NTV Telugu Site icon

Top Headlines @ 9 AM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. పద్దు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

నేటి నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనునుంది. ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుంది. 11 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుమారు పది రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. సుమారు 2.7 లక్షల కోట్ల పైగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రమే స‌భ‌కు హ‌జ‌ర‌య్యే అవకాశం ఉంది. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే తాత్కాలిక ప్రాతిపదికన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగియనుండడంతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో కీల‌క బిల్లులు ప్రవేశ‌పెట్టే అవ‌కాశం ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ నిరోధ‌క చ‌ట్టం 1982 రిపిల్ బిల్లు ప్రవేశ‌పెట్టనున్నారు.ల్యాండ్ గ్రాబింగ్ నిరోధ‌క బిల్లు 2024 ను ప్రవేశపెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. దేవాల‌యాల పాల‌క మండ‌లాల్లో ప్రస్తుతం ఉన్న వారికి ఆద‌నంగా మ‌రో ఇద్దరు స‌భ్యులు నియామ‌కం పై బిల్లును ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకువ‌చ్చిన జ్యూడిషియ‌ల్ క‌మిష‌న్ ర‌ద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ‌పెట్టనున్నారు. జ్యుడీషియ‌ల్ అధికారుల ఉద్యోగ ప‌ద‌వి విర‌మ‌ణ వ‌య‌స్సు 60 ఏళ్ల నుండి 61 ఏళ్ల కు పెంచుతూ బిల్లు ప్రభుత్వం ప్రవేశ‌పెట్ట‌నుంది. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ప్రభుత్వ మద్యం దుకాణాల‌ను రద్దు చేస్తు తీసుకువ‌చ్చిన ఆర్ఢినెన్స్ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మ‌ద్యం ధ‌ర‌ల పై బిల్లు ప్రవేశ‌పెట్ట‌నుంది. డ్రోన్ పాలసీ, డేటా పాలసీలపై అసెంబ్లీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

 

ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ.. మూడవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే!
ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’ దిగ్విజయంగా కొనసాగుతోంది. దీపాల పండగలో ఇప్పటికే రెండు రోజులు పూర్తి కాగా.. వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. నేడు కోటి దీపోత్సవంలో మూడవ రోజు. అందులోనూ కార్తిక సోమవారం కాబట్టి.. భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. కార్తిక సోమవారం నాడు కోటి దీపోత్సవంలో విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. కోటి దీపోత్సవంలో మూడవ రోజు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహా స్వామీజీ (వైశ్య గురు మఠము హలదీపూర్ మరియు వారణాసి), శ్రీ శివానంద భారతి స్వామీజీ (కర్ణాటక హోస్పేట చింతామణి మఠం) గారిచే అనుగ్రహ భాషణం ఉండగా.. శ్రీ బంగారయ్య శర్మ గారు ప్రవచనామృతం చేయనున్నారు. వేదికపై శివపరివారానికి కోటి బిల్వార్చన, భక్తులచే శివలింగాలకు కోటి బిల్వార్చన, కోటి దీపోత్సవం వేదికపై జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మహాకాళ్ కల్యాణం, పల్లకీ వాహన సేవ ఉంటుంది. సాయంత్రం 5.30 నుంచి మూడో రోజు విశేష కార్యక్రమాలు ఆరంభమవుతాయి. భక్తులు ముందుగానే ఎన్టీఆర్‌ స్టేడియంకు చేరుకోవచ్చు. దీపాల పండగ సందర్భంగా వేలాది మందితో ఎన్టీఆర్‌ స్టేడియం కళకళలాడుతోంది. నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం జరగనున్న విషయం తెలిసిందే.

 

చిన్న సినిమాలు తీసేవాళ్లకి థియేటర్లు ఇప్పించే బాధ్యత నాది!
నాకు సినిమాలంటే చాలా ఇష్టం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి అర్హులైన సినీ పరిశ్రమ కార్మికులకు చిత్రపురి కాలనీ లేఅవుట్‌లో ఇళ్లు ఇస్తాం అని అన్నారు. చిన్న సినిమాలు తీసేవాళ్లకి థియేటర్లు ఇప్పించే బాధ్యత నాది అని పేర్కొన్న ఆయన తెలంగాణలో ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారని అన్నారు. పాన్ ఇండియా సినిమాలు తీసే సత్తా తెలంగాణ వారికీ ఉందన్నారు. అలాంటి వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీలో 16,000 మంది సభ్యులు ఉన్నారని.. ఇందులో చాలా మంది సభ్యులకు నివాస స్థలాలు లేవని, ఇల్లు లేని సినీ కార్మికులకు ఇళ్లు మంజూరు చేయించాలని మంత్రిని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది. దానికి మంత్రి హామీ ఇచ్చారు.

 

నేటి నుంచి భవానీ దీక్షలు ప్రారంభం
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఉన్న లోక కళ్యాణార్ధమై శ్రీ క్రోధినామ సంవత్సర భవానీ దీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుండి డిసెంబరు 25 వరకు భవానీ దీక్షలు కొనసాగనున్నాయి. దేవస్థాన వైదిక కమిటీ వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నారు. 11.11.2024, కార్తీక శుద్ధ దశమి/ఏకాదశి రోజున ఉ. గం.07-00లకు శ్రీ భవానీ మండల దీక్షాధారణలు ప్రారంభం కానున్నాయి. 15.11.2024: కార్తీక పూర్ణిమ రోజున శ్రీ భవానీ మండల దీక్షాధారణలు సమాప్తి ఉంటుంది. 01.12.2024న శ్రీ భవానీ అర్ధ మండల దీక్షాధారణలు ప్రారంభం కానున్నాయి. 05.12.2024 శ్రీ భవానీ అర్ధ మండల దీక్షాధారణలు సమాప్తి ఉంటుంది. 14.12.2024 – మార్గశిర పూర్ణిమ (రాత్రి గల) రోజున “కలశ జ్యోతి” ఉత్సవము శ్రీ శృంగేరి శారదా పీఠం పరిపాలిత శ్రీ శివరామకృష్ణ క్షేత్రం (రామకోటి), సత్యనారాయణపురం, విజయవాడ నుండి సా. గం.06-30 ని.లకు బయలుదేరి నగరోత్సవముగా శ్రీ అమ్మవారి దేవస్థానమునకు చేరును. డిసెంబరు 21 నుంచీ 25 వరకు దీక్ష విరమణలు ఉండనున్నాయి. డిసెంబరు 25న మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు సమాప్తం కానున్నాయి. డిసెంబరు 21 నుంచీ 25 వరకూ ఆర్జిత సేవలు ఏకాంతంగా జరుగునున్నాయి.

 

దారుణం.. ఇంటి అద్దె కట్టలేదని యువతిపై కత్తితో దాడి
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటి అద్దె కట్టలేదని యజమాని ఓ యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన అత్తాపూర్ హసన్ నగర్ లో చోటుచేసుకుంది. కొద్ది నెలలుగా ఇంటి అద్దె కట్టకపోవడంతో యువతి పై కత్తితో దాడి చేయగా.. ఆమె చేతికి, తలకు కత్తి గాయాలయ్యాయి. గాయాల పాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు. అత్తాపూర్ హసన్ నగర్ లో ఓ ఇంటి యజమాని అద్దె చెల్లించకపోవడంతో కరెంట్ కట్ చేశాడు. అద్దెకు ఉంటున్న కుటుంబానికి, యజమానికి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి లోనైన యజమాని ఆ కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ కుటుంబంలోని యువతికి గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించిన కుటుంబీకులు స్థానిక పోలీస్ట్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..నేడే ప్రమాణ స్వీకారం
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో భాగమైన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు నవంబర్ 11న భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ఆదివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ డివై చంద్రచూడ్ స్థానంలో జస్టిస్ ఖన్నా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం మే 13, 2025 వరకు ఉంటుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా జిల్లా కోర్టు న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. అక్టోబర్ 16న ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న జస్టిస్ ఖన్నా నియామకాన్ని అధికారికంగా నోటిఫై చేసింది. శుక్రవారం జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా చివరి పని దినం కావడంతో ఆయనకు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. జనవరి 2019 నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఖన్నా, ఈవీఎంల పవిత్రతను నిలబెట్టడం, ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేయడం, ఆర్టికల్ 370 రద్దు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చే తీర్పుల్లో భాగమయ్యారు.జస్టిస్ ఖన్నా 1960 మే 14న ఢిల్లీలో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్ నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు. ఢిల్లీలోని ప్రముఖ కుటుంబానికి చెందిన జస్టిస్ ఖన్నా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దేవ్ రాజ్ ఖన్నా కుమారుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా మేనల్లుడు. జనవరి 18, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కాకముందు మూడవ తరం న్యాయవాది. కేసుల పెండింగ్‌ను తగ్గించి, సత్వరమే న్యాయం చేయాలనే ఉత్సాహంతో వారిని ప్రేరేపించారు.జస్టిస్ ఖన్నా మేనమామ, జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా 1976లో ఎమర్జెన్సీ సమయంలో అప్రసిద్ధ ఏడీఎం జబల్‌పూర్ కేసులో భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పును వ్రాసి రాజీనామా చేయడం ద్వారా వెలుగులోకి వచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను సమర్థిస్తూ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ నిర్ణయం న్యాయవ్యవస్థపై ‘బ్లాక్ స్పాట్’గా పరిగణించబడింది. అయితే, జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా ఈ చర్యను రాజ్యాంగ విరుద్ధమని, చట్ట నియమాలకు విరుద్ధంగా ప్రకటించారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం అతనిని తొలగించి జస్టిస్ ఎంహెచ్ బేగ్‌ను తదుపరి సీజేఐగా చేయడంతో మూల్యం చెల్లించుకుంది. జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా 1973 కేశవానంద భారతి కేసులో ప్రాథమిక నిర్మాణ సూత్రాన్ని ప్రతిపాదించిన ల్యాండ్‌మార్క్ తీర్పులో భాగం. సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియోగాన్ని కొనసాగించడం. ఈ పరికరాలు సురక్షితమైనవని, బూత్ క్యాప్చరింగ్, ఫేక్ ఓటింగ్‌ను తొలగిస్తాయని తీర్పును ఇస్తూ చెప్పారు. ఏప్రిల్ 26న జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈవీఎం తారుమారు అనుమానాన్ని “నిరాధారమైనది” అని పేర్కొంది. పాత పేపర్ బ్యాలెట్ విధానాన్ని తిరిగి మార్చాలనే డిమాండ్‌ను తిరస్కరించింది.

 

మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. కాల్పులు, బాంబు దాడి.. ప్రతిస్పందించిన భద్రతా దళాలు
మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లామ్‌లై అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కొండ ప్రాంతం నుండి సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. అనేక బాంబు దాడులకు పాల్పడ్డారు. సైన్యం, సరిహద్దు భద్రతా దళం, పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారని, సన్‌సబి, సబుంగ్‌ఖోక్ ఖునౌలో భీకర కాల్పులకు దారితీసిందని పోలీసు అధికారులు తెలిపారు. కొండ ప్రాంతాల నుంచి సంసాబీ దిగువ ప్రాంతాల వరకు కాల్పులు జరపడం వల్ల రైతులు పొలాలను చూసుకోలేకపోతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు నవంబర్ 7న తమన్‌పోక్పి గ్రామంలో ఒక మహిళ హత్యకు గురైంది. ఈ మహిళ పేరు సపం సోఫియా, ఆమె వరి పంట కోసేందుకు పొలానికి వెళ్లింది. కాగా, అనుమానిత ఉగ్రవాదులు దాదాపు 100 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపారు. కాల్పుల్లో మహిళ మృతి చెందింది.జిరిబామ్ జిల్లాలో కూడా ఓ మహిళపై దాడి చేసి సజీవ దహనానికి ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ రెండు ఘటనలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. హింసాత్మకంగా ఆ ప్రాంతాన్ని అస్థిరపరిచే ప్రయత్నం మరోసారి జరుగుతోందని భావిస్తున్నారు. మణిపూర్‌లో హింసాత్మక చరిత్ర జాతి, రాజకీయ సంఘర్షణలతో ముడిపడి ఉంది. రాష్ట్రంలోని కుకీ, నాగా, మైతేయ్ వర్గాల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. మణిపూర్ సమస్య కూడా స్వాతంత్ర్యం, గుర్తింపు, స్వపరిపాలన హక్కులకు సంబంధించినది. 1990ల నుండి మణిపూర్‌లో అనేక మిలిటెంట్ సంస్థలు ఉద్భవించాయి, దీని లక్ష్యం తమ జాతి గుర్తింపు, రాష్ట్రం నుండి విడిపోవాలని డిమాండ్ చేయడం. దీని కారణంగా, హింస, కాల్పులు, సైనిక చర్యలు తరచుగా ఇక్కడ జరుగుతాయి.

 

క్యూబాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.8గా నమోదు
తుఫానులు, బ్లాక్‌అవుట్‌ల తర్వాత ఆదివారం తూర్పు క్యూబాలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ద్వీపంలో చాలా మంది ప్రజలు భయపడ్డారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. భూకంప కేంద్రం క్యూబాలోని బార్టోలోమ్ మాసోకు దక్షిణంగా 25 మైళ్ల (40 కి.మీ) దూరంలో ఉంది. శాంటియాగో డి క్యూబా వంటి పెద్ద నగరాలతో సహా క్యూబా తూర్పు భాగంలో భూకంపం సంభవించింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి తక్షణ నివేదికలు లేవు. క్యూబాలోని రెండో అతిపెద్ద నగరమైన శాంటియాగో వాసులు ఆదివారం షాక్‌కు గురయ్యారు. 76 ఏళ్ల యోలాండా టాబియో మాట్లాడుతూ.. నగరంలో ప్రజలు వీధుల్లోకి పోయారని, ఇప్పటికీ వారి ఇంటి గుమ్మాలపై కూర్చొని ఉన్నారని చెప్పారు. భూకంపం తర్వాత కనీసం రెండు ప్రకంపనలు సంభవించాయని, అయితే స్నేహితులు, కుటుంబ సభ్యులలో ఎలాంటి నష్టం జరగలేదని వారు తెలిపారు. ఈ భూకంపం క్యూబాకు మరో క్లిష్ట సమయంలో వస్తుంది. బుధవారం, కేటగిరీ 3 రాఫెల్ తుఫాను పశ్చిమ క్యూబాను నాశనం చేసింది. దీని తరువాత, బలమైన గాలుల కారణంగా, మొత్తం ద్వీపంలో విద్యుత్ వైఫల్యం ఉంది, వందలాది ఇళ్ళు ధ్వంసమయ్యాయి. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత, ద్వీపంలోని చాలా భాగం ఇప్పటికీ విద్యుత్తు లేకుండా కష్టపడుతోంది. కొన్ని వారాల క్రితం అక్టోబర్‌లో, మొత్తం ద్వీపం చాలా రోజుల పాటు కొనసాగిన బ్లాక్‌అవుట్‌తో ప్రభావితమైంది. కొంతకాలం తర్వాత, ఇది శక్తివంతమైన టైఫూన్‌తో దెబ్బతింది, ఇది ద్వీపం యొక్క తూర్పు భాగాన్ని ప్రభావితం చేసింది. కనీసం ఆరుగురిని చంపింది. బ్లాక్‌అవుట్‌లు, అక్కడికి చేరుకోవడానికి కష్టపడుతున్న చాలా మంది ప్రజలలో విస్తృతమైన అసంతృప్తి ద్వీపం అంతటా చిన్న నిరసనలను ప్రేరేపించాయి.

Show comments