NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరించింది. రాయలసీమ జిల్లాలకు వర్షాలు ఓ మోస్తరు ఉంటాయని వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మూడు రోజుల పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిలికా సరస్సు వద్ద ఏర్పడిన గాలి వ్యవస్థ బలహీనపడి రాత్రి సమయంలో అల్పపీడనంగా మారిందని వివరించింది. వాయువ్య దిశగా పయనిస్తూ ఆదివారం ఉదయం 8:30 గంటలకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలను తాకింది. గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హనుకొండ, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపే, కామారెడ్డి, జనగాం, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, నారాయణ పేట, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసింది. భద్రాద్రి కొత్తగూడం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్‌లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలు చాలా చోట్ల ముంపునకు గురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతుంది. కాగా, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 195 గ్రామాలు ముంపునకు గురయ్యాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు వర్షాల వల్ల చాలా చోట్ల ఆస్తి నష్టం జరగగా, ఒకరి మృతిని అధికారికంగా ప్రకటించారు. కాగా, నిన్న సాయంత్రం ధవళేశ్వరం వద్ద 4.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

 

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ముగియనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలను గవర్నర్ వివరించనున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు.. గత ఐదేళ్ల పాలనను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతే ఏపీ రాజధాని అనే విషయాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలకు హై ప్రయార్టీ, గంజాయి నివారణ వంటి అంశాలను గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు రానున్నారు. వైసీపీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నారంటూ సభ బయట, లోపల నిరసనలు తెలిపేందుకు వైసీపీ ప్రణాళికలు చేసినట్లు సమాచారం.

 

భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక.. నీటిమట్టం 46.5 అడుగులు
అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పర్యాట ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 46.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 43 అడుగులు దాటి నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 48 అడుగులకి వస్తే రెండవ ప్రమాద జారీ చేస్తారు. అయితే భద్రాచలం పరివాహక ప్రాంతంలో ఎగువన ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గత మూడు రోజులుగా వర్షాలు వస్తూనే ఉన్నాయి. ఛత్తీస్గడ్ ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు నేపథ్యంలో శబరికి భారీ వరద వచ్చింది. శబరి వరద భద్రాచలం దిగువన గోదావరిలో కలుస్తుంది.. దీంతో గోదావరి వరద నీరు దిగువకి స్లోగా వెళుతుంది. గోదావరి భద్రాచల వద్ద పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది బూర్గంపాడు మండలంలో పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాదం జారీ చేస్తారు. కాగా ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీగా వరద అంతా శబరి మీద పడింది. శబరి నీటి ప్రవాహం వేగంగా పెరిగింది. ప్రస్తుతం శబరి 38 అడుగులకు చేరుకోవడంతో అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక ప్రారంభమైంది. దీంతో గోదావరి స్పీడ్ తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి కొద్ది మేరకు పెరుగుతున్నది. ఇది మరింత పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తు హెచ్చరికల్ని ఇప్పటికే అధికారులు జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక తర్వాత పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

 

ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకోగా.. సుమారు 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురవడంతో. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ధవళేశ్వరం బ్యారేజీ దిగువన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న గౌతమి, వైనతేయ, వశిష్ట, వృద్ధ గౌతమి నాలుగు ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి వరద నీటి ప్రవాహానికి కాజ్ వేలు నీటమునిగాయి. పి. గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో కాజ్ వే నీట మునిగి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల వరద బాధితులు కాజ్ వేలపై ఉన్న వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. వరద ఉధృతికి చాకలి పాలెం – కనకాయలంక కాజ్ వే నీట మునిగింది. దీనితో భీమవరం – కోనసీమ జిల్లాల మధ్య రాకపోకలు నిలిచి పోయాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజల రాకపోకలకు ఇంజన్ పడవలు ఏర్పాటు చేశారు .

 

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఉదయం 10గంటలకు మోడీ మీడియా సమావేశం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం (జులై 22) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. సెషన్‌లో 22 రోజుల పాటు 16 సమావేశాలు ఉంటాయి. సోమవారం (జూలై 22) పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు ప్రారంభమయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 10 గంటలకు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మీడియాతో ప్రసంగించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కీలకమని, బడ్జెట్ పై సభలో చర్చించి సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని ప్రధాని మోడీ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయవచ్చని విశ్వసనీయ సమాచారం. అంతకుముందు, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆదివారం (జూలై 21) పిలిచిన అఖిలపక్ష సమావేశంలో.. పార్లమెంటు సజావుగా జరిగేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల నుండి సహకారాన్ని కూడా కోరింది. సెషన్‌లో మొదటి రోజు అంటే జూలై 22న భారత ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడుతుంది. 18వ లోక్‌సభ రెండో సెషన్ లో ప్రభుత్వం పార్లమెంట్ ఆర్థిక (నం. 2) బిల్లు- 2024, విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు- 2024, బాయిలర్స్ బిల్లు- 2024, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్‌, కాఫీ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు- 2024, రబ్బర్ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్) బిల్లు- 2024 బిల్లులను ప్రవేశ పెట్టనుంది. అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రతిపక్ష పార్టీలకు అన్ని సమస్యలపై ఓపెన్ హార్ట్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంపై ఉభయ సభలు – లోక్‌సభ, రాజ్యసభల్లో విపక్షాలు సృష్టించిన రచ్చ, అంతరాయం పార్లమెంటరీ సంప్రదాయానికి తగదని ఆయన అన్నారు. పార్లమెంట్‌ను సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలపై కూడా ఉందని అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు అన్నారు. అఖిలపక్ష సమావేశానికి బీజేపీ సహా 41 రాజకీయ పార్టీలకు చెందిన 55 మంది నేతలు హాజరయ్యారని తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నేతలు పలు మంచి సలహాలు కూడా ఇచ్చారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు తమ సమస్యలను ప్రస్తావించాయి. సంబంధిత ప్రిసైడింగ్ అధికారుల ద్వారా విధివిధానాలు, వ్యాపార ప్రవర్తన నియమాల ప్రకారం అనుమతించబడిన ఏదైనా సమస్యను సభా వేదికపై చర్చించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల నేతల సహకారం, మద్దతును కూడా అభ్యర్థించారు.

 

నేడు ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
మోడీ ప్రభుత్వం మూడో దఫా తొలి బడ్జెట్‌ నిరీక్షణకు తెరపడనుంది. పార్లమెంటు కొత్త సమావేశాలు సోమవారం ప్రారంభమవుతున్నాయి. మరుసటి రోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు బడ్జెట్‌కు ముందు భారత ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. 2023-24 ఆర్థిక సర్వేను లోక్‌సభలో మధ్యాహ్నం 1 గంటలకు, రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటలకు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 02.30 గంటలకు నేషనల్ మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత్ నాగేశ్వరన్ ఆర్థిక సర్వేను సిద్ధం చేస్తున్న తన బృందంతో కలిసి ప్రసంగిస్తారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు ప్రభుత్వం ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. సాధారణంగా ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి పార్లమెంటులో సమర్పిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరి నెలలో, మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించినప్పుడు, అంతకు ముందు ప్రభుత్వం ఆర్థిక సర్వే ఇవ్వడానికి బదులుగా ది ఇండియన్ ఎకానమీ: ఎ రివ్యూ పేరుతో నివేదికను విడుదల చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులైలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు ముందు ఆర్థిక సమీక్షను ప్రవేశపెడతామని అప్పట్లో చెప్పారు. ఆర్థిక సర్వేలో ప్రతిసారీ ప్రభుత్వం గత బడ్జెట్‌లో నిర్దేశించిన లక్ష్యాలను ఏ మేరకు సాధించామో చెబుతారు. ఒక విధంగా ఆర్థిక సర్వే అంటే గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష. దీనిని ఆర్థిక వ్యవహారాల శాఖ సిద్ధం చేసింది. ఈసారి ఆర్థిక సర్వేను ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత్ నాగేశ్వరన్ కార్యాలయం సిద్ధం చేసింది. దేశ ఆర్థిక విధానం పరంగా ఆర్థిక సర్వే చాలా ముఖ్యం. బడ్జెట్‌లో ప్రభుత్వ భవిష్యత్తు (సాధారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం) ప్రణాళికలను వివరిస్తున్నప్పటికీ, ఆర్థిక సర్వే గతంలో (సాధారణంగా మునుపటి ఆర్థిక సంవత్సరం) ప్రభుత్వం చేసిన పనికి సంబంధించిన ఖాతాను ఉంచుతుంది. అంటే ఆర్థిక సర్వే అనేది గతం, దాని ఆధారంగానే భవిష్యత్తు బడ్జెట్‌ను రూపొందిస్తారు. ఆర్థిక సర్వేలో ప్రధాన ఆర్థిక సలహాదారు గత బడ్జెట్‌లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఏ మేరకు సాధించారో వివరిస్తారు. అదేవిధంగా గతేడాది బడ్జెట్‌లో రూపొందించిన ప్రణాళికల్లో ఎంతమేరకు అమలు చేశారనే దానిపై కూడా ఆర్థిక సర్వేలో సవివరమైన సమాచారం ఉంటుంది. ఇవి కాకుండా, దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు (జిడిపి వృద్ధి రేటు), ద్రవ్యోల్బణం రేటు, వివిధ రంగాల పనితీరు (వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు) మొదలైన అనేక ఇతర ముఖ్యమైన ఆర్థిక సమస్యల వివరాలను కూడా సర్వే కలిగి ఉంటుంది.

 

వింత ఘటన.. యువకుడి కడుపులో అడుగు సొరకాయ!
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడి కడుపులోంచి అడుగుకు పైగా పొడవున్న సొరకాయను వైద్యులు బయటకు తీశారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. యువకుడికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అతడి శరీరంలోకి ఇది మలద్వారం ద్వారా వచ్చి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సొరకాయను ఎవరైనా బలవంతంగా చొప్పించారా? లేదా ఇంకేమైనా జరిగిందా? అన్నది యువకుడు స్పృహలోకి వచ్చాక తెలియనుంది. సమాచారం ప్రకారం… మూడు రోజుల క్రితం ఖజురహో ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తీవ్రమైన కడుపు నొప్పితో ఛతర్‌పుర్‌ జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. భయంకరమైన కడుపు నొప్పిగా ఉందని, అస్సలు తట్టుకోలేక పోతున్నాని డాక్టర్లతో చెప్పాడు. ప్రాథమిక పరీక్ష అనంతరం అతడికి ఎక్స్‌రే తీశారు. కడుపులో పొడవైన వస్తువు చూసి డాక్టర్‌ నందకిశోర్‌ జాదవ్‌ షాక్ అయ్యారు. ఏం జరిగిందని యువకుడిని అడగ్గా.. అతడు చెప్పే పరిస్థితిలో లేడు. ఆపరేషన్ ద్వారా మాత్రమే ఆ వస్తువును తొలగించవచ్చని కుటుంబసభ్యులతో చెప్పారు. నందకిశోర్‌ జాదవ్‌ ఆధ్వర్యంలో శనివారం యువకుడికి ఆపరేషన్ జరిగింది. కొన్ని గంటలపాటు ఆపరేషన్ జరిగింది. వైద్యుల బృందం అతడి పొట్టలో తొడిమతో కూడిన సొరకాయను చూసి అవాక్కయ్యారు. ఈ సొరకాయ వల్ల యువకుడి పెద్ద పేగు పూర్తిగా నలిగిపోయింది. దీంతో అతనిడికి తీవ్రమైన నొప్పి వస్తోంది. యువకుడు స్పృహలోకి వస్తే గానీ అసలు విషయం ఏంటో తెలియరానుంది. సొరకాయ అడుగుకు పైగా పొడవు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. మానసిక పరిస్థితి బాగాలేని వారే ఇలాంటి పనులు చేస్తారని వైద్యులు అంటున్నారు.

 

అమెరికా అధ్యక్ష రేసులో కమలా హారిస్.. బైడెన్ ఔట్.. !
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం 2024 యూఎస్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను నామినేట్ చేశారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగే పోటీలో నిలిచింది. భారతీయ- ఆఫ్రికన్ మూలానికి చెందిన కమలా హారిస్ పేరును బైడెన్ సిఫార్సు చేశారు. ఈ ఏడాది కమలా హారిస్‌ను మా పార్టీ అభ్యర్థిగా చేయడానికి నా పూర్తి మద్దతు, సహకారం అందించాలని కోరుకుంటున్నాను అని జో బైడెన్ ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు. డెమోక్రటిక్ పార్టీ మొత్తం ఏకమై ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది అని బైడెన్ తెలిపాడు. ఇక, కమలా హారిస్ మాట్లాడుతూ.. తానను ప్రెసిడెంట్ పదవికి నామినేట్ చేసినందుకు బైడెన్ కు ధన్యవాదములు అని పేర్కొన్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన అతివాద ‘ప్రాజెక్టు 2025’ అజెండాను ఓడించడం కోసం దేశాన్ని ఏకం చేయడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని ఆమె వెల్లడించారు. ప్రకటించారు. అలాగే, అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా.. మొదటి నల్లజాతి, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్‌ కూడా ఆమె నిలిచింది. అధ్యక్షుడి బైడెన్ ఆమోదం పొందడం నేను గౌరవంగా భావిస్తున్నా.. ఈ నామినేషన్‌ను సాధించి, గెలవడమే నా యొక్క ఉద్దేశం అని కమలా హారిస్‌ తెలిపారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో డెమోక్రాట్లలో పలువురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. జో బైడెన్‌ మద్దతు ఉండడం కమలా హారిస్‌కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.. వచ్చే నెల షికాగోలో జరిగే డెమోక్రటిక్‌ పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధుల ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది.

 

కమలా హారిస్‌ను ఓడించడం ఈజీ: డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్‌ తప్పుకోవడంతో పాటు కమలా హారిస్ పోటీ చేయడంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ కంటే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఓడించడం సులభమని తాను భావిస్తున్నానని అన్నారు. జో బైడెన్ అధ్యక్షుడిగా పోటీ చేసే అర్హత లేదన్నారు.. యూఎస్ ప్రజలకు సేవ చేయడానికి అతడు అర్హత కాదని పేర్కొన్నారు. ఇక, ‘దేశ చరిత్రలో చెత్త అధ్యక్షుడిగా జో బైడెన్ నిలిచిపోతాడని డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. అతడికి అధ్యక్షుడిగా ఉండటానికి హక్కు లేదు.. ప్రెసిడెంట్ పదవికి అర్హుడు కాదని వైద్యులు, మీడియాతో సహా ఆయన చుట్టూ ఉన్న వారందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పి ఫేక్ న్యూస్ సృష్టించి అధ్యక్ష పదవిని సాధించుకున్నారు.. ఇక, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఎన్నికల్లో ఆమెను ఓడించడం మాకు మరింత ఈజీ అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక, నవంబర్ 5వ తేదీన జరిగే ఎన్నికల్లో 2025 నుంచి నాలుగేళ్ల కాలానికి యూఎస్ ప్రెసిడెంట్ ను ఎన్నుకోనున్నారు. అయితే, 1968 తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు మళ్లీ ఎన్నికల రేసు నుంచి దూరం కావడం ఇదే తొలిసారి. అంతకుముందు 1968లో అధ్యక్షుడు లిండన్ జాన్సన్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. సెమ్ అలాంటి పరిస్థితి ప్రస్తుతం.. జో బైడెన్ ఎదుర్కొన్నారు.. అతడి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పాటు జ్ఞాపకశక్తి కోల్పోవడం వల్ల డెమోక్రటిక్ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని వదులుకోవాలని బైడెన్‌పై ఒత్తిడి పెరిగింది.

Show comments