నేడు ఏపీ కేబినెట్ భేటీ.. ఈ కీలకాంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 43వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతిలో 20 వేల కోట్ల విలువైన పనులకు పాలనపరమైన అనుమతులపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇప్పటికే సీఆర్డీఏ అథారిటీ అమోదించిన పలు ప్రాజెక్ట్‌ల ఆమోదం కోసం కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు రానున్నాయి. ఇక, పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్‌లో చర్చ సాగనుంది.. మరోవైపు.. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు.. ఇక, రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. విజయవాడ బుడమేరు ముంపు బాధితులకు రుణాల రీ షెడ్యూల్ కోసం స్టాంపు డ్యూటీ మినహాయింపుపై చర్చించనున్నారు. పలు పరిశ్రమలకు భూ కేటాయింపుల విషయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమైంది.. ఇప్పటికే సీఆర్డీఏ పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. మూడేళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ.. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట.. మరోవైపు.. కాకినాడ పోర్ట్‌లో పీడీఎస్ రైస్ పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడం కూడా చర్చగా మారింది.. ఈ తరుణంలో పీడీఎస్ రైస్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యలో ఆస్తిలో వాటా
భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని సేలంకు చెందిన చిన్నయ్యన్ అనే వ్యక్తి మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకున్నారు. చనిపోయిన మొదటి భర్త ఆస్తుల్లో వాటా ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను సేలం సివిల్ కోర్టు కొట్టివేసింది. ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించడంతో జస్టిస్ సుబ్రమణియన్, జస్టిస్ కుమరప్పన్ ధర్మాసనం విచారణ జరిపింది. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా అడిగేందుకు భార్యకు హక్కు ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు.. భర్తను కోల్పోయిన మహిళకు ఆస్తిలో వాటా లేదని హిందూ వివాహ చట్టం చెప్పలేదని, మళ్లీ వివాహం చేసుకున్న మహిళకు హక్కు లేదన్న హిందూ వివాహ చట్టం సెక్షన్‌ను 2005లోనే రద్దు చేశారని పేర్కొన్నారు. ఆమెకు దక్కాల్సిన ఆస్తులను అప్పగించాలని ఉత్తర్వులిచ్చారు.
చిరుతపులి దాడి.. యువతి మృతి
తమిళనాడు రాష్ట్రం వెలూరు జిల్లా కేవీ కుప్పం గ్రామంలో ఒక విషాదకరమైన ఘటన జరిగింది. వంట కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన 20 ఏళ్ల అంజలీ అనే యువతి చిరుతపులి దాడికి గురైంది. అంజలీ కట్టెలు తీసుకొని ఇంటి వైపు వస్తుండగా, చిరుతపులి ఆమెపై దాడి చేసి ఆమెను గొంతు పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లి హతమార్చింది. ఈ ఘటనపై గ్రామస్థులు ఆందోళన చెందారు. కట్టెల కోసం ఉదయం బయలు దేరిన అమ్మాయి సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో, గ్రామస్తులు అడవిలో ఆమెను వెతకడం ప్రారంభించారు. గ్రామం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో అంజలీ మృతదేహాన్ని గ్రామస్థులు గుర్తించారు. ఈ విషాద ఘటనతో ఆమె కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాంతో చిరుతపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. అంజలీ మేల్మొయిల్ గ్రామ పంచాయతీకి చెందినది. ఆ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. స్థానికులు చిరుతపులి దాడుల కారణంగా చాలా భయాందోళనలో వున్నారు. ఈ సంఘటన గ్రామంలో గందరగోళం రేపింది. అలాగే, అటవీ శాఖ అధికారులు తదుపరి చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేపడుతున్నారు.
కుప్పకూలిన విమానం.. పైలట్, కో-పైలట్ మృతి
అర్జెంటినాలోని సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో బాంబర్డియర్ ఛాలెంజర్ 300 విమానం ప్రమాదవశాత్తు భవనంను ఢీకొన్న ఘటనలో పైలట్, కో-పైలట్ మరణించారు. పుంటా డెల్ ఏస్తే నుండి బయలుదేరిన ఈ విమానం సాన్ ఫెర్నాండో విమానాశ్రయంలో రన్‌వేపై ల్యాండింగ్ చేస్తున్న సమయంలో లోపల కారణంగా, పక్కనే ఉన్న నివాస ప్రాంతాలలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చివరకు విమానం ఒక నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం వల్ల పక్కన ఉన్న కొన్ని ఇళ్లను కూడా దెబ్బతీసింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్ అగస్టిన్ ఆర్ఫోర్టే (35), కో-పైలట్ మార్టిన్ ఫెర్నాండెజ్ లోజా (44) లు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలో అత్యవసర సేవల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి పరిస్థితిని అఫుపు చేసేందుకు స్థానిక రహదారులను మూసివేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నైజీరియాలో ఘోరం.. తొక్కిసలాటలో పలువురు చిన్నారుల మృతి
నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో పలువురు చిన్నారులు చనిపోయినట్లు తెలుస్తోంది. హాలిడే ఫెయిర్ సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకున్నట్లు ఓయో రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు. నైజీరియాలోని నైరుతి ప్రాంతంలో ఒక పాఠశాల నిర్వహించిన హాలిడే ఫెయిర్ సందర్భంగా బుధవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఓయో రాష్ట్రంలోని ఇస్లామిక్ హైస్కూల్ బసోరున్‌లో తొక్కిసలాట సంభవించిందని, మరిన్ని మరణాలు సంభవించకుండా భద్రతా బలగాలు మోహరించినట్లు ఓయో రాష్ట్ర గవర్నర్ సెయి మకిండే తెలిపారు. ఈ మరణాల కారణంగా దుఖంలో ఉన్న తల్లిదండ్రులకు గవర్నర్ సానుభూతి తెలియజేశారు.
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్‌కు ఆ ఇద్దరే కారణమా?
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బుధవారం ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే మీడియా ముందుకు వచ్చి అశ్విన్.. తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టులు ఉన్నా.. యాష్ అనుహ్యంగా రిటైర్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్‌మెంట్ ఇవ్వడానికి ఆ ఇద్దరే కారణమని చెప్పొచ్చు. సిరీస్ మధ్యలోనే ఆర్ అశ్విన్ రిటైర్ కావడానికి మొదటి కారణం సహచర స్పిన్నర్ రవీంద్ర జడేజా అని చెప్పొచ్చు. బ్రిస్బేన్ టెస్టులో జడేజా వలనే టీమిండియా ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకుంది. 77 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న జడేజాను మెల్‌బోర్న్, సిడ్నీలో జరిగే టెస్టుల్లో పక్కనపెట్టే అవకాశం లేదు. మరోవైపు మెల్‌బోర్న్, సిడ్నీ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయనే అంచనాలున్నాయి కాబట్టి.. రెండో స్పిన్నర్‌గా బ్యాటింగ్ చేసే వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో చోటు దక్కడం కష్టమని బావించిన అశ్విన్.. రిటైర్‌మెంట్ ప్రకటించి ఉంటాడని విశ్లేషకులు బావిస్తున్నారు. న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్‌గా రాణించాడు. దాంతో ఆస్ట్రేలియా టూర్‌కు బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. ఆర్ అశ్విన్‌తో పోలిస్తే సుందర్ బాగా బ్యాటింగ్ చేయగలడు. యాష్ కెరీర్ చరమాంకంలో ఉండడంతో.. టీమిండియా భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సుందర్‌కు అవకాశాలు ఇస్తోంది. యాష్ స్థానాన్ని సుందర్‌తో భర్తీ చేయాలనేది బీసీసీఐ ఆలోచన. ఇప్పటికే వన్డే, టీ20ల తుది జట్టులో యాష్ ఉండడం లేదు. ఇప్పుడు టెస్టుల్లో కూడా అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు ఇప్పట్లో భారత జట్టుకు టెస్టు సిరీస్‌లు లేవు. ఇవన్నీ లోతుగా ఆలోచించిన తర్వాతే అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అశ్విన్ భారత్ తరఫున 106 టెస్టుల్లో 537, 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 3503 పరుగులు చేసిన యాష్.. 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు బాదాడు.
‘బలగం’ మొగిలయ్య కన్నుమూత!
బలగం మూవీ ఫేమ్, జానపద కళాకారుడు మొగిలయ్య (67) కన్నుమూశారు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. బలగం సినిమాలో తన గాత్రంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య.. గత కొన్ని నెలలుగా కిడ్నీలు ఫేయిల్యూర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. మొగిలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకర్గంలోని దుగ్గొండి. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి, నటీనటులు సంతాపం తెలిపారు. మొగిలయ్య వైద్య ఖర్చులు బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి, చిత్ర యూనిట్‌తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆర్థికసాయం చేశారు. రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడంతో మొగిలయ్య అనారోగ్యానికి గురయ్యారు. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేస్తున్న క్రమంలో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు అసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారు జామున మరణించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య , కొమురమ్మ దంపతులు బుర్ర కథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ బుర్రకథను చెప్పడమే వీళ్లకు జీవనాధారం. వరంగల్, మంచిర్యాల, గోధావరిఖని, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో బుర్రకథ చెబుతూ.. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. కాగా ఈ దంపతులు బలగం సినిమాలో క్లైమాక్స్ లో పాడిన పాట మంచి హిట్ అయ్యింది. దీంతో మొగిలయ్యకు ప్రత్యేక గుర్తింపు లభించింది.