NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్‌..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం కానుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి సమావేశం కానుంది. వివిధ కీలకాంశాలపై చర్చ సాగనున్నట్టుగా తెలుస్తోంది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కేబినెట్‌లో సమీక్ష జరగనుంది.. ఇసుక కొత్త పాలసీ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.. వూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉందని ఇప్పటికే అంచనాకు వచ్చిన ఏపీ ఆర్థిక శాఖ. ఓటాన్ అకౌంట్ ఆమోదం కోసం సభలో బిల్లు పెట్టాలా..? లేదా ఆర్డినెన్స్ జారీ చేయాలా..? అనే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై చర్చించే అవకాశం ఉండగా.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.. మరోవైపు.. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ వేసే అంశంపై కేబినెట్‌లో ప్రస్తావించనున్నారు.. ఇప్పటికే టీటీడీ విషయంలో ధర్మారెడ్డి, ఐ అండ్ పీఆర్ లో అక్రమాలపై తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వంటి వారిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయం విదితమే.. వీటితో పాటు.. ఇతర అక్రమాలను సీఐడీకి అప్పగించే ఛాన్స్ ఉండగా.. దీనిపై చర్చించనున్నట్టుగా సమాచారం.. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రత్యేక ప్రస్తావన చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌.. డయేరియా నివారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని చర్చ సాగనుండగా.. శాంతి భద్రతలపై మరింత దృష్టి సారించాలనే దిశగా మంత్రి వర్గంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది.. మహిళలు, మైనర్ బాలికల పట్ల లైంగిక వేధింపులను అరికట్టేలా పోలీస్ యంత్రాంగాన్ని పటిష్ట పరిచే దిశగా కేబినెట్‌లో సమాలోచనలు చేయనున్నారు.

శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు ఆణివార ఆస్థానం కార్యక్రమాని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.. ఉదయం ఘంటా మండపంలో ఆస్థానం నిర్వహించనున్న అర్చకులు.. ఇక, సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పుష్పపల్లకి పై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. కాగా, ప్రతి సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రాంతి నాడు.. అంటే తమిళుల సంప్రదాయం ప్రకారం ఆణిమాసం చివరి రోజున జరిగే ఉత్సవం కావడంతో.. ఈ వేడుకలకు ఆణివార ఆస్థానం అనే పేరు వచ్చింది. చారిత్రక నేఫథ్యంలో పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలన స్వీకరించిన రోజైన ఆణివార ఆస్థానం పర్వదినం నుండి టీటీడీ వార్షిక బడ్జెట్ ప్రారంభమైయ్యేది. టీటీడీ ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్ కు మారినపట్టికి.. ఆనాదికాలంగా వస్తున్న ఆచారాని అనుసరిస్తు నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తుంది టీటీడీ.. మరోవైపు.. ఆణివారి ఆస్ధానం సంధర్భంగా శ్రీరంగం దేవస్ధానం తరుపున స్వామివారికి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు. ఈ వస్త్రాలను ముందుగా పెద్ద జీయర్ మఠంలో వుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాల నడుమ జీయర్‌ స్వాములు, ఆలయ అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి వారికి సమర్పించనున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో సర్వభూపాల వాహనంపై వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం.. తొమ్మిది అంశాలపై చర్చ..
సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఉన్నతాధికారులు బదిలీ అయిన నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా పాలన, వ్యవసాయం, వైద్యం, ఆరోగ్యం, వనమహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలన తదితర అంశాలపై చర్చ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. నిన్న పంచాయతీరాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో… రిజర్వేషన్లపై ఒక అవగాహన కోసం సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రెజర్వేషన్ల పెంపుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. పంచాయ‌తీల ఎన్నిక‌ల‌కు సంబంధించి బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంపుపై స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో రిజ‌ర్వేష‌న్ల అమ‌లు, రాబోయే ఎన్నిక‌ల్లో వాటి పెంపున‌కు సంబంధించిన అంశాల‌ను వెల్ల‌డించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. గ‌త పంచాయ‌తీ ఎన్నిక‌ల అనుస‌రించిన విధానం, రానున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న తీరును అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. ఇప్ప‌టికే కుల గ‌ణ‌నకు ఆమోదం తెలిపినందున‌, దాని ఆధారంగా పంచాయ‌తీ ఎన్నికల‌కు వెళితే ఎలా ఉంటుంద‌ని, అందుకు ఎంత స‌మ‌యం తీసుకుంటార‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు.

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. నలుగురు సైనికులు మృతి..!
దేశ సరిహద్దులో భారత ఆర్మీ 24 గంటల పాటు పహారా కాస్తున్నా టెర్రరిస్టుల చొరబాట్లు ఏమాత్రం ఆగడం లేదు.. దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తునే ఉన్నారు. అడ్డంగా దొరికిపోయిన ఉగ్రమూకలు ఏమాత్రం వెనుకాడకుండా భారత సైన్యంపై కాల్పులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే జమ్ము కాశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో నిన్న (సోమవారం) అర్థరాత్రి దాటాక భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టెర్రరిస్టులు సంచరిస్తున్నారనే ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు దేసా అడవుల్లో ఇండియన్ ఆర్మీ, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ కొనసాగించారు. టెర్రరిస్ట్‌ల ఏరివేతకు అదనపు బలగాలను భారీగా మోహరించారు. అయితే, ఈ క్రమంలోనే గాలింపు చర్యలను భారత సైనికులు, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు.. అందులో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. కాగా, టెర్రరిస్టులు, ఇండియన్ సైనికులకి మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, దోడా ప్రాంతంలో గత 35 రోజుల్లో ఇది నాలుగో ఎన్‌కౌంటర్ అని స్థానిక పోలీసులు ప్రకటించారు.

రిపబ్లికన్‌ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌.. వైస్ ప్రెసిడెంట్..?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ను ఎంపిక చేశారు. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులందరూ కలిసి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు ఇచ్చారు. అదే టైంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్‌ జెడీ వాన్స్‌ పేరును కూడా ట్రంప్‌ వెల్లడించారు. దీంతో నవంబరులో జరగబోయే ఎన్నికకు రిపబ్లికన్ పార్టీ తరఫున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఇప్పటికే ఖరారైనట్లైంది. ఎంతో ఆలోచించి, అందరి యోగ్యతలను మదించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్‌ తగిన వ్యక్తి అని రిపబ్లికన్ పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు. కాగా, మెరైన్‌ విభాగంలో అమెరికాకు వాన్స్ సేవలందించారు అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన ఆయన యేల్‌ లా విశ్వవిద్యాలయం పట్టభద్రుడు కూడా అని చెప్పుకొచ్చారు. యేల్‌ లా జర్నల్‌కు సంపాదకుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.. వాన్స్ రచించిన ‘హిల్‌బిల్లీ ఎలెజీ’ బుక్ అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు దీనిపై సినిమా కూడా తీశారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్త వాన్స్ అని ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో వ్రాసుకొచ్చాడు. అయితే, 39 ఏళ్ల వాన్స్‌ 2022లో అమెరికా సెనేట్‌కు ఎంపికయ్యాడు. మొదట్లో ట్రంప్‌ విధానాలను విమర్శిస్తూ వచ్చిన.. ఆ తర్వాత అతడికి విధేయుడిగా మారిపోయారు.. డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన ఒక రోజు తర్వాత- రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులను ఖరారు చేసింది.

శ్రీలంక పర్యటన.. భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్స్!
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి జోష్‌లో ఉన్న భారత్.. జింబాబ్వేపై 4-1తో టీ20 సిరీస్‌ను గెలిచింది. ఇక శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది. లంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జులై 26 నుంచి టీ20 సిరీస్.. ఆగస్టు 1 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానున్నాయి. అయితే ఈ టూర్‌లో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అని చాలా మంది అంటున్నారు. టీ20 ప్రపంచకప్‌ 2024 అనంతరం రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అద్భుత ప్రదర్శనతో జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. గతంలో కూడా టీమిండియాకు అతడు సారథ్యం వహించాడు. కెప్టెన్సీ రేసులో హార్దిక్ ముందున్నప్పటికీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌దే తుది నిర్ణయం అని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

పారిస్ ఒలింపిక్స్‌లోని భారత అథ్లెట్లకు కోహ్లీ శుభాకాంక్షలు.. (వీడియో)
పారిస్ 2024 ఒలింపిక్స్‌ లో పాల్గొననున్న భారత అథ్లెట్లకు టీమిండియా స్టార్ బాట్స్మెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ అథ్లెట్లు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారని కోహ్లి సోషల్ మీడియాలో ప్రోమోలో ఆశాభావం వ్యక్తం చేశాడు. టోక్యో 2020 ఒలింపిక్స్‌ లో జావెలిన్ త్రో ఈవెంట్‌ లో బంగారు పతకాన్ని గెలుచుకున్న నీరజ్ చోప్రాకు కోహ్లి ధన్యవాదాలు తెలిపాడు. రాబోయే గేమ్‌ ల కోసం చోప్రా టాప్ పొజిషన్ లో ఉండేందుకు యూరప్‌ లో కఠోర శిక్షణ తీసుకుంటున్నాడు. అతను జాకబ్ వాడ్లెడ్జ్, అండర్సన్ పీటర్స్, పాకిస్తాన్ ఆటగాడు అర్షద్ నదీమ్ నుండి కఠినమైన సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. కోహ్లి షేర్ చేసిన వీడియో ఒక దేశంగా భారతదేశం యొక్క పురోగతిని హైలైట్ చేసింది. ప్రజాస్వామ్యం, క్రికెట్, బాలీవుడ్, వ్యాపార విజయాలకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఎలా ప్రసిద్ధి చెందిందనే దాని గురించి ఆయన మాట్లాడారు. ప్యారిస్ వెళ్లే క్రీడాకారులు పతకాలు సాధించి భారత్ గర్వపడేలా చేస్తారని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

రికీ పాంటింగ్ ఔట్.. నెక్స్ట్‌ టార్గెట్‌ రిషబ్ పంత్!
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైన విషయం తెలిసిందే. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ 14 మ్యాచ్‌లలో 7 విజయాలు సాధించి.. లీగ్ దశ నుంచే ఇంటిదారి పట్టింది. దాంతో ఢిల్లీ యాజమాన్యం కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే ఢిల్లీకి కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్‌పై వేటు వేసింది. ఏడేళ్లుగా ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవడంతో ఢిల్లీ ఫ్రాంఛైజీ యజమానులు పాంటింగ్‌ను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నెక్స్ట్‌ టార్గెట్‌ రిషబ్ పంత్ అని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్.. ఐపీఎల్ 2024తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఢిల్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న పంత్.. విజయాలు కూడా అందించాడు. అయితే రెండో భాగంలో డీసీకి వరుస పరాజయాలు ఎదురవడంతో.. ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. గత మూడు సీజన్లలో ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. ఈ క్రమంలో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మొదటి బాధితుడిగా మారాడు. ఇక ఇప్పుడు పంత్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఐపీఎల్ 2025 సీజన్‌ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ వదిలేయనుందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

హాస్యనటుడి నుండి అందరూ మెచ్చే హీరోగా మారిన దర్శి..!
హాస్యనటుడుగా పెళ్లిచూపులు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రియదర్శి . కమెడియన్ రోల్స్ మాత్రమే కాకుండా కథా బలం ఉన్న పలు వెబ్ సిరీస్ లు నటిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దర్శి. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి. గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశం సినిమాలో తన నటనతో అందరి ప్రశంసలు పొందాడు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన బలగం చిత్రంతో ఆడియెన్స్ మెప్పు పొందడమే కాకుండా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో నిర్మాతలు దర్శితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డితో  “డార్లింగ్” అనే సినిమా చేసాడు ఈ హీరో. దర్శికి జోడిగా అందాల నటి నభా నటేశ్‌ నటిస్తోంది. ఈ చిత్రం ప్రీ – రిలీజ్ ఈవెంట్ గత రాత్రి పార్క్ హయత్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.