NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్‌ రంగంలోని సంక్షోభం.. ఇలా వరుసగా ఇప్పటి వరకు మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మరో శ్వేత పత్రం విడుదలకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు 4వ శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు… గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయను్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అంటే, గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో జరిగిన భూములు, ఇసుక, సహజ వనరుల దోపిడీపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ల్యాండ్‌ టైటిలింగ్ చట్టం ద్వారా ఎలాంటి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం తెరలేపింది అనే అంశాన్ని ప్రస్తావించనున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, ఇష్టానుసారంగా ఇసుక, ఇతర ఖనిజ వనరుల్ని దోపిడీ చేశారని, భూములు కబ్జా చేశారని అలాగే ఎర్రచందనం వంటి అరుదైన వనరులనూ దోచుకున్నారని ఆరోపణలు చేస్తూ వచ్చారు కూటమి నేతలు.. ఈ అంశాలపై పూర్తి వివరాలు ప్రజలకు తెలిసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారని చెబుతున్నారు.

కువైట్‌లో కార్మికుడి కష్టాలు.. స్పందించిన మంత్రి లోకేష్.. హామీ..
కువైట్‌లో వేధింపులకు గురై దుర్భర జీవితం గడుపుతున్నానంటూ ఓ తెలుగు కార్మికుడు సోషల్‌ మీడియాలో పెట్టిన వీడియోపై స్పందించారు మంత్రి నారా లోకేష్‌.. తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ బాధితుడు సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్‌ చేసిన విషయం విదితమే కాగా.. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని.. తెలుగుదేశం ఎన్​ఆర్​ఐ బృందం ఆయనను చేరుకుందని మంత్రి లోకేష్‌ తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితున్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కాగా, అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి చెందిన శివకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. శివ సొంత ఊరు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు అయితే.. పెళ్లి తర్వాత జీవనోపాధి కోసం తన అత్తగారి ఊరు అయినటువంటి పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామానికి ఇల్లరికం వచ్చాడు.. ఆ తర్వాత జీవనోపాధి కోసం గల్ఫ్ కంట్రీ కువైట్ కు వెళ్లాడు.. నెల క్రితం గొర్రె కాపరిగా చేరినట్టు తెలుస్తోంది.. అయితే అక్కడ అనేక ఇబ్బందులు పడి ఎడారిలో నీటి వసతి లేని చోట.. కరెంటు కూడా లేని చోట.. ఆ కువైట్ యజమాని పెట్టడంతో విధి లేని పరిస్థితిలో సోషల్ మీడియా ద్వారా.. వాట్సాప్ ద్వారా తన మనోవేదనను, బాధను వీడియో రూపంలో విడుదల చేశాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది.. ఇక, కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేష్.. శివను స్వగ్రామానికి రప్పించే విషయంపై చర్చించారు.. మొత్తంగా శివను స్వరాష్ట్రానికి రప్పిస్తామని హామీ ఇచ్చారు.

భారీ వర్షాలు.. గండి పోచమ్మ ఆలయాన్ని తాకిన వరద నీరు
ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. మరోవైపు గోదావరి నదిలో వరద పోటెత్తింది. దీంతో.. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన గండి పోచమ్మ ఆలయాన్ని తాకింది వరదనీరు.. అమ్మవారి దేవస్థానం మండపం సమీపానికి పోటెత్తిన వరద నీరు ప్రవహిస్తోంది.. స్నానాల ఘాటు వద్ద మెట్లు పూర్తిస్థాయిలో నీటమునిగాయి.. మరోపక్క గండి పోచమ్మ ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గంలో దండింగి గ్రామం వద్ద రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరింది.. అయితే, ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గం లేక భక్తులు తీర్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇక, గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున స్నానాల రేవులు మూసివేయడమైనది.. ఫోటోలకు గానీ, సెల్ఫీలకు గానీ.. మరే ఇతర పనులకు గానీ.. గోదావరి ఒడ్డులకు గానీ, గోదావరి దరిదాపులకు గానీ వెళ్లరాదు అంటూ.. ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖ ఓ హెచ్చరిక బోర్డును గండిపోచ్చమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది.. మరోవైపు.. అల్లూరి జిల్లా ముంచింగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయితీ కర్లపొదర్ వద్ద మత్యగెడ్డ వాగు పొంగిపొర్లుతుంది.. వాగు అవతల పశువుల మంద చిక్కుకుంది.. ప్రమాద కర పరిస్థితుల్లో మేకల మందను వాగు దాటించారు గ్రామస్తులు… వాగు అవతల సుమారు ఇరవై గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. ప్రతీ ఏటా వర్షాకాలంలో వాగు పొంగితే గ్రామాల్లో మగ్గిపోయే పరిస్థితి ఉంది.. గతంలో ఇదే వాగు వర్షాలు ధాటికి వాగు పొంగి పశువుల మంద సహా స్థానికులు కొంతమంది మూడు రోజులు కొండ పై ఉండిపోయిన పరిస్థితి ఉంది.

నేడు సుప్రీం కోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ.. సర్వత్రా ఆసక్తి
విద్యుత్‌ కమిషన్‌పై మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై నేడు సీజేఐ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కోరుతూ గతంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు కమిషన్‌ ఏర్పాటును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కేసీఆర్‌ చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. దానిని హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కేసీఆర్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ప్రక్రియ, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం తదితరాలను విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్.. కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించింది.

నేడు వరంగల్ లో రైతు భరోసాపై సదస్సు.. 250 మంది రైతులకు ఆహ్వానం
నేడు వరంగల్ జిల్లాలో రైతు భరోసాపై సదస్సు జరగనుంది. రైతు భరోసా పథక విధివిధానాలపై నేడు హనుమకొండ కలెక్టరేట్ లో రైతు భరోసా పథకంపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో పూర్తి చేశారు. రైతు భరోసా పథకంపై వివిధవర్గాల నుంచి వస్తున్న అభిప్రాయాలను సేకరించి.. రైతు బంధు ఎవరికి ఇవ్వాలనే ఆలోచనతో ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారు. ఈ మంత్రి వర్గ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బా బుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్శాఖ మంత్రి సీతక్క సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో రైతుభరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతరవర్గాల నుంచి మంత్రి వర్గ ఉప సంఘం అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి సమర్పించనుంది. రైతు భరోసా సదస్సుకు ఉమ్మడి వరంగల్ నుంచి 250 మంది రైతులను ఆహ్వానించారు. ఈ రైతులతో రైతు బంధు పథకం ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనే దానిపై చర్చించనున్నారు.

యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరిప్రదక్షిణ వన మహోత్సవం..
తెలంగాణ కొలువుదీరిన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రానికి ప్రతినెలా గిరిప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత నెలలో చేపట్టిన గిరిప్రదక్షిణలో అనూహ్యంగా 10 వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం జరిగిన ప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొండ చుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర కొనసాగే ఈ గిరి ప్రదక్షిణ ఉదయం 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ సందర్భంగా వ్రత మండపం, సంస్కృత పాఠశాల, అన్నదాన సత్రం, గిరిప్రదక్షిణ రహదారికి ఇరువైపులా, మల్లాపురంలోని గోశాల తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక ఆదివారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులతో యాదగిరికొండ కిక్కిరిసిపోయింది. ఆషాడ మాసం అయినప్పటికీ వారాంతపు సెలవులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వాహనాల్లో యాదగిరికొండకు చేరుకుని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. సుమారు 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు రావడంతో ప్రత్యేక, ధర్మదర్శనం క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ టికెట్ దర్శనానికి గంట, ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. వివిధ శాఖల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 45,68,806 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.

ఇంతకీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో ఏం దొరికింది ?
12వ శతాబ్దంలో నిర్మించిన జగన్నాథ ఆలయ రత్న భాండాగారంలోని సంపద లెక్కింపు మొదలైంది. నిన్న మధ్యాహ్నం ఓ శుభ ముహూర్తంలో 46 ఏళ్ల తర్వాత ఈ రత్న భాండాగారం తలుపు తెరుచుకుంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రతినిధులతోపాటు 11 మంది హాజరయ్యారు. ఖజానా తెరవడానికి ముందు, పూరీ పరిపాలన 6 ప్రత్యేక పెద్ద పెట్టెలను ఆర్డర్ చేసింది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. గర్భగుడి పక్కనే జగన్నాథ దేవాలయం రత్న భాండాగారం నిర్మించబడింది. రత్న భండార్ తలుపులు చివరిగా 1978లో తెరవబడ్డాయి. ఆడిట్‌లో 149.6 కిలోలకు పైగా విలువైన రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాలు, 258.3 కిలోల వెండి పాత్రలు, ఇతర వస్తువులు ఉన్నాయని ఒడిశా ప్రభుత్వం తెలిపింది. ఆదివారం ఆగమ శాస్త్రం ప్రకారమే అన్ని పనులు చేశామని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన (SJTA) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధి చెప్పారు. ముందుగా రత్న భండారం బయట ఉన్న గదిని తెరిచి అక్కడ ఉంచిన నగలు, విలువైన వస్తువులను ఆలయంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూంలోకి మార్చారు. ఆ తర్వాత స్ట్రాంగ్‌రూమ్‌కు సీల్‌ వేశారు.

భర్త వేరే కలర్ లిప్ స్టిక్ తెచ్చాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య
చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. కాకపోతే తర్వాత వారి మధ్య సయోధ్య కుదురుతుంది. లిప్‌స్టిక్‌ విషయంలో భార్యాభర్తలు గొడవపడి విషయం పోలీసులకు చేరింది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా.. అవును, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ భర్త తన భార్యకు లిప్ స్టిక్ బహుమతిగా తీసుకొచ్చాడు. లిప్‌స్టిక్‌ని చూడగానే భార్య చాలా సంతోషిస్తుందని భర్త ఆలోచించాడు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగింది. నాకు ఈ రంగు నచ్చదు. మీరు మరొక రంగు లిప్‌స్టిక్‌ని తీసుకురండి అని తేల్చి చెప్పింది. దీంతో భర్త ఇది కూడా ఉంచుకో.. ఇంకొకటి తెస్తాను. అయితే ఇది విన్న అతని భార్య గొడవపడి అతన్ని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లింది. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దంపతులను కౌన్సెలింగ్‌కు పిలిచారు. మాకు అంత ఆదాయం అంతంత మాత్రమేనని భార్య చెప్పింది. మెరూన్ కలర్ లిప్ స్టిక్ ఇచ్చి ఎరుపు రంగు లిప్‌స్టిక్‌ తీసుకురమ్మని నా భర్తకు చెప్పాను. కానీ వారికి డబ్బు మీద గౌరవం లేదు. వారు నా మాట వినడం లేదు. ఇది ఉంచుకో మరొకటి కూడా తెస్తానని చెప్పాడు. ఇది కేవలం వృధా ఖర్చు, కాదా? అని ప్రశ్నించింది. దీనిపై భర్త మాట్లాడుతూ.. మహిళల మేకప్ వస్తువుల గురించి తనకు పెద్దగా తెలియదన్నారు. తను తెచ్చిన లిప్ స్టిక్ ప్రేమతో తెచ్చాడు. అతనికి ఆ రంగు నచ్చింది. నా భార్య పెదవులపై అది రాసుకుంటే మరింత అందంగా కనిపిస్తుందని అనుకున్నాను. కానీ అతని భార్య లిప్ స్టిక్ మార్చమని కోరింది. రెడ్ లిప్ స్టిక్ కూడా తెచ్చి ఉండేవాడిని. కానీ నాకు ఈ రంగు కూడా నచ్చిందన్నారు.

నేడు నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణస్వీకారం..
నేపాల్ మాజీ ప్రధాన మంత్రిగా కేపీ శర్మ ఓలి మరోసారి గద్దెనెక్కనున్నారు. ప్రస్తుత ప్రధాని పుష్పా కమల్ దహల్ విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో నేపాల్ ప్రధాని పీఠం కేపీ శర్మ ఓలికి దక్కింది. ఓలిని ప్రధానిగా కూటమి నేతలు అంగీకరించారు. దీంతో ఓలిని కొత్త ప్రధానిగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఎంపిక చేశారు. ఇవాళ ( సోమవారం) ప్రధానిగా కేపీ శర్మ ఓలి మరో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, నేపాల్ లో సంకీర్ణ సర్కార్ అధికారంలో ఉంది.. ఒప్పందం ప్రకారం ప్రధానిగా ఉన్న ప్రచండ అధికార బదలాయింపుకు ఒప్పుకోకపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్- యూనిఫైడ్ మార్క్సిన్స్ లెనినిస్ట్ తమ మద్దతును వెనక్కి తీసుకుంది. దీంతో ప్రచండ విశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రచండకు మద్దతుగా కేవలం 63 మంది మాత్రమే ఓట్లు వేయడంతో ఆయన ఓడిపోయారు. కాగా, నేపాల్ లో కొత్త ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్.. నేపాల్ కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. సభలో అతి పెద్ద పార్టీగా ఉన్న నేపాల్ కాంగ్రెస్ తో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్- యూఎంఎల్ పార్టీ వారం క్రితం సర్కార్ ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రచండకు మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు. ఈ ఒప్పందం తర్వాత నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బా, ఓలిని తదుపరి ప్రధాన మంత్రిగా ఆమోదిస్తున్నట్లు వెల్లడించారు. వీరి మధ్య ఒప్పందం ప్రకారం 18 నెలలు ఓలి.. ఆ తర్వాత మిగిలిన కాలం దేవ్‌బా ప్రధాని పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా 275 మంది సభ్యులున్న నేపాలీ పార్లమెంట్ లో నేపాలీ కాంగ్రెస్ కు 89 సీట్లు ఉండగా.. సీపీఎస్-యూఎంఎల్ కి 78 సీట్ల సంఖ్య బలం ఉంది. ఇరు పార్టీలు కలవడంతో ఆ సంఖ్య మెజారిటీకి అవసరమైన (138) సీట్లు కంటే ఎక్కువగా ఉంది.

అంబానీ సర్.. మీరు విరాట్ కోహ్లీని కొనలేరు!
అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక మర్చంట్‌ల వివాహం జులై 12న అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. టీమిండియా క్రికెటర్లు చాలామంది అనంత్-రాధికల పెళ్లికి హాజరైనా.. ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం హాజరుకాలేదు. ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్.. టీమిండియా ఆటగాళ్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్.. భారత మాజీ ప్లేయర్స్ సచిన్ టెండ్యూలర్, ఎంఎస్ ధోనీ ఇలా చాలామంది అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహంలో సందడి చేశారు. అయితే ఈ పెళ్లికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం రాలేదు. టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం లండన్‌లో తన కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లాడు. అంబానీ ఇంట్లో పెళ్లికి విరాట్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాంతో సోషల్ మీడియాలో విరాట్ ఫాన్స్ జోకులు పేల్చుతున్నారు. ‘ముఖేశ్ అంబానీ సర్.. మీరు ఎన్ని కోట్లు ఖర్చు చేసినా మా విరాట్ కోహ్లీని కొనలేరు’ అని ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రిల్ చేశాడు. ఆ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నాగి vs సందీప్ బ్లడ్ వార్…ఇంతకీ తప్పెవరిది..?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898ఎడి.  ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. కాగా కల్కి చిత్రం సూపర్ హిట్ అయి వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సందర్భంగా  దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసాడు. బ్లడ్, భూతు, అశ్లీలత, రెచ్చగొట్టే వంటి అంశాలు లేకుండా తీసిన మా చిత్రాన్ని ఆదరించి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు, సినీ నటులకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు, రేపటికోసం.. అంటూ చేసిన ఒక పోస్ట్ ఇద్దరి దర్శకుల అభిమానుల మధ్య వివాదానికి కారణం అయింది.  నాగి చేసిన పోస్ట్ యానిమ‌ల్‌ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డిని ఉద్దేశించి చేసాడని, సందీప్ రెడ్డి రీసెంట్ హిట్ ‘యానిమ‌ల్‌’ చిత్రంలో  భూతు, బ్లడ్, ఆడవారిని తక్కువ చేసి చూపించడం వంటివి ఎక్కువ మోతాదులో చూపించాడు. నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సందీప్ ను ఉద్దేశించినవే అని కామెంట్లు పెడుతున్నారు. నాగ్ అశ్విన్ చేసిన ఆ పోస్ట్ వివాదానికి కారణామవడంతో  కాసేపటి తర్వాత  ఆ పోస్ట్ ను తొలగించాడు. కానీ అప్పటికే జరగాల్సిన రచ్చ జరిగింది. కానీ అసలు ఈ వివాదం సందీప్ మొదలెట్టాడని గతంలో యానిమ‌ల్‌ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ “మహానటి చిత్రాన్నీ చూశాను, నేను అయితే ఇంకోలా తీసేవాడిని, భవిష్యత్తులో మహానటి లాంటి సినిమా చేసి ఇంకా బెటర్ గా  తీస్తాను”  అనే భావం వచ్చేలా అన్నాడు. అప్పటి  సందీప్ కామెంట్స్ కు కౌంటర్ ఇప్పడు కల్కితో సమాధానం ఇచ్చాడని డిబేట్ చేస్తున్నారు నాగి ఫ్యాన్స్. సందీప్ రెడ్డి ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ చిత్రంతో కల్కి రికార్డులు బద్దలు కొడతాడని సందీప్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఒక పోస్ట్ తో ఇద్దరు సూపర్ హిట్ డైరెక్టర్ల మధ్య అగ్నికి ఆజ్యం పోసింది.