NTV Telugu Site icon

Top Headlines @ 9AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం 11 గంటలకు స్టార్ట్ కానున్నాయి. శాసనమండలి సమావేశాలు రేపు( జులై 24) ఉదయం 10 గంటలకుయ ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు జరిగే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభలో సంతాపం ప్రకటించనున్నారు. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. ఇక, ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీలో నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీ జరగనుంది. ఈ సమావేశంలో సభ ఎజెండా, అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు జరిగేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు రైతు రుణమాఫీ అంశంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే, ఈ నెల 25వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 2024–25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 26వ తేదీన సమావేశాలకు విరామం ప్రకటించనున్నారు. ఇక, ఈ నెల 27న బడ్జెట్‌ ప్రసంగంపై చర్చ స్టార్ట్ అవుతుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ సభకు విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 30వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సెషన్స్ లో స్కిల్స్‌ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మీటింగ్‌ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది.

 

రెండో రోజు ప్రశ్నోత్తరాలు, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
ఏపీలో రెండో రోజున అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలతో పాటు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు, హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చేలా సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై రెండో రోజు చర్చ జరగనుంది. ధన్యవాదాల తీర్మానంపై చర్చను కాల్వ శ్రీనివాసులు ప్రారంభించనున్నారు. తీర్మానాన్ని గౌతు శిరీష బలపరచనున్నారు. ధన్యవాదాల తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
పాఠశాలల్లో నాడు – నేడు, కొత్త పాలిటెక్నిక్-ఐటీఐలు, వలంటీర్ల వ్యవస్థ, వీఆర్ లో ఉన్న ఇన్స్ పెక్టర్ల సమస్యలు, 2022-గ్రూప్-1 పోస్టుల ఇంటర్వూలు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు..:
విశాఖ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, ఎస్సీ సబ్ ప్లాన్, కేంద్ర పథకాలు, విభజన హామీలు, తుంగభద్ర హెచ్ఎల్ కెనాల్ మోడ్రనైజేషన్.
మండలిలోనూ అదే అజెండా
రెండో రోజు మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చించనున్నారు. ధన్యవాదాల తీర్మానంపై మండలిలో చర్చను ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రారంభించనున్నారు. తీర్మానాన్ని పంచుమర్తి అనూరాధ బలపరచనున్నారు. మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
మండలిలో ప్రశ్నోత్తరాలు..:
ఆర్థిక సంఘం గ్రాంట్ల మళ్లింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ పథకం, జాతీయ రహదారి పనుల్లో అవకతవకలు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, టీటీడీలో అక్రమాలు
మండలిలో ప్రశ్నోత్తరాలు..:
వైద్యారోగ్యం, పౌర సరఫరాల రుణాలు, ఫిషింగ్ హర్బర్లు, గనుల్లో అక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆరోగ్య శిబిరాలు.

 

గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి ఉగ్రరూపంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. బ్యారేజ్ వద్ద వరద నీటిమట్టం 13.75 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుండి 13 లక్షల 261 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీనితో భద్రాచలం దిగువన విలీన మండలాల నుంచి కోనసీమ వరకూ పరివాహక ప్రాంతాల ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. కోనసీమ లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు కనకాయలంక కాజ్ వే పై రాకపోకలు స్తంభించాయి. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలలో చేపడుతున్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతంరెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది.. 51.30 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. గత రాత్రి నుంచి స్వల్పంగానే గోదావరి పెరుగుతున్నప్పటికీ మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే స్థాయికి వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే రహదారిపై నీళ్లు వచ్చాయి. అదే విధంగా గత మూడు రోజుల నుంచి విలీన మండలాలకు వెళ్లే రోడ్ల మీదకి నీళ్లు రావడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అదే విధంగా విలీన మండలాల్లో అనేక గ్రామాల చుట్టూ గోదావరి చేరుకుంది. అయితే ఎగువ నుంచి మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి వరద తీవ్రత కొంత తగ్గిందని సమాచారం. ఈ నేపథ్యంలో గోదావరి మరో రెండు అడుగులు పెరిగి తగ్గవచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే నిన్నటి వరకు గోదావరి దిగువన వున్న శబరి నది భారీగా పెరిగి మళ్ళీ తగ్గి గత రాత్రి నుంచి మళ్లీ పెరుగుతుంది. శబరి పెరిగితే గోదావరికి ప్రమాదకరంగా వుంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

 

టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యతా లోపాలు.. బ్లాక్‌లిస్ట్‌లోకి సరఫరాదారు!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే యాత్రికులు.. ఆ శ్రీనివాసుడి ముగ్ధమనోహర రూపాన్ని చూసి ఎంత ఆనందిస్తారో.. శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుకొండల వాడి భక్తుల మనసులో ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతలో నిబంధనల ప్రకారం ప్రమాణాలను పాటించిన ఓ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు టీడీడీ ఈవో శ్యామలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల టీటీటీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపాలను తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. ఏటా ముడిసరుకుల కొనుగోలు కోసం 500 కోట్లు వెచ్చిస్తుండగా.. అందులో నెయ్యి కొనుగోలుకే రూ.250 కోట్లు వెచ్చిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. నెయ్యి నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ క్యాలిబ్రేషన్ ల్యాబ్‌కు నెయ్యిని టీటీడీ పంపింది. టీటీడీకి సరఫరా చేస్తున్న 5 మంది పంపిణీదారులలో తమిళనాడుకి చెందిన పంపిణీదారుడు సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత ప్రమాణాల లోపాలను టీటీడీ గుర్తించారు. ఈ క్రమంలోనే సరఫరాదారుడిని బ్లాక్ లిస్ట్‌లో చేర్చేందుకు టీటీడీ ఈవో షోకాజ్ నోటీస్ జారీ చేశారు.

 

నేడే కేంద్ర బడ్జెట్.. నిర్మలమ్మ దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్‌ డోస్‌ ఇస్తారా ?
ఒకవైపు ప్రపంచంలో రెండు యుద్ధాలు నడుస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ప్రతిరోజూ దాడి చేస్తుంటే, ఇజ్రాయెల్ హమాస్‌ను నాశనం చేయడానికి ప్రతిరోజూ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ రెండు యుద్ధాలు గ్లోబల్ సప్లై చైన్ ను ప్రభావితం చేశాయి. దీని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడమే కాకుండా ఉపాధి తగ్గుదల, ద్రవ్యోల్బణం పెరిగిపోయాయి. ఈ రెండింటిని ఎదుర్కోవడం ఈ బడ్జెట్‌లో భారత ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్. ఈరోజు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ కేవలం పన్ను చెల్లింపుదారులకే కాకుండా, ఏదో ఒక రోజు పన్ను చెల్లింపుదారులు కావాలని కలలు కంటున్న లక్షలాది మంది యువతకు చాలా ప్రత్యేకం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రీఫ్‌కేస్ నుండి దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్ లభిస్తుందా లేదా అది సాధారణ బడ్జెట్‌గా మిగిలిపోతుందా అనేది బడ్జెట్ ప్రసంగంలో చూడాలి.
బడ్జెట్ రోజు షెడ్యూల్ ఎలా ఉంటుంది?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23న ఉదయం 8:40 గంటలకు తన ఇంటి నుంచి కార్యాలయానికి బయలుదేరనున్నారు. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌ను సిద్ధం చేస్తున్న మంత్రిత్వ శాఖ బృందంతో ఆమె ఫోటో సెషన్ ఉంటుంది. ఆ తర్వాత బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆమె వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి బడ్జెట్‌తో పార్లమెంటుకు చేరుకోగా, అక్కడ మరో ఫోటో సెషన్ ఉంటుంది. బడ్జెట్‌కు ముందు రెండు సార్లు ఫొటోలు దిగే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అనంతరం 11 గంటలకు నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి బడ్జెట్ ప్రసంగం చేస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణ అనంతరం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ బడ్జెట్‌పై తన స్పందనను తెలియజేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు బడ్జెట్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి తన బృందంతో విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. సాధారణ బడ్జెట్‌పై లోక్‌సభ, రాజ్యసభల్లో 20 గంటలపాటు చర్చ జరిగుతుంది.

 

బడ్జెట్‌ను రెడీ చేసిన నిర్మలా సీతారామన్ బృందం గురించి తెలుసా ?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ వివరాలను రెడీ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్‌ను సిద్ధం చేసే బాధ్యత ఈ బృందంపై ఉంది. ఈ బృందం ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసింది. 2024-25 బడ్జెట్‌ను రూపొందించడంలో ఆర్థిక మంత్రి కాకుండా ఆమె బృందంలో ఏడుగురు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు. వారి గురించి తెలుసుకుందాం.
పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి
మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పంకజ్ చౌదరి కూడా సహాయ మంత్రిగా ఉన్నారు. మోడీ ప్రభుత్వం 2.0 సమయంలో చౌదరి సీతారామన్ బృందం పంకజ్ కూడా పాల్గొన్నారు. ఆయన ఏడోసారి లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. గోరఖ్‌పూర్‌లో 1964 నవంబర్ 20న జన్మించిన పంకజ్ చౌదరి 1991లో తొలిసారి ఎంపీ అయ్యారు. రాష్ట్ర మంత్రిగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.
వి అనంత్ నాగేశ్వరన్, ముఖ్య ఆర్థిక సలహాదారు
వి అనంత్ నాగేశ్వరన్ బడ్జెట్ 2022కి ముందు ప్రధాన ఆర్థిక సలహాదారుగా (CEA) ఎన్నికయ్యారు. ఈసారి బడ్జెట్ తయారీ మొత్తం ప్రక్రియలో నాగేశ్వరన్ కూడా ముఖ్యపాత్ర పోషించారు. దేశ ఆర్థిక సర్వే కూడా ఆయన మార్గదర్శకత్వంలోనే తయారైంది. దీనిని ఆర్థిక మంత్రి సోమవారం పార్లమెంటులో సమర్పించారు.
వివేక్ జోషి, సెక్రటరీ, (DFA) ఆర్థిక సేవల విభాగం
19 అక్టోబర్ 2022న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో వివేక్ జోషి కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ పాత్రను చేపట్టడానికి ముందు జోషి హోం శాఖ క్రింద రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ డైరెక్టర్‌గా ఉన్నారు.
అజయ్ సేథ్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
బడ్జెట్‌ను సిద్ధం చేసేవారిలో ఒక ముఖ్యమైన పేరు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఇన్‌ఛార్జ్ సెక్రటరీ అజయ్ సేథ్. మంత్రివర్గం బడ్జెట్ విభజనను ఆయన చూస్తున్నారు. బడ్జెట్ సంబంధిత ఇన్‌పుట్‌లను అందించడంలో.. వివిధ రకాల ఆర్థిక నివేదికలను సిద్ధం చేయడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
టీవీ సోమనాథన్, సెక్రటరీ ఫైనాన్స్ అండ్ పేమెంట్స్
2024-25 బడ్జెట్‌ను సిద్ధం చేసే ప్రక్రియలో ప్రముఖమైన వ్యక్తి ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్. సోమనాథన్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దేశ మూలధన వ్యయాన్ని రికార్డు స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది.
సంజయ్ మల్హోత్రా, రెవెన్యూ కార్యదర్శి
రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బడ్జెట్ తయారీ ప్రక్రియలో బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు ప్రభుత్వ విధానాలు,మ ఆశయాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. బడ్జెట్‌లో చేసిన ప్రకటనలు గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉండకుండా చూసుకోవాలి.
తుహిన్ కాంత్ పాండే కార్యదర్శి, DIPAM (పెట్టుబడి, పబ్లిక్ మేనేజ్‌మెంట్ విభాగం)
తుహీన్ కాంత్ పాండే ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పెట్టుబడుల ఉపసంహరణ.. పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (DIPM) కార్యదర్శిగా ఉన్నారు. ఇటీవలి కాలంలో డిజిన్వెస్ట్‌మెంట్ రంగంలో ప్రభుత్వం సాధించిన విజయాల్లో తుహీన్‌కు చాలా ముఖ్యమైన సహకారం ఉంది. ఎల్‌ఐసీకి ఐపీఓ తీసుకురావడం, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.
అలీ రజా రిజ్వీ, కార్యదర్శి, DPE (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం)
అలీ రజా రిజ్వీ, హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ అధికారి, భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ కింద పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి కార్యదర్శిగా ఉన్నారు. 2024-25 బడ్జెట్‌ను సిద్ధం చేయడంలో కూడా అతని పాత్ర ముఖ్యమైనది.

 

 

రూపాయి ఎక్కడ నుండి వస్తుంది.. ఎక్కడికి పోతుంది? బడ్జెట్ తీరు తెలుసుకుందాం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రానున్న ఈ బడ్జెట్‌పై యావత్ దేశం దృష్టి సారిస్తోంది. ప్రజలు బడ్జెట్ గురించి చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మీ కోసం ఏముందో తెలుసుకునే ముందు, అసలు బడ్జెట్‌లో డబ్బు ఎక్కడ నుండి వస్తుంది.. ఎలా ఖర్చు అవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దాని ఆధారంగా, బడ్జెట్‌లో రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది.. ఎక్కడ ఖర్చు చేయబడుతుందో అర్థం చేసుకుందాం?
రూపాయి ఎక్కడి నుంచి వచ్చిందంటే ?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరిలో రూ.47.66 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ను ప్రాతిపదికగా పరిశీలిస్తే బడ్జెట్ లోని ప్రతి రూపాయి ఏ వస్తువు నుంచి ఎంత వచ్చిందో, ఎక్కడికి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. గత బడ్జెట్‌లో ప్రభుత్వం విడుదల చేసిన దాని ప్రకారం.. బడ్జెట్‌లోని ప్రతి రూపాయిలో 28 పైసలు రుణాలు, ఇతరత్రాల ద్వారా సేకరించబడింది. రుణాల తర్వాత ప్రభుత్వ ఖాతాలో అత్యధిక మొత్తం ఆదాయపు పన్ను ద్వారానే వసూలైంది. ఈ అంశం నుంచి ప్రతి రూపాయిలో 19 పైసలు ప్రభుత్వ ఖాతాలోకి చేరాయి. ఆ తర్వాత వస్తు సేవల పన్ను, ఇతర పన్నుల వసూళ్ల ద్వారా 18 పైసలకు పైగా ఆదాయం వచ్చింది. కంపెనీలు లేదా కార్పొరేషన్ పన్నుల ద్వారా ప్రభుత్వం తన ఖాతాలోకి వచ్చే ప్రతి రూపాయికి 17 పైసలు వసూలు చేసింది. ప్రభుత్వం పన్నేతర ఆదాయం ద్వారా ఒక రూపాయి ఏడు పైసలు సేకరించింది. అదే సమయంలో యూనియన్ ఎక్సైజ్ డ్యూటీల నుంచి ఐదు పైసలు, కస్టమ్స్ వసూళ్ల నుంచి నాలుగు పైసలు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రతి రూపాయిలో ఒక పైసాను రుణేతర ఆదాయాల ద్వారా సంపాదించింది.
ఎక్కడ, ఎంత ఖర్చు చేస్తుందంటే ?
గత బడ్జెట్ డేటా ప్రకారం, ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో, 20 పైసలు రుణాల చెల్లింపుకు (వడ్డీ చెల్లింపులు) వెళ్తుంది. తదుపరి 20 పైసలు పన్నులు, సుంకాలలో రాష్ట్రాల వాటాకు వెళతాయి. ప్రభుత్వం పొందే ప్రతి రూపాయిలో 16 పైసలు కేంద్ర పథకాలపై (కేంద్ర రంగ పథకాలు, రక్షణ, ఆర్థిక సహాయం మినహా) ఖర్చు చేస్తుంది. రాష్ట్రాలలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఎనిమిది పైసలు ఖర్చు చేస్తారు. రక్షణ కోసం ఎనిమిది పైసలు ఖర్చు చేస్తారు. ఫైనాన్స్ కమిషన్, ఇతర బదిలీ అంశాలకు (కేంద్ర రంగ పథకాలు) కేవలం ఎనిమిది పైసలు మాత్రమే ఖర్చు చేస్తారు. ప్రభుత్వం సబ్సిడీపై 6 పైసలు ఖర్చు చేస్తుంది. ఒక రూపాయిలో నాలుగు శాతం ప్రభుత్వం పింఛన్ల కోసం ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ ఆదాయంలో ప్రతి రూపాయిలో తొమ్మిది పైసలు ఇతర వస్తువులకు (ఇతర వ్యయం) ఖర్చు చేస్తారు.
గత బడ్జెట్‌లో ఏ మంత్రిత్వ శాఖకు ఎంత మొత్తం ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
మంత్రిత్వ శాఖ మొత్తం లక్ష కోట్ల రూపాయలు
రక్షణ మంత్రిత్వ శాఖ 6.2
రోడ్లు, హైవేలు, రవాణా 2.78
రైల్వే మంత్రిత్వ శాఖ 2.55
వినియోగదారుల వ్యవహారాలు 2.13
హోం మంత్రిత్వ శాఖ 2.03
గ్రామీణాభివృద్ధి 1.77
రసాయనాలు, ఎరువులు 1.68
కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ 1.37
వ్యవసాయం, రైతుల సంక్షేమం 1.27

 

ఆగస్టు 15న ట్రాక్టర్ మార్చ్కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు..
రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరోసారి రైతు సంఘాలు ఆందోళన చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు నుంచి పలు కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే ప్రకటించాయి. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా( KMM)లు ఓ ప్రకటన రిలీజ్ చేశాయి. ఈ సందర్భంగా కేఎంఎం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. ఆగస్టు 31వ తేదీ వరకు ఢిల్లీకి రైతుల పాదయాత్ర 200 రోజులు పూర్తి అవుతుందని చెప్పుకొచ్చారు. అయితే, ఆగస్టు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలకు రైతులు పాదయాత్రలు నిర్వహించి అధికార భారతీయ జనతా పార్టీ దిష్టి బొమ్మలను దహనం చేస్తామని కిసాన్ మజ్దూర్ మోర్చా నేతలు తెలిపారు. ఆగస్టు15వ తేదీన దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరీ, శంభు పాయింట్ల దగ్గర ప్రజలు గుమికూడాలని రైతులకు వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించి.. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.

 

మాలిలో దారుణం.. దుండగుల కాల్పుల్లో 26 మంది మృతి..
ఆఫ్రికా దేశమైన మాలిలో బుర్కినాఫసోతో ఉన్న దేశ సరిహద్దుల్లోని డెంబో అనే గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటుండగా.. కొంత మంది దుండగులు ఒక్కసారిగా దాడి చేసి దాదాపు 26 మందిని చంపేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ దాడికి ఏ వర్గమూ బాధ్యత వహించలేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో ఇటీవల ఈలాంటి దాడులు మరీ ఎక్కువ అయ్యాయని పేర్కొన్నారు. అయితే, సైన్యం సైతం ఈలాంటి దాడులను నిలువరించలేకపోతోందన్నారు. సాధారణంగా ఇక్కడి గ్రామీణ ప్రజలపై ఉగ్ర సంస్థ అల్‌ ఖైదాకు అనుబంధంగా పని చేసే జేఎన్‌ఐఎం గ్రూప్‌ దాడి చేస్తుంది.. ఈ నెలలోనే ఓ వివాహ వేడుకలో 21 మంది సామాన్య ప్రజలను పొట్టన బెట్టుకుందని అధికారులు చెప్పుకొచ్చారు. తాజా దాడి కూడా వారి పనే అఅయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మధ్య, ఉత్తర మాలిలో దాదాపు దశాబ్ద కాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఉత్తర ప్రాంతంలోని నగరాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న తీవ్రవాద ముఠాలను ఫ్రెంచ్ సైన్యం సహాయంతో దేశ భద్రతా బలగాలు తరిమికొట్టాయి. వారందరూ ఒక గ్రూపుగా ఏర్పడి గ్రామాలు, సైనికులపై తరచూ దాడులకు దిగుతున్నారు. ఈ ముఠాను అంతం చేసేందుకు సైనికులు కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహింది.