NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్..
అరేబియా సముద్రంలో అస్నా తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని దీంతో రాష్ట్రానికి రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. తెలంగాణలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. జన జీవనంత అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. బయటికి రావద్దని ఇంట్లోనే ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం. ఇకపోతే.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, ఆరోగ్య శాఖల అధికారులు గైర్హాజరు కాకుండా చూడాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

 

తీరం దాటిన వాయుగుండం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయుగుండం వాయవ్యంగా పయనిస్తోంది. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఆదివారం చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, వైఎస్‌ఆర్‌, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడనున్నట్లు పేర్కొన్నారు.

 

మళ్లీ నిండిన తుంగభద్ర డ్యామ్.. ఇవాళ గేట్లు ఎత్తనున్న అధికారులు
తుంగభద్ర డ్యామ్ మళ్లీ నిండుకుండలా మారింది. డ్యామ్‌ అధికారులు ఇవాళ గేట్లు ఎత్తనున్నారు. గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుంగభధ్ర ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయి స్టాప్ లాగ్ ఎలిమెంట్ ఏర్పాటు తరువాత డ్యామ్ మళ్లీ నిండడం గమనార్హం. గేటు కొట్టుకుపోయి భారీగా నీరు వృథా అయినా వరుణుడు మళ్లీ కరుణించాడు. తుంగభధ్ర డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు.. ప్రస్తుతం నీటి మట్టం 1630 అడుగులు నిండుకుండలా ఉంది. ఇన్ ఫ్లో 42, 142 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 10,067 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 94.552 టీఎంసీలుగా ఉంది. గతంలో 19వ గేటు కొట్టుకుపోవడంతో తుంగభద్ర డ్యామ్‌ నుంచి 45 టీఎంసీల నీరు కిందకు వృథాగా వెళ్లింది. మరింత నీరు దిగువకు పోకుండా యుద్ధప్రాతిపదికన రెండు ప్రభుత్వాలు స్పందించి చర్యలు తీసుకోవడంలో సఫలమయ్యారు. తుంగభద్ర బోర్డు , కర్ణాటక, ఏపీ అధికారులు ఉమ్మడి కృషి ఫలితంగా డ్యామ్‌లోని నీటిని వృథాగా వెళ్లకుండా అడ్డుకున్నారు. డ్యాంల గేట్లు తయారీలో నైపుణ్యం ఉన్న సాగునీటి నిపుణులు కన్నయ్య నాయుడు ఈ బృందానికి నాయకత్వం వహించారు.

 

ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 70 గేట్లను అధికారులను పూర్తిగా ఎత్తివేశారు. సముద్రంలోకి 4,06,490 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువలకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,06,990 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ నీటిమట్టం 12.2 అడుగుల మేర ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరకట్ట పొడవునా రీటైనింగ్ వాల్ కారణంగా యనమలకుదురు వరకూ ప్రమాదం తప్పింది. యనమలకుదురు తర్వాత పొలాల వెంబడి కృష్ణానది ప్రవహిస్తోంది. పొలాలలోకి వెళ్లొద్దని రైతాంగాన్ని అధికారులు హెచ్చరించారు. ఇంకా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. రెవెన్యూ, పోలీసు, రక్షణ యంత్రాంగంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరకట్ట వెంబడి ఉన్న గ్రామాలలో ముంపుకు గురయ్యే ప్రాంతాల వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నదీ పరీవాహక ప్రాంతంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణా తీరం వెంబడి ఉమ్మడి కృష్ణాజిల్లాలో రక్షణ చర్యలు ముమ్మరం చేశారు. రేపు ఉదయానికి మరింతగా వరద పెరిగే అవకాశం ఉంది. పాములలంక, తోడేలు దిబ్బలంక, పొట్టిలంక, పిల్లిలంక గ్రామాల ప్రజలను ముందుగానే అధికారులను హెచ్చరించారు. పశుగ్రాసం కోసం వరి పొలాలనే వినియోగించాలని అధికారులు సూచించారు. గొర్రెలు, మేకలు వంటి వాటిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంఆర్ఓ కార్యాలయాల వద్దే వీఆర్ఓ, వీఆర్ఏలు ఉన్నారు. ప్రతీ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రవాహ వేగం పెరిగే అవకాశం ఉండటంతో బోట్లను బయటకు తీయద్దని అధికారులు హెచ్చరించారు. లంక గ్రామాల ప్రజలను ప్రతీక్షణం గమనిస్తున్నామని అధికారులు తెలిపారు. కృష్ణా తీరం వెంబడి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

 

అమెరికాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి ఏడుగురు మృతి, 37 మందికి గాయాలు
అమెరికాలోని మిస్సిస్సిప్పిలో ఇంటర్‌స్టేట్ రూట్ 20లో శనివారం ఉదయం బస్సు బోల్తా పడడంతో ఏడుగురు మరణించగా, 37 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని మిస్సిస్సిప్పి హైవే పెట్రోల్ ఈ సమాచారాన్ని తెలియజేస్తోంది. వారెన్ కౌంటీలోని బోవినా సమీపంలో బస్సు హైవేపై నుండి జారిపడి బోల్తా పడింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విడుదల చేసిన పోస్ట్‌లో టైరు పగిలిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంది. మృతుల్లో ఆరేళ్ల బాలుడు, అతని 16 ఏళ్ల సోదరి ఉన్నారని వారెన్‌ కౌంటీ కరోనర్‌ డౌగ్‌ హస్కీ తెలిపారు. ఇద్దరినీ వారి తల్లి గుర్తించారు. మిగిలిన మృతులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గాయపడిన 37 మంది ప్రయాణీకులను విక్స్‌బర్గ్, జాక్సన్‌లోని ఆసుపత్రులకు తీసుకెళ్లినట్లు సమాచారం. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన అమృతపాల్ సింగ్ ఇటీవల అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. అమృతపాల్ తన భార్యతో కలిసి శాక్రమెంటో ప్రాంతంలో నివసించేవాడు. అతను ఇక్కడ ట్రక్కులు నడిపేవాడు. ఈ ఘటనతో ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. అమృతపాల్ కర్నాల్‌లోని జల్మనా ప్రాంతంలోని తాజ్ధా మజ్రా గ్రామంలో నివాసి. ఆగస్టు 21న తన తోటి డ్రైవర్‌తో కలిసి ట్రక్కులో పని నుంచి వెళ్తున్నట్లు సమాచారం. ఇంతలో డ్రైవర్ అకస్మాత్తుగా నిద్రపోవడంతో ట్రక్కు అదుపు తప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అమృతపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. తరువాత అతను ఎక్కడ మరణించాడు.

 

వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) శనివారం 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సవరించిన ధరల ప్రకారం నేటి నుంచి రూ.39 పెరిగింది. పెంపుతో ఇప్పుడు ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ రూ.1691.50కి అందుబాటులోకి రానుంది. అయితే 14 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో చమురు కంపెనీలు ఎలాంటి మార్పు చేయకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెంపు తర్వాత కొత్త రేట్లు కూడా వెలువడ్డాయి. కొత్త రేట్ల ప్రకారం నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.39 పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1691.50కి చేరింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ (IOCL) వెబ్‌సైట్ ప్రకారం.. వాణిజ్య LPG సిలిండర్ల ధరల పెరుగుదల సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఆ తర్వాత ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1644కి చేరింది. గతంలో ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర 1605 రూపాయలు. కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1764.50 నుంచి రూ.1802.50కి పెరిగింది. చెన్నైలో ఈ సిలిండర్ ఇప్పుడు రూ. 1855కి అందుబాటులో ఉంటుంది. ఇంతకుముందు దీని ధర రూ.1817. హైదరాబాద్ మహానగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1935 రూపాయలుగా నమోదు అయింది. అంతకుముందు ఆగస్టులో కూడా ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచారు. ఆ సమయంలో 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ ధర రూ. 8.50 పెరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1652.50కి పెరిగింది.

 

జెట్ స్పీడ్ లో పుష్ప రాజ్.. డిసెంబర్ 6న బాక్సాఫీస్ బద్దలే
స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. వాస్తవానికి పుష్ప – 2 ఈ ఆగష్టు 15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల డిసెంబర్ 6 కి వాయిదా పడింది. కానీ పుష్ప మరోసారి వెనక్కి వెళ్తాడు అనే రూమర్స్ వినిపించాయి. దీనిపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాడుతూ ” డిసెంబ‌రు 6న పుష్ష 2 రావ‌డం ఫిక్స్. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాం అంతే కాదు. ఒక‌రోజు ముందు, అంటే డిసెంబ‌రు 5న ప్రీమియ‌ర్లు కూడా వేస్తున్నాం, సెప్టెంబ‌రు 2 నాటికి ఫ‌స్టాఫ్ ఎడిటింగ్ వెర్ష‌న్ పూర్తి చేస్తామ‌ని, అక్టోబ‌రు 6 క‌ల్లా సెకండాఫ్ కూడా అయిపోతుంది, న‌వంబ‌రు 20కి కాపీ పూర్త‌వుతుంది. న‌వంబ‌రు 25కి సెన్సార్ కూడా పూర్తి చేస్తాం. ఈ సినిమాకి సంబంధించి ఇంకా పాటలు ఇవ్వాల్సి ఉంది.. అక్టోబ‌రులో ఒక‌టి, న‌వంబ‌రులో ఇంకో పాట విడుద‌ల చేస్తాం” అని అన్నారు. మరోవైపు పుష్ప థియేట్రికల్ బిజినెస్ ఎవరు ఊహించని రేంజే లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో ఎవరు కనిపిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు

 

పారాలింపిక్స్‌లో నేటి భారత షెడ్యూల్ ఇదే!
పారిస్‌ పారాలింపిక్స్‌లో శుక్రవారం నాలుగు పతకాలు సాధించిన భారత్‌.. శనివారం ఒక పతకం మాత్రమే సాధించింది. షూటింగ్‌లోనే మరో పతకం దక్కింది. రుబీనా ఫ్రాన్సిస్‌ కంచు గెలవడంతో పతకాల సంఖ్యను ఐదుకు చేరింది. బ్యాడ్మింటన్‌లో కనీసం ఓ పతకం ఖాయమైంది. సుకాంత్, సుహాస్‌ నేడు సెమీస్‌లో తలపడనున్నారు. భారీ అంచనాలతో బరిలో దిగిన ఆర్చర్‌ శీతల్‌ నిరాశపర్చింది. వ్యక్తిగత విభాగంలో ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె నిష్క్రమించింది. నేడు భారత్ ఖాతాలో మరిన్ని పతకాలు చేరే అవకాశాలు ఉన్నాయి.
భారత షెడ్యూల్:
పారా షూటింగ్‌:
మిక్స్‌డ్‌ 10మీ ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌1 క్వాలిఫికేషన్‌ (సిద్ధార్థ, అవని)- మధ్యాహ్నం 1, ఫైనల్‌- సాయంత్రం 4.30;
మిక్స్‌డ్‌ 10మీ ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌2 క్వాలిఫికేషన్‌ (శ్రీహర్ష)- మధ్యాహ్నం 3, ఫైనల్‌- సాయంత్రం 6.30
పారా అథ్లెటిక్స్‌:
పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌40 (రవి రొంగలి)- మధ్యాహ్నం 3.12,
పురుషుల హైజంప్‌ టీ47 (నిశాద్‌ కుమార్, రాంపాల్‌)- రాత్రి 10.40,
మహిళల 200మీ పరుగు టీ35 (ప్రీతి పాల్‌)- రాత్రి 11.27
పారా ఆర్చరీ:
పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌ ప్రిక్వార్టర్స్‌ (రాకేశ్‌ కుమార్‌)- రాత్రి 7.17,
పతక రౌండ్లు- రాత్రి 11.13 నుంచి

 

ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవ‌న్.. రోహిత్‌కు దక్కని చోటు! కెప్టెన్‌గా..
భారతదేశ ప్రముఖ కామెంటేటర్ హ‌ర్షా భోగ్లే త‌న ఆల్‌టైమ్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ఎంచుకున్నాడు. తన జ‌ట్టుకు కెప్టెన్‌గా టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడైన రోహిత్ శర్మను జట్టులోకి తీసుకోకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ ఐదు టైటిల్స్ అందించిన విషయం తెలిసిందే. అంతేకాదు బెస్ట్ ఓపెనర్ కూడా. హర్ష భోగ్లే తన జట్టు ఓపెనర్లుగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లీలను తీసుకున్నాడు. ఈ జోడి బెంగళూరు తరఫున ఓపెన‌ర్లుగా 28 ఇన్నింగ్స్‌లలో 1210 పరుగుల చేశారు. మూడో స్ధానంలో మిస్ట‌ర్ ఐపీఎల్ సురేష్ రైనాకు చోటిచ్చాడు. ఐపీఎల్‌లో 5000 ప‌రుగుల మైలు రాయిని అందుకున్న తొలి క్రికెట‌ర్ రైనానే. ఒంటిచేత్తో ఎన్నో మ్యాచ్‌లను మలుపుతిప్పాడు. నాలుగో స్ధానంలో మిస్టర్ 360 సూర్య‌కుమార్ యాద‌వ్‌కు అవకాశం ఇచ్చాడు. ముంబై తరఫున సూర్య‌ ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌ల‌ను ఆడాడు. హ‌ర్షా భోగ్లే త‌న జ‌ట్టుకు కెప్టెన్‌తో పాటు వికెట్ కీప‌ర్‌గా ఎంఎస్ ధోనీనే ఎంచుకున్నాడు. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ కెప్టెన్‌, వికెట్ కీప‌ర్ల‌లో మహీ ఒకరు. ఆల్‌రౌండ‌ర్‌గా హార్దిక్ పాండ్యాను తీసుకున్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. స్పిన్ కోటాలో రషీద్ ఖాన్, సునీల్ నరైన్‌లకు అవకాశం ఇచ్చాడు. ఈ ఇద్దరు స్పిన్ బౌలింగ్‌తో పాటు మెరుపు బ్యాటింగ్ చేస్తారు. ఫాస్ట్ బౌలర్లుగా లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాకు చోటిచ్చాడు. ఈ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన బౌలర్లుగా పేరుగాంచారు.
హ‌ర్షా భోగ్లే టీమ్:
విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, సురేశ్ రైనా, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్, సునీల్ నరైన్.

Show comments