NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదలు.. అర్ధరాత్రి సీఎం సమీక్ష
ఏడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం వణికి పోతోంది. ఆగకుండా కురుస్తున్న భారీ వర్షంతో కొండవాగులు పొంగుతున్నాయి. వరద నీరు రహదారుల పైకి రావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి 29 మీటర్లకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ప్రాజెక్టు 48 గేట్ల నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జంగారెడ్డిగూడెం నల్లజర్ల తాడేపల్లిగూడెం నిడదవోలు ప్రాంతాల్లోని పంట పొలాలు నీటిమునగనున్నాయి. జల్లేరు తమ్మిలేరు జలాశయాలకు సైతం వరద నీరుకి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది.

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో.. ఏజెన్సీలోని పలు గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి.. అయితే, ఈ రోజు, రేపు కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రేపు ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ఇక, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఇక, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.. ఈ సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.. ప్రజలు వరద ప్రవహించే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని సూచించింది.. ఇక, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు కింద ఉండరాదు అని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది.

ఏజెన్సీలో ఉప్పొంగిన వాగలు, వంకలు.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్..
గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అల్లూరి ఏజెన్సీలో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తు న్నాయి. వీటిని దాటుకుని రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడు తున్నారు. ముంచింగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కోడా పుట్టు, ఉబ్బింగుల, దొరగుడ గ్రామాల గిరిజనులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ఉబ్బింగుల గ్రామం నుంచి లక్ష్మీపురం వచ్చే మార్గంలో ఉన్న గెడ్డ వర్షాలకు పొంగి ప్రవహిస్తోంది. గెడ్డకు అవతల వైపు ఉన్న ఉబ్బెంగుల, దొరగుడ గిరిజనులు ఆ ప్రవాహంలో దిగి ప్రయాణిస్తేనే కనీసం పంచాయతీ కేంద్రానికి చేరగలరు. ఈ గెడ్డపై వంతెన నిర్మించాలని, రెండు గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిం చాలని అనేకమార్లు అధికారులకు తెలిపినా ఫలితం లేదంటున్నారు. కోడాపుట్టు సమీపంలో గెడ్డ ప్రవాహం పెర గడంతో గ్రామస్తులంతా గ్రామాల్లో మగ్గిపోయారు. బిరిగుడ గెడ్డపై వంతెన నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు తొలగు తాయని, పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇక, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏజెన్సీలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం కొంగ వారి గూడెం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది జలాశయం పూర్తి నీటిమట్టం 83.50మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 82.90 కి చేరింది. ప్రస్తుతం జలాశయంలోకి 20000 క్యూసెక్కులు ఇన్ఫ్లో కాగా అధికారులు నాలుగు గేటు ఎత్తి 17000 క్యూసెక్కుల నీటిని దిగివకు విడుదల చేశారు. ఎర్ర కాలువ జలాశయం దిగువ మండలాలు ప్రజల నిడదవోలు తాడేపల్లిగూడెం మండలాలకు సంబంధించిన రైతులు ప్రజలు అప్రమత్తంగా అధికారులు సూచించారు.. మరోవైపు.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టిన పాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడంతో డైవర్షన్ రహదారిపై జల్లేరువాగు ప్రవహిస్తుండగా 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి రవాణా సదుపాయం లేకుండా పోయింది. ఇప్పలపాడు, రెడ్డి గణపవరం, కన్నాపురం, వద్ద వాగులు రహదారులపై ప్రవహించడంతో దీంతో ఏజెన్సీ మండలాల్లోని ప్రజలు వాగులు దాటువద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

భద్రాచలం వద్ద 24 అడుగులకు చేరిన వరద నీరు.. అప్రమత్తమైన అధికారులు..
గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి స్వల్పంగా వరద పెరిగింది. ప్రస్తుతం గోదావరి భద్రాచలం వద్ద 24 అడుగుల వద్ద చేరుకొని ఉంది.. ఇది మరి కొంత పెరిగే అవకాశం కనబడుతుంది.మరోవైపున తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకి భారీ ఎత్తున నీళ్లు రావడంతో గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి 25 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు నీటి సామర్థ్యం 407 అడుగులు కాగా వరద ప్రభావం పెరుగు తుండటంతో ప్రస్తుతం 43 అడుగులకి చేరింది .దీంతో గత రాత్రి కిన్నెరసాని గేట్లని ఎత్తారు అదేవిధంగా తాలి పేరు ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయి నీటిమట్టం రావటంతో 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి విడుదల చేశారు. ఇకపోతే నిన్న అశ్వరావుపేట వద్ద 16 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. ఇటీవల కాలంలో ఇక్కడ ఇంత పెద్ద వర్షం ఎప్పుడు పడలేదు భారీ వర్షం నమోదు కావడంతో వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. పెదవాగు ప్రాజెక్టు నిండిపోయింది పెదవాగు ప్రాజెక్టు సామర్థ్యానికి మించి నీళ్లు చేరాయి. దీంతో మూడు గేట్లని పూర్తిగా వదిలినప్పటికీ బండు మీద నుంచి నేటి ప్రవాహం జరిగింది. ఇకపోతే పెదవాగు ప్రాజెక్ట్ పక్కనే ఉన్న నారాయణపురం వాగు పొంగింది. నారాయణపురం వాగులో అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో 50 మంది చిక్కుకొనిపోయారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు సమాచారం అందించడం తో స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అధికారులతో మాట్లాడారు. రెండు ప్రభుత్వాలు రెండు హెలికాప్టర్ ని సంఘటన స్థలానికి పంపించారు. హెలికాప్టర్ ద్వారా 26 మందిని అదేవిధంగా ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది ఎయిర్ బొట్ల ల ద్వారా 25 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాగా పెదవాగు ప్రాజెక్టుకి మూడు చోట్ల స్వల్పంగా గండిపడింది. అయితే గత రాత్రి నుంచి వర్ష ప్రభావం తగ్గటంతో ఈ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ముందస్తు నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజల్ని అధికారులు తరలించారు.

పెద్దవాగులో చిక్కుకున్న వారందరూ సేఫ్..
భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెదవాగు భారీగా పొంగిపొర్లడంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నదికి కట్టలు కట్టడంతో గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాలు నీటమునిగిపోతున్నాయి. పెదవాగు వరద నీటిలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, కూలీలు సహా 51 మంది చిక్కుకుపోయారు. పెదవాగు వరద నీటిలో చిక్కుకున్న ఏపీలోని నారాయణపురం, బచ్చువారిగూడెంకు చెందిన 51 మందిని ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. వారంతా ఊపిరి పీల్చుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు ఇరు రాష్ట్రాల ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, చిర్రి బాలరాజు సహాయక చర్యలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నుంచి వేలేరుపాడుకు కారులో వెళ్తున్న ఐదుగురు ప్రయాణికులు వరదలో చిక్కుకున్నారు. కారు వదిలి చెట్లను పట్టుకుని నవ్వుకున్నారు. అల్లూరిసీతారామనగర్ వద్ద గ్రామస్తులు వారిని రక్షించారు. భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అశ్వారావుపేట పెదవాగు ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ స్వయంగా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతం ఏపీకి సమీపంలో ఉన్నందున, మంత్రి ఆ రాష్ట్ర సీఎస్ నిరబ్‌కుమార్ ప్రసాద్‌తో మాట్లాడి, అతని అభ్యర్థన మేరకు, నదిలో చిక్కుకున్నవారందరిని రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఏపీ, తెలంగాణ అధికారులతో సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ను ఆదేశించారు.

వర్షాకాల సమావేశాల్లో ఆరు కొత్త బిల్లులకు ఆమోదం ?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఫైనాన్స్ బిల్లు, విపత్తు నిర్వహణ, బాయిలర్స్ బిల్లు, ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లు, కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ బిల్లు, రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్ బిల్లు ఉన్నాయి. వీటితో పాటు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చర్చించనున్నారు. డిమాండ్ ఫర్ గ్రాంట్స్‌పై చర్చ, ఓటింగ్ కూడా ఉంటుంది. ఈ సెషన్‌లో విభజన బిల్లు ఆమోదం పొందనుంది. వీటన్నింటితో పాటు జమ్మూకశ్మీర్ బడ్జెట్‌ను చర్చల అనంతరం ఆమోదించనున్నారు. వాస్తవానికి వచ్చే వారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపత్తు నిర్వహణ చట్టాన్ని సవరించే బిల్లుతో సహా ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక బిల్లుతో పాటు, పౌర విమానయాన రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 స్థానంలో ప్రభుత్వం ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లు 2024ని కూడా తీసుకు రానున్నారు. గురువారం సాయంత్రం లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన పార్లమెంట్ బులెటిన్‌లో బిల్లుల జాబితాను ప్రచురించారు. వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.

ముందువైపు అద్దం మీదే ఫాస్టాగ్‌.. లేకపోతే టోల్‌ రుసుం డబుల్..!
నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు వాహనదారులు ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌షీల్డ్‌పై ఏర్పాటు చేయకపోవడంతో టోల్‌గేట్ల దగ్గర చెల్లింపుల విషయంలో అంతరాయం కలుగుతుంది. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఇకపై విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్‌ స్టికర్‌ ఏర్పాటు చేయకపోతే.. టోల్‌లైన్‌లోకి ప్రవేశించే వాహనదారుల నుంచి డబుల్‌ టోల్‌ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విండ్‌స్క్రీన్‌పై ఉద్దేశపూర్వకంగా ఫాస్ట్‌ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేయకపోవడంతో టోల్ ప్లాజాల దగ్గర అనవసరమైన జాప్యాలు కొనసాగుతున్నాయని.. దాంతో ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. కాగా, ముందువైపు అద్దంపై ఫాస్టాగ్ స్టికర్ లేకపోతే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ పొడ్యూసర్‌ని జారీ చేసింది. దీంతో ఫాస్టాగ్‌లను అమర్చని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ లేకుండా టోల్‌లేన్‌లోకి ప్రవేశిస్తే విధించే రుసుంలపై డబుల్ ఫీజులతో కూడిన బోర్డులు ప్రదర్శించాలని ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు ఇచ్చింది. ఫాస్టాగ్‌లు లేని వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సీసీటీవీ ఫుటేజీలో సైతం రికార్డు చేయాలని వెల్లడించింది. దీంతో వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.

కోల్‌కతాపై ప్రేమ.. చెన్నైపై ద్వేషం!
శ్రీలంక పర్యటన కోసం అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ గురువారం భారత టీ20, వన్డే జట్లను ప్రకటించింది. అందరూ ఊహించనట్లుగానే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టుపై స్పష్టంగా కనిపించింది. హార్దిక్ పాండ్యాను కాదని.. టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించాడు. కనీసం వైస్ కెప్టెన్‌గానూ అతడికి అవకాశం ఇవ్వలేదు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం గమనార్హం. చాలామంది స్టార్ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు. దాంతో భారత జట్టు ఎంపికలో ప్రధాన పాత్ర వహించిన గంభీర్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. జింబాంబ్వే పర్యటనలో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌కు టీ20 జట్టులో చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ మాదిరి.. ఓపెనర్ స్థానం సహా వన్‌డౌన్‌లో ఆడే గైక్వాడ్‌కు చోటు దక్కకపోవడం విశేషం. గత 7 టీ20 ఇన్నింగ్స్‌‌ల్లో రుతురాజ్ 71 సగటుతో, 158 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశాడు. వన్డేల్లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, పేసర్ హర్షిత్ రాణాలకు చోటు దక్కింది. గత కొంత కాలంగా జట్టులో లేని శ్రేయాస్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ ఇస్తుందని తెలుస్తోంది. ఇందుకు కారణం గంభీర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఐపీఎల్ 2024లో కోల్‌కతాకు మెంటార్‌గా గంభీర్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. భారత జట్టు విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కోల్‌కతాపై ప్రేమను, చెన్నైపై ద్వేషంను చూపించాడని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలి ప్రదర్శన కారణంగానే చెన్నై ఆటగాడు శివమ్ దూబె విషయంలో గౌతీ ఏమీ చేయలేకపోయాడని అంటున్నారు. చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై గంభీర్ ఎప్పటికప్పుడు అసహనం వ్యక్తం చేస్తాడన్న విషయం తెలిసిందే. మొత్తానికి కోల్‌కతాపై ఫేవరిటిజం చుపించాడు అని విమర్శలు చేస్తున్నారు.

నటుడు దర్శన్, సహచరుల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు..
అభిమాని హత్య కేసులో తాజాగా కన్నడ సూపర్‌ స్టార్‌ దర్శన్‌ తోపాటు అతని సహచరులకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ కస్టడీని ఆగస్టు 1వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ నిమిత్తం దర్శన్ తోపాటు ఇతర నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన నిందితుడు, దర్శన్ భాగస్వామి పవిత్ర గౌడను ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి విచారణ చేసారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్‌ ను జూన్ 11న పోలీసులు అరెస్టు చేశారు. పవిత్ర గౌడను రేణుకాస్వామి కించపరిచేలా, అసభ్యకరమైన సందేశం పంపారని ఆరోపించారు. దర్శన్, అతని భాగస్వామి పవిత్ర గౌడ, అతని 13 మంది సహచరులు బెంగళూరు శివార్లలోని పరపప్పన అగ్రహారలోని సెంట్రల్ జైలులో ఉండగా.. మరో నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు.

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆడు జీవితం’!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం ‘ఆడు జీవితం’ (ది గోట్‌ లైఫ్‌). బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. వేసవి కానుకగా మార్చి 28న థియేటర్లలో విడుదలైంది. సౌదీలో కూలీలు ప‌డే క‌ష్టాల‌ ఇతి వృత్తంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాంతో ఆడు జీవితం ఓటీటీ విడుదల కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూశారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఆడు జీవితం స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం అర్ధరాత్రి 12 గంటలకే స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఎట్టకేలకు ఓటీటీలోకి ఆడు జీవితం రావడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన మహారాజ చిత్రం ఓటీటీ రికార్డులు బద్దలు కొడుతున్న విషయం తెలిసిందే.