NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మన్యంలో ఏనుగుల బీభత్సం.. గుంపులు గుంపులుగా వచ్చి..
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు అలజడి సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి దాడి చేస్తున్నాయి.. బీభత్సం సృష్టిస్తున్నాయి.. కురుపాం మండలంలోని గిరిశిఖర ప్రాంతంలో ఒక గుంపు, జియ్యమ్మవలస, కొమరాడా, గరుగుబిల్లి మండలాలలో ఒక గుంపు గిరిజనులకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గరుగుబిల్లి మండలంలోని ఒక ఏనుగుల గుంపు మిల్లులో చొరబడి బీభత్సం సృష్టించిన ఘటన మరువక ముందే కురుపాం మండలం పట్టాయిగూడ గిరిజన గ్రామంలోనికి ఏనుగులు చొరబడటంతో గిరిజనులు భయంతో పరుగులు తీశారు. ఏ క్షణం తమపై ఏనుగులు దాడి చేస్తాయో అని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పండిస్తున్న పంటలను ధ్వంసం చేస్తూ తీరని నష్టాన్ని కలిగిస్తున్న ఏనుగులు ఇప్పుడు జనావాసాల్లోనికి రావడంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే ఏనుగులను తరలించి తమ పంటలను, ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, మన్యం జిల్లాలో తరచూ ఈ ఏనుగుల గుంపులు వచ్చి పంటలు ధ్వంసం చేస్తూనే ఉన్నాయి.. దీంతో.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. మరోవైపు.. ఏనుగుల కట్టడికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చర్యలు ప్రారంభించారు.. ఈ మధ్యే.. కర్ణాటక వెళ్లి.. ఆయన ఏనుగుల విషయంపై చర్చించిన విషయం విదితమే.

ఏపీ రైతులకు శుభవార్త.. ఇవాళే నిధులు విడుదల
రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. గత రబీ సీజన్‌లో ధాన్యం విక్రయించి.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తీపికబురు చెప్పింది కూటమి ప్రభుత్వం.. పాత బకాయిలను అందించడానికి ఇవాళ్టి నుంచి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్‌.. ఈ రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఈ రోజు పర్యటించనున్నారు.. ఇక, తన పర్యటనలో భాగంగా.. కలెక్టరేట్‌లో జరిగే ఒక కార్యక్రమంలో రైతులకు ధాన్యం బకాయిలకు సంబంధించిన చెక్కులను అందజేయనున్నారు. మొత్తంగా ఏపీలో ఇవాళ ధాన్యం రైతులకు 674 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఉదయం ఏలూరు, సాయంత్రం అమలాపురంలో రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. గత ప్రభుత్వంలో రబీ ధాన్యం విక్రయించిన రైతులకు 1,674 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది.. అయితే, రెండు విడతలుగా ధాన్యం బకాయిలు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. ధాన్యం డబ్బులు చెల్లించాలంటూ కోనసీమ కలెక్టరేట్ వద్ద పలు సార్లు రైతులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి.. కోనసీమ జిల్లాలో రబీ పంటకు సంబంధించి 19,652 మంది రైతుల నుంచి ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు కొనుగోలు చేశారు. వారికి రూ.355.88 కోట్లను అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 10,823 మంది రైతులకు సంబంధించి రూ.201.25 కోట్లను రైతులకు పంపిణీ చేశారు. ఇక మిగిలిన 8,829 మంది రైతులకుగాను రూ.192 కోట్లను ఈ రోజు అమలాపురంలోని కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈ బకాయిలను అందించనున్నారు..

పెళ్లి ఇంట విషాదం.. తెల్లారితే పెళ్లి అనగా విద్యుత్‌ షాక్‌తో…
పెళ్లిబాజాలు మోగాల్సిన ఇంటిలో చావు డప్పులు మోగిన ఘటన మన్యం జిల్లా గౌరీపురం గ్రామంలో చోటుచేసుకుంది. తెల్లవారితే తన తమ్ముడు లక్ష్మణరావు వివాహం జరిపేందుకు అన్న చంద్రశేఖర్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి.. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. ఈ రోజు ఉదయం 11 గంటలకు పెళ్లి చేయడానికి సిద్ధపడి ఏర్పాట్లలో మునిగిపోయారు.. అయితే, రాత్రి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో పెళ్లి కుమారుడి అన్న చంద్రశేఖర్‌ మృతి చెంది అనంతలోకాలకు వెళ్లిపోయాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ చంద్రశేఖర్ మరణించినట్లు వైద్యులు నిర్దారించారు. తండ్రి లేనప్పటికి తండ్రిలా చూసుకునే అన్న మరణించడంతో పెళ్లి ఇంట తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తన అన్నను కోల్పోయి పెళ్లికుమారుడు లక్ష్మణరావును ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు..

హైదరాబాద్ లో జోరువాన.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిర్మల్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెంలలో వర్షం కురుస్తుంది. భాగ్యనగరం హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సికింద్రాబాద్‌లోనూ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. నిన్న ఆదివారం రాత్రి నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, హైటెక్ సిటీ, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షంతో వాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేశారు.

కవిత బెయిల్ పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఇప్పటికే కవితకు బెయిల్ ను ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.. దాంతో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసులో నిందితులుగా ఉన్న 50 మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం, తల్లిగా బిడ్డ బాగోగులు చూడాల్సి ఉండడంతో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత చేసిన వాదనలను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు అదే అంశాల ఆధారంగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!
బిహార్‌లోని జెహానాబాద్‌ జిల్లా మగ్ధుంపూర్‌లోని బాబా సిద్ధనాథ్‌ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని జెహనాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే సోమవారం ఉదయం తెలిపారు. మృతుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని, అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నట్లు చెప్పారు. గాయపడిన వారిని మగ్ధుంపూర్‌, జెహనాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు.

అలర్ట్.. భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం
ప్రతి వారం కొన్ని గ్రహశకలాలు భూమి వైపు వస్తూనే ఉంటాయి. ఈ నెల ప్రారంభం నుంచి అనేక గ్రహశకలాలు భూమికి సమీపంలోకి వచ్చి వెళ్లాయి. ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొనే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే పెను విపత్తు సంభవించవచ్చు. నీలి తిమింగలం ఆకారంలో ఉన్న ఓ గ్రహశకలం భూమి వైపు వేగంగా కదులుతున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. ఈ కొత్త గ్రహశకలం అత్యంత వేగంతో భూమి వైపు కదులుతోంది. దీని పేరు 2024 PK2.. ప్రస్తుతం అది భూమికి దగ్గరగా వచ్చే మార్గంలో ఉంది. ఇది ఈ రోజు రాత్రి భూమికి దగ్గరగా రానుంది. ఈ గ్రహశకలాల పరిమాణం 83 అడుగులు ఉంటుందని.. పెద్ద తిమింగళం పరిమాణంలో ఉంటుందని నాసా తెలిసింది. దీని గురించి నాసా కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఈ గ్రహశకలాలపై ఓ కన్నేసి ఉంచారు. అయితే ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం లేకపోలేదు.. అయితే దీని తర్వాత కూడా స్పేస్ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ఈ గ్రహశకలం అటెన్ సమూహంలో భాగం, ఇది తరచుగా భూమి కక్ష్యను కలుస్తున్న గ్రహశకలాల సమూహం. ఈ గ్రహశకలం గంటకు 19,500 మైళ్ల (గంటకు 31,380 కిలోమీటర్లు) వేగంతో భూమికి సమీపంలోకి వస్తోంది. గ్రహశకలం ట్రాక్ చేయడానికి, నాసా ఇతర అంతరిక్ష సంస్థల సహకారంతో టెలిస్కోప్‌లు.. అధునాతన కంప్యూటింగ్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది.

లగ్జరీ కారు కొన్న మియా భాయ్.. ఎన్ని కోట్లంటే.?
భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కొత్త ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. సిరాజ్ ఈ SUV ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. తన డ్రీమ్ కారును కొనుగోలు చేయడం గురించి అభిమానులకు తెలియజేశాడు. ఫోటోతో పాటు, కలలకు హద్దులు ఉండకూడదని రాసి హృదయాన్ని హత్తుకునే పోస్ట్‌ను కూడా పోస్ట్ చేశాడు. మహ్మద్ సిరాజ్ కొత్త ల్యాండ్ రోవర్ SUV డెలివరీ తీసుకుంటున్న ఫోటోను పంచుకున్నారు. ఈ పోస్ట్ లో అతను ” మీ కలలను పరిమితం చేయవద్దు, ఎందుకంటే ఇవి మిమ్మల్ని కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తాయి” అంటూ రాసుకొచ్చాడు.

15 కోట్లు మోసం చేశాడంటూ.. ఎంఎస్ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదు!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదైంది. ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ నిర్వహణ విషయంలో ధోనీ తనను రూ.15 కోట్ల మేర మోసం చేశాడని ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. బీసీసీఐ ఎథిక్స్ కమిటీ రూల్ 36 కింద కేసును నమోదు చేసుకొని.. ఆగస్ట్ 30లోపు వివరణ ఇవ్వాలని ధోనీని బీసీసీఐ ఆదేశించింది. ఈ విషయంపై ధోనీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 2017లో ఎంఎస్ ధోనీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీ నడిపేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలోని షరతులను పాటించడంలో కంపెనీ విఫలమైంది. ఆర్కా స్పోర్ట్స్‌కు చెందిన మిహిర్‌ దివాకర్‌, సౌమ్య విశ్వాస్‌తో చర్చించినా ఫలితం లేకపోవడంతో ఆ ఒప్పందం నుంచి మహీ వైదొలిగాడు. 2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను రద్దు చేసుకున్నాడు. దాదాపు రూ. 15 కోట్ల మేర తనకు రావాలని పలుమార్లు లీగల్‌ నోటీసులు పంపించినా.. అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ధోనీ రాంచీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కేసు విచారాణలో ఉంది.

ముగిసిన పారిస్‌ ఒలింపిక్స్‌.. 40 స్వర్ణాలతో టాప్‌లో అమెరికా! భారత్ స్థానం ఎంతంటే
పారిస్‌ వేదికగా గత 19 రోజులుగా అలరించిన ఒలింపిక్స్ ముగిశాయి. ప్రపంచంలో అత్యున్నత క్రీడలుగా భావించే ఒలింపిక్స్‌ ముగింపు వేడుకలు సైతం ఆదివారం అర్ధరాత్రి ఘనంగా ముగిశాయి. జులై 26న విశ్వ క్రీడలు ప్రారంభం కాగా.. ఆగష్టు 11న క్లోజ్ అయ్యాయి. సెన్‌ నది వేదికగా ఒలింపిక్స్ వేడుకలకు బీజం పడగా.. స్టేడ్‌ డి ఫ్రాన్స్‌ స్టేడియంలో సమాప్తమయ్యాయి. నృత్యకారులు, సంగీత కళాకారులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. భారత్‌ తరఫున షూటర్‌ మను బాకర్‌, హాకీ దిగ్గజం పీఆర్‌ శ్రీజేష్‌ పతకధారులుగా వ్యవహరించారు. 2028 ఒలింపిక్స్‌ పోటీలు లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరగనున్నాయి. పారిస్‌ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో 329 స్వర్ణ పతకాలకు 206 దేశాలకు చెందిన 10,714 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. అగ్రరాజ్యం అమెరికా 40 స్వర్ణాలతో టాప్‌లో నిలిచింది. చివరి రోజు చైనాను వెనక్కి నెట్టిన యూఎస్.. పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఒలింపిక్స్‌ చివరి పోటీలు అయిన మహిళ బాస్కెట్‌బాల్‌లో అమెరికా జట్టు స్వర్ణ పతకాన్ని గెలిచి తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. 40 స్వర్ణ పతకాలు సహా మొత్తంగా 126 పతకాలను యూఎస్‌ సాధించింది. డ్రాగన్ దేశం చైనా 40 స్వర్ణాలు పాటు మొత్తం 91 పతకాలను తన ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో నిలిచింది. జపాన్‌ 20 బంగారు పతకాలతో మూడు స్థానంలో నిలిచాయి. గత టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచిన భారత్‌.. ఈసారి 71వ స్థానంకు పడిపోయింది. మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనగా.. ఆరు పతకాలు వచ్చాయి. ఇందులో ఒక రజతం, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి.

హమ్మయ్య.. ఆ సినిమాకు ఇక టెన్షన్ తీరిపోయినట్టే..
టాలీవుడ్ లో హిట్ ఇస్తే ఒకలా ఫ్లాప్ ఇస్తే ఒకలా ఉంటుంది వ్యవ్యహారం. వరుస హిట్లు ఇచ్చి ఒక్క ఫ్లాప్ ఇస్తే తరువాత సినిమా దర్శకత్వం అవకాశం ఇచ్చేందుకు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు హీరోలు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ లు తీసిన పూరి జగన్నాధ్ ఒకే ఒక ఫ్లాప్ సినిమాతో కథ మొత్తం మారిపోయింది. పూరి విజయ్ దేవరకొండ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా ఈ దర్శకుడి తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ కు తలనొప్పిగా మారింది. లైగర్ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించాడు. పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీ డిజాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. ఈ సినిమాను నైజాంలో పంపిణి చేసిన బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడం, నష్టపరిహారం చెల్లిస్తానని పూరి లెటర్స్ ఇవ్వడం అప్పట్లో జరిగింది. దీంతో ఆ బయ్యర్స్ డబుల్ ఇస్మార్ట్ ను తమకే ఇవ్వాలని పంచాయతీ పెట్టారు. లేదంటే నైజాం లో ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమా పంచాయతీ ఒక కొలిక్కి వచ్చింది. లైగర్ ఎగ్ఙిబిటర్లకు నలభై శాతం నష్టాలు భర్తీ చేయడానికి నిర్మాతలు పూరి, ఛార్మి ఒప్పుకోవడంతో సమస్య తీరింది. నైజాం వ్యవహారం ఎటూతేలక పోవడంతో డబుల్ ఇస్మార్ట్ కు రిలీజ్ ఇబ్బంది అవుతుందేమోనని రామ్ ఫ్యాన్స్ టెన్షన్ పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాకు లైగర్ కష్టాలు తీరిపోయినట్లే. మరోవైపు ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది పూరి జగన్నాధ్, రామ్ పోతినేనిల డబుల్ ఇస్మార్ట్.

మెగా బ్రదర్స్ వస్తున్నారు.. ఇక బాక్సాఫీస్ రికార్డ్స్ గల్లంతే..
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది. అందులో భాగంగానే రీసెంట్ గా మహేష్ బాబు బర్త్ డే ని పురస్కరించుకొని ‘మురారి ‘ సినిమాను రిలీజ్ చేశారు. రీరిలీజ్ లో కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లు నమోదు చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఇంద్ర సినిమా చాలా ప్రత్యేకం. బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు మీద రికార్డులు నమోదు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. జులై 24 నాటికి ఈ సినిమా రిలీజ్ అయి 22 ఏళ్ళు కంప్లిట్ అయింది.  వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు ఇంద్ర సినిమాను గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నాం.” అంటూ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. అన్నయ దారిలోనే మెగా బ్రదర్ సినిమా కూడా రానుంది. పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాప్ లకు బ్రేక్ వేస్తూ సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం గబ్బర్ సింగ్. అప్పట్లో ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రానున్న సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా గబ్బర్ సింగ్ మరోసారి థియేటర్లలో రచ్చ చేయబోతున్నాడు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యే గా గెలవడంతో పాటు,పవన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. దింతో గబ్బర్ సింగ్ రీరిలీజ్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేసారు. పది రోజుల గ్యాప్ లో మెగా బ్రదర్స్ సినిమాలు రీరిలీజ్ కానుండడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.