NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు..
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంలో పలు రాష్ట్రాట్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో.. గోవా, కర్నాట‌క‌, కేర‌ళ‌లోని అన్ని స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులను ప్రకటించిన విషయం విదితమే కాగా.. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కూడా భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని జిల్లాలో కుండపోత వర్షంతో జనజీవనం అతలాకుతలం అవుతుంది.. మరికొన్ని జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షలు పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. ఏపీలోని పలు జిల్లాల్లో నిన్న స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఈ రోజు.. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం.. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.. ఎన్టీఆర్ జిల్లాలో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించింది విద్యాశాఖ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్టు డీఈవో ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. ఇక, భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఆంగన్వాడి కేంద్రాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ తెలిపారు.. మరోవైపు.. నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఉంటుందని.. భారీ స్థాయిలో వర్ష శాతం నమోదు నేపథ్యంలో సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్.. అయితే, విద్యార్థులకు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నామని.. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది యథావిథిగా హాజరుకావాలని ఆదేశించారు.. విద్యార్థులకు సెలవు ప్రకటించిన రోజులను ఇతర ప్రభుత్వ సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు కలెక్టర్‌..

నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు కీలక సూచనలు
నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు.. ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్షలాదిగా తరలిరానున్నారు భక్తులు.. సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది స్వామివారి రథం.. ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ చేపట్టి పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించు కోవడం భక్తుల్లో అనవాయితీగా వస్తుంది.. ఇక, 32 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. ఐదుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు 2,600 మంది పోలీసు సిబ్బంది.. మరోవైపు.. గిరిప్రదక్షిణ కారణంగా ఈ రోజు, రేపు నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.. వివిధ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని.. భక్తులు, ప్రజలు అగమనించాలని సూచించారు అధికారులు.. నగరం మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించినట్టు పేర్కొన్నారు.. అయితే, సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి
పావంచ వద్ద మొదలు పెట్టాల్సి ఉంటుంది.. తొలిపావంచ నుంచి అడవివరం, ధారపాలెం, ఆరిలోవ, హనుమంతువాక పోలీసు క్వార్టర్స్, కైలాసగిరి టోల్ గేట్, అప్పుఘర్ జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్, వెంకోజీపాలెం, హెచ్‌బీ కాలనీ, కైలాసపురం, మాధవధార, మురళీ నగర్, బుచ్చిరాజు పాలెం, లక్ష్మీ నగర్, ఇందిరా నగర్, ప్రహ్లాదపురం, గోశాల జంక్షన్, లి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేసుకోవాల్సి ఉంటుంది.. మొత్తంగా గిరిప్రదక్షణ 32 కిలో మీటర్ల మేర సాగుతుంది.. కాగా, ఈ గిరి ప్రద‌క్షిణ‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు త‌మిళనాడు, క‌ర్ణాట‌క‌, ఒడిశా, తెలంగాణ త‌దిత‌ర రాష్ట్రాల నుంచి భ‌క్తులు పెద్ద సంఖ్యలో వ‌చ్చి పాల్గొంటారు. ఇక, గిరి ప్రద‌క్షిణ సంద‌ర్భంగా ఈ రోజు, రేపు ఆర్జిత సేవ‌ల‌న్నీ ర‌ద్దు చేశారు. జులై 20న ఉద‌యం గిరి ప్రద‌క్షిణ ప్రారంభించి, రాత్రికే తిరిగి సింహాచలం చేరుకునే భ‌క్తుల సౌక‌ర్యార్థం.. రాత్రి 10 గంట‌ల‌కు వ‌ర‌కు ద‌ర్శనాలకు అనుమతించనున్నారు.

ఏపీలో వర్షాలపై తాజా రిపోర్ట్.. ఈ జిల్లాలకు వార్నింగ్..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఏపీలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం విదితమే కాగా.. వాయుగుండం, దాని ప్రభావంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం .. పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కదులుతుందని.. వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, వాయుగుడం ప్రభావంతో.. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని చెబుతుంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది..

తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు ఫుల్‌ వానలే..
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది. 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం ద్వారా సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు నుండి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంది. ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మీదుగా వాయుగుండంగా బలపడిన అల్పపీడనం నేడు వాయువ్య దిశగా పయనించి పూరీ సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉండగా.. పది జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి మళ్లీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు వర్షం కురుస్తుంది. ఉదయం 10 గంటల తర్వాత వర్షం పెరుగుతుంది. హైదరాబాద్, ఉత్తర, పశ్చిమ తెలంగాణలో సాయంత్రం 5 గంటల తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో రాత్రి 9 గంటల తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌లో నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వర్షం కురుస్తోంది.

నేడు యూపీలో ‘పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ‘..36.50కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం
ఉత్తరప్రదేశ్‌లో నేడు ‘పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ‘ ప్రారంభం కానుంది. ఈ రోజున యూపీలో 36.50 కోట్లకు పైగా మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని అక్బర్‌నగర్ ప్రాంతంలో ‘పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ‘ను ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ‘అమ్మ పేరిట ఒక చెట్టు’ నాటనున్నారు. ఈ ప్రచారానికి నోడల్ మంత్రులను కూడా సిద్ధం చేశారు. ప్లాంటేషన్ సైట్లకు జియో ట్యాగింగ్ కూడా చేయనున్నారు. సీఎం యోగి ఆదేశాల మేరకు ఇన్‌చార్జి మంత్రులందరినీ వారి వారి జిల్లాల్లోనే నియమించనున్నారు. జూలై 20 (శనివారం), అన్ని కార్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలు సగం రోజు ఈ పనిలో పాల్గొంటాయి. సిఎం యోగి ఆదిత్యనాథ్ సూచనల మేరకు అదనపు ప్రధాన కార్యదర్శి/ప్రిన్సిపల్ సెక్రటరీ/కార్యదర్శి స్థాయి అధికారులను ‘పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ‘, తల్లి పేరుతో ఒక చెట్టు కోసం నోడల్ అధికారులుగా నామినేట్ అయ్యారు.

ప్రధాని మోడీకి ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు.. ఎందుకో తెలుసా..?
ఎక్స్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ప్రపంచ నేతగా రికార్డు సృష్టించిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి టెక్ ఆంత్రప్రెన్యూర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ విషెస్ తెలిపారు. అత్యధిక ఫాలోవర్లతో ఉన్న ప్రధాని మోడీకి కంగ్రాట్స్ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జులై 14వ తేదీన ఎక్స్‌‌లో మోడీ ఫాలోవర్ల సంఖ్య 100 మిలియన్లు దాటింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీనే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతటి ఉత్సాహభరిత వేదికలో ఉండటం తనకెంతో ఆనందమన్నారు. ఈ వేదికగా జరిగే చర్చలు, నిర్మాణాత్మక విమర్శలు, ప్రజలు ఇచ్చే దీవెనలు ఎంతో ఇష్టమని వెల్లడించారు. ఇక, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోడీకి ఎలాన్ మస్క్ కామెంట్ చేశారు. ప్రపంచంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు అందరినీ మించి మోడీ ఫాలోవర్లను దక్కించుకున్నారు. గ్లోబల్ సెలబ్రిటీలైన టేలర్ స్విఫ్ట్ (95.3 మిలియన్ ఫాలోవర్స్), లేడీ గాగా (83.1 మిలియన్స్), కిమ్ కర్డేషియన్ (75.2 మిలియన్స్) లను సైతం మోడీ మించిపోయారు. ఇక, ప్రపంచ రాజకీయ నేతలు ఎవరూ కూడా నరేంద్ర మోడీ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 38.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. దుబాయ్ అధ్యక్షుడు షేక్ ముహమ్మద్‌కు 11.2 మిలియన్స్ ఫాలోవర్లు, పోప్ ఫ్రాన్సిస్‌కు 18.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఇక, క్రికెట్ ప్రపంచ స్టార్లు విరాట్ కోహ్లీ (64.1 మిలియన్స్), ఫుట్‌బాల్ స్టార్ నేమార్ జూనియర్ (63.6 మిలియన్), బాస్కెట్ బాల్ ప్లేయర్ లిబ్రాన్ జేమ్స్ (52.9 మిలియన్లు) కూడా వెనకబడే ఉండిపోయారు.

బంగ్లాదేశ్ అల్లర్లలో 105 మంది మృతి.. గాయపడిన 2500మంది..!
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌ అట్టుడుకుతుంది. స్టూడెంట్స్, నిరుద్యోగుల ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా సర్కార్ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. విద్యార్థుల ఆందోళనలను అదుపు చేయడంలో పోలీసులు ఫెయిల్ కావడంతో రంగంలోకి మిలటరీని దించింది. కాగా, ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల్లో 105 మంది చనిపోగా.. దాదాపు 2500 మంది గాయపడ్డారు. ఒక్క రాజధానిలో 52 మంది మృతి చెందాగా.. ఎక్కువ మరణాలకు పోలీసుల కాల్పులే కారణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఉత్తమ నటుడిగా రానా.. ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ కు గాను..
టాలీవుడ్ అగ్ర కథ నాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కుమారుడు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన సంచలన వెబ్ సిరీస్ “రానా నాయుడు”. ఈ సిరీస్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విక్టరీ వెంకటేష్ ను ఎప్పుడు చూడని విధంగా ఈ సిరీస్ లో కాస్త భిన్నంగా చూపించారు. అయితే, ఈ సిరీస్ కి ఇప్పటికే పలు అవార్డులు వచ్చాయి. ఇకపోతే తాజాగా రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటనకు గాను ఉత్తమ నటుడిగా దగ్గుబాటి రానా అవార్డు పొందాడు. ” ఇండియన్ టెలి అవార్డు 2024 “లో భాగంగా రానా ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో రానా హాజరు కాకపోవడంతో ఆయన బదులు రానా నాయుడు సీరియస్ డైరెక్టర్ అవార్డును అందుకున్నాడు. ఇక ఈ అవార్డు అందుకోవడంతో రానా స్పందించారు. ఈ విషయంపై రానా మాట్లాడుతూ.. తాను ఈ పురస్కారానికి ఎంపిక అవడం చాలా గౌరవంగా ఉందని తెలిపారు. దీంతో ప్రస్తుతం రానా కు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వస్తున్నాయి. ఇకపోతే రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎప్పుడూ తాను మంచి కథల పైన దృష్టి పెడతానని ఈ సీరియస్ ఒక కుటుంబంలో జరిగిన గ్యాంగ్ స్టార్ డ్రామా అని తెలుపుతూనే ప్రేక్షకులు బాగానే ఆకట్టుకుంది అంటూ చెప్పకోచ్చారు. వెబ్ సిరీస్ లో కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్న ఎంతో ధైర్యంగా దీనిని చిత్ర బృందం తెరకెక్కించిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే., ఈ సినిమా నెట్ ఫిక్స్ లో విడుదలయ్యి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. రన్ టైం పరంగా ఈ వెబ్ సిరీస్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్ సంపాదించుకున్న వెబ్ సిరీస్ గా టాప్ లో నిలిచింది.

ఓటీటీలో సుధీర్ బాబు చిత్రం ట్రెండింగ్..ఎక్కడంటే …?
టాలీవుడ్ న‌టుడు సుధీర్‌బాబుప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన‌ తాజా చిత్రం ‘హరోంహర ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వ‌చ్చిన‌ ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా న‌టించింది. సుమంత్‌ జి.నాయుడు  నిర్మించిన హరోం హర  జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టింది. అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు మిగిల్చింది. ఇదిలావుంటే ఈ సినిమాను ఓటీటీలో జూలై 11న స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు తెలుగు ఓటీటీ వేదికలు ‘ఈటీవీ విన్‌’తో పాటు ‘ఆహా’ ప్ర‌క‌టించాయి. కాని అనుకోని కార‌ణాల వ‌ల‌న ఓటీటీ విడుదల  వాయిదా ప‌డింది. ఫైనల్ గా అన్ని అవాంతరాలు దాటుకొని జూలై 18వ తేదీన ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేశారు ఈటీవీ విన్‌, ఆహా . కాగా ఇటీవల తండ్రీకూతుళ్ల బంధంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్ర‌ణీత్ హ‌నుమంతు ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. దీంతో కొంత వివాదం రేగడంతో హీరో సుధీర్ బాబు వివరణ ఇస్తూ వీడియో రిలీజ్ చేసాడు. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రణీత్ సీన్స్ క‌ట్ చేసి  ట్రిమ్ చేసిన వర్షన్ స్ట్రీమింగ్ చేసింది ఈటీవీ విన్‌, ఆహా. రెండు రోజుల గ్యాప్ తరువాత హరోంహర చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ కు ఉంచారు. కాగా ప్రైమ్ లో ఈ చిత్రం ఇండియా నం.1గా ట్రేండింగ్ అవుతోంది. థియేటర్లలో అంతగా ఆకట్టుకొకున్న, ఓటీటీలో సుధీర్ బాబు చిత్రం  ట్రేండింగ్ పట్ల సంతోషం వ్యక్తం చేసింది నిర్మాణ సంస్థ. ఇంకెందుకు  ఆలస్యం పనిలో పనిగా మీరు ఓ సారి చూసేయండి.

మరో స్టార్ దర్శకుడితో మొదలెట్టిన రెబల్ స్టార్..!
పాన్ ఇండియా హీరో  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్  “కల్కి 2898 ఎడి”. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించిన కల్కి  భారీ వసూళ్లు అందుకొని  దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా దిశా పటాని నటించింది. విడుదలై మూడు వారాలు దాటి నాలుగో వారంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాగా ప్రస్తుతం రెబల్ స్టార్ రాజా సాబ్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రన్ని నిర్మిస్తోంది. స్టార్ డైరెక్టర్ మారుతీ రాజాసాబ్ చిత్రానికి దర్శకత్వ భాద్యతలు చేపడుతున్నారు. థమన్ సంగీత దర్శకునిగా వ్యయవహరిస్తున్నాడు. రాజా సాబ్ సెట్స్ పై ఉండగానే ప్రభాస్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సీతారామం చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన హను రాఘవ పూడి రెబల్ స్టార్ తో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు ఇటీవల ముగిసాయి. బౌండెడ్ స్క్రిప్ట్ ను హనురాఘవపూడి ప్రభాస్ కు వినిపించగా పచ్చజెండా ఊపాడు. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా చిత్రంగా రానుంది . రెబల్ స్టార్ కు జోడిగా కొత్త హీరోయిన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు హను రాఘవాపుడి. అక్టోబరు నుండి ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. మైత్రి మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు “ఫౌజి” (Fauji) అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం.