NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. కూల్చిన ప్రజావేదిక నుంచే స్టార్ట్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. సమీక్ష నిర్వహించిన ఆయన.. ఇప్పుడు అమరావతి రాజధానిపై ఫోకస్‌ పెట్టనున్నారు.. అందులో భాగంగా ఈ రోజు రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. మొత్తంగా తన రెండో క్షేత్ర స్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టబోతున్నారు.. వైఎస్‌ జగన్ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను ప్రారంభించనున్నారు సీఎం.. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి. ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని కూడా సందర్శించనున్నారు.. సిడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయ మూర్తుల గృహ సముదాయాలను పరిశీలించబోతున్నారు. ఇక, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలు పెట్టిన సైట్లను పరిశీలించబోతున్నారు సీఎం చంద్రబాబు. ఐదేళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసిన గత ప్రభుత్వం.. భవనాలను పట్టించుకోలేదు.. 70, 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం నాటి వైసీపీ ప్రభుత్వం వదిలేసిందనే విమర్శలు ఉన్నాయి.. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటి వైసీపీ సర్కార్ ఆయన్ని అడ్డుకుంది.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని కూటమి అందుకుంది.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు.. దీంతో.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేడు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

వరుసగా రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమీక్షలు..
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రితో పాటు తనకు కేటాయించిన మంత్రిత్వశాఖల బాధ్యతలను బుధవారం రోజు చేపట్టిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. తొలిరోజే బిజీబిజీగా గడిపారు.. వరుసగా శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. నిన్న ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖల HODలతో సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం.. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఇక, ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులపై అధికారుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకుని డిప్యూటీ సీఎం.. అన్నీ నోట్ చేసుకున్నారు. అలాగే, ఆయా శాఖల్లో కార్యాచరణపై మరోమారు త్వరలోనే సమీక్ష సమావేశాలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుందామని అధికారులతో చెప్పారు. ఇక, వరుసగా రెండో రోజూ సమీక్షలకు సిద్ధం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు పవన్‌ కల్యాణ్‌.. మరోవైపు.. నిన్న బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి ఫైల్‌పై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన రెండో ఫైల్ పై సంతకం చేసిన విషం విదితమే.. అంతేకాదు.. ఉపాధి హామీ కూలీల వేతనాల చెల్లింపుల్లో ఆలస్యానికి కారణం ఎవరు? పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? స్థానిక సర్పంచ్‌లకు వాటిపై నియంత్రణ లేకపోతే ఎలా? ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు ఎందుకు ఇవ్వట్లేదు? అని సమీక్ష సమావేశంలో ప్రశ్నించారట డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.

బాధ్యతలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్.. కార్మికుల కష్టాలు తీరుస్తా
ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మరికొందరు మంత్రులు పదవీ బాధ్యతలు స్వీకరించగా.. మిగతావారు కూడా బాధ్యతలు స్వీకరించే పనిలోపడిపోయారు.. ఇక, ఈ రోజు సచివాలయంలోని 5వ బ్లాక్ లో వేద పండితులు ఆశీర్వచనాల మధ్య కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తాం అన్నారు. కార్మిక శాఖలో ఒక కార్మికుడిలా పని చేస్తా.. కార్మికుల హక్కుల పరిరక్షిస్తా.. కార్మికుల కష్టాలు తీరుస్తా అన్నారు.. ఇక, వైసీపీ ప్రభుత్వం 2019 నుండి 1.25 కోట్ల మంది కార్మికులకు మాత్రమే బీమా సదుపాయం కల్పించింది.. కానీ, చంద్రన్న పాలనలో కార్మికులు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. వైసీపీ పాలనలో కార్మికులకు చెందాల్సిన మూడువేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపించారు.. కార్మికుల సంక్షేమం వైసీపీ పట్టించుకోలేదన్న ఆయన.. 13 పథకాల రద్దు ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఇసుక లభ్యత లేక పోవడంతో భవన నిర్మాణ కార్మికులు అనేక కష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు మంత్రిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.

నేడు కలెక్టర్లతో మంత్రి కోమటి రెడ్డి సమావేశం.. రోడ్ల మరమ్మతులపై చర్చ
నేడు సెక్రటేరియట్ లో పలువురు కలెక్టర్లతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల ప్రతిపాదనలు, త్రిబుల్ ఆర్ భూసేకరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. కాగా.. మంత్రి కోమటిరెడ్డి నిన్న తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్లు, సిఆర్ఐఎఫ్ రోడ్లు, పనుల పురోగతులపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ ను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చారన్నారు. మూడున్నర ఏళ్లలో RRR పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తులు చేయాలని అదేశించామని వెల్లడించారు. విజయవాడ రోడ్డు అనగానే డెత్ రోడ్డు అనే పేరు ఉందన్నారు. డిసెంబర్ లోపు సిక్స్ లైన్ రోడ్డు పనులను మొదలు పెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. నేటి నుంచి ఫుల్ టైం యాక్షన్ లోకి దిగుదామని, కేంద్రం నుంచి నిధులు తెస్తామన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

విమానానికి తప్పిన ప్రమాదం.. ఇంజిన్ లో మంటలు..
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ అయినా 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్ లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. పైలట్‌ మంటలను గుర్తించడంతో ప్రయాణికులు సేఫ్ గా బయట పడ్డారు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అధికారులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ మలేషియా మలేషియా ఎయిర్లైన్స్ విమానం బయలుదేరేందుకు సిద్దమైంది. విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే చెకింగ్‌ అనంతరం పైలట్‌ టేకాఫ్‌ చేశాడు. అయితే టేకాఫ్ అయిన 15నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌ లో మంటలు చెలరేగాయి. అయితే మంటలను గమనించిన పైలట్‌ వెంటనే అలర్ట్‌ అయ్యాడు. మంటలను గుర్తించి వెంటనే పైలట్ లాండింగ్ కి అనుమతి కోరాడు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని సమాచారం ఇచ్చారు. అందరూ కదలకుండా కూర్చోవాలని తెలిపాడు. మంటలను గమనించిన ప్రయాణికులు భయాదోళన చెందారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎవరి సీట్లల్లో వారు కూర్చొని వున్నారు. అయితే ల్యాండింగ్‌ కు అనుమతి కోసం పైలట్‌ కోరడంతో అలర్ట్‌ అయిన ఏటీసీ అధికారులు కొద్దిసేపు పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు.

నేటి నుంచి రెండ్రోజుల పాటు జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోడీ పర్యటన..
నేడు ( గురువారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జమ్మూ అండ్ కశ్మీర్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో ‘ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, జమ్మూ-కశ్మీర్‎లో పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు ఆయన చేయనున్నారు. వ్యవసాయరంగానికి పెద్దపీట వేసే క్రమంలో వాటికి సంబంధించిన అనుబంధ రంగాల ప్రాజెక్టులను ఓపెనింగ్ చేస్తారని పీఎంఓ తెలిపింది. అలాగే, రేపు (జూన్ 21న) ఉదయం 6.30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఇక, జమ్ము, కశ్మీర్ అభివృద్దితో పాటు తన పర్యటనకు సంబంధించిన అంశాలపై ప్రసంగిచే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సామూహిక యోగా సెషన్‎లో పాల్గొని యోగా యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేయనున్నారు.

సామాన్యులకు కేంద్రం మరో షాక్.. భారీగా పెరగనున్న ట్యాబ్లెట్ల ధరలు..!
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్య ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. ట్యాబ్లెట్స్ ధరలను పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొనింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) డయాబెటిస్, బీపీ సహా 54 రకాల ఔషధాల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎక్కువ మంది బీపీకి వినియోగించే టెల్మిసార్టన్, క్లోర్తాలిడోన్, సిల్నిడిపైన్ కలిపిన మాత్రలు రిటైల్ ధర ఒక్కో టాబ్లెట్‌కు రూ.7.14గా నిర్ణయించారు.. సిప్రోఫ్లోక్సాసిన్ యాంటీ బాక్టీరియల్ ఇంజక్షన్ ధర మిల్లీలీటర్ (మి.లీ)కు రూ.0.23గా మోడీ సర్కార్ సవరించింది. అధికంగా వినియోగించే మెటా ఫార్మిన్, లినాగ్లిస్టిన్, సిటాగ్లిస్టిన్ రేట్లను ట్యాబ్లెట్ కు రూ.15 నుంచి రూ.20కు పెంచుతున్నట్లు సెంట్రల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రోఫ్లోక్సాసిన్, కాల్షియం, విటమిన్ డీ3 పిల్స్ ధరలు సైతం భారీగా పెరిగాయి. ఇక, కొలెస్ట్రాల్‌కు చికిత్స కోసం వినియోగించే అటోర్వాస్టాటిన్, ఆస్పిరిన్ కలయిక క్యాప్సూల్స్ రిటైల్ రేట్లను కూడా ఎన్‌పీపీఏ పెంచుతున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు భారంగా మారనుంది. క్యాల్షియం, విటమిన్ డి3 ట్యాబ్లెట్ల ధరను ఒక్కో టాబ్లెట్‌కు రూ.7.82గా నిర్ణయించడంతో పాటు యూరో హెడ్ ప్లాస్టిక్ బాటిళ్లతో కూడిన 500 ఎంఎల్ గ్లూకోజ్ ప్యాక్ ధర రూ.0.24గా ఫిక్స్ చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, NPPA నిర్ణయం మేరకు.. మధుమేహం, రక్తపోటు, గుండె సమస్యలు, మల్టీవిటమిన్‌లు, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలకు సంబంధించిన ట్యాబ్లెట్స్, ఫార్ములేషన్‌లకు రేట్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం సవరించింది.

నేడు సూపర్‌-8లో భారత్‌ తొలి మ్యాచ్‌.. అఫ్గానిస్తాన్‌తో కీలక పోరు! జడేజాపై వేటు
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం తన తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. గ్రూప్‌ దశ ఫామ్‌ను భారత్ కొనసాగించి.. సూపర్‌-8లో శుభారంభం చేయాలని చూస్తోంది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్‌ అంటే విజయం నల్లేరుపై నడకే అనుకుంటాం. అఫ్ఘనులను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో మనం చూశాం. కివీస్‌ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ సేన జాగ్రత్తగా ఆడాల్సిందే. బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా భారత్‌, అఫ్గానిస్తాన్‌ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభం అవుతుంది. గ్రూప్‌ దశలో భారత్ విజయాలు సాధించినా విరాట్ కోహ్లీ వైఫల్యం ఆందోళన కలిగిస్తోంది. 1, 4, 0 గ్రూప్‌ దశలో విరాట్ స్కోర్లు ఇవి. దాంతో కీలక సూపర్‌-8లో విరాట్‌ పెద్ద ఇన్నింగ్స్‌ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రోహిత్‌ శర్మతో కలిసి విరాట్ ఎలాంటి ఆరంభం అందిస్తాడన్న దానిపైనే మ్యాచ్‌ గమనం ఆధారపడి ఉంటుంది. రిషబ్ పంత్, సూర్యకుమార్‌లు ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. మిడిలార్డర్లో దూబె, హార్దిక్‌ కీలకం. అక్షర్ రాణిస్తున్నా.. జడేజా ఇప్పటివరకు ప్రభావం చూపలేదు. దాంతో కాబట్టి స్పెషలిస్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ను ఆడిస్తే జట్టుకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేస్‌ ద్వయం బుమ్రా, అర్ష్‌దీప్‌లపై భారీ అంచనాలున్నాయి. సిరాజ్‌ ఫామ్ అందుకంటే టీమిండియాకు ఎదురుండదు.

ఆ సినిమా టికెట్‌ కోసం కొన్ని వారాల పాటు ఎదురు చూశా!
‘షోలే’ సినిమా టికెట్‌ కోసం తాను కొన్ని వారాల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని లోకనాయకుడు కమల్‌హాసన్‌ తెలిపారు. అప్పట్లో షోలే సినిమాని చూసిన అభిమానులకంటే ఎక్కువగా.. ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ని చూస్తారన్నారు. బుధవారం ముంబైలో కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన కమల్‌హాసన్‌.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన షోలే చిత్రం 1975 విడుదలై ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఇందులో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్‌ లీడ్‌ రోల్స్‌లో నటించారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో రానా హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ సినిమా తొలి టికెట్‌ను అమితాబ్‌కు అశ్వినీదత్‌ అందించగా.. బిగ్‌బీ నగదు చెల్లించి తీసుకున్నారు. ఈ టికెట్‌ను ఇవ్వాలనుకుంటే.. ఎవరికి ఇస్తారు? అని అమితాబ్‌ను రానా అడగ్గా.. కమల్‌హాసన్‌ పేరు చెప్పారు. అమితాబ్‌ నుంచి టికెట్‌ను తీసుకున్న కమల్‌.. షోలే సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన గం గం గణేశా..
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ “దొరసాని” సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత ఆనంద్ నటించిన “మిడిల్ క్లాస్ మెలోడీస్ ” మంచి విజయం సాధించింది.గత ఏడాది రిలీజ్ అయిన బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ ,విరాజ్ ,వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ సినిమా తరువాత ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “గం గం గణేశా “ఉదయ్ బొమ్మిశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో కేదార్ శెలగం శెట్టి తో పాటు వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మించారు . ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన ప్రగతి శ్రీవాస్తవ ,నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు.టీజర్ ,పోస్టర్స్ ,ట్రైలర్ తో ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ మే 31 న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది.ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.కామెడీతో పాటు ట్విస్టులు కూడా ఉండటంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు కూడా లభించాయి.థియేటర్ లో ఎంతగానో ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటిలోకి వచ్చింది.ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసింది.అయితే ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ సినిమా ఓటిటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.జూన్ 20 గురువారం అర్ధ రాత్రి నుంచి ఈ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఆ సినిమాలో నటించడం నా జీవితంలో చెత్త నిర్ణయం..
స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .తన అందం ,అభినయంతో తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.తన అద్భుతమైన నటనతో లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం ఈ భామ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో కూడా అద్భుతంగా రానిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా నయనతార గతంలో తాను నటించిన గజిని సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సూర్య హీరోగా స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించిన గజిని మూవీ 2005 లో విడుదల అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాలో అసిన్ హీరోయిన్ గా నటించగా నయనతార ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించింది.అయితే గజిని సినిమాలో నా పాత్రను ముందు చెప్పిన విధంగా తెరకెక్కించలేదని తాజాగా నయన్ తెలిపారు.ఈ కారణం వల్లే గజిని సినిమాలో నటించడం ఓ చెత్త నిర్ణయం గా భావిస్తున్నానని నయనతార తెలిపారు.ఈ విషయంలో తాను ఎవరిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.ఇలాంటి వాటినే గుణపాఠంగా స్వీకరిస్తాను అని ఆమె చెప్పుకొచ్చారు.

Show comments