్పు లడఖ్ ప్రాంతం, దాని రాజధాని లేహ్ మినహా) కేంద్ర పాలిత ప్రాంతంలో సాయుధ పోరాటం జరిగే ప్రమాదం ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది. దీనితో పాటు సలహాలో, అమెరికన్లు ఉగ్రవాదం, హింస కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లడం గురించి మరోసారి ఆలోచించాలని కోరారు. భారతదేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాలలో అత్యాచారం ఒకటని భారత అధికారులు నివేదించినట్లు ప్రయాణ సలహాదారు పేర్కొంది. లైంగిక వేధింపుల వంటి హింసాత్మక నేరాలు పర్యాటక ప్రదేశాలలో.. ఇతర ప్రదేశాలలో జరిగాయి. ఉగ్రవాదులు ఎప్పుడైనా దాడి చేయవచ్చు. వారు పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటారు.

అత్యవసర సేవలను అందించడానికి పరిమిత సామర్థ్యం
గ్రామీణ ప్రాంతాల్లోని అమెరికన్ పౌరులకు అత్యవసర సేవలను అందించడానికి అమెరికా ప్రభుత్వానికి పరిమిత సామర్థ్యం ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాలు తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుండి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్నాయి. యూఎస్ ప్రభుత్వ ఉద్యోగులు ఆయా ప్రదేశాలకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అడ్వైజరీలో పేర్కొంది. పర్యటనపై పునరాలోచన చేయాలని విదేశాంగ శాఖకు ఆదేశాలు అందాయి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల రాజధాని నగరాల వెలుపల ఏదైనా ప్రాంతాలను సందర్శించడానికి అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు భారతదేశానికి వెళ్లే ముందు ముందస్తు అనుమతి అవసరం అని పేర్కొంది.