NTV Telugu Site icon

Top Headlnes @ 9 AM : టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు గ్రూప్‌-1 డిమాండ్లపై ప్రభుత్వం సమగ్ర ప్రకటన.. అభ్యర్థుల్లో టెన్షన్..

గ్రూప్‌-1 పరీక్షల రద్దుపై తెలంగాణ రాజకీయం హీటెక్కింది. జీవో 29ను రద్దు చేయాలంటూ గ్రూప్‌-1 అభ్యర్థులు ఆందోళన కొనసాగుతోంది. ఒకవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద బీఆర్ఎస్ మరోవైపు అశోక్ నగర్ వద్ద బీజేపీ ఆందోళనతో రణరంగంగా మారింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ను రద్దు చేయాలని అభ్యర్థులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. చివరకు గ్రూప్ -1 అభ్యర్థులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ సమావేశమయ్యారు. గ్రూప్ 1 రద్దు చేయాలని మంత్రులను అభ్యర్థులు కోరారు. మంత్రుల గ్రూప్‌ 1 అభ్యర్థుల డిమాండ్లపై చర్చించారు. గ్రూప్‌1 అభ్యర్థుల డిమాండ్లపై నేడు ప్రభుత్వం సమగ్ర ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. మరి గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తారా? లేక రేపటి నుంచి అంటే (సోమవారం 21) నుంచి అనుకున్న విధంగానే పరీక్షలు కొనసాగిస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒక వేళ గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తే ఇప్పటికే దాదాపు 90 శాతానికి పైగా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్న అభ్యర్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.. రేపటి నుంచి (సోమవారం 21) నుంచి గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేస్తే మిగతా 10శాతం మంది అభ్యర్థులు అనుకున్నది సాధించినట్లే. దీనివల్ల 90 శాతం మంది నష్టపోతే 10 శాతం మందికి మాత్రమే ఫలితం ఉంటుంది. మరి దీనిపై 90 శాతం అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇన్ని రోజులుగా గ్రూప్ 1 పరీక్షలు ప్రిపరేషన్ అయి ఇప్పుడు తీరా పరీక్షలు రాసే సమయంలో వాయిదా వేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం ఇచ్చే తీర్పులు భవిష్యత్ ఉంటుంది.

 

ఆన్‌లైన్‌లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. తిరుమలలో శ్రీవారి దర్శనానికి.. వివిధ సేవలకు సంబంధించిన టికెట్లకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది.. ఇప్పటికే ఈ ఏడాది ఆర్జిత సేవా టికెట్ల కోటా పూర్తి కాగా.. ఆన్‌లైన్‌లో జనవరి నెల ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. లక్కీడిప్‌ విధానంలో ఆర్జిత సేవా టికెట్ల కేటాయింపు జరగనుంది. రేపు ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ విధానంలో ఆర్జిత సేవా టికెట్లను కేటాయించనున్నారు. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ వెల్లడించింది.. ఇక, నిన్న శ్రీవారిని 80,741 మంది భక్తులు దర్శించుకున్నారు.. 31,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లుగా ప్రకటించింది టీటీడీ.

 

ప్రేమపేరుతో పెట్రోల్ పోసి నిప్పు.. చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి
ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై పెట్రోల్‌పోసి నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన వైఎస్‌ఆర్‌ కడప జిల్లా బద్వేల్‌లో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బద్వేల్ పట్టణంలో ప్రేమ పేరుతో యువకుడి చేతిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. బద్వేల్ సమీపంలోని పీపీ కుంట వద్ద ఉన్న సెంచరీ ప్లై వుడ్ కంపెనీ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి విఘ్నేష్ అనే యువకుడు నిప్పటించాడు. ఈ ఘటనలో దాదాపు 80 శాతం కాలిపోయిన విద్యార్థినిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే. బద్వేల్ పట్టణంలోని రామాంజనేయ నగర్ లో నివాసం ఉంటున్నారు దస్తగిరమ్మ కుటుంబం. అదే కాలనీ అదే వీటికి చెందిన విఘ్నేష్ అనే యువకుడు గత కొంతకాలంగా దస్తగిరమ్మను ప్రేమిస్తున్నాను అంటూ వేధించేవాడు. ఇదే విషయమై పలుసార్లు దస్తగిరమ్మ తల్లిదండ్రులు విఘ్నేష్‌ను మందలించారట. అటు తరువాత మరో అమ్మాయిని ప్రేమ పేరుతో లేపుకుపోయి వివాహం చేసుకున్నాడు. ఒకపక్క ఒక అమ్మాయిని ప్రేమిస్తూ మరో పక్క మరో అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు. ఆరు నెలల క్రితం విమల అనే అమ్మాయిని ప్రేమ పేరుతో లేపుకుపోయి వివాహం చేసుకున్నాడు విఘ్నేష్.. అంతటితో ఆగకుండా బద్వేల్ పట్టణం లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దస్తగిరమ్మ అనే బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ నీవు లేకుంటే నేను బ్రతకలేను అని బెదిరించేవాడు . శుక్రవారం,శనివారం నేను నీతో మాట్లాడాలి రా అంటూ బాలికను బెదిరించడం తో అతనితోపాటు అడవిలోకి వెళ్ళింది.అడవిలోకి తీసుకెళ్లి తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆ బాలికపై ఒత్తిడి తెచ్చాడు. నీకు వివాహం అయ్యింది ఆరు సంవత్సరాల తర్వాత ఆమెను వదిలేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆ బాలిక చెప్పడంతో ఆగ్రహ వేషానికి లోనైన విఘ్నేష్ ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతూ మైనర్ బాలిక ప్రాణాలు విడిచింది.

 

మహారాష్ట్రలో 250సీట్లపై ఎన్సీపీ శివసేనతో బీజేపీ చర్చలు పూర్తి.. త్వరలోనే ప్రకటన
మహారాష్ట్రలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకాల ఏర్పాట్లపై చర్చించడానికి శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన తర్వాత, చర్చలు చివరి దశలో ఉన్నాయని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శనివారం చెప్పారు. మొత్తం 288 సీట్లకు గాను 30-35 సీట్లపై మాత్రమే ఇంకా అంగీకారం కుదరలేదని చెప్పారు. సీట్ల పంపకంపై ఒకట్రెండు రోజుల్లో తుది ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు. షిండే మాట్లాడుతూ, “అమిత్ షాతో మా చర్చలు సానుకూలంగా ఉన్నాయి. విబేధాలు సద్దుమణిగాయని, ఎలాంటి సమస్యలు లేకుండా చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు. తుది చర్చలు పెండింగ్‌లో ఉన్న 30-35 స్థానాలు మాత్రమే ఉన్నాయి. అవసరమైతే మరోసారి వారితో చర్చలు జరిపి ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేస్తాం’’ అన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం కూడా రాష్ట్రంలోని ప్రముఖ నాయకులతో సుమారు 160 స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించింది. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అధికార వ్యతిరేక వాతావరణాన్ని తగ్గించేందుకు 30 నుంచి 40 శాతం మంది ఎమ్మెల్యేల టిక్కెట్లను రద్దు చేయాలని నిర్ణయించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో బీజేపీ వాటాలో పడే దాదాపు 160 సీట్ల పేర్లపై కేంద్ర నాయకత్వం చర్చించింది. 100 మందికి పైగా అభ్యర్థుల పేర్లను పార్టీ ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొన్ని సీట్లను వ్యూహాత్మకంగా నిలిపివేశారు. మిగతా పార్టీల అభ్యర్థులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. మిత్రపక్షాలతో ఒకటి రెండు సీట్లు ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంది. మిత్రపక్షాలను సంతృప్తి పరిచేలా గత సారి పోటీ చేసిన 164 స్థానాల్లో కొన్ని స్థానాల్లో బీజేపీ మార్పులు చేర్పులు చేయవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. శివసేన (షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం)లకు ఇచ్చే సీట్లపై కూడా ఏకాభిప్రాయం కుదిరింది. అయితే ఇంకా ప్రకటించలేదు. కేంద్ర నాయకత్వానికి అందిన అంతర్గత నివేదికలో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలపై అధికార వ్యతిరేక వాతావరణం నెలకొని ఉందని, అయితే పార్టీలో తిరుగుబాటు భయంతో 30లోపు టికెట్లు తెగే అవకాశం ఉందని భావిస్తున్నారు. 40 శాతం వరకు. తొలి జాబితా విడుదలకు ముందు పార్టీ మరికొన్ని సమీకరణాలను పరిశీలిస్తుంది. బుధవారం జరిగిన సమావేశంలో అభ్యర్థులను నిర్ణయించిన స్థానాల్లో దాదాపు 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓడిపోయిన కొన్ని స్థానాలకు అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేశారు.

 

2028లోపు మళ్లీ ముఖ్యమంత్రి అవుతాను… జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి జోస్యం
కేంద్ర ఉక్కు మంత్రి, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి శనివారం కర్ణాటక ముఖ్యమంత్రి పదవి పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. 2028లోపు తాను మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రిని అవుతానని ఆయన ప్రకటించారు. తాను ప్రవక్తను కాదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2028 వరకు కొనసాగడం ఖాయం. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసంతృప్తితో రాష్ట్ర ప్రభుత్వం పతనం కానుందని కుమారస్వామి జోస్యం చెప్పారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి మాండ్యాలో విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటకకు సంబంధించి ఈ జోస్యం చెప్పారు. ఈ ప్రభుత్వం 2028 వరకు కొనసాగడం ఖాయం. ప్రజలు నాకు మరోసారి అవకాశం ఇస్తారని, మళ్లీ నేనే ముఖ్యమంత్రిని అవుతానన్న నమ్మకం ఉంది. కర్ణాటకలోని మాండ్యాకు చెందిన ఎంపీ మాట్లాడుతూ.. ‘2028లోపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుంది. నేను ప్రవక్తను కాను, కానీ ఈ మాట చెబుతున్నాను’ అని జేడీఎస్ నాయకుడు ‘ప్రజలు కోరుకుంటే నేను ఎందుకు ముఖ్యమంత్రిని కాను? ఇప్పటికైనా నాకు ఐదేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. హెచ్‌డి కుమారస్వామి 2006 – 2007 మధ్య, 2018 – 2019 మధ్య రెండుసార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి హెచ్‌డి దేవెగౌడ దేశ మాజీ ప్రధాని. కుమారస్వామి మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కనకపుర నుంచి గెలిచి తొలిసారి ఎంపీ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో, హెచ్‌డి కుమారస్వామి కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానం నుంచి 2,84,620 ఓట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేశారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రామన్ గౌడ్‌పై ఆయన విజయం సాధించారు. హెచ్‌డి కుమారస్వామికి మొత్తం 851,881 ఓట్లు వచ్చాయి.

 

బస్సు-టెంపో ఢీ.. చిన్నారులు సహా 11 మంది మృతి
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ స్లీపర్ కోచ్ బస్సు టెంపోను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 11 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. మృతుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. బారీ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని NH 11Bలోని సునిపూర్ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. టెంపోలో ప్రయాణిస్తున్న వారందరూ బారీ నగరంలోని గుమత్ మొహల్లా నివాసితులు. వీరంతా బరౌలి గ్రామంలో భాత్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. కరౌలి-ధోల్‌పూర్ హైవే (NH 11B)పై సునిపూర్ గ్రామ సమీపంలో స్లీపర్ కోచ్ బస్సు టెంపోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంకా పలువురికి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

 

ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో వీధుల్లోకి వచ్చిన వేలాది మంది ముస్లింలు
ఫేస్‌బుక్‌లో ప్రవక్తపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో ఉన్న బుధానా పట్టణంలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిఖిల్ త్యాగి అనే యువకుడు చేసిన ఈ వ్యాఖ్యతో ఆగ్రహించిన ముస్లిం సంఘాలు వేలాదిగా వీధుల్లోకి రావడంతో పెద్ద దుమారం మొదలైంది. ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ బలగాలను మోహరించారు. అంతేకాకుండా జిల్లా ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఉద్రిక్త వాతావరణముకు సంబంధించి ముజఫర్‌నగర్ పోలీసులు నిందితుడు నిఖిల్ త్యాగిని అరెస్ట్ చేశారు. ఈ విషయమై జమియత్‌ ఉలేమా ఏ హింద్‌ నగర అధ్యక్షుడు ఆస్‌ మహ్మద్‌ తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యల్లో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముజఫర్‌నగర్ ఎస్‌ఎస్పీ అభిషేక్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బహ్రైచ్‌లో దుర్గా విగ్రహం నిమజ్జనం సందర్భంగా హింస చెలరేగింది. ఈ సమయంలో రామ్ గోపాల్ మిశ్రాపై కాల్పులు జరిపిన నిందితులను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. నిందితులు రింకూ సర్ఫరాజ్ ఖాన్, తాలిబ్ నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించగా వారిద్దరినీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఇంకా అక్కడ విషయం సంబంధించి వాతావరణం శాంతించలేదు. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కష్టపడి పరిస్థితిని అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నామ్ చేసారు. కానీ, ఇప్పటికీ పరిస్థితి మునుపటిలా కనిపించడం లేదు. బాధిత కుటుంబం కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసినా న్యాయం పట్ల సంతృప్తి చెందలేదు.

 

బెంగళూరు టెస్టు డ్రా లేదా ఓడిపోయినా టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‭కు చేరుకుంటుందా?
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ప్రస్తుతం మొదటి మ్యాచ్ జరుగుతోంది. అక్టోబర్ 16 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమైంది. నేడు (అక్టోబర్ 20) మ్యాచ్ ఐదో రోజు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఎదురుదాడి చేసి 462 పరుగులు చేసింది. దాంతో న్యూజిలాండ్‌కు 107 పరుగుల లక్ష్యం లభించింది. ఈ మ్యాచ్‌లో మొదటి రోజు వర్షం కారణంగా రద్దవగా.. నాలుగో రోజు కూడా వర్షం అంతరాయం కలిగింది. ఈరోజు (అక్టోబర్ 20) కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. కాగా, బెంగళూరు టెస్టు మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే అంచనా వేసింది. ఈ పరిస్థితిలో, ఈ మ్యాచ్ వర్షంతో ఆగిపోతే.. అంటే డ్రా అయినట్లయితే ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ రేసు నుండి భారత జట్టు ఔట్ అవుతుందా అనే ప్రశ్న చాలా మందిలో ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ భారత జట్టు ఓడినా.. భారత్ అవకాశాలపై ప్రభావం పడుతుందా? అనే విషయాలను ఒకసారి చూద్దాం. ఈ మ్యాచ్ వర్షం కారణంగా జగకపోతే, ఈ మ్యాచ్ డ్రాగా పరిగణించబడుతుంది. దీన్ని బట్టి ఫైనల్ చేరే మార్గం భారత జట్టుకు కాస్త కష్టంగా అనిపించవచ్చు. బెంగళూరులో ఓడిపోతే తదుపరి మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. ప్రస్తుతం భారత జట్టు WTC పాయింట్లలో 74.24 శాతంతో అగ్రస్థానంలో ఉంది. 62.5 శాతంతో విజయాల శాతంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. బెంగళూరు టెస్ట్ తర్వాత, ఈ WTC సీజన్ 2023-25లో భారత జట్టు మరో 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఈ టెస్ట్ డ్రా లేదా ఒదిన తర్వాత, భారత జట్టు తన మిగిలిన 7 మ్యాచ్‌లలో కనీసం 3 గెలవవలసి ఉంటుంది. 4 మ్యాచ్‌లు గెలిస్తే స్థానం దాదాపు ఖాయం. 3 టెస్టులు గెలిచిన పక్షంలో, భారత్ వేరే జట్టు గెలుపు లేదా ఓటమిపై ఆధారపడాల్సి రావచ్చు. భారత జట్టు తన తదుపరి 7 మ్యాచ్‌లు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మాత్రమే ఆడాలి. ఇందులో ప్రస్తుత సిరీస్‌లో మిగిలిన అంటే చివరి 2 మ్యాచ్‌లు కివీ జట్టుతో ఆడాల్సి ఉంటుంది. ఆపై ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరగనుంది.