NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

ముగిసిన ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన..!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్తిన పర్యటన ముగిసింది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు ఏపీ సీఎం.. ఢిల్లీలో ఈ రోజు మరికొంతమంది కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తారని ముందుగా ప్రచారం జరిగింది.. ముఖ్యంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై.. ఏపీకి రావాల్సిన బకాయిలను విడదల చేయాలని కోరనున్నారని.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రారంభంలో రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు బకాయిలను కూడా కేంద్రం వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరే అవకాశం ఉందన్నారు.. మరోవైపు.. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసి.. జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియ జాప్యానికి అడ్డుగా ఉన్న ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని కోరతారనే ప్రచారం కూడా సాగింది.. అయితే, హస్తినలో ఏపీ చంద్రబాబు.. ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశం లేదని తెలుస్తోంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరనున్న ఆయన గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు.. మరోవైపు.. ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి అధికార నివాసంలో ( 1, జనపధ్) మరికాసేపట్లో పూజలు నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత విజయవాడ బయల్దేరనున్నారు..

అమిత్‌షాతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తన తొలి రోజు పర్యటనలో హస్తిన చేరుకోగానే.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు… పలు కీలక అంశాలపై హోం శాఖ మంత్రితో ఏపీ సీఎం చర్చించినట్లు తెలుస్తుంది.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కేంద్ర సహాయం కోరారు.. జాతీయ సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియను జాప్యం చేస్తున్న ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలు, అభ్యంతరాలను కేంద్రం వేగంగా పరిష్కరించాలని కోరారు సీఎం.. నిర్మాణం వేగంగా పూర్తయ్యేందుకు, నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.. ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి పెట్టిన ఖర్చు బకాయిలు కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు.. పోలవరం ప్రాజెక్ట్ తో పాటు, విభజన చట్టంలోనూ పలు పెండింగ్ అంశాలను కూడా సత్వరమే పరిష్కరించాలని.. విభజన చట్టంను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర హోం మంత్రిత్వశాఖ దేనని ఏపీ సీఎం చంద్రబాబు కోరినట్టుగా తెలుస్తోంది..

నేటి నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ.. విస్తృత ఏర్పాట్లు..
నెల్లూరు నగరంలో ప్రతి ఏటా మొహరం సందర్భంగా జరిగే రొట్టెల పండుగ కోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి నాలుగు ఐదు రోజులపాటు జరిగే ఈ పండుగ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రానున్నారు. దర్గా మిట్టలోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. దర్గా ప్రాంగణంలోని బారా షాహిద్ లను దర్శనం చేసుకొని.. అనంతరం స్వర్ణాల చెరువులో తమ కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు ఏదైనా కోరికను కోరుకొని ఆ రొట్టెను వదిలే వారి నుంచి తీసుకుంటారు. గత ఏడాది తాము అనుకున్న కోరికకు సంబంధించిన రొట్టెను పట్టుకుని.. అది నెరవేరితే తర్వాత మరుసటి ఏడాది వచ్చి ఆ రొట్టెను వదలడం సంప్రదాయంగా వస్తోంది. ప్రధానంగా సంతాన రొట్టె.. ఆరోగ్య రొట్టె.. చదువు రొట్టె.. వివాహ రొట్టె.. విదేశీ రొట్టె.. ఉద్యోగ రొట్టె.. ఇలా 12 రకాల కోరికలకు సంబంధించిన రొట్టెలను ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు. గతంలో మొహరం రోజున మాత్రమే ఈ రొట్టెల పండుగను నిర్వహించేవారు.. భక్తుల రద్దీ అధికం కావడంతో రొట్టెల పండుగను ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నారు. భక్తుల కోసం నెల్లూరు నగరపాలక సంస్థ.. పోలీసు శాఖతోపాటు ఇతర విభాగాల సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లను చేశారు. చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు వీలుగా సూచిక బోర్డులు.. భక్తులు ఉండేందుకు గుడారాలు.. స్నానపు గదులు.. మహిళల కోసం ప్రత్యేకంగా దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. వేల మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు.. సీసీ కెమెరాలతో భక్తుల కదిలికలను పర్యవేక్షించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు.. అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు.

రాష్ట్రంలో ఉదయం నుంచి వాన.. చిరు జల్లులతో తడిసిన తెలంగాణ..
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి వాన కురుస్తుండటంతో తెలంగాణ తడిసిముద్దయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాల్లో 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఇతర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ.ఎత్తు వరకు విస్తరించి ఉంటుందని.. పైకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంపుగా మారుతుందని తెలిపారు. సముద్ర మట్టానికి 1.5 కి.మీ. మీ ఎత్తులో అల్పపీడనం కొనసాగుతోందని ప్రకటించారు. దీంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీం, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఆఫ్ఘనిస్తాన్‌లో తుఫాను బీభత్సం.. 35 మంది మృతి.. 230మందికి గాయాలు
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు, వడగళ్ల వాన కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోగా, 230 మంది గాయపడ్డారు. నంగర్‌హర్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో 400కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని ఖామా ప్రెస్ నివేదించింది. నంగర్‌హార్‌లోని పలు జిల్లాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచార, సాంస్కృతిక శాఖ సోమవారం ధృవీకరించింది. ప్రకృతి వైపరీత్యం తర్వాత బాధిత వర్గాల పునరావాసానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం సమాచారం ఇస్తోంది. భారీ వర్షాలు, వడగళ్ల వానల కారణంగా నష్టపోయిన ప్రజల కష్టాలను తగ్గించడానికి.. దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడానికి ఖచ్చితమైన సహాయక చర్యలు చేపట్టడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు నాలుగు వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీని కారణంగా నివాసితులు, వ్యాపారాలు గణనీయమైన ఆర్థిక నష్టాన్ని చవిచూశాయి. అయితే, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అవసరమైన ప్రతి ఒక్కరికీ అవసరమైన సహాయం అందేలా చూడటంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. రెస్క్యూ, రికవరీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

‘వన్‌ప్లస్‌ నార్డ్‌ 4’ వచ్చేసింది.. 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్‌!
ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్‌’.. నార్డ్‌ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ 4’ను మంగళవారం రిలీజ్ చేసింది. గతేడాది వచ్చిన వన్‌ప్లస్‌ నార్డ్‌ 3కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ వస్తోంది. వన్‌ప్లస్‌ సమ్మర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ 4లో 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. 50 ఎంపీ సోనీ సెన్సర్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం. వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్‌ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.29,999గా ఉండగా.. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.32,999గా ఉంది. ఇక హై ఎండ్ వేరియంట్ 12జీబీ+256 జీబీ ధర రూ.35,999గా కంపెనీ నిర్ణయించింది. సిల్వర్‌, గ్రీన్‌, మిడ్‌నైట్‌ షేడ్స్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆగస్టు 2 నుంచి విక్రయాలు ఆరంభం అవుతాయి. జులై 20 నుంచి 30 మధ్య వన్‌ప్లస్‌, అమెజాన్‌లో ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చు. బ్యాంక్‌ ఆఫర్లతో కలిపి బేస్‌ వేరియంట్‌ రూ.27,999కి మీకు లభిస్తుంది.

ఆ సమయంలో నా మైండ్ బ్లాంక్ అయింది: రోహిత్‌ శర్మ
బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన భారత్.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఫైనల్‌లో ఓ దశలో భారత్ పూర్తిగా వెనకపడిపోయింది. 15 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా గెలుపు సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులు. చేతిలో 6 వికెట్లున్న దక్షిణాఫ్రికా ఓటమి పాలవుతుందని ఎవరూ అనుకోలేదు. భారత అభిమానులే కాదు.. ఆటగాళ్లు కూడా మ్యాచ్‌ మీద ఆశలను దాదాపుగా వదిలేశారు. కానీ చివరి 5 ఓవర్లలో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో టీమిండియా అనూహ్య విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌ విజయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యూహాలదీ కీలక పాత్ర. చివరి ఓవర్లలో బౌలర్లను అద్భుతంగా ఉపదయోగించుకున్నాడు. ఫీల్డింగ్ సెటప్ కూడా బాగా చేశాడు. ఫైనల్‌ విజయంపై రోహిత్ మరోసారి స్పందించాడు. తాజాగా డల్లాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హిట్‌మ్యాన్.. 15వ ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్‌ చెలరేగిపోవడంతో ఏం చేయాలో అర్ధం కాలేదని తెలిపాడు. ఆ సమయంలో తన మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిందని వెల్లడించాడు. ఎక్కువ దూరం ఆలోచించకుండా.. పరిస్థితులకు తగ్గట్లు స్పందించడంపై దృష్టి పెట్టానని చెప్పాడు.

మురారీ వద్దు..ఖలేజా ముద్దు..
ఆగస్టు 9 టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ రోజు ఘట్టమనేని అభిమానులకు పండగ రోజు. రాబోయే మహేశ్ బర్త్ డే ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. అదే రోజు దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ ల పాన్ ఇండియా చిత్రం ప్రకటన ఉండనుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ల్ ఖుషిగా ఉన్నారు. కాగా ఈ మధ్య కాలంలో హీరోల పుట్టిన రోజు సందర్భంగా తమ తమ హీరోల హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అదే విధంగా మహేష్ పుట్టిన రోజు కానుకగా ప్రిన్స్ సినిమాలు రీ – రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఈ దఫా మహేశ్ అభిమానులు కొద్దిగా నిరుత్సహాంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. బాబు బర్త్ డే రోజ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ ల ‘ఖలేజా’ రీరిలీజ్ చేయాల్సిందిగా ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ కృష్ణవంశీ, మహేశ్‌ కాంబోలో వచ్చిన క్లాసిక్ హిట్ మురారి రీరిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం తమకు ఖలేజా కావాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. మురారి సూపర్ హిట్ సినిమానే అది ఫ్యామిలీతో చూసే సినిమా, కానీ ఖలేజాలో సూపర్ స్టార్ వన్ మ్యాన్ షో ఉంటుందని కల్ట్ మహేశ్ ను చూస్తామనేది ఫ్యాన్స్ వాదన. మరోవైపు ఖలేజా రీరిలీజ్ చేసేందుకు లీగల్ ఇష్యూస్ ఉన్నాయని, రీ రిలీజ్ చేయడం కుదరదని అందుకే మురారి చేస్తున్నట్టు సమాచారం. మురారితో పాటుగా అతిథి చిత్రాన్ని కూడా రీరిలీజ్ చేసే ఆలోచనలో చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా ఖలేజా అనేది మహేశ్ కెరీర్ లో ఓ కల్ట్ మాస్ బొమ్మ.

నేను ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తాను..
టాలీవుడ్ లోని బడా నిర్మాతలలో దగ్గుబాటి సురేష్ ఒకరు. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దగ్గుబాటి రానా. తొలి చిత్రం లీడర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. తదుపరి కొన్ని ఫ్లాప్ లు రావడంతో రొటీన్ కథలకు గుడ్ బై చేప్పేసాడు. మరోవైపు బాలీవుడ్ లో మంచి కథ బలం ఉన్న సినిమాలలో నటించి తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. బాహుబలి రెండు భాగాలలో ప్రతిపక్ష నాయకుడి పాత్రలో రానా నటన గురించి ఎంత చెప్పిన తక్కువే. భల్లాలదేవ పాత్రలో అద్భుతంగా నటించి పలు అవార్డులు గెలుచుకున్నాడు. బాహుబలి క్రేజ్ తో తర్వాత వరుస సినిమాలు ఆఫర్లతో రానా ఫుల్ బిజీ అవుతాడని అందరూ ఊహించారు. కానీ రానా చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకొంటున్నాడు. కాగా రానా IIFA అవార్డ్స్ కార్యక్రమానికి హాజరవగా తదుపరి సినిమా ఎప్పుడు రాబోతోందని మీడియా ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానంగా రానా బదులిస్తూ ” లైఫ్ అంతా కొత్త జానర్ సినిమాలే చేస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు అవన్నీ మామూలు సినిమాలు అయిపోయాయి. అందరూ హీరోలు ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు. కాబట్టి నేను చేయడం ఆపేసాను. కొత్తగా ఏదైనా సినిమా చేయాలి అని వెతుకుతున్నాను, ఇండస్ట్రీలో డిఫ్రెంట్ జోనర్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ చేసిందే నేను, త్వరలో ఎవరు చేయని కథతో సినిమా చేస్తాను, ఆ చిత్ర విశేషాలు మీడియా ముఖంగా వెల్లడిస్తాను” అని అన్నారు. లీడర్ 2 గురించి రానాను అడగగా ఆ విషయం దర్శకుడు శేఖర్ కమ్ముల ను అడగండి అని అన్నారు. కల్కి చిత్రం సక్సెస్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రిలీజ్ కు, ముందునుండే కల్కి సక్సెస్ సాధిస్తుంది అనే నమ్మకం ఉంది అని అన్నారు.

నానికి డబుల్ ధమాకా.. తెలుగు నామినేషన్స్‌ లిస్ట్ ఇదే!
ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024లో మొదటి అడుగు పడింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితా తాజాగా విడుదలైంది. ఈ వేడుకలను ఎక్కడ?, ఎప్పుడు నిర్వహిస్తారు? అనే విషయాలను త్వరలోనే వెల్లడికానున్నాయి. తెలుగు నామినేషన్స్‌ లిస్ట్ ఓసారి చూద్దాం. నేచురల్‌ స్టార్ నానికి డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఉత్తమ నటుడు కేటగిరిలో నాని రెండు (దసరా, హాయ్‌ నాన్న) సినిమాలకు నామినేట్ అయ్యాడు. ఈ కేటగిరిలో ఆనంద్‌ దేవరకొండ (బేబీ), బాలకృష్ణ (భగవంత్‌ కేసరి), చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య), ధనుష్‌ (సర్‌), నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ) పోటీ పడుతున్నారు. ఉత్తమ దర్శకుడు కేటగిరిలో కూడా హాయ్‌ నాన్న, దసరా ఉండడం విశేషం. ఉత్తమ నటి కేటగిరిలో కీర్తి సురేశ్‌ (దసరా) ఉన్నారు. ఉత్తమ చిత్రంకు దసరా నామినేట్ అయింది.
ఉత్తమ చిత్రం:
బేబీ
బలగం
దసరా
హాయ్‌ నాన్న
మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి
సామజవరగమన
సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌

ఉత్తమ నటుడు:
ఆనంద్‌ దేవరకొండ (బేబీ)
బాలకృష్ణ (భగవంత్‌ కేసరి)
చిరంజీవి (వాల్తేర్‌ వీరయ్య)
ధనుష్‌ (సర్‌)
నాని (దసరా)
నాని (హాయ్‌ నాన్న)
నవీన్‌ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)
ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)

ఉత్తమ నటి:
అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి)
కీర్తిసురేశ్‌ (దసరా)
మృణాళ్‌ ఠాకూర్‌ (హాయ్‌ నాన్న)
సమంత (శాకుంతలం)
వైష్ణవీ చైతన్య (బేబీ)

ఉత్తమ దర్శకుడు:
అనిల్‌ రావిపూడి (భగవంత్‌ కేసరి)
కార్తిక్‌ దండు (విరూపాక్ష)
ప్రశాంత్‌నీల్‌ (సలార్‌:పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)
సాయి రాజేశ్‌ (బేబీ)
శౌర్యువ్‌ (హాయ్‌ నాన్న)
శ్రీకాంత్‌ ఓదెల (దసరా)
వేణు యెల్దండ (బలగం)

ఉత్తమ సహాయ నటుడు:
బ్రహ్మానందం (రంగ మార్తండ)
దీక్షిత్‌శెట్టి (దసరా)
కోట జయరాం (బలగం)
నరేశ్‌ (సామజవరగమన)
రవితేజ (వాల్తేర్‌ వీరయ్య)
విష్ణు ఓఐ (కీడా కోలా)

ఉత్తమ సహాయ నటి:
రమ్యకృష్ణ (రంగమార్తండ)
రోహిణి మోల్లెటి (రైటర్‌ పద్మభూషణ్‌)
రుపా లక్ష్మీ (బలగం)
శ్యామల (విరూపాక్ష)
శ్రీలీల (భగవంత్‌ కేసరి)
శ్రియారెడ్డి (సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌)
శ్వేతరెడ్డి (మంత్‌ ఆఫ్‌ మధు)

ఉత్తమ గాయని:
చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)
చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్‌ పాప)
దీ (చమ్కీల అంగీలేసి -దసరా)
మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)
శక్తిశ్రీ గోపాలన్‌ (అమ్మాడి -హాయ్‌ నాన్న)
శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు -సర్‌)

ఉత్తమ గాయకుడు:
అనురాగ్‌ కుల్‌కర్ణి (సమయ-హాయ్‌ నాన్న)
హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ (ఖుషి -టైటిల్‌ సాంగ్‌)
పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ప్రేమిస్తున్నా -బేబీ)
రామ్‌ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)
సిధ్‌ శ్రీరామ్‌ (ఆరాధ్య – ఖుషి)
శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)

ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌:
బేబీ (విజయ్‌ బుల్గానిన్‌)
బలగం (భీమ్స్‌ సిసిరిలియో)
దసరా (సంతోష్‌ నారాయణ్‌)
హాయ్‌ నాన్న (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)
ఖుషి (హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌)
వాల్తేర్‌ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)

ఉత్తమ సాహిత్యం:
అనంత శ్రీరామ్‌ (గాజు బొమ్మ -హాయ్‌ నాన్న)
అనంత శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)
కాసర్ల శ్యామ్‌ (చమ్కీల అంగీలేసి -దసరా)
కాసర్ల శ్యామ్‌ (ఊరు పల్లెటూరు -బలగం)
పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్‌)

Show comments