NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు స్పీకర్‌ ఎన్నికపై సభలో అధికారిక ప్రకటన.. దూరంగా వైసీపీ
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఈ రోజు ఆయన శాసన సభలో బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇవాళ రెండో రోజు ఉదయం పదిన్నరకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. నిన్న ప్రమాణం చేయని వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇక, ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్య చౌదరి ప్రకటిస్తారు.. ఆ తర్వాత స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు అయ్యన్నపాత్రుడు. సభాపతి ఎన్నిక ప్రకటన తర్వాత.. అయ్యన్నను గౌరవప్రదంగా స్పీకర్‌చైర్‌లో కుర్చొబెట్టనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాల్‌, కూటమి ఎమ్మెల్యేలు.. అయితే, స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు.. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్లనున్నారు.

నేడు పులివెందులకు వైఎస్ జగన్.. ఎన్నికల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లనున్నాఉ.. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఇదే తొలిసారి.. ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు పయనం అవుతారు. ఇక, ఐదు రోజులపాటు పులివెందులలోనే మకాం వేయనున్నారు వైఎస్‌ జగన్. సోమవారం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకుంటారు వైఎస్ జగన్‌.. భవిష్యత్ కార్యాచరణ పైన పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి వైసీపీ శ్రేణులు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో దర్శన టికెట్లు విడుదల
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్‌ కావాల్సిన సమయం వచ్చేసింది.. శ్రీవారి వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను ఈ రోజు ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. ఇవాళ ఆన్‌లైన్ లో సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టికెట్లు విడుదల కానుండగా.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయబోతున్నారు.. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటా కూడా విడుదల కాబోతున్నాయి.. మరోవైపు ఇవాళ శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహిస్తోంది టీటీడీ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.. వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు ప్రారంభమైనా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.. ఈ రోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి.. వెలుపల క్యూ లైన్‌లో వేచిఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 72,294 మంది భక్తులు దర్శించుకున్నారు.. 31855 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. ఇక, హుండీ ఆదాయం రూ.3.39 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.

ముద్రగడపై కూతురు ఘాటు వ్యాఖ్యలు.. పేరు మార్చుకున్నారు.. కానీ..!
ముద్రగడపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన కూతురు క్రాంతి.. ‘మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని, అయన అలోచానా విధానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉందని మండిపడ్డారు క్రాంతి.. వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని ఏనాడూ ప్రశ్నించని ఆయనకు పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. ఒకసారి, తనపేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాక, కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువత భవిష్యత్ ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ విషయం ఆయనకు ఎందుకో అర్ధం కావడం లేదన్నారు.. పవన్ కళ్యాణ్ ఏమి చేయాలో ఆయనకు స్పష్టత ఉంది. ఏమి చేయాలో మా తండ్రి గారికే స్పష్టత లేదు అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. శేషజీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా ఒక కూతురుగా సలహా యిస్తున్నాను.. మళ్లీ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే, నేను గట్టిగా ప్రతిఘటిస్తాను” అని హెచ్చరిస్తూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌లో నిలదీశారు ముద్రగడ కూతురు క్రాంతి.

కోర్టు ధిక్కరణ కేసు.. మేడ్చల్ కలెక్టర్ తోపాటు మరో ఇద్దరికి నోటీసులు..
కోర్టు ధిక్కరణ కేసులో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రూ, కాప్రా తహసీల్దారు సుచరిత, కాప్రా డిసి ముకుంద్ రెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన వ్యవహరించిన అధికారులపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో అధికారులకు హై కోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రూ, కాప్రా మండల తహసీల్దారు సుచరిత, కాప్రా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డికి కోర్ట్ ధిక్కరణ కింద ఎందుకు వారిమీద తగిన చర్యలు తీసుకోవద్దు తెరపాలంటూ నోటీసులో పేర్కొంది. విచారణను వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారించింది. పిటిషనర్ తరుపు న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపిస్తూ కాప్రా మండలం సర్వే నంబర్ 152 లోని 13 ఎకరాలకు సంబంధించి అన్ని యజమాని హక్కులు, అనుమతులు ఉన్నప్పటికి రెవిన్యూ అధికారులు సదరు భూమిని కస్టడీయన్ భూమిగా ప్రకటిస్తూ.., అనధికారికంగా సదరు భూమిలో ప్రభుత్వ బోర్డు పెట్టారని తెలిపింది.

భయాందోళన రేపుతున్న వరుస హత్యలు.. ఇవాళ మరో మర్డర్..
శాంతి భద్రతలకు భాగ్యనగరానికి పెట్టింది పేరు. అయితే ఇప్పుడు హైదరాబాద్ అంటేనే భయానక వాతావరణం నెలకొంది. వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లో 7 హత్యలు, 2 హత్యాయత్నాలు జరిగాయంటే హైదరాబాద్ లో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదు. ఏ నిమిషమంలో ఏం జరుగుతుందో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల్లో 7 హత్యలు జరిగినా పోలీసులు అంటి ముట్టనట్టు ఉంటున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో 7 హత్యలు, 2 హత్యా యత్నాలు నగరాన్ని రక్తసిక్తరంగా మారుతున్నాయ. ఓల్డ్ సిటీలోని నవాబ్ సాబ్ కుంట అచ్చి రెడ్డి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడి మొహమ్మద్ జాకీర్ హుస్సేన్ కు దుండగులు హత్య చేశారు. అక్రమ సంబంధం కారణంగానే జాకీర్ ను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. షాహిన్ అనే మహిళతో పాటు భర్త హసన్ మరికొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రెండు రోజుల క్రితం ఓల్డ్ సిటీ శాలిబండ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురయ్యాడు. అదే రోజు శాలిబండ పరిధిలో వజీద్, ఫకృద్దీన్ లపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యా యత్నానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్ పరిధి తుకారం గేట్ పిఎస్ పరిధి అడ్డ గుట్టలో భార్య రోజాను హత్య చేసి భర్త పరార్ అయ్యాడు. మరుసటి రోజు అసిఫ్ నగర్ లో అలీం అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

నేడు ప్రధాని మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భేటీ

ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు తెచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నేడు చర్చలు జరపనున్నారు. షేక్ హసీనా తన రెండు రోజుల భారత పర్యటనను ప్రారంభించిన కొన్ని గంటల తర్వాత, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆమెను కలుసుకుని వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాను కలవడం సంతోషంగా ఉందని జైశంకర్‌ ట్విట్టర్‌లో తెలిపారు. షేక్ హసీనా ఢిల్లీకి వచ్చిన వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ భారతదేశానికి ప్రధాన భాగస్వామి, విశ్వసనీయ పొరుగు దేశమని, ప్రధాన మంత్రి హసీనా పర్యటన ద్వైపాక్షిక భాగస్వామ్యానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. భారతదేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక విదేశీ నాయకుడు చేస్తున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. బంగ్లాదేశ్ ప్రధానికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. పీఎం మోడీ, హసీనా మధ్య ఈరోజు చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సహకారం కోసం ఇరుపక్షాల మధ్య అనేక ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఈ ఒప్పందాలు రెండు దేశాల మధ్య అనేక రంగాల్లో సహకారానికి దారి తీస్తాయి. జూన్ 9న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన పొరుగు దేశాలకు చెందిన ఏడుగురు అగ్రనేతలలో షేక్ హసీనా ఒకరు. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలతో పాటు, షేక్ హసీనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్‌లను కూడా కలవనున్నారు. ఇరుదేశాల ప్రధానమంత్రుల మధ్య చర్చలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తాయని సమాచారం.

బ్రిడ్జి మీద ఆగిన రైలు.. గాల్లో వేలాడుతూ రిపేర్ చేసిన లోకోపైలట్లు..
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ రైలు బ్రిడ్జ్ మీద ఆగిపోయింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకోపైలట్లు తమ రైలు ఇంజెన్‌కు అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి రిపేర్లు చేశారు. వారిలో ఒక లోకో పైలెట్ అయితే, ఏకంగా బ్రిడ్జి మీద అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి రిపేర్లను పూర్తి చేశారు. కాగా, యూపీలోని నర్కటీయా గోరఖ్‌పూర్ ప్యాసెంజర్ రైలు.. శుక్రవారం నాడు మార్గమధ్యంలో ఓ రైల్వే బ్రిడ్జిపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఇంజెన్‌లోని అన్‌లోడర్ వాల్వ్‌లో అకస్మాత్తుగా గాలి పీడనం తగ్గిడంతో ట్రైన్ సడెన్ గా ఆగిపోయింది. అయితే, మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్లు రావడానికి కొంత ఆలస్యం అవుతుందని ప్రధాన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ గుర్తించారు. దీంతో, తామే స్వయంగా ఇష్యూను పరిష్కరించేందుకు పెద్ద సాహసం చేశారు. ఇక, లోకో పైలట్లలో ఒకరు ట్రైన్ కింద దూరి రిపేర్లు చేస్తుండగా.. మరో లోకో పైలట్ అత్యంత సాహసోపేతంగా బ్రిడ్జి అంచులను పట్టుకుని వేలాడుతూ.. నడుస్తూ సమస్య ఉన్న చోటుకు వెళ్లి మరమ్మతులు చేస్తున్నాడు.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి, ఎనిమిది మందికి గాయాలు
అమెరికాలోని దక్షిణ అర్కాన్సాస్‌లోని జనరల్ స్టోర్ లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఫోర్డైస్‌లోని మ్యాడ్ బుట్చర్ జనరల్ స్టోర్ లో కాల్పులు జరిగాయని, పోలీసుల కాల్పుల్లో సాయుధుడు తీవ్రంగా గాయపడ్డాడని అర్కాన్సాస్ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ సమయంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిపై కూడా కాల్పులు జరిపారని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఆర్కాన్సాస్ గవర్నర్ సారా హుకాబీ శాండర్స్ మాట్లాడుతూ.. కాల్పుల గురించి తనకు సమాచారం అందిందని చెప్పారు. ఫోర్డైస్‌లోని మ్యాడ్ బుట్చర్ జనరల్ స్టోర్ లో కాల్పులు జరిగాయని, పోలీసుల కాల్పుల్లో సాయుధుడు తీవ్రంగా గాయపడ్డాడని అర్కాన్సాస్ రాష్ట్ర పోలీసులు తెలిపారు. అయితే షాపులోపల కాల్పులు జరిగాయా లేదా బయటా అనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. ఫోర్డైస్ అనేది లిటిల్ రాక్‌కు దక్షిణంగా 65 మైళ్ళు (104 కిమీ) దూరంలో ఉన్న సుమారు 3,200 మంది జనాభా కలిగిన పట్టణం. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు ఆ వ్యక్తి పార్కింగ్ స్థలంలో పడుకున్నట్లు చూపించగా, మరొక వీడియోలో అనేక తుపాకీ కాల్పులు వినిపించాయి. టీవీ జర్నలిస్టుల ఫుటేజీలో అనేక స్థానిక, రాష్ట్ర ఏజెన్సీలు సన్నివేశానికి ప్రతిస్పందిస్తున్నట్లు.. ఒక వైద్య హెలికాప్టర్ సమీపంలో ల్యాండింగ్‌ అయినట్లు చూపించాయి. కాల్పుల గురించి తనకు సమాచారం అందిందని అర్కాన్సాస్ గవర్నర్ సారా హక్బీ శాండర్స్ తెలిపారు.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. దూబే, జడేజాపై వేటు! హైదరాబాద్ ప్లేయర్ ఎంట్రీ
టీ20 ప్రపంచకప్ 2024లో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత్.. మరో కీలక పోరుకు సిద్ధమైంది. సూపర్‌-8లో భాగంగా తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన.. నేడు ఆంటిగ్వాలోని వీవీ రిచర్డ్స్ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విగెలిస్తే.. టీమిండియా సెమీఫైనల్ బెర్త్ దాదాపుగా ఖరారు అవుతోంది. ఈ క్రమంలోనే బంగ్లా మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని భారత్ భావిస్తోంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్.. తుది జట్టులో రెండు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన శివమ్ దూబే, రవీంద్ర జడేజాలను బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో పక్కనపెట్టే అవకాశం ఉంది. ఈ ఇద్దరి స్థానాల్లో యశస్వి జైస్వాల్, మొహ్మద్ సిరాజ్‌లు ఆడనున్నారు. మిడిలార్డర్లో దూబే వైఫల్యం భారత్‌కు సమస్యగా మారింది. దాంతో యశస్విని ఓపెనింగ్‌లో ఆడించి.. విరాట్ కోహ్లీని తనకు అలవాటైన మూడో స్థానంలో దింపాలని మేనేజ్మెంట్ చూస్తోందట. ఇక వెస్టిండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా.. పేసర్లదే హవా నడుస్తోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో పేసర్లే వికెట్స్ పడగొట్టారు. అందుకే జడేజా స్థానంలో హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో రాక్షసుడిగా ఎన్టీఆర్..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ముందుగా అక్టోబర్ 10 న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.కానీ ఈ సినిమా అనుకున్న తేదీ కంటే ముందుగానే సెప్టెంబర్ 27 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈసినిమాకు మేకర్స్ డ్రాగన్ అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు పెట్టనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ తెలిపింది.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర రాక్షసుడిలా ఎంతో వైల్డ్ గా ఉంటుందని సమాచారం.అలాగే హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం.

మరోసారి వరుస సినిమాలతో బిజీ అయిన శ్రీలీల..
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన “పెళ్లి సందD ” సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న శ్రీలీల గత ఏడాది వరుస సినిమాలతో ఎంతో బిజీ గా మారింది.ఒకానొక సమయంలో ఈ భామ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఎన్నో సినిమాలు వదులుకుంది.అయితే ఆమె నటించిన సినిమాలేవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. గత ఏడాది ఆమె నటించిన భగవంత్ కేసరి సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్ని కూడా డిజాస్టర్ గా నిలిచాయి. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న కూడా ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు అంత స్కోప్ లేదు.దీనితో ఈ భామకు ఆఫర్స్ కరువయ్యాయి.అయితే ఈ భామ తన డాన్స్ తో మాత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.అయితే ఈ భామ గత ఐదు నెలలుగా కొత్త సినిమా చేయలేదు.దీనితో శ్రీలీల సినిమాలకు బ్రేక్ తీసుకుందని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా శ్రీలీల హవా మరోసారి మొదలైనట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన “ఉస్తాద్ భగత్ సింగ్ “సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఆ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టింది.నితిన్ ,వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్ మూవీ అలాగే రవితేజ 75 మూవీలో ఈ భామ ఆఫర్ అందుకుంది.