NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌ కల్యాణ్‌..
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయంతో పాటు.. సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌ను మంగళవారం రోజే పరిశీలించారు పవన్‌.. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్తున్న జనసేనానికి అపూర్వ స్వాగతం పలికారు అమరావతి రైతులు.. దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ గ్రాండ్‌ వెల్కమ్ చెప్పారు.. సచివాలయంలోకి ఉద్యోగుల అద్భుత ఆహ్వానం పలికారు.. ఇక, సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గంటన్నరపాటు సమావేశమైన వివిధ అంశాలపై చర్చించారు.. మరోవైపు.. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్‌ కల్యాణ్‌కు కేటాయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇక, ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించగా.. పవన్‌ కల్యాణ్‌ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు.. ఈ రోజు ఉదయం 9.30కి విజయవాడలోని తన క్యాంప్‌ ఆఫీస్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. ఆ తర్వాత ఉదయం 11.30కి ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులతో సమావేశం కానున్నారు జనసేనాని.. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్-1, గ్రూప్-2 అధికారులతో చర్చించనున్నారు.. అనంతరం మధ్యాహ్నం 12.30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ కానున్నారు.

నడక మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతీరోజూ వేలాది మంది దర్శించుకుంటారు.. ఇక, ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చినా.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా.. తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోతాయి.. మరోవైపు.. ప్రతీరోజూ వేలాది మంది నడక మార్గంలో తిరుమల వెళ్తుంటారు.. శ్రీవారిని దర్శించుకుంటారు.. ఇప్పుడు నడక మార్గంలో తిరుమల వెళ్తున్న భక్తులకు అలర్ట్.. శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులుకు జారి చేసే టోకేన్ల స్కానింగ్ పున:ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.. శ్రీవారి మెట్టు నడకమార్గంలో భక్తులుకు జారి చేసే టోకేన్లు 1200 మెట్టు వద్ద స్కాన్ చేసిన తర్వాత దర్శనానికి అనుమతించనుంది టీటీడీ.. గతంలో నడకమార్గంలో చిరుత దాడుల ఘటనతో టోకేన్ జారి విధానంలో మార్పులు చేశారు అధికారులు.. దీంతో, స్కానింగ్ విధానం లేకపోవడంతో నడకదారి భక్తులకు జారి చేసే టోకేన్లు పక్కదారి పడుతున్నాయని టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు దృష్టికి తీసుకెళ్లారు విజిలెన్స్‌ అధికారులు.. ఈ నేపథ్యంలో తిరిగి పూర్వపు విధానాని కోనసాగించాలని అధికారులను ఆదేశించారు ఈవో..

రుషికొండ భవనాల వివాదంపై స్పందించిన రోజా.. అది తప్పా..?
రుషికొండపై నిర్మించిన భవనాలపై తీవ్ర వివాదం రేగుతోంది.. కూటమి-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అయితే, ఈ వ్యవహారంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా..? అని ఆమె ప్రశ్నించారు.. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా..? ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా…? అంటూ నిలదీశారు.. వెన్ను చూపేది లేదు… వెనకడుగు వేసేది లేదు..!! అని పేర్కొన్నారు..

నేడు కరీంనగర్‌ కు కేంద్రమంత్రి బండిసంజయ్‌.. షెడ్యూల్‌ ఇదీ..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇవాళ కరీంనగర్ వస్తున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమర్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికనున్నారు. తొలిరోజు ఉదయం 9 గంటలకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని శనిగరం వద్దకు చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం వారితో కలిసి కరీంనగర్ చేరుకుని నేరుగా మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం చైతన్యపురిలోని తన నివాసానికి వెళ్లి మాతృమూర్తి ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడి నుండి నేరుగా కొండగట్టు బయలుదేరి వెళతారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తనను కలిసేందుకు వచ్చిన చొప్పదండి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో గడుపుతారు. అనంతరం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు వేములవాడ శ్రీరాజశ్రీరాజేశ్వర ఆలయానికి విచ్చేస్తారు. ఎములాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలిసి ముచ్చటిస్తారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు సిరిసిల్ల నియోజక కేంద్రానికి వెళతారు. పట్టణంలోని మార్కండేయ దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించడంతోపాటు తనను కలిసేందుకు వచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటారు. ఆ తరువాత నేరుగా కరీంనగర్ బయలుదేరి వెళతారు. రేపు (జూన్ 20) మధ్యాహ్నం వరకు కరీంనగర్ లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినేట్ భేటీతో పాటు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మొదటి సమావేశం నేడు సాయంత్రం 5 గంటలకు దేశ రాజధానిలో జరిగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రధాన ఆర్థిక విధానాలు, కార్యక్రమాలను ప్రస్తావించి, వచ్చే నెలలో ప్రభుత్వం యొక్క పూర్తి బడ్జెట్ 2024-25 ప్రకటనకు వేదికను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దేశ ఆర్థిక స్థితిపై పలు కీలక అంశాలపై చర్చించి, వచ్చే ఐదేళ్లపాటు ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లనున్నారు. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉందని కూడా సమాచారం. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) భారత ప్రభుత్వంలోని అత్యంత ముఖ్యమైన కమిటీలలో ఒకటి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక విధానాలు, ఇతర కీలక ఆర్థిక కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయాలను ఖరారు చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అవి ప్రభుత్వ లక్ష్యాలు, ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. కేంద్ర బడ్జెట్‌కు ముందు జరిగే ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం ముఖ్యమైన ఆర్థిక చర్యలను చర్చించడానికి, ఆమోదించడానికి కీలకమైనది. ఈ చర్చలు బడ్జెట్ కేటాయింపులు మరియు మోడీ 3.0 ప్రభుత్వం మొత్తం ఆర్థిక దిశను ప్రభావితం చేస్తాయి.

హజ్ యాత్రలో 550 మందికి పైగా యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో ఎండ వేడిమి హజ్ యాత్రికులను అతలాకుతలం చేసింది. వేడి కారణంగా హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు మరణించారు. అత్యధిక మరణాలు ఈజిప్ట్‌కు చెందినవే. ఇద్దరు అరబ్ దౌత్యవేత్తలు వార్తా సంస్థతో మాట్లాడుతూ.. ఈజిప్టు నుంచి 323 మంది హజ్ యాత్రికులు వేడి-సంబంధిత అనారోగ్యాల కారణంగా మరణించారు. ఈజిప్టులోని 323 మంది హజ్ యాత్రికులలో ఒకరు మినహా అందరూ వేడి కారణంగా మరణించారని దౌత్యవేత్త ఒకరు తెలిపారు. రద్దీ సమయంలో హజ్ యాత్రికుడు గాయపడ్డాడు. ఈ డేటా మక్కా సమీపంలోని అల్-ముయిస్సామ్‌లోని ఆసుపత్రి మార్చురీ నుంచి వచ్చిందని దౌత్యవేత్త చెప్పారు. ఈ సారి హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నారని, వారిలో 22 దేశాలకు చెందిన 16 లక్షల మంది ఉన్నారని సౌదీ హజ్ నిర్వాహకులు పేర్కొన్నారు. కనీసం 60 మంది జోర్డానియన్లు మరణించినట్లు దౌత్యవేత్తలు తెలిపారు. ఈ సంఖ్య మంగళవారం అమ్మన్ నుంచి విడుదలైన అధికారిక సంఖ్య కంటే ఎక్కువ, ఇందులో 41 మరణాలు నమోదయ్యాయి. కొత్త మరణాలతో అనేక దేశాలు ఇప్పటివరకు నివేదించిన మొత్తం 577కి చేరుకున్నాయి. మక్కాలోని అతిపెద్ద శవాగారాల్లో ఒకటైన అల్-ముయిసం వద్ద మొత్తం 550 మృతదేహాలు ఉన్నాయని దౌత్యవేత్తలు తెలిపారు. మృతదేహాలను సంబంధీకులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తమ దేశం నుంచి వచ్చిన యాత్రికులు చాలా మంది ఆచూకీ తెలియరావడం లేదని ఈజిప్టు ప్రభుత్వ వర్గాలు హజ్‌ నిర్వహకులకు వెల్లడించాయి. వారిని గుర్తించేందుకు ముమ్మర చర్యలు చేపట్టినట్లు తెలిపాయి.

జైలు నుంచి వీడియో కాల్‌లో పాక్ గ్యాంగ్‌స్టర్‌కు ఈద్ శుభాకాంక్షలు.. వీడియో వైరల్
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తన స్నేహితుల్లో ఒకరికి ఈద్ శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని తెలిపారు. ఈ వీడియో వైరల్‌గా మారిన తీరు పలు ప్రశ్నలకు తావిస్తోంది. లారెన్స్ బిష్ణోయ్‌ను సబర్మతి జైలులో ఉంచారు. ప్రత్యేక సెక్యూరిటీ సెల్‌లో ఉంచారు, అయినా మొబైల్ అక్కడికి ఎలా చేరిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజిథియా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ద్వారా ప్రశ్నలు లేవనెత్తారు. లారెన్స్ మొదట పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను హత్య చేశాడని, ఇప్పుడు బిష్ణోయ్ పాకిస్థానీ గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పాడని, అది కూడా గుజరాత్ జైలు నుండి అని ఆయన రాసుకొచ్చారు. జైలులో ఉన్నా ఎంత స్వేచ్ఛగా ఉన్నాడో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, సబర్మతి జైలు అధికారులు, గుజరాత్ పోలీసులపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై గుజరాత్ పోలీసుల నుంచి తొలుత ఎలాంటి స్పందన లేదు. మధ్యాహ్నం సబర్మతి జైలు డీఎస్పీ ఈ వీడియో సబర్మతి జైలుకు చెందినది కాదని చెప్పారు. ఈ వీడియో కూడా ఏఐ జనరేట్ కావచ్చు, ఏడాదిలో మూడు ఈద్‌లు ఉన్నాయి, ఇది ఏ ఈద్ వీడియో అని చెప్పడం కష్టమని అన్నారు.

ట్యాక్స్ చెల్లింపుదారులకు కోసం కొత్త యాప్.. ఎలా వాడాలంటే
ఆదాయపు పన్ను శాఖ తాజాగా పన్ను చెల్లింపుదారుల కోసం AIS అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఈ అప్లికేషన్‌తో, పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక రిటర్న్ సమాచారం గురించి సమగ్ర సమాచారాన్ని పొందవచ్చు. ఇది పన్ను చెల్లింపుదారులు చెల్లించే పన్నుల గురించి పూర్తి సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఈ అప్లికేషన్‌ను ఎలా ఉపయోగించాలి..? దీన్ని డౌన్‌లోడ్ చేయడం ఎలా..? రిజిస్ట్రేషన్ ప్రక్రియ లాంటి అన్ని వివరాలను తెలుసుకుందాం. ఇది పన్ను చెల్లింపుదారుల కోసం AIS అనే కొత్త మొబైల్ అప్లికేషన్. ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం వెల్లడించింది. ఈ AIS అప్లికేషన్‌కు యాక్సెస్ పూర్తిగా ఉచితం. పన్ను చెల్లింపుదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి నేరుగా తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌తో మీరు TCS, TDS, డివిడెండ్‌లు, వడ్డీ, పన్ను చెల్లింపులు, షేర్ లావాదేవీలు, ఆదాయపు పన్ను రీఫండ్‌లు, GST లాంటి వివరాలతో పాటు విదేశీ చెల్లింపులు వంటి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.ఈ యాప్‌ ని ఉపయోగించే వినియోగదారులు ముందుగా తమ పాన్ నంబర్‌ ను అప్‌లోడ్ చేసి నమోదు చేసుకోవాలి. మీరు ఇమెయిల్ ద్వారా పంపిన మీ ఫోన్ నంబర్, OTPని ధృవీకరించాలి. అప్పుడు మీరు 4-అంకెల పిన్‌ని సెట్ చేయాలి. ఇందుకోసం ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో 26AS/AIS నమోదు అవసరం లేదు.

రెండు నిమిషాల ‘మ్యాగీ మ్యాన్’ అని రోహిత్ శర్మను ట్రోల్ చేశారు!
కెరీర్ ఆరంభంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బరువును ఉద్దేశించి చాలామంది ట్రోల్ చేశారని భారత మాజీ ప్లేయర్ అభిషేక్ నాయర్ తెలిపారు. ముఖ్యంగా రోహిత్ పొట్టను ఉద్దేశించి ‘రెండు నిమిషాల మ్యాగీ మ్యాన్’ అంటూ ట్రోల్ చేసేవారన్నారు. బాడీ షేమింగ్ చేసినా.. రోహిత్ ఏనాడూ కృంగిపోలేదని, మరింత కసిగా కష్టపడి స్టార్ బ్యాటర్‌గా ఎదిగాడని అభిషేక్ పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌ 2007తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఫిట్‌నెస్ సమస్యలు, పేలవ ప్రదర్శనతో భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో 2011 వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. ఆపై దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన రోహిత్‌కు అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడంతో.. తానేంటో నిరూపించుకున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అభిషేక్ నాయర్ పంచుకున్నారు. ‘వన్డే ప్రపంచకప్ 2011లో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. అప్పుడు నేను రోహిత్‌తోనే ఉన్నాను. ఆ సమయంలో రోహిత్ బరువు ఎక్కువగానే ఉన్నాడు. ప్రపంచకప్ సమయంలో యువరాజ్ సింగ్‌తో కలిసి రోహిత్ ఓ యాడ్‌లో నటించాడు. ఆ యాడ్‌ను నేను ఎప్పటికీ మరిచిపోను. యాడ్‌లోని రోహిత్ విజువల్ కట్ చేసి.. అతని పొట్ట చుట్టూ ఓ గీత గీసి ట్రోల్ చేశారు. అది చూసిన నాకు చాలా బాధేసింది’ అని అభిషేక్ తెలిపారు. ‘ట్రోల్స్ చూశాక ఫిట్‌నెస్ విషయంలో నువ్ చాలా కష్టపడాలని రోహిత్ శర్మకు సలహా ఇచ్చాను. నువ్ ఏం చెబితే అదే చేస్తా అని హిట్‌మ్యాన్ నాతో అన్నాడు. ఐపీఎల్ తర్వాత ఓ కొత్త రోహిత్‌కు చూస్తావని చెప్పాడు. తాను అన్నది చేసి చూపించాడు. అందుకు చాలా కష్టపడ్డాడు. హిట్‌మ్యాన్‌గా గుర్తింపు పొందాడు. కెరీర్ పట్ల అతడి ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయింది. ఎంతో సక్సెస్ సాధించాడు. రెండు నిమిషాల మ్యాగీ మ్యాన్ అంటూ హేళన చేసిన వారికి అతడు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. ఇప్పుడు సారథిగా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది’ అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చారు.

నన్ను ట్రోల్ చేస్తే భర్తిస్తా.. నా కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టను!
టీ20 ప్రపంచకప్‌ 2024లో పాకిస్థాన్‌ జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. పసికూన అమెరికా, చిరకాల ప్రత్యర్థి భారత్‌ చేతిలో ఓడిన పాక్.. కెనడా, ఐర్లాండ్‌పై విజయం సాధించినా మెగా టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. పాక్ వైఫల్యంపై ఆ జట్టు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హారిస్‌ రవూఫ్‌ తన సతీమణితో కలిసి అమెరికా వీధుల్లో నడుస్తుండగా.. ఓ అభిమాని ట్రోల్ చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రవూఫ్‌.. అతడు టీమిండియా అభిమాని అని భావించి కొట్టేందుకు వెళ్లాడు. ఆ సమయంలో హారిస్‌ రవూఫ్‌ను తన సతీమణి ఆపే ప్రయత్నం చేసింది. సమీపంలో ఉన్న వేరే వ్యక్తులు కూడా అతడిని నిలువరించాలని చూశారు. సదరు అభిమాని భారతీయుడంటూ రవూఫ్‌ గట్టిగా అరుస్తుంటే.. తాను పాకిస్థానీనే అని అతడు చెప్పాడు. అభిమాని మీద దాడి చేయబోతున్న రవూఫ్‌ను పక్కన ఉన్న వాళ్లు అతి కష్టం మీద ఆపారు. ఈ వ్యవహారాన్ని కొందరు తమ మొబైల్‌లో వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ గొడవ చర్చనీయాంశం కావడంతో ఎక్స్ వేదికగా రవూఫ్‌ స్పందించాడు. తనను ట్రోల్ చేసినా భర్తిస్తానని, కుటుంబం జోలికి వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టనని పేర్కొన్నాడు.

కల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..టాక్ ఎలా ఉందంటే?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ కల్కి.. ఈ సినిమాకు తాజాగా సెన్సార్ పూర్తయింది.. దాంతో టాక్ బయటకు వచ్చింది..డార్లింగ్ ఎప్పటిలాగే మూవీని అదరగోట్టాడు.. ఈ మూవీ సస్పెన్స్ లు ఓ రేంజులో ఉన్నట్లు టాక్.. ఇక ట్విస్టులు సినిమాకు హైలెట్ అంట. భైరవ పాత్రలో ప్రభాస్ దుమ్ములేపేశాడట. ఇలాంటి సినిమాను తీయడం, ఇలాంటి విజన్‌తో చేయడం నాగ్ అశ్విన్‌కు మాత్రమే సాధ్యమని కొనియాడారని, అతని డెడికేషన్ కు దండం పెట్టాల్సిందే.. అంత అద్భుతంగా సినిమా విజువల్స్ ఉన్నాయని చెప్పారని అంటున్నారు. ఇక ఈ టాక్ బయటకు రావడంతో సినిమాను అంత అద్భుతంగా తియ్యడం కేవలం నాగ్ అశ్విన్ కే సాధ్యం అంటూ సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆ ధైర్యానికి దండం పెట్టాల్సిందే అంటూ మోత మోగిస్తున్నారు. దాదాపు మూడు గంటల నిడివితో సినిమా రాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం సినిమా బ్లాక్ బాస్టర్ అనే టాక్ వినిపిస్తుంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అందరూ ఊహించినట్లే యూ/ ఏ సర్టిఫికెట్ ను అందుకుంది. నిజానికి సినిమాకు మొదటి నుంచి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పాన్ వరల్డ్ మూవీ అంటూ మేకర్స్ ఓ రేంజులో బజ్ క్రియేట్ చేశారు. కానీ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ప్రమోషన్స్ లో స్పీడును పెంచలేదు మేకర్స్.. బుజ్జి అండ్ భైరవ అంటూ ఓ వారం రోజులు హంగామా చేశారు. అమెజాన్‌లో వదిలిన యానిమేషన్ ఎపిసోడ్స్ బాగానే ఉన్నాయి. కాంప్లెక్స్, బుజ్జి, భైరవల స్నేహం గురించి చూపించారు. ఆ సీన్స్ పిల్లలను బాగానే ఆకట్టుకున్నాయి.. ఆ తర్వాత సౌండ్ ను పెంచలేదు.. ఓ పాటను రిలీజ్ చేశారు..ఈ సినిమా మీద భారీ స్థాయిలో బిజినెస్ అయితే జరుగుతోంది. ప్రీ సేల్స్‌తోనే నార్త్ అమెరికాలో రెండు మిలియన్ల డాలర్లకు పైగా రాబట్టేసింది.. సెన్సార్ టాక్ ఇదేనా? లేదా కల్కి టీమ్ ఇలా చేసిందా అనేది మాత్రం తెలియదు.. ఏది ఏమైనా ఈ టాక్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చింది.. సంబరాలు మొదలెట్టేశారు..