NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

శ్రీవారి భక్తులకు అలర్ట్‌.. నేడే దర్శన టికెట్లతో పాటు వివిధ సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చింది.. ఇప్పటికే పలు సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌ విక్రయించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇవాళ జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేయనుంది.. ఈ రోజు ఆన్‌లైన్‌లో జనవరి నెల కోటాకు సంబంధించిన దర్శన టికెట్లతో పాటు పలు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు.. ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కెట్లు విడుదల కాబోతున్నాయి.. ఇక, మధ్యహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల చేయబోతున్నారు..

పోలవరం నిర్మాణంపై నేడు, రేపు సమీక్షలు.. ఆ తర్వాత సీఎంతో భేటీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు పోలవరం నిర్మాణం పై సమీక్షలు నిర్వహించనున్నారు.. అనంతరం సీ‌ఎం చంద్రబాబు సమక్షంలో నిర్మాణ సంస్ధలతో భేటీ కానున్నారు.. సచివాలయంలో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు- ఈఎన్సీ ఎం. వెంక టేశ్వరరావు తదితరులు నిర్మాణ సంస్థలతో వర్చువల్ సమావేశం నిర్వహిస్తారు.. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులకు మరింత సమయం పడుతుందని మేఘా ఇంజనీరింగ్ చెబుతోంది.. అయితే, వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి పూర్తి చేయాలని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం, రాష్ట్ర జల వనరుల శాఖ నిర్ణయం తీసుకున్నాయి.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య సీపేజీ జలాలు ఉన్నందున అప్పటికి పూర్తిచేయలేం అంటున్నారు.. వాల్ నిర్మాణ షెడ్యూల్ జలవనరుల శాఖకు అందించాల్సిన మేఘా ద్వారా బావర్ అందించలేదు.. సీపేజీ జలాలు ఎక్కువగా ఉన్నందున అత్యంత ఖరీదైన యంత్రాలు పాడైపోయే ప్రమాదం ఉంది.. డయాఫ్రం వాల్ 2026 ఫిబ్రవరి నాటికి పూర్తిచేస్తాం అంటున్నారు మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ.. ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మా ణానికి మూడు సీజన్లు పడుతుందని అంచనా వేస్తన్నారు.. 2029 నాటికి అది పూర్తయ్యే అవకాశం ఉంది అంటోంది మేఘా సంస్థ..

నలుగురు ఐఏఎస్‌లకు హైకోర్టు వారెంట్లు.. కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి..
ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఐఏఎస్ అధికారులకు బెయిలబుల్ వారెంట్లును ఏపీ హైకోర్టు జారీ చేసింది.. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలన్న ఆదేశాలు పాటించకపోవడంతో బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు పేర్కొంది.. ఐఏఎస్ అధికారులు శశి భూషణ్, రావత్, కృతి శుక్లా, హిమాన్ష్ శుక్లాలకు ఈ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ఇక, వారెంట్లు అమలుకు వీలుగా విచారణ నవబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.. ఇక, ఆ నలుగురు ఐఏఎస్‌ అధికారులకు బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు.. నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పై బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

నేడు సౌత్ కొరియాలోని హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం
నేడు దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం పర్యటనకు వెళ్తుంది. సౌత్ కొరియాలోని ముఖ్యమైన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ ను ఈ బృందం సందర్శించనుంది. సియోల్ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న హన్ నది.. కాలుష్యానికి గురైన హాన్ నదిని దక్షిణ కొరియా ప్రభుత్వం శుభ్రపరచి, పునరుద్ధరించింది. ఇక, పునరుజ్జీవన కార్యక్రమంలో ప్రైవేట్ డెవలప్మెంట్ పనులను నియంత్రించడం, పారిశ్రామిక వ్యర్థాలను తగ్గించడం, పర్యాటక ఆకర్షణలుగా నది ప్రదేశాలను అభివృద్ధి చేయడం లాంటి చర్యలు సియోల్ నగరపాలక సంస్థ చేపట్టింది. అయితే, 494 కిలో మీటర్ల మేర హన్ నది ప్రవహిస్తుంది. సియోల్ నగరంలో 40 కిలో మీటర్ల మేర ప్రవహిస్తున్న హన్ నది.. ప్రక్షాళన తర్వాత శుభ్రంగా మారి.. ఇప్పుడు సియోల్ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంతో పాటు జలవనరుగా మారింది. దీంతో నేడు హన్ నదిని తెలంగాణ ప్రతినిధి బృందం సందర్శించనుంది.

సిలిండర్ పేలి కూలిన ఇంటి పైకప్పు.. ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆశాపురి కాలనీలో సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో కుటుంబానికి చెందిన ఆరుగురు శిథిలాల కింద పడి మృతి చెందారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసు పరిపాలన ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. శిథిలాల కింద మహిళలు, చిన్నారులు చిక్కుకుని ఉన్నారని.. వారిని ప్రస్తుతం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహకారంతో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.

నేటి నుంచి రష్యాలో బ్రిక్స్‌ సమ్మిట్.. ప్రధాని మోడీతో పుతిన్ కీలక భేటీ
‘బ్రిక్స్‌’ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు (మంగళవారం) ప్రారంభం కానుంది. ఈ నెల 24వ తేదీ వరకూ జరిగే ఈ కార్యక్రమానికి రష్యాలోని కజన్‌ వేదికగా స్టార్ట్ కానుంది. ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడమే ఈ ఏడాది సమ్మిట్ యొక్క ప్రధాన నినాదం. ఇందులో మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన జరగబోతున్న ఈ సదస్సుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఇతర దేశాల నేతలు పాల్గొంటారు. ఇక, బాత్రూమ్‌లో పడి తలకు గాయం కావడంతో బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డా సిల్వా.. బ్రిక్స్‌ సమావేశానికి దూరంగా ఉంటున్నారు. ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరవుతారని అధికారులు వెల్లడించింది. అయితే, బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్‌ కూటమి ఏర్పడింది. ఇప్పుడు దాన్ని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకూ ఈ కూటమిలో సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత తొలి శిఖరాగ్ర సమ్మిట్ ఇదే.

మహిళలకు వడ్డీ లేకుండా రూ. 5 లక్షలు.. షరతులు వర్తిస్తాయి
భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. వివిధ వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ పథకాలను తీసుకువస్తుంది. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారతను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకురావడానికి కారణం ఇదే. గతేడాది కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ‘లక్షపతి దీదీ యోజన’ అనే పథకాన్ని ప్రారంభించింది. పరిశ్రమ రంగంలో మహిళలను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటుకు వారికి ఆర్థిక సాయం అందించదానికి ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. ఇందుకోసం మహిళలు కొన్ని షరతులు పాటించాలి. మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. లఖపతి దీదీ యోజన కూడా అదే ప్రయత్నం. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళల కోసం ఈ పథకం అమలు చేయబడింది. ఈ పథకం ద్వారా మహిళలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి సహాయం చేస్తారు. స్త్రీలు స్వయం ఉపాధికి ముందుకొస్తారు. వీరికి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద శిక్షణ ఇస్తారు. ఆపై సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా రుణం ఇస్తారు. ఈ పథకం కింద 3 కోట్ల మంది మహిళలను లఖపతి దీదీ పథకంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గెలుపు జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్.. మనోళ్లకు పండగే!
బెంగళూరులో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించి.. జోష్‌లో ఉన్న న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ రెండో టెస్టుకు సైతం దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ఉదయం ఓ ప్రకటలో తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా పూణేలో భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కేన్ అందుబాటులో ఉండడు అని పేర్కొంది. గాయం కారణంగా కేన్ మామ బెంగళూరు టెస్ట్ ఆడని విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండవ టెస్టులో కేన్ విలియమ్సన్ గజ్జల్లో గాయం అయింది. పూర్తిస్థాయి ఫిట్‌నెస్ కోసం న్యూజిలాండ్‌లో పునరావాసం పొందుతున్నాడు. భారత్‌తో రెండో టెస్టుకు కేన్ అందుబాటులో ఉంటాడనుకున్నా.. 100 శాతం ఫిట్‌గా లేడు. విలియమ్సన్ పురోగతి సాధిస్తున్నప్పటికీ.. అతను టెస్టు క్రికెట్‌ ఆడే ఫిట్‌నెస్ సాధించలేదని న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. విలియమ్సన్ చివరి టెస్టులో ఆడడం కూడా అనుమానంగానే ఉంది. కేన్ విలియమ్సన్ స్థానంలో మొదటి టెస్ట్ కోసం మార్క్ చాప్‌మన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. రెండో టెస్టుకు సైతం అతడే కొనసాగనున్నాడు. ఏదేమైనా కేన్ మామ దూరమవడం మన బౌలర్లకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. ఎందుకంటే కేన్ మంచి ఫామ్ మీదున్నాడు. కేన్ లేకున్నా కాన్వే, రచిన్, డారిల్, బండెల్, లాతమ్‌లు రాణిస్తున్నారు. పూణేలో గురువారం (అక్టోబర్ 24) నుంచి రెండో టెస్ట్ ఆరంభం కానుంది.

రిషబ్ పంత్‌ ఆడితే.. కేఎల్ రాహుల్‌ తప్పుకోవాల్సిందే!
ఇటీవల టెస్టుల్లో శ్రీలంక చేతిలో దారుణ ఓటములను ఎదుర్కొని భారత్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో సంచలన ప్రదర్శనతో సొంతగడ్డపై వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాకు షాక్ ఇచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ దిశగా దూసుకెళ్తున్న భారత జట్టుకు ఈ ఓటమి మింగుడుపడం లేదు. పూణే టెస్టులో గెలుపే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగనుంది. ఇందుకోసం జట్టులో మార్పులు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు మంచి ఫామ్‌లో ఉన్నారు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటారు. మెడ నొప్పితో తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్‌ గిల్‌.. రెండో టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న గిల్‌కు తుది జట్టులో చోటు ఖాయం. అయితే గిల్ స్థానంలో బెంగళూరు టెస్టులో ఆడి అద్భుత సెంటిరీ (150) చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ను పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పేలవ ప్రదర్శన చేసిన కేఎల్‌ రాహుల్‌పై వేటు తప్పేలా లేదు.

లక్కీ భాస్కర్ లో తప్పులు కనిపెడితే పార్టీ ఇస్తా..
మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం  ‘లక్కీ భాస్కర్’.  దీపావళి కానుకగా ఈ నెల అక్టోబర్ 31న పాన్ ఇండియా బాషలలో వరల్డ్​వైడ్​ గ్రాండ్​గా రిలీజ్ కానుంది. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజగా హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ‘లక్కీ భాస్కర్’ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ‘నరుడి బ్రతుకు నోటుతోనే ముడిపడి ఉంటుందని, అది లేనిదే మనిషికి మర్యాద ఉండదు’ అనే కధాంశంతో వస్తోంది లక్కీ భాస్కర్. ట్రైలర్ రిలీజ్ అనంతరం మీడియాతో ముచ్చటించారు చిత్ర యూనిట్. అందులో భాగంగా నిర్మాత నాగవంశీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ‘మ్యాడ్’ సినిమా రిలీజ్ టైమ్ లో సినిమా నచ్చలేదని చెప్తే టికెట్ డబ్బు రీఫండ్ అని స్కీం పెట్టారు. ఈ సినిమాకు కూడా అలాంటిదే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా అందుకు నిర్మాత నాగవంశీ బదులిస్తూ  ”  నాకు తెలిసి ఈ సినిమాలో తప్పులను వెతకడం కష్టం. అసలు తప్పులు అనేవి దొరకవేమో అని నమ్మకం కూడా ఉంది ఈ సినిమాలో కూడా తప్పులు పట్టుకుంటే వాళ్లందర్నీ పిలిచి పార్టీ ఇచ్చి, ఫోటోలు కూడా దిగుతాను’ అని అన్నారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.