NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే దర్శన టికెట్లు విడుదల..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్‌.. ఇవాళ్టి నుంచి శ్రీవారికి దర్శనానికి సంబంధించిన వివిధ టికెట్లను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయబోతున్నారు.. అందులో భాగంగా ఈ రోజు.. లక్కీడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చేయబోతున్నారు.. ఇక, ఈ నెల 21వ తేదీన వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానుండగా.. 22వ తేదీన వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, అంగప్రదక్షణ దర్శన టికెట్లు విడుదల కాబోతున్నాయి.. మరోవైపు, 24వ తేదీన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు. ఇక, రేపటి నుంచి మూడు రోజులు పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. మరోవైపు.. ఈ నెల 22వ తేదీన శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి..

కనుల పండువగా అప్పనపల్లి బాల బాలాజీ కల్యాణోత్సవం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువైవున్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్య కల్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది . స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు రాష్ట్రం నలుమూలలనుండి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఇక, ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు . ఈ ఉత్సవానికి గాను నవీన ఆలయానికి ఉత్తరం వైపున కళ్యాణ వేదికను నయనానందకరంగా తీర్చిదిద్దారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచి నీరు, ఉచిత అన్నదాన వసతి కల్పించారు. ఇక, ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ ఆర్‌జేసీకే సుబ్బారావు.. స్వామి వారికీ పట్టువస్త్రాలు సమర్పించారు. అంతర్వేది దేవస్థానం తరపున అంతర్వేది ఆలయ అర్చకులు పట్టువస్త్రాలు సమర్పించారు. వాడపల్లి దేవస్థానం తరఫున స్వామివారికి ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కొత్తపేట డీఎస్పీ వెంకటరమణ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దలి తిరుమల సింగరాచార్యులు , త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి అర్చక బృందం ఆద్వర్యంలో స్వామివారితో పాటు ఉభయ దేవేరులను బుగ్గన చుక్కపెట్టి వారిని పెళ్ళికొడుకు , పెళ్ళికుమార్తెలుగా తీర్చిదిద్ది వారిరువురిని కళ్యాణమండపము నకు తీసుకువచ్చి వేదం మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ దివ్య తిరుకళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణోత్సవంలో, కూటమి నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తంగా నిత్యం భక్త జన నీరాజనాలు అందుకుంటున్న వైనతేయ నది తీరాన ఉన్న అప్పనపల్లి గ్రామంలో కొలువైవున్న శ్రీ బాలబాలాజీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి..

ఈవీఎంలపై వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. బ్యాలెట్ విధానమే ముద్దు..!
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి ఈవీఎంలపై రకరకాల ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈవీఎంల వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈవీఎంల ట్యాంపరింగ్‌, హ్యాకింగ్‌ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈవీఎంల విషయంపై సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన మాజీ సీఎం.. ”న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు.. నిజంగా జరగాలి. అలాగే ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో.. దాదాపు అభివృద్ధి చెందిన ప్రతీ ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదు. ఈవీఎంల బదులు పోస్టల్‌ బ్యాలెట్లను ఉపయోగించాలి.. మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి. ” అంటూ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు వైఎస్‌ జగన్‌..

నేడే తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల..
తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGSET) 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ హెచ్‌ గోల్డెన్‌ జూబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్‌, అడ్మిషన్‌ భవనంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్ JNTU ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ పరీక్షలు జూన్ 13న ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,712 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 20,626 (90.82%) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని అనేక కళాశాలల్లో ME, M Tech, B Pharmacy , MRC కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG PGESET) ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఈ ఏడాది పీజీఈసెట్ పరీక్ష జూన్ 10 నుంచి 13వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. రోజుకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. PGESET 2024లో పొందిన ర్యాంక్ ఆధారంగా, 2024-25 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ ఇంజినీరింగ్, ఫార్మసీ మరియు ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ME, M.Tech, M.Pharmacy, M.R.C., గ్రాడ్యుయేట్ స్థాయి ఫార్మసీ మరియు ఆర్కిటెక్చర్ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతాయి. PGESET పరీక్షలో మొత్తం మార్కులలో కనీసం 25% సాధించిన వారు మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణించబడతారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు కనీస అర్హత మార్కులు లేవు. వచ్చిన మార్కుల సంఖ్యను బట్టి ర్యాంక్‌ను కేటాయిస్తారు.

నేడు పీఎం-కిసాన్ యోజన 17వ విడత డబ్బులు రిలీజ్ చేయనున్న మోడీ
నేడు 17వ విడత పీఎం కిసాన్ తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి చేరబోతోంది. పీఎం కిసాన్ పోర్టల్‌లో మొత్తం 12 కోట్ల మంది రైతులు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారు. వీటిలో జూన్ 18న అంటే నేటికి కనీసం మూడు కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2000 వాయిదాలు రావడం లేదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇంకా ఈ-కేవైసీ చేయని రైతులకు ఈసారి 17వ విడత సొమ్ము వారి ఖాతాల్లోకి చేరదు. కోట్లాది మంది రైతుల పొలాల్లో వరి నార్లు సిద్ధంగా లేవు. 12 కోట్ల మందికి పైగా రైతులకు జూన్ 18న వరి నాట్లు వేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు డబ్బులు ఇవ్వనున్నారు. వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిని జూన్ 18న సందర్శించనున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 9.26 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 20,000 కోట్లకు పైగా విలువైన పీఎం-కిసాన్ పథకం 17వ విడతను ఆయన విడుదల చేయనున్నారు.

ఇంట్లో అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి
జార్జియాలో సోమవారం ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు చనిపోయారు. పిల్లలు 6, 12, 13 సంవత్సరాల వయస్సు గలవారని కోవెటా కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది. ప్రమాదంలో చనిపోయిన బాధితురాలి వయస్సు 70 ఏళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. వారి గుర్తింపులను వెంటనే విడుదల చేయలేదు. ఇంటిలో మొత్తం 11 మంది ఉన్నారు. ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వారిని అట్లాంటాలోని గ్రేడీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించినట్లు కోవెటా కౌంటీ ఫైర్ రెస్క్యూ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాణాలతో బయటపడిన వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని ఏజెన్సీ తెలిపింది. ఉదయం అగ్నిమాపక దళం జార్జియాలోని న్యూనాన్‌కు ఉత్తరాన ఉన్న ఇంటికి వెళ్లింది. కోవెటా కౌంటీ అగ్నిమాపక అధికారులు మాట్లాడుతూ.. మొదటి యూనిట్లు తొమ్మిది నిమిషాల్లో చేరుకున్నాయి. ఇంటిలో మంటలు అంటుకుని 50 శాతానికి పైగా కాలిపోయింది., పైకప్పు నుండి మంటలు వస్తున్నాయని తెలిపారు. ఒక కోవెటా కౌంటీ అగ్నిమాపక సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. బాధిత కుటుంబానికి, స్నేహితులకు మా సానుభూతి తెలియజేస్తున్నట్లు కోవెటా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.. న్యూనాన్ అట్లాంటాకు నైరుతి దిశలో 40 మైళ్లు (64 కిలోమీటర్లు) దూరంలో ఉంది. కోవెటా కౌంటీ ఫైర్ రెస్క్యూ కారణాన్ని గుర్తించడానికి కౌంటీ, రాష్ట్ర ఫైర్ మార్షల్స్ , కోవెటా కౌంటీ షెరీఫ్ కార్యాలయంతో కలిసి పనిచేస్తోందని అధికారులు తెలిపారు.

బ్యాడ్ న్యూస్.. భారత్ ఆడే ‘సూపర్ 8’ మ్యాచ్‌లకు భారీ అడ్డంకి!
టీ20 ప్రపంచకప్ 2024లో ‘సూపర్ 8’ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. బుధవారం (జూన్ 19) నుంచి మెగా టోర్నీ సూపర్ 8 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లకు వెస్టిండీస్‌లోని బార్బోడస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ఆంటిగ్వా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే సూపర్ 8 మ్యాచ్‌లకు ముందు అక్కడి వాతావరణ శాఖ ఓ బ్యాడ్ న్యూస్ తెలిపింది. సూపర్ 8 మ్యాచ్‌లు అన్నింటికీ వర్షం ముప్పు పొంచి ఉందని పేర్కొంది. జూన్ 20న జరిగే భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ మినహా అన్ని సూపర్ 8 మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించనుందని వాతావరణ శాఖ తెలిపింది. బార్బోడోస్ వేదికగా జరిగే భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ సమయంలో 10 నుంచి 15 శాతం వర్షం పడనుందట. బార్బోడోస్ స్టేడియంలో జరిగే ఇతర మ్యాచ్‌ల సమయంలో 40 నుంచి 55 శాతం వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. సెయింట్ లూసియాలో జరిగే మ్యాచ్‌లకు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. సెయింట్ విన్సెంట్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల సమయంలో 52 శాతం వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంటిగ్వా వేదికగా జరిగే భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్‌ సమయంలో 20 శాతం వర్షం కురిసే అవకాశం ఉందట. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8లో జరిగే దాదాపు 80 శాతం మ్యాచ్‌లపై వర్షం ప్రభావం చూపనుందట. ఈ విషయం తెలిసిన ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గ్రూప్ దశలో కొన్ని మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

రెండేళ్ల పదవీ కాలం ఉండగానే.. భారత కోచ్‌పై వేటు!
భారత సీనియర్‌ ఫుట్‌బాల్‌ టీమ్ హెడ్ కోచ్‌ ఇగర్‌ స్టిమాక్‌పై వేటు పడింది. రెండేళ్ల పదవీ కాలం ఉండగానే.. 56 ఏళ్ల స్టిమాక్‌ను అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) తప్పించింది. 2026 ఫిఫా ప్రపంచకప్‌ కోసం ఇటీవల నిర్వహించిన క్వాలిఫయర్స్‌లో సులువైన డ్రా పడ్డప్పటికీ.. భారత్‌ మూడో రౌండ్లోనే నిష్క్రమించడంతో స్టిమాక్‌పై ఏఐఎఫ్‌ఎఫ్‌ చర్యలు తీసుకుంది. ఆదివారం జరిగిన ఏఐఎఫ్‌ఎఫ్‌ సమావేశంలో పాల్గొన్న టెక్నికల్ కమిటీ హెడ్ ఐఎం విజయన్, సాంకేతిక కమిటీ సభ్యుడు క్లైమాక్స్ లారెన్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని.. జట్టును ముందుకు తీసుకెళ్లేందుకు కొత్త కోచ్‌ అవసరమని సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇగర్‌ స్టిమాక్‌ను పదవి నుంచి తప్పిస్తూ నోటీసు జారీ చేశాం. స్టిమాక్‌ తక్షణమే హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకొంటాడు’ అని ఏఐఎఫ్‌ఎఫ్‌ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కాంట్రాక్టును మధ్యలో రద్దు చేసినందుకు స్టిమాక్‌కు ఏఐఎఫ్‌ఎఫ్‌ రూ.3 కోట్ల చెల్లించాల్సి ఉంటుంది.

రాంచరణ్, అల్లు అర్జున్ మధ్య తీవ్ర పోటీ తప్పదా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ ముందుగా ఆగస్టు 15 న రిలీజ్ చేయాలనీ చూసారు కానీ షూటింగ్ డిలే అవ్వడం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఉండటంతో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.అయితే పుష్ప 2 ను డిసెంబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలమే అయింది.ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దర్శకుడు శంకర్ ఇండియన్ 2 షూటింగ్లో బిజీ గా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.మరో వారం పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తుంది.దీనితో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ సినిమాను దిల్ రాజు అక్టోబర్ లో రిలీజ్ చేస్తారా లేక డిసెంబర్ లో రిలీజ్ చేస్తారా అనేది ప్రశ్నగా మారింది .డిసెంబర్ లో కనుక రిలీజ్ చేస్తే పుష్ప 2 సినిమాతో తీవ్ర పోటీ ఎదురయ్యే ఛాన్స్ వుంది .ఇప్పటికే అల్లు అర్జున్ ,మెగా ఫ్యాన్స్ మధ్య దూరం పెరుగుతూ వస్తుంది.ఈ ఎన్నికలలో అల్లుఅర్జున్ వైసీపీకి మద్దతు ఇవ్వడంతో ఈ రచ్చ మొదలైంది.ఇప్పుడు అల్లుఅర్జున్ ,రాంచరణ్ సినిమాలు డిసెంబర్ లోనే వస్తే కనుక రెండు సినిమాల మధ్య తీవ్ర పోటీ తప్పదనే వాదన వినిపిస్తుంది.

రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్..?
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈసినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్ చంద్ర ,సునీల్ ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.ఇదిలా ఉంటే షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.దర్శకుడు శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లో బిజీ గా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు.తండ్రి ,కొడుకుగా రాంచరణ్ నటిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిత్రీకరించిన చిత్ర యూనిట్ తాజాగా వైజాగ్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.మరో వారం లేదా పది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం.దీనితో షూటింగ్ పూర్తయ్యాక ఫ్యామిలీ తో చరణ్ వెకేషన్ కు వెళ్లనున్నట్లు సమాచారం.తిరిగొచ్చిన వెంటనే బుచ్చి బాబు సినిమా మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది.