NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే సభా కార్యక్రమాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉండనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. గురువారం రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేసిన విషయం విదితమే కాగా.. ఇక, నేడు సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మంత్రులు.. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. మరోవైపు.. సాధారణ సభ్యుడిగానే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాసులు రద్దు చేశారు. ఈ విషయాన్ని ఏపీ శాసనసభ అధికారులు వెల్లడించారు. అసెంబ్లీలో స్థలాభావం కారణంగా విజిటింగ్ పాసులు రద్దు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా విజిటింగ్ పాసులు ఇవ్వట్లేదని వెల్లడించారు. విజిటింగ్ పాసులు రద్దు చేయడంతో ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కూడా అసెంబ్లీలోకి వెళ్లే అవకాశం ఉండదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తమవారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రత్యక్షంగా చూసే అవకాశం వారి కుటుంబసభ్యులకు ఉండదన్నమాట.. అయితే, ప్రత్యక్ష ప్రసారాలు చూసుకునే అవకాశం ఉంటుంది.

సీఎం చంద్రబాబుకు పురంధేశ్వరి లేఖ..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.. పలు కీలక అంశాలను ఈ లేఖ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఏపీ బీజేపీ చీఫ్‌.. ఇసుక తవ్వకాలకు డిజిటల్ చెల్లింపులు జరిగేలా చేయాలని కోరిన ఆమె.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రమాణాలను పాటిస్తూ ఇసుక తవ్వకాలు జరగాలి.. భారీ మెషీన్లతో ఇసుక తవ్వకాలు జరపకూడదు అని సూచించారు.. ఇదే సమయంలో గత ఐదేళ్లలో జరిగిన ఇసుక తవ్వకాలపై విచారణ జరిపించాలని కోరారు.. టాటా, బిర్లాల ద్వారా శుద్ధి చేసిన ఇసుక 25 కేజీల బస్తాలలో అందించేలా చూడాలన్నారు.. మరోవైపు.. మద్య నియంత్రణ, క్వాలిటీ లిక్కర్ పై చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు పురంధేశ్వరి.. ఇప్పటి వరకూ ఉన్న డిస్టిలరీస్ పై విచారణ జరిపించాలి.. ముడి సరుకుల వినియోగం, లిక్కర్ తయారీ పై విచారణ జరగాలన్నారు. ఇథనాల్ కంటే సగం ఖర్చుతో లభించే సింథటిక్ ఆల్కహాల్ వినియోగంపై విచారణ జరగాలి.. కాలం చెల్లిన డిస్టిలేషన్, శుద్ధి యంత్రాల వినియోగం పరిశీలించాలి.. కలర్, ఫ్లెవర్ల కోసం సింథటిక్ కెమికల్స్ వినియోగంపై విచారణ చేయించాలి.. 6 నుంచీ 12 నెలలు చెక్క బ్యారెల్స్ లో నిల్వ ఉంచిన ఆల్కహాల్ ను బాటిళ్ళలో నింపేలా చూడాలి.. శాంపిల్స్ ను ప్రతీవారం నేషనల్ లేబొరేటరీలలో పరీక్షలు జరిపించాలి.. డిజిటల్ చెల్లింపులను పూర్తిస్ధాయిలో అమలు పరచాలి.. పరివర్తన తీసుకొచ్చేందుకు రిహేబిలిటేషన్ సెంటర్లను రాష్ట్రం అంతా ప్రారంభించాలి.. బలవంతంగా లీజుకు తీసుకున్న లిక్కర్ తయారీ కేంద్రాలను తక్కువ రేట్లకే తిరిగి తీసుకోవాలి.. బ్రూవరీస్ కార్పొరేషన్ లో కరప్షన్ పై విచారణ జరిపించాలి అంటూ సీఎం చంద్రబాబు దృష్టికి తన లేఖ ద్వారా తీసుకెళ్లారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి.

సీఎం చంద్రబాబుకు బీజేపీ నేతల మూడు విజ్ఞప్తులు
మాజీ సీఎం వైఎస్‌ జగన్ టార్గెటుగా పావులు కదుపుతోంది ఏపీ బీజేపీ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణాలను వెలికి తీయాలని చంద్రబాబుకు ఏపీ బీజేపీ విజ్ఞప్తి చేసింది.. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడు విజ్ఞప్తులు చేశారు బీజేపీ నేతలు.. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన మద్యం, ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరిపాలని ఏపీ సీఎంకు బీజేపీ బృందం విజ్ఞప్తి చేసింది.. ఇప్పటికే ఏపీలోని మద్యం, ఇసుక మాఫియాలపై కేంద్రానికి పురంధేశ్వరి ఫిర్యాదు చేసిన విషయం విదితమే.. మరోవైపు.. బీజేపీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కోరుతూ మరో విజ్ఞాపన ఇచ్చారు నేతలు.. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి గురువారం రాత్రి వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బీజేపీ ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చారు.. చంద్రబాబు నివాసానికి బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, పురంధరేశ్వరి, సీఎం రమేష్ వచ్చారు.. ప్రతీ ఒక్కరికీ బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు చంద్రబాబు. తన చేత్తో ప్రతీ ఒక్కరికీ ప్లేట్లు అందచేస్తూ అందరితో కలిసి భోజనం చేశారు.. ఎన్నికలు జరిగిన తీరు, అంతా కలసి కట్టుగా పడిన కష్టం గురించి చంద్రబాబు బీజేపీ నేతల మధ్య చర్చ సాగింది.. ఐదేళ్ల వైసీపీ వేధింపులను సుజనా చౌదరి ప్రస్తావించగా.. అన్ని వర్గాలు ఇందులో బాధితులే అన్నారు చంద్రబాబు.. అనపర్తిలో ఉపాధి హామీ నిధులు జోడించి కాల్వల మరమ్మతులు చేపట్టానని నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తెలిపగా.. నువ్వు ఎక్కడున్నా పని ప్రారంభించేస్తావంటూ అభినందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇలా చంద్రబాబు నివాసంలో ఆత్మీయ విందు ఆసక్తికరంగా సాగింది.

భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తాం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయవల్లే ఈరోజు బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. ఈ విషయంలో కార్యకర్తల కష్టార్జితం మరువలేనిదన్నారు. కార్యకర్తలతోపాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు. ఈరోజు హైదరాబాద్ వచ్చిన బండి సంజయ్ కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తదితరులతో కలిసి పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మీ అమ్మవారు చాలా పవర్ ఫుల్ అన్నారు. అమ్మవారి దయవల్లే ఆనాడు ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందన్నారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందంటే అమ్మవారి దయే. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తాం. మేం తెలంగాణలో గెలిచామంటే బీజేపీ కార్యకర్తల త్యాగాలే కారణమని, వారి కష్టార్జితమే అన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతోపాటు జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు. సామాన్య కార్యకర్తలమైన కిషన్ రెడ్డిని ఇవాళ కేంద్ర మంత్రులుగా ఉన్నామంటే.. బీజేపీ వల్లే సాధ్యమైందన్నారు. కార్పొరేటర్ కేంద్ర మంత్రి కావొచ్చని, చాయ్ వాలా ప్రధాని కావొచ్చని.. నిరూపించిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన బీజేపీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా మార్చి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేదాకా పోరాడతా అన్నారు. నా చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ కోసమే ధారపోస్తా అన్నారు.

పేపర్ లీక్ ఎఫెక్ట్.. యోగా దినోత్సవ ప్రోగ్రామ్ రద్దు చేసిన కేంద్ర విద్యామంత్రి
యూజీసీ- నీట్2024 పరీక్ష పేపర్ లీకేజీ కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థులతో కలిసి నిర్వహించే యోగా దినోత్సవాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విరమించుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ముందే విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శించారు. దీంతో ఆయన ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా, నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), యూజీసీ-నెట్‌కు సంబంధించిన పేపర్ లీకేజీలు ఇటీవలి తీవ్ర విమర్శలకు దారి తీశాయి. కాగా, గురువారం నాడు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. యూజీసీ-నెట్ ప్రశ్నపత్రం లీక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఎ) యొక్క “సంస్థాగత వైఫల్యం” అన్నారు. కేంద్ర సర్కార్ వేసిన ఈ కమిటీ ఎన్టీఏ యొక్క నిర్మాణం, పనితీరు, పరీక్షా ప్రక్రియ, పారదర్శకత, డేటా భద్రతా ప్రోటోకాల్‌లను మరింత మెరుగుపరచడానికి సిఫార్సులు చేస్తుందన్నారు. జీరో-ఎర్రర్ టెస్టింగ్ మాది.. నిబద్ధతతో కూడిన ప్యానెల్‌ను త్వరలో తుది నివేదిక ఇస్తుంది.. ఈ కమిటీలో నిపుణులు ఉన్నారు.. వారే అన్ని అంశాలపై లోతైన విచారణ చేసి రిపోర్ట్ అందజేస్తుందన్నారు. డార్క్‌నెట్‌లో పేపర్ లీక్ అయింది.. అలాగే, టెలిగ్రామ్‌లో సర్క్యులేట్ అవుతుందని మాకు రుజువులు దొరికాయి.. ఈ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

కాలిఫోర్నియాలోని జూనెటీన్త్ వేడుకలో మళ్లీ హింస.. 15 మందిపై కాల్పులు
అమెరికాలో జునెటీన్ వేడుకల్లో మరోసారి కాల్పుల ఘటన వెలుగు చూసింది. కాలిఫోర్నియాలోని ఓక్‌లాండ్‌లో 15 మందిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు గత శనివారం రాత్రి టెక్సాస్‌లోని రౌండ్ రాక్‌లో జూన్‌టీన్ వేడుకల్లో కాల్పులు జరిగాయి. దుండగుడు జనంపైకి కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు గాయపడ్డారు. లేక్ మెరిట్‌లో 5,000 మందికి పైగా హాజరైన కార్యక్రమంలో హింస చెలరేగిందని పోలీసులు గురువారం తెలిపారు. సరస్సు ఒడ్డున మోటార్‌బైక్‌లు, వాహనాల సైడ్‌షో జరిగే వరకు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఆ తర్వాత రోడ్డు పక్కన వాగ్వాదం జరగడంతో జనం గుమిగూడారు. ఈ సమయంలో అధికారిపై దాడి చేసినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మరో వ్యక్తి గాయపడ్డాడని ఓక్లాండ్ పోలీస్ చీఫ్ ఫ్లాయిడ్ మిచెల్ తెలిపారు. ఒక వాహనం హుడ్ మీదుగా వెళ్లినప్పుడు అందులో ఉన్నవారు బయటకు వచ్చి అతనిపై దాడి చేశారు. కాల్పులకు సంబంధించి ఎలాంటి అనుమానితులను అదుపులోకి తీసుకోలేదని మిచెల్ తెలిపారు. ఘటనా స్థలంలో 50కి పైగా బుల్లెట్ కేసింగ్‌లను దర్యాప్తు అధికారులు గుర్తించారు. బాధితుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. అధికారులు గుంపును చెదరగొట్టేందుకు ప్రయత్నించగా, పలువురు వ్యక్తులు అధికారులపై కూడా దాడి చేశారని పోలీసులు తెలిపారు.

స్విస్ బ్యాంకుల్లో భారీగా క్షీణించిన భారతీయ ఖాతాదారుల డిపాజిట్లు..
భారతీయులు, కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు 2023లో 70 శాతం తగ్గి కనిష్ట స్థాయి రూ.9,771 కోట్లకు (1.04 స్విస్ ఫ్రాంక్‌లు) చేరింది. ఈ డబ్బును స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల మొత్తం సంపద వరుసగా రెండో సంవత్సరం కూడా క్షీణించింది. ఇది 2021లో గరిష్ట స్థాయి 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు చేరుకుంది. క్షీణతకు ప్రధాన కారణం బాండ్లు, సెక్యూరిటీలు, వివిధ ఆర్థిక సాధనాల ద్వారా నిల్వ చేయబడిన సంపద తగ్గిపోవడమని నివేదికలు చెబుతున్నాయి. అదనంగా, కస్టమర్ డిపాజిట్ ఖాతాలలో డిపాజిట్లు, భారతదేశంలోని ఇతర బ్యాంకు శాఖల ద్వారా నిర్వహించబడే నిధులు కూడా గణనీయంగా తగ్గాయి. అయితే తాజాగా విడుదలైన స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక డేటాలో కీలక విషయాలు బయటపడ్డాయి. స్విస్‌ బ్యాంకుల్లో విదేశీ ఖాతాదారుల నిధుల నిల్వల్లో బ్రిటన్‌ అగ్రస్థానంలో ఉండగా, అమెరికా రెండో స్థానంలో ఉంది. అయితే స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు ఈ డేటా చెబుతోంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2023లో దాదాపు 25 శాతం పడిపోయి రూ.63 కోట్లకు చేరాయి. ఈ డిపాజిట్లు 2022లో 18 శాతం పెరగగా, 2021లో 8 శాతానికిపైగా పడిపోయాయి. 2007 చివరి నాటికి స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్ల విలువ రూ. 9,000 కోట్లతో గరిష్ఠ స్థాయికి చేరింది. స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల డేటా, వ్యక్తులు,సంస్థల డిపాజిట్లు, వివిధ బ్యాంకుల్లో నిల్వలు సహా స్విస్ బ్యాంకుల్లోని భారతీయ ఖాతాదారుల అన్ని రకాల నిధులను పరిగణనలోకి తీసుకుని ఈ గణాంకాలను వెల్లడించారు. బాండ్లు, సెక్యూరిటీలు ఇలా భారతీయుల నిల్వలు భారీగా పడిపోయాయని,కస్టమర్ డిపాజిట్ ఖాతాల్లోని మొత్తం నిధులు కూడా గణనీయంగా తగ్గాయని తాజా డేటా వివరించింది. 2023లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిధులు రూ.9,771 కోట్లకు పడిపోయినట్లు తెలిపింది.

వారి వలనే ఈ విజయం: రోహిత్
అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం విజయంలో కీలక పాత్ర పోషించిందని భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. జస్ప్రీత్ బుమ్రా సత్తా ఏంటో అందరికీ తెలిసిందే అని, ఎప్పుడైనా సరే బాధ్యత తీసుకొని జట్టుకు అండగా నిలుస్తాడని ప్రశంసించాడు. ప్రత్యర్థిని బట్టి తుది జట్టులో మార్పులు ఉంటాయని రోహిత్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్‌ 2024 సూపర్‌-8లో భాగంగా గురువారం అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ‘గత రెండేళ్లుగా విండీస్‌లో కొన్ని టీ20 మ్యాచ్‌లు ఆడాం. ఆ అనుభవంతో పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలను రూపొందించాం. పిచ్ కండిషన్స్‌ను ఉపయోగించుకున్నాం. మా బౌలింగ్ దళం గురించి మాకు బాగా తెలుసు. మేం విధించిన లక్ష్యాన్ని డిఫెండ్ చేయగలమని అనుకున్నాం. జట్టులో ప్రతీ ఒక్కరు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. మిడిలార్డర్‌ బ్యాటర్లు గొప్ప పరిణతి చూపించారు. సూర్యకుమార్-హార్దిక్ పాండ్య భాగస్వామ్యం చాలా కీలకం. చివరి వరకూ ఒక బ్యాటర్‌ క్రీజ్‌లో ఉండాలనుకున్నాం’ అని రోహిత్ తెలిపాడు. ‘బుమ్రా సత్తా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు కోసం అతడు ఏమి చేయగలడో మాకు తెలుసు. ఎక్కడ ఆడినా బాధ్యత తీసుకొని జట్టుకు అండగా నిలుస్తాడు. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడంపై చర్చించుకున్నాం. ప్రత్యర్థిని బట్టి తుది జట్టులో మార్పులు ఉంటాయి. ఇక్కడ ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం సరైన నిర్ణయమే. ఒకవేళ పిచ్‌ పేసర్లకు అనుకూలంగా ఉంటే.. వారినే తీసుకుంటాం. జట్టు అవసరాలకు తగ్గట్టుగా అందరూ సిద్ధంగా ఉంటారు’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. సూర్యకుమార్‌ (53) హాఫ్ సెంచరీ చేయగా.. బుమ్రా (3/7) మూడు వికెట్స్ తీశాడు.

వామ్మో.. రాధిక ధరించిన ఈ నెక్లేస్ ధర అన్ని కోట్లా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ గురించి అందరికీ తెలుసు.. ఆయన ఇంట్లో ఫంక్షన్ అంటే మామూలు విషయం కాదు.. ముకేశ్ చిన్న కుమారుడు అనంత అంబానీ రెండవ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫారెన్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీలో అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ ఆ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఆమె ధరించిన ప్రతిదీ ప్రత్యేకమే.. అందరి చూపు ఆమె పైనే పడ్డాయి.. సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. రాధిక తన ప్రీ వెడ్డింగ్ పార్టీలో మొదటి రోజు బ్లూ కలర్ డ్రెస్సులో మెరిసింది.. ఆ డ్రెస్సుకు మ్యాచింగ్ నెక్లెస్ ధరించింది. ఆమె లోరైన్ స్క్వార్ట్జ్ వజ్రాలతో రూపొందించిన అరుదైన నీలం రంగు ఒపల్ నెక్లెస్ వేసుకోవడం వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బ్లూ ఒపల్ రాధిక బర్త్ స్టోన్.. అంటే బర్త్‌స్టోన్ అనేది ఒకరి పుట్టిన కాలాన్ని సూచించే రత్నం. అయితే వజ్రాలు అనంతాన్ని సూచిస్తాయి.. అది చాలా ఖరీదైనది.. వారి లగ్జరీ లైఫ్ కు తగ్గట్లే ఆ నెక్లేస్ ను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.. అందుకే అది చాలా స్పెషల్ గా నిలిచింది.. ఆ నెక్లేస్ ధర కోట్లల్లో ఉంటుందని తెలుస్తుంది.. ఇక రాధిక మర్చంట్‌ అనంత్ అంబానీ ఇచ్చిన లవ్ లెటర్ ప్రింట్ చేసిన గౌను ధరించింది. తనకు 22 ఏళ్ల వయసులో అనంత్ అంబానీ ఈ లెటర్ ఇచ్చారని రాధిక పార్టీలో చెప్పారు. అనంత్ పుట్టినరోజు సందర్భంగా ఆమె కోసం ఈ ప్రేమలేఖ రాశాడు.. ఈ లెటర్ ను ప్రత్యేకంగా దాచుకున్నారు.. ఈ లెటర్ నా తర్వాత తరాలకు చెప్పాలని ఆమె అందరి ముందు చెప్పింది.. వీరి వివాహం జూలై 12 న జరగబోతుంది.. ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టిన అంబానీ ఇక పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారో అని పెద్ద చర్చలే జరుగుతున్నాయి..

కాజల్ బర్త్ డే.. ఫ్యాన్స్ చేసిన ఆ పనికి ఎమోషనల్ అయిన కాజల్..
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ..ఈ భామ తెలుగు ,తమిళ్ ,హిందీ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.టాలీవుడ్ కాజల్ కెరీర్ దూసుకుపోతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూనీ పెళ్లి చేసుకొని ఫామిలీ లైఫ్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామ గత ఏడాది నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన “భగవంత్ కేసరి” సినిమాలో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ భామకు వరుసగా ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.అయితే పెళ్ళికి ముందు గ్లామర్ పాత్రలతో అలరించిన కాజల్ ఇప్పుడు పెర్ఫార్మన్స్ రోల్స్ చేయాలనీ భావిస్తుంది. దానిలో భాగంగా ఈ భామ రీసెంట్ గా సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించింది.ఈ సినిమాలో కాజల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.రీసెంట్ గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చిన కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం కాజల్ ఇండియన్ 3 ,కన్నప్ప వంటి భారీ సినిమాల్లో నటిస్తుంది.ఆ సినిమాల్లో కాజల్ దీ కేవలం అతిధి పాత్రే అని తెలుస్తుంది.ఇదిలా ఉంటే జూన్ 19 కాజల్ బర్త్డే సందర్భంగా ఆమె అభిమానులు మంచి పనులు చేసారు.తమ అభిమాన హీరోయిన్ బర్త్ డే సందర్భంగా సుమారు 150 మంది పేద పిల్లలకు భోజనాలు పంపిణి చేసారు.అలాగే 50 మొక్కలను కూడా నాటారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన కాజల్ ఎంతో ఎమోషనల్ అయింది.నాపై మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఎప్పటికి మర్చిపోలేను మీ అందరికి ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది.