మూడో రోజు దావోస్ టూర్.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశాలు..
స్విట్జర్లాండ్ దావోస్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా మూడో రోజూ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం ముఖాముఖి భేటీలు నిర్వహించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్‌లో పారిశ్రామిక పురోగతిపై నిర్వహించే ప్రత్యేక సెషన్‌లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి ప్రణాళికలను అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా హొరైసిస్ ఛైర్మన్ ఫ్రాంక్ రిచర్‌తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. అలాగే తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీఓఓ కుష్భు అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సీఈఓ రాజ్ వట్టికుట్టి, స్కాట్ శాండ్స్చెఫర్‌లతోనూ సీఎం చర్చలు జరపనున్నారు. ఇక, పలు అంతర్జాతీయ సెషన్లలో సీఎం పాల్గొననున్నారు.. ఏపీ సీఎన్ఎఫ్ నిర్వహించే “హీలింగ్ ప్లానెట్ త్రూ రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్” పేరిట జరిగే చర్చా కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. అలాగే “ట్రిలియన్ డాలర్ పైవోట్ – రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్” అంశంపై జరిగే మరో కీలక చర్చలోనూ పాల్గొననున్నారు.
నేడు పెడనకు పవన్ కల్యాణ్.. మృతిచెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి పరామర్శ..
డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లా పెడనలో పర్యటించనున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంత రాయల కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. జనసేన విడుదల చేసిన పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బయలుదేరనున్న పవన్ కల్యాణ్.. ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.20 గంటలకు పెడనకు చేరుకోనున్నారు. తదనంతరం మధ్యాహ్నం 1.50 గంటలకు పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం పెద చందాల గ్రామానికి వెళ్లి మృతిచెందిన జనసేన కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు పవన్ కల్యాణ్.. ఇక, కార్యక్రమం అనంతరం, పవన్ కల్యాణ్ మధ్యాహ్నం 1.50 గంటలకు పెడన నుంచి బయలుదేరి సాయంత్రం 3.50 గంటలకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు.
సీఎం కీలక నిర్ణయం.. ఏటా హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు..
సీఎం రేవంత్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది జులై లో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ప్రతినిధులకు సూచించారు. హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం తెలిపారు. ‘ప్రతి ఏడాది మేము ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్ కు వస్తాం.. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావటంతో, తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చాం” అని తెలిపారు.
హోలీకి ముందు పేదలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా LPG సిలిండర్
ఢిల్లీ లోని పేద కుటుంబాలకు హోలీ పండుగ ముందే ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. వంట గ్యాస్ కోసం ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు ఒక ఉచిత ఎల్పీజీ సిలిండర్ ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కోసం తొలి దశలో రూ.300 కోట్లను కేటాయించారు. ఈ పథకం హోలీ నుంచే అమల్లోకి రానుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. హోలీ, దీపావళి పండుగల సందర్భంగా పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని, అలాగే రూ.500కే మరో సబ్సిడీ సిలిండర్ అందిస్తామని అప్పట్లో పార్టీ చెప్పింది. ఇప్పుడు ఆ హామీల్లో తొలి అడుగుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీలోని పేద రేషన్ కార్డు దారులకే ఈ పథకం వర్తించనుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాలను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. అర్హులైన ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్ ఖర్చుకు సమానమైన మొత్తం అందజేయనున్నారు.
పలు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. గత కొద్దిరోజులుగా పొల్యుషన్‌తో సతమతం అవుతున్న దేశ రాజధాని ఢిల్లీకి ఐఎండీ శుభవార్త చెప్పింది. ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల్లో వర్ష కురుస్తుందని తెలిపింది. ఢిల్లీ సహా ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యారాలో వర్షం కురుస్తుందని అలర్ట్ చేసింది. హిమాలయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీలో చలిగాలులు లేవు.. పొగమంచు కనిపించడం లేదు. వాతావరణంలో జరిగిన మార్పులు కారణంగా ఆహ్లాదకరంగా మారింది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు… ఉత్తరాఖండ్ నుంచి కాశ్మీర్ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తొలుత కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే హిమపాతం కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో తేలికపాటి లేదా మితంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో మేఘాలు కమ్ముకుంటాయని.. బలమైన గాలులు.. తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతుంటే నేనే ఆపా.. మరోసారి భారత్-పాక్ వార్‌పై ట్రంప్ వ్యాఖ్య
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్థాన్ అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతున్నట్లుగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు చెప్పారని.. వెంటనే ఇరు దేశాలను వాణిజ్య హెచ్చరికలతో యుద్ధం ఆపినట్లుగా ట్రంప్ చెప్పుకొచ్చారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ముష్కరులు 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతీకారంగా 2025 మే 10న భారతదేశం.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అయితే ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది. అయితే రెండు దేశాలను వాణిజ్య సుంకాలతో హెచ్చరించడంతో యుద్ధం ఆపాయని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వాగతించగా.. భారత్ ఖండించింది. మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పింది.
పాకిస్థాన్ రక్షణ మంత్రికి ఘోర అవమానం.. నకిలీ స్టోర్‌ను ప్రారంభించిన మినిస్టర్!
పాకిస్థాన్ ప్రజా ప్రతినిధుల తెలివిలేని తనం మరోసారి బయటపడింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తామే విజయం సాధించామని విర్రవీగిన పాకిస్థాన్ అసలు రూపం బట్టబయలైంది. అక్కడి పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నాయో, ప్రభుత్వ పెద్దల పని తీరు ఎంత అజాగ్రత్తగా ఉందో ఈ ఒక్క ఘటనతోనే అర్థమవుతోంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా సియాల్కోట్‌లో ఒక పిజ్జా హట్ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి.. నవ్వుతూ ఫోటోలు దిగారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. కానీ కథ అక్కడితో ఆగలేదు. కొద్దిసేపటికే అసలు నిజం బయటపడింది. ఆ స్టోర్ అసలైన పిజ్జా హట్ కాదని, పూర్తిగా నకిలీదని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. “ఈ స్టోర్‌కు మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు” అని పిజ్జా హట్ పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. ఇది మా బ్రాండ్ పేరును తప్పుగా వాడుతోందని, తమ ప్రమాణాలు, నాణ్యత, భద్రతా నియమాలు ఏవీ పాటించడం లేదని స్పష్టం చేసింది. సాధారణంగా పిజ్జా హట్ లాంటి అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్ ప్రారంభం అంటే పూర్తి అనుమతులు, రిజిస్ట్రేషన్, కఠిన నియమాలు ఉంటాయి. అలాంటిది ఒక నకిలీ స్టోర్‌ను దేశ రక్షణ మంత్రి స్వయంగా ప్రారంభించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. “ఒక మంత్రి కనీసం ఇది నిజమైన స్టోరేనా కాదా అని కూడా చూసుకోలేదా?” అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తాయి. కొందరు అయితే దీన్ని జోకులా తీసుకొని, తీవ్రంగా విమర్శలు చేశారు.
27 ఏళ్ల జర్నీకి గుడ్ బై.. సునీతా విలియమ్స్ నాసా నుంచి రిటైర్డ్..
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ట్రైల్‌బ్లేజింగ్ వ్యోమగామి సునీతా విలియమ్స్, రికార్డు స్థాయిలో స్పేస్ వాక్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలల కష్టకాలం గడిపినందుకు ప్రసిద్ధి పొందారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిదిన్నర నెలలుగా 10 రోజుల అంతరిక్ష యాత్ర సాగించిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ 27 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేశారు. మంగళవారం నాసా ప్రకటించిన పదవీ విరమణ గత క్రిస్మస్ తర్వాత, డిసెంబర్ 27, 2025న అమల్లోకి వచ్చింది. అంతరిక్షంలో 608 రోజులకు పైగా విస్తరించిన అద్భుతమైన కెరీర్‌ను ముగించింది. విలియమ్స్, తోటి వ్యోమగామి బారీ “బుచ్” విల్మోర్ జూన్ 2024లో బోయింగ్, తొలి సిబ్బందితో కూడిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి దిగారు. ఇది ISSకి ఎనిమిది రోజుల టెస్ట్ ఫ్లైట్ గా ఉద్దేశించబడింది. సాంకేతిక సమస్యలు – ప్రధానంగా థ్రస్టర్ లోపాలు, హీలియం లీక్‌లు – అంతరిక్ష నౌకను గ్రౌండ్ చేయడంతో, తొమ్మిది నెలలకు పైగా నిలిచిపోయాయి. విల్మోర్ గత వేసవిలో నాసా నుండి బయలుదేరాడు. విలియమ్స్ మార్చి 2025లో స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ద్వారా తిరిగి భూమి మీదకు వచ్చారు.
వాట్సాప్‌లో కొత్త బటన్.. ఒకే క్లిక్‌తో సరికొత్త ఫీచర్లు..!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. కొత్త ఫీచర్లను ముందుగానే ఉపయోగించే అవకాశం కల్పించడంతో పాటు, నచ్చకపోతే వాటిని నిలిపివేసే సౌలభ్యాన్ని కల్పించేలా కొత్త టోగుల్ బటన్‌ను జోడించింది. వాట్సాప్‌లో రాబోయే ఫీచర్లు, అప్‌డేట్స్‌ను ట్రాక్ చేసే ప్రముఖ వెబ్‌సైట్ WABetaInfo ఈ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్‌లో పరీక్ష దశలో ఉంది. WABetaInfo ప్రకారం, తాజా బీటా వెర్షన్‌లో వినియోగదారులు ఆన్ / ఆఫ్ చేయగల కొత్త టోగుల్‌ను గుర్తించారు. దీని ద్వారా వినియోగదారులు బీటా ఫీచర్లను ఉపయోగించాలా వద్దా అన్న నిర్ణయాన్ని స్వయంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త ఫీచర్లు నచ్చకపోతే, ఒక్క క్లిక్‌తోనే బీటా అనుభవాన్ని నిలిపివేయవచ్చు. ఇప్పటి వరకు బీటా ప్రోగ్రామ్‌లో చేరాలంటే ప్లే స్టోర్ ద్వారా ప్రత్యేకంగా నమోదు కావాల్సి వచ్చేది. అంతేకాదు, పరిమిత సంఖ్యలో వినియోగదారులకే బీటా వెర్షన్ యాక్సెస్ ఇచ్చేది. బీటా సభ్యులైనప్పటికీ, చాలామందికి కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాకపోవడం సాధారణంగా జరుగుతోంది. ఈ కొత్త టోగుల్ ఫీచర్‌తో అటువంటి సమస్యలకు చెక్ పెట్టినట్లు వాట్సాప్ తెలుస్తోంది.
వైభవ్ సూర్యవంశీ రికార్డును బ్రేక్ చేసిన ఆసిస్ ప్లేయర్.. యూత్ వన్డేలో ఫాస్టెస్ట్ సెంచరీతో సంచలనం
అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 16వ మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా అండర్ 19 క్రికెట్ జట్టు ఓపెనర్ విల్ మలజ్‌చుక్ తన ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించాడు. అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును సృష్టించాడు. అలాగే, యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీని దాటి వేగవంతమైన సెంచరీ సాధించడంలో నంబర్ 2 అయ్యాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్‌లో 16వ మ్యాచ్‌లో జపాన్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విల్ మలాజ్‌జుక్ 55 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సర్లు, 12 ఫోర్లు ఉన్నాయి. విల్ మలాజ్‌జుక్ కేవలం 51 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. యూత్ వన్డే చరిత్రలో సెంచరీ సాధించిన రెండవ అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతంలో, భారత స్టార్ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ 2025లో ఇంగ్లాండ్‌పై 52 బంతుల్లో సెంచరీ సాధించి (యూత్ వన్డేల్లో వైభవ్ వేగవంతమైన సెంచరీగా మిగిలిపోయింది) యూత్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు విల్ 51 బంతుల్లో ఈ ఘనతను సాధించాడు, వైభవ్‌ను మూడవ స్థానానికి నెట్టాడు. పాకిస్తాన్‌కు చెందిన సమీర్ మిన్హాస్ 2026లో జింబాబ్వేపై 42 బంతుల్లో ఈ ఘనతను సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
ప్రశాంత్ నీల్ సినిమా షూట్ కు బ్రేక్ ఇచ్చిన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్. గత కొన్ని నెలలుగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన మేకర్స్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్‌లో జెట్ స్పీడ్ లో సాగుతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కూడా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ స్వల్పంగా జలుబుతో బాధపడుతున్నాడట. ఆరోగ్య సమస్య పెద్దది కాకపోయినా ఎన్టీఆర్ కాస్త అలసట గా ఉన్నాడని పూర్తి విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే చిత్ర బృందం షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అనుకోని కారణాల వలన ఇప్ప్పటికే వాయిదా పడిన ఈ సినిమా షూట్ మరోసారి బ్రేక్ పడింది. ఆయితే ఇది చిన్న బ్రేక్ మాత్రమే అని ఒకటి లేదా రెండు రోజుల్లో షూట్ తిరిగి స్టార్ట్ అవుతుందని యూనిట్ సమాచారం. ప్రశాంత్ నీల్ డ్రాగన్ ను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. వాస్తవానికి డ్రాగన్ ను మొదట 2026 జనవరి 26న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ షూట్ డిలే అవడంతో 2027 కు పోస్ట్ పోన్ అయింది. మరి సంక్రాంతి కానుకా తీసుకువస్తారా లేదా సమ్మర్ లో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. కానీ ఎప్పుడు వచ్చిన సరే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం మాత్రం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
లెక్కలు వేసుకుంటే ఇక్కడ రాణించలేం..
‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాలతో మెప్పించిన తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, ఇప్పుడు తన తొలి తెలుగు ఓటీటీ చిత్రం ‘చీకటిలో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సురేష్ బాబు నిర్మాణంలో, శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో శోభిత తన పాత్ర గురించి, కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. శోభిత మాట్లాడుతూ.. ఇందులో తాను ‘సంధ్య’ అనే పాడ్‌కాస్టర్ పాత్రలో కనిపిస్తాను, సంధ్య చాలా ధైర్యవంతురాలు. తన నమ్మకం కోసం ఎవరు ఉన్నా లేకపోయినా నిలబడే అమ్మాయి. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. ఇది కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక బలమైన ఎమోషనల్ జర్నీ. కష్టం వస్తే భయపడి వెనకడుగు వేయకుండా, ముందడుగు వేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని సంధ్య పాత్ర ద్వారా చెప్పబోతున్నాం’ అని వివరించింది. ఈ పాత్ర నేటి తరం అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్ర ట్రైలర్‌ను నాగచైతన్య తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయడం పట్ల శోభిత సంతోషం వ్యక్తం చేసింది. ‘నాకు నచ్చిన పాత్రకు నేను వంద శాతం న్యాయం చేస్తాను, మిగతా ఫలితాన్ని ప్రేక్షకులే తేలుస్తారు. నా వాళ్ళని కూడా ‘సినిమా ఎలా ఉంది?’ అని అడిగి అభిప్రాయాలు తీసుకోవడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అని చాలా ఓపెన్ గా చెప్పింది.
మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసిన బ్యూటీ ఆషిక రంగనాథ్..
కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్‌గా మారిపోయింది. గతంలో ఈమె చేసిన సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినా, ఈ ఏడాది సంక్రాంతి మాత్రం అమ్మడి జాతకాన్ని మార్చేసింది. మాస్ రాజా రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో నటించి సాలిడ్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఆషికకు టాలీవుడ్‌లో ‘గోల్డెన్ లెగ్’ అనే ట్యాగ్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విజువల్ వండర్ ‘విశ్వంభర’లో కూడా ఆషిక ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఈ బ్యూటీ బిజీ అయిపోయింది. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం.. చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా మంది పేర్లను పరిశీలించిన మేకర్స్, చివరికి ఆషిక రంగనాథ్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీలో శర్వానంద్-ఆషిక జంట చూడటానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అంటే 2026 సంక్రాంతిని తన ఖాతాలో వేసుకున్న ఆషిక, 2027 సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వరుస పెట్టి పెద్ద సినిమాలు ఓకే చేస్తూ ఈ భామ టాలీవుడ్‌లోనే సెటిల్ అయ్యేలా ఉంది.
