NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

పెన్షన్ల పంపిణీ ప్రారంభం.. స్వయంగా పెన్షన్లు అందించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ భరోసా పేరుతో పెన్షన్ల పంపిణీని ప్రారంభించింది ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది.. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్‌ అందిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు.. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తున్న తొలి పెన్షన్‌ ఇదే.. ఇక, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన తొలి సంతకాల్లో పెన్షన్‌ పంపిణీ కూడా ఉన్న విషయం విదితమే.. ఆ తర్వాత కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. గత మూడు నెలలకు రూ.1000 చొప్పున.. ఈ నెల రూ.4000తో కలిపి.. రూ.7,000 పెన్షన్‌ మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది ప్రభుత్వం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు పెన్షన్ల పంపిణీకి స్వయంగా రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో సీఎం చంద్రబాబు పెన్షన్‌ పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌ పాల్గొన్నారు.. ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం, మంత్రి.. లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్‌ అందించారు.. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెనుమాకలో స్వయంగా ఇస్లావత్ సాయి అనే మహిళకు వితంతు పెన్షన్, బానావత్‌ పాములు నాయక్‌ అనే వ్యక్తికి వృద్ధాప్య పెన్షన్‌ అందజేశారు.. ఇక, గతం కంటే భిన్నంగా చంద్రబాబు పర్యటన సాగింది.. గ్రామంలో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.. గ్రామం లోని యువకులతో ఫొటోలు దిగి భుజం తట్టి పంపించారు.. అనంతరం పెనుమాక గ్రామ ప్రజా వేదిక వద్దకు చేరుకుని.. పెనుమాకలో ప్రజలతో మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు.. గ్రామస్తుల సమస్య లు అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

నా పాలనలో హడావుడి ఉండదు.. ప్రజలతో మమేకమే ప్రభుత్వ లక్ష్యం..
నా పాలనలో హడావుడి ఉండదు.. ప్రజలతో మమేకమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ పంపిణీని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. గత పాలన పోలీసు భయంతో గడిచింది.. స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఉండేది.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదన్నారు.. ప్రజలు టీడీపీ కూటమిని గెలిపించారు.. అయితే, రాత్రికి రాత్రే మిరాకిల్స్ జరగవు.. అప్పులు చాలా ఉన్నాయి.. గత పాలన చూసి పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారు.. రాష్ట్రం బ్రాండ్ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ముఖ్య మంత్రిగా పనికి రాని వ్యక్తి పాలన చేశాడు.. ఇప్పుడు పాలన ఎలా చేయాలో నిరూపించాల్సిన భాధ్యత నాపై ఉందన్నారు.. ఇక, వాలంటీర్లు లేకపోతే పెన్షన్ లు రావని బెదిరించారు… సచివాలయానికి వచ్చి పెన్షన్ లు తీసుకోవాలని ఎండల్లో తిప్పారు.. పెన్షన్ ల కోసం తిరిగి తిరిగి 33 మంది వృద్దులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. గ్రామ సచివాలయం సిబ్బందితో ఒకే రోజులో రాష్ట్రం అంతా పెన్షన్ ల పంపిణీ చేస్తాం అన్నారు. ఇక, నా పాలనలో హడావుడి ఉండదు.. ప్రజలతో మమేకం అవ్వడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.. ఈ రోజు పంపిణీ చేస్తున్న పెన్షన్ లు చారిత్రాత్మ కం .. 1.20 కోట్లు ఒక్క పెనుమాక గ్రామంలోనే ఇస్తున్నాం.. గుంటూరుజిల్లా లో పెన్షన్ లు రూ.81 కోట్లు .. గుంటూరు జిల్లాలో ఈ రోజు 111 కోట్ల రూపాయలు పెన్షన్ ల రూపంలో పంపిణీ చేస్తున్నాం.. 28 రకాల పెన్షన్ లకు 4,408 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఇస్తున్నాం అన్నారు. ఉదయం లేవగానే పెనుమాకలో లబ్ధి దారులకు పెన్షన్ ఇచ్చాను.. పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్న బాణావత్ పాములు కుటుంబానికి ఇల్లు కూడా కట్టించే భాధ్యత నాది అని హామీ ఇచ్చారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని చెప్పిన ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ టీడీపీ.. ఆ దిశగా పనిచేస్తా అని తెలిపారు సీఎం చంద్రబాబు.

మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీకి 14,500 క్యూసెక్కుల మేర వరద రాగా.. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అన్ని గేట్లను ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు వెళ్లిపోతోంది. వరద రావడంతో తాత్కాలిక పనుల కోసం తెచ్చిన యంత్రాలు, సామగ్రిని తరలించారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

విషాదం.. మట్టి మిద్దె కూలి నలుగురు మృతి
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్లలో జరిగింది. ఆదివారం భారీ వర్షం కురవడంతో మట్టి మిద్దె కూలి తల్లి గొడుగు పద్మ (26) ఇద్దరు కూతుర్లు పప్పి(6) , వసంత (6) , ఒక కుమారుడు విక్కి మృతి చెందారు. తండ్రికి గాయాలు కాగా.. జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడడంతో ఆ గ్రామాన్ని విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

7 నుంచి పూరీ జగన్నాథుడి రథయాత్ర.. 315 ప్రత్యేక రైళ్లు..!
ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు లక్షలాది సంఖ్యలో తరలి వస్తుంటారు. హిందూ పంచాంగం ప్రకారం.. పూరీ జగన్నాథుని తీర్థయాత్ర ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమై.. జూలై 16వ తేదీన ముగుస్తుంది. ఈ పవిత్రమైన యాత్రలో బలరాముడు, తన సోదరి సుభద్ర కూడా ఉంటారు. ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనడం వల్ల అన్ని తీర్థయాత్రల ఫలాలు దొరకుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. కాగా, ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాల కోసం హాజరయ్యేందుకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తుల సౌకర్యార్ధం రైల్వేశాఖ 315 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఒడిశాలోని బాదం పహాడ్‌, రూర్కెలా, బాలేశ్వర్‌, సోనేపుర్‌, దస్‌పల్లా, జునాగఢ్‌ రోడ్‌, సంబల్‌పుర్‌, కేందుజుహర్‌గఢ్‌, పారాదీప్‌, భద్రక్‌, అనుగుల్, గుణుపుర్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ అవుతాయని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అధికారులు వెల్లడించారు. ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్‌ మ్యాప్‌‌ను సిద్ధం చేశారు. దక్షిణ మధ్య రైల్వే కూడా కొన్ని ప్రత్యేక ట్రైన్స్ ను నడిపే ఛాన్స్ ఉంది.

నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు..
నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తుండటంతో బ్రిటిష్‌ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌(సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో పూర్తిగా ముగిసి పోయింది. అయితే, కొత్త చట్టాలలో జీరో ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు ఎస్‌ఎంఎస్‌ పద్ధతిలో సమన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద నేరాలకు సంబంధించిన క్రైమ్‌ సీన్లను తప్పనిసరి వీడియోల్లో చిత్రికరించడం వంటి కొత్త రూల్స్ న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. బ్రిటిష్‌ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ సంప్రదాయంలో రూపొందించినట్లు తెలిపారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని అతడు వెల్లడించారు.

వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు
గ్యాన్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా నాలుగో నెలలో తగ్గుముఖం పట్టాయి. నాలుగు మెట్రో నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.30మేర తగ్గింది. మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ల ధరలు మార్చి 9 నుంచి నిలకడగా కొనసాగుతున్నాయి. గత 10 నెలల్లో ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.300 తగ్గించింది. రానున్న రోజుల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని అంచనా. మరోవైపు, రాబోయే నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర మరింత తగ్గే అవకాశం ఉంది. డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలా మారాయో తెలుసుకుందాం. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మార్చి నుంచి ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా మార్చి 9న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.100 తగ్గించారు. అంతకు ముందు ఆగస్టు 30న దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింది. గత 10 నెలల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో కేవలం రెండు మార్పులు మాత్రమే కనిపించాయి. ఈ క్రమంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.300 తగ్గింది. మార్చి 1, 2023న గృహోపకరణ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. ఈ మార్పు కూడా జూలై 6, 2022 తర్వాత కనిపించింది. అంటే గత రెండేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు వచ్చింది.

బాక్సాఫీస్‌ వద్ద ‘కల్కి’ ప్రభంజనం.. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిక!
రెబల్ స్టార్ ప్రభాస్‌ కథానాయకుడిగా, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సైన్స్, ఫిక్షన్‌కు ముడిపెడితూ తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ ఎక్స్‌లో పోస్టు చేసింది. విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసిన కల్కి.. నాలుగో రోజు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. కల్కి 2898 ఏడీ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి రోజు రూ.191.5 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ సినిమా.. రెండ‌వ రోజు రూ.95.3 కోట్ల వ‌సూళ్లను సాధించింది. మూడు రోజుల్లో రూ.415 కోట్లు వ‌సూళ్లను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర‌ యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. నాలుగో రోజైన ఆదివారం వీకెండ్ కావ‌డంతో క‌లెక్ష‌న్లు భారీగా పెరిగాయి. ఈ మూవీ వారంతానికి రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. కల్కి వసూళ్లపై ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ కంటెస్టెంట్ 8 లిస్ట్ వచ్చేసింది.. లాంచింగ్ ఎప్పుడంటే ?
బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయిన షో బిగ్ బాస్. రియాలిటీ కాన్సెప్టుతో నడిచే షో ఇది. ఎన్నో ట్విస్టులతో సాగుతూ టెలివిజన్ రంగంలో సత్తా చాటుతోంది. ఈ రియాలిటీ షో స్టార్ట్ అయిందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. అలాగే.. సీజన్ మొదలు అయ్యేటప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉంటారో.. ఫైనల్ ఎపిసోడ్ టైంలో వచ్చినప్పుడు అప్పుడే అయిపోయిందా అంటూ నిరాశ వ్యక్తం చేస్తుంటారు. మళ్లీ కొత్త సీజన్ వచ్చే వరకు కళ్లు కాయలు కాసే వరకు ఎదురు చూస్తుంటారు. ఆ రేంజ్‌లో బిగ్‌బాస్ షోకు అభిమానులు ఉండడంతో బుల్లితెర పై బిగ్గెస్ట్ షోగా భారీ టీఆర్పీతో దూసుకుపోతుంది. అంతేకాకుండా దేశంలో ఉన్న పలు భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతుంది. అయితే, అన్నింటి కంటే తెలుగులోనే ఇది ఎక్కువగా రెస్పాన్స్‌ అందుకుని సత్తా చాటుతోంది. చాలా రికార్డులను సైతం క్రియేట్ చేసి తెలుగు షో సెన్సేషన్ అయిపోయింది. సీజన్ 8 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ ఆడియన్స్‌కు శుభవార్త అందింది. తెలుగులో ఇప్పటివరకు 7 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు సీజన్ 8కు రెడీ అయింది.

కూతురు పెళ్లైన వారానికే ఆసుపత్రి పాలైన స్టార్ హీరో!
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, టీఎంసీ ఎంపీ శత్రుఘ్న సిన్హా ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన కుమారుడు లవ్‌ సిన్హా ఆదివారం తెలిపారు. నాన్నకు తీవ్ర జ్వరంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లామని, సాధారణంగా చేయించే వైద్యపరీక్షలు చేయిస్తున్నాం అని లవ్‌ సిన్హా చెప్పారు. శత్రుఘ్న సిన్హా చికిత్స పొందుతున్న ఆసుపత్రికి నూతన వధూవరులు సోనాక్షి సిన్హా, జహీర్‌ అబ్బాస్ వచ్చి వెళ్లారు. వారం రోజుల కిందటే శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా వివాహం నటుడు జహీర్‌ ఇక్బాల్‌తో జరిగింది. ఈ కార్యక్రమాలతో జూన్‌ నెలంతా శత్రుఘ్న బిజీగా గడిపారు. పని ఒత్తిడి కారణంగా ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చిందని సమాచారం. శత్రుఘ్న ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, ఆయన ఈరోజు డిశ్చార్జ్ అవుతారని తెలుస్తోంది. జూన్ 25న శత్రుఘ్న సోఫాలోంచి లేస్తుండగా కిందపడిపోయాడని కూడా సమాచారం. ఆ సమయంలో ఆయన పాదంకు చిన్న గాయం అయిందట. ఓ రోజు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నా.. పక్కటెముకల నొప్పి తగ్గకపోవడంతో మరుసటి రోజు కోకిలాబెన్ ఆసుపత్రికి తీసుకెళ్లారట.