NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్ న్యూస్

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మహారాష్ట్రలో ప్రధాని మోడీ పర్యటన.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈరోజు (శనివారం) ప్రధానమంత్రి మహారాష్ట్రలో ఒకరోజు పర్యటనకు రానున్నారు. ఈ మహారాష్ట్ర పర్యటనలో వాషిం నుంచి ముంబై, థానే వరకు దాదాపు రూ.56 వేల 100 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వాషిమ్‌లో వ్యవసాయం, పశుసంవర్ధక రంగం పురోగతికి రూ. 23 వేల 300 కోట్లు, థానేలో పట్టణ అభివృద్ధికి రూ. 32 వేల 800 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. దాదాపు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20 వేల కోట్ల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేస్తారు. వ్యవసాయం, పశుసంవర్ధక రంగానికి సంబంధించి దాదాపు రూ.23 వేల 300 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను వాషిమ్‌లో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు థానేలో రూ.32,800 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఆరే JVLR నుండి BKC వరకు ముంబై మెట్రో లైన్ 3 ఫేజ్ 1 సెక్షన్ ప్రారంభోత్సవం కూడా ఇందులో ఉంది. దాదాపు రూ.12 వేల 200 కోట్లతో థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైలు ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత విడుదల కానుంది. దీంతో పాటు 5వ విడత ‘షేత్కారీ మహాసమ్మన్ నిధి యోజన’ను కూడా ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు. దీని కింద సుమారు రూ.2000 కోట్లు పంపిణీ చేయనున్నారు. అగ్రికల్చరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద సుమారు రూ.1920 కోట్ల విలువైన 7500 ప్రాజెక్టులను అంకితం చేయనున్నారు. 1300 కోట్ల రూపాయల టర్నోవర్‌తో 9200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (ఎఫ్‌పిఓ) ప్రధాని మోదీ దేశానికి అంకితం చేయనున్నారు. బంజారా కమ్యూనిటీ యొక్క గొప్ప వారసత్వానికి చిహ్నంగా ఉన్న బంజారా హెరిటేజ్ మ్యూజియాన్ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీని మొత్తం పొడవు 29 కిలోమీటర్లు. ఇందులో 20 ఎలివేటెడ్, రెండు భూగర్భ స్టేషన్లు ఉన్నాయి. రూ. 3310 కోట్లతో చేదా నగర్ నుండి ఆనంద్ నగర్, థానే వరకు ఎలివేటెడ్ ఈస్టర్న్ ఫ్రీవే ఎక్స్‌టెన్షన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ దక్షిణ ముంబై నుండి థానేకి కనెక్టివిటీని అందిస్తుంది.

 

90 అసెంబ్లీ స్థానాలకు మొదలైన ఓటింగ్
హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు శనివారం (అక్టోబర్ 5) ఓటింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హుడా, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్, జేజేపీకి చెందిన దుష్యంత్ చౌతాలాతో పాటు 1027 మంది అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానుంది. ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) – బహుజన్ సమాజ్ పార్టీ (BSP) కూటమి ఇంకా జననాయక్ జనతా పార్టీ (JJP) – ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) కూటమిలు పోటీలో ఉన్నాయి. ఇంతకుముందు హర్యానాలో అక్టోబర్ 1 న ఓటింగ్ జరగాల్సి ఉండగా, అయితే, కొన్ని కారణాలవల్ల నాలుగు రోజులు వాయిదా పడింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దాని ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడికానున్నాయి. జమ్మూ కాశ్మీర్‌ లోని 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇది అక్టోబర్ 1న పూర్తయింది. రెండు రాష్ట్రాల్లోనూ ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అక్టోబర్ 8వ తేదీన తేలనుంది.

 

బతుకమ్మ పండుగకు తంగేడు పువ్వులకు సంబంధం ఏమిటి?
తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు అతి పెద్ద పండగ బతుకమ్మా.. ఈ బతుకమ్మా పండుగకు రాష్ట్రమంతా సందడిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో బతుకమ్మలు రంగు రంగు పూలతో గుభాళిస్తాయి. ఆటపాటలతో బతుకమ్మను ఆడబిడ్డాలు కొలుచుకుంటూ తమ కుటుంబాలను చల్లగా చూడమ్మా అని దీవించమని వేడుకునేదే ఈ బతుకమమ్మ పండుగ.. తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రానికే ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు.. తెలంగాణ ఆడబిడ్డలు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పూజిస్తారు. ఈ బతుకమ్మను పేర్చటంలో తంగేడు పూలు వెరీ వెరీ స్పెషల్.. పసుపు రంగులో చూడగానే ఆకర్షణగా కనిపిస్తుంది. అయితే, బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలు వెలుగులో ఉన్నాయి. వాటిలో ఓ కథ తంగేడు పూలతో బతుకమ్మకు ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఏడుగురు అన్నదమ్ములకు ఒకే ఒక్క చెల్లెలు ఉండేది. ఆ చెల్లెలంటే ఏడుగురికి చాలా ఇష్టం.. తమ ముద్దుల చెల్లికి చిన్న దెబ్బ తగిలినా వాళ్లు విలవిల్లాడిపోయేవారు. చెల్లిని అంత ప్రాణంగా చూసుకోవటం అన్నల భార్యలకు ఇష్టముండేది కాదు.. దీంతో ఆడబిడ్డ అంటే ఆ ఏడుగురు అన్నదమ్ముల్ల భార్యలు అసూయపడేవారు. అన్నలు ఎక్కడికెళ్లినా చెల్లెలి కోసం స్పెషల్ గా గిఫ్ట్ లు తీసుకొచ్చేవారు.. దాంతో వదినలకు ఆడబిడ్డ అంటేనే గిట్టేది కాదు.. కానీ భర్తలకు భయపడి వాళ్లు సైలెంట్ గా ఉండేవారు. ఇలా అన్నల ప్రేమాభిమానాలతో చెల్లెలు సంతోషంగా జీవిస్తుంటే ఆడబిడ్డను చూసి ఈర్ష అసూయ ద్వేషాలతో వదినల మనస్సు మండిపోయేది. ఆమెను ఎలాగైనా వదిలించుకుంటేనే తమకు మనశ్శాంతి లభిస్తుంది అనుకున్నారు. అందుకు తగిన సమయం కోసం వేచి చూసేవారు. ఈక్రమంలో ఓ రోజు అన్నలు వేటకెళ్లారు. తమ భర్తలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో వారికి ఓ చెడు ఆలోచన వచ్చింది. ఇదే సమయం తమ ఆడబిడ్డను వదిలించుకోవటానికి అనువైన సమయం అనుకున్నారు. తోటి కోడళ్లంతా కలిసి సదరు ఆడబిడ్డను ప్రతీ చిన్న విషయానికి తిట్టేవారు.. అలా ఆమెను చంపేసి ఊరి బయట పాతి పెట్టారు. దీంతో ఆ ఆడబిడ్డా అడవి తంగేడు చెట్టుగా పుట్టి విరగబూసింది. ఇక, ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు తమ చెల్లెలుకు ఎప్పటిలాగే బహుమతులు తీసుకొచ్చారు. ఇంటికి రాగానే భార్యాల్ని అడిగారు.. దీంతో వారంతా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అన్నదమ్ములందరికి సందేహం వచ్చింది. చెల్లెల్ని వెతుక్కుంటు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. అలా తిరిగి తిరిగి ఓ చోట కూర్చొని చెల్లెలి గురించి మాట్లాడుకుంటూ.. బాధపడుతుంటే. అది విన్న వారి చెల్లెలు.. అన్నదమ్ములు తన కోసం పడుతున్న బాధల్ని చూడలేని ఆ చెల్లెలు తంగేడు మొక్క రూపంలో తన మరణం గురించి వారికి చెప్పింది.. అప్పుడు ఆ అన్నలు చెల్లెలికి ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా ఈ తంగేడు పూలలో తనను చూసుకోమని, ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండగ చేయమని చెప్పిందట.. అలా ఈ బతుకమ్మ పండుగ ప్రారంభమైంది అనే నానుడి ఉంది.

 

మద్యం మత్తులో ప్రియురాలిని చంపిన ప్రియుడు
తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన ప్రియురాలిని చంపేశాడు. శ్రీకాళహస్తి మండలం రామలింగాపురం ఎస్టీ కాలనీలో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. పుట్టుకతో మూగ ఉన్న కాటమ్మ అనే మహిళ భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన చెంచయ్యతో ప్రేమాయణం సాగిస్తోంది. ఓ రైతు వద్ద ఇద్దరు కూలీ పనిచేస్తూ సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో కాటమ్మను చెంచయ్య కర్రతో తలపై కొట్టడంతో ఆమె మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు చెంచయ్యను పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని.. మద్యం మత్తులో చేసినట్లు పోలీసులకు చెంచయ్య వెల్లడించాడు.

 

దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్.. 45 లక్షల ఫేక్ కాల్స్ బ్లాక్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సాధనాలను ఉపయోగించి ఇప్పటివరకు 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసినట్లు కేంద్ర సమాచార శాఖ తెలిపింది. దీని కింద నకిలీ పత్రాలు ఉపయోగించిన మొబైల్ కనెక్షన్లు డిస్‌కనెక్ట్ చేయబడ్డాయి. దీనితో పాటు 45 లక్షలకు పైగా ఫేక్ కాల్స్ కూడా బ్లాక్ అయినట్లు సమాచారం. ఈ చర్య మోసం, సైబర్ నేరాలను అరికట్టడంలో సహాయపడుతుంది. అలాగే దేశ ప్రజల భద్రతకు భరోసా ఇస్తుంది. ఈ విషయంలో మరింత సమాచారం ఇస్తూ, నాలుగు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSP) టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ (DOT) సహకారంతో అధునాతన వ్యవస్థను విజయవంతంగా అమలు చేశారని కేంద్ర సమాచార శాఖ తెలిపింది. దీని కింద ఇప్పటివరకు 45 లక్షల ఫేక్ ఇంటర్నేషనల్ కాల్స్ ఇండియన్ టెలికాం నెట్‌వర్క్‌లోకి రాకుండా నిలిపివేశారు. అలాగే, తదుపరి దశలో కేంద్రీకృత వ్యవస్థ ఉంటుంది. ఇది అన్ని TSPలలో మిగిలిన నకిలీ కాల్‌లను తొలగిస్తుంది. ఇది త్వరలో అమలులోకి రానుంది. దీనితో పాటు, టెలికమ్యూనికేషన్స్ విభాగం అధునాతన వ్యవస్థను ప్రారంభించిందని కూడా తెలిపింది. దీని కింద, భారతీయ టెలికాం వినియోగదారులకు చేరేలోపు అంతర్జాతీయ నకిలీ కాల్‌ లను గుర్తించి బ్లాక్ చేయడానికి ఇది సిద్ధం చేయబడింది. ఈ వ్యవస్థను రెండు దశల్లో అమలు చేస్తున్నారు. మొదటి దశ TSP స్థాయిలో అమలు చేయబడుతోంది. దీని కింద, కస్టమర్ల ఫోన్ నంబర్ల నుండి వచ్చే ఫేక్ కాల్‌లను ఆపవచ్చు. రెండో దశను కేంద్ర స్థాయిలో అమలు చేస్తున్నారు. ఇందులో, ఇతర TSPల కస్టమర్ల ఫోన్ నంబర్ల నుండి వచ్చే నకిలీ కాల్‌ లను ఆపవచ్చు. దేశంలోని సైబర్ క్రైమ్ హాట్‌స్పాట్‌లు లేదా జిల్లాలలో 1.77 కోట్ల మొబైల్ కనెక్షన్‌లపై అణిచివేతలో భాగంగా కేంద్రం ఏకంగా 33.48 లక్షల మొబైల్ కనెక్షన్‌లను డిస్‌కనెక్ట్ చేసింది. అలాగే సైబర్ నేరగాళ్లు ఉపయోగించే 49,930 మొబైల్ హ్యాండ్‌సెట్‌ లను కూడా బ్లాక్ చేసింది. ఒక వ్యక్తికి నిర్దేశించిన పరిమితిని మించిన 77.61 లక్షల మొబైల్ కనెక్షన్‌లు డిస్‌కనెక్ట్ చేయబడ్డాయి. అలాగే సైబర్ నేరాలు లేదా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడిన 2.29 లక్షల మొబైల్ ఫోన్‌లు కూడా బ్లాక్ చేయబడ్డాయి. ఇది కాకుండా దొంగిలించిన, పోగొట్టుకున్న 21.03 లక్షల మొబైల్ ఫోన్‌లలో సుమారు 12.02 లక్షల మందిని గుర్తించారు. దీనితో పాటు DOT, TSP SMS పంపడంలో పాల్గొన్న దాదాపు 20,000 ఎంటిటీలు, 32,000 SMS హెడర్‌లు, 2 లక్షల SMS టెంప్లేట్‌ లను కట్ చేశాయి. ఇక నకిలీ పత్రాల ఆధారంగా తీసిన డిస్‌కనెక్ట్ చేయబడిన మొబైల్ కనెక్షన్‌లతో అనుసంధానించబడిన దాదాపు 11 లక్షల ఖాతాలను బ్యాంకులు, చెల్లింపు వాలెట్లు స్తంభింపజేశాయని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక మరోవైపు నకిలీ పత్రాల ఆధారంగా డిస్‌కనెక్ట్ చేయబడిన మొబైల్ కనెక్షన్‌లకు లింక్ చేయబడిన దాదాపు 11 లక్షల వాట్సాప్ ఖాతాలను వాట్సప్ మూసివేసింది.

 

ఇజ్రాయెల్‌కు షాక్ ఇచ్చిన ముస్లిం దేశాలు!
హిజ్బుల్లా, ఇరాన్‌తో విభేదాల మధ్య అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదంలో తాము తటస్థంగా ఉంటామని ఇరాన్‌కు భరోసా ఇవ్వడానికి అరబ్ దేశాలు ఈ వారం దోహాలో సమావేశమయ్యాయి. ఈ ప్రాంతంలో వివాదాలు పెరగడం వల్ల తమ చమురు కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది ఇజ్రాయెల్‌కు దెబ్బగా పరిగణించబడుతోంది, ఎందుకంటే ఏప్రిల్‌లో ఇరాన్ దాడి సమయంలో అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చాయి. ఖతార్ నిర్వహించిన ఆసియా దేశాల సమావేశంలో పాల్గొన్న గల్ఫ్ అరబ్ దేశాలు, ఇరాన్ మంత్రులు ఉద్రిక్తతను తగ్గించడంపై పరస్పర చర్చలను కేంద్రీకరించినట్లు పలు వర్గాలు తెలిపాయి. ఈ వారం మంగళవారం (అక్టోబర్ 1) ఇరాన్ ఇప్పటివరకు ఇజ్రాయెల్‌పై అతిపెద్ద దాడి చేపట్టింది. గాజా, లెబనాన్‌లలో హమాస్, హిజ్బుల్లా సీనియర్ నాయకులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడిని చేపట్టినట్లు ఇరాన్ అభివర్ణించింది. శుక్రవారం, అక్టోబర్ 4, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన ప్రసంగంలో ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడిని ‘అత్యల్ప శిక్ష’గా అభివర్ణించారు. అయితే, తమ దాడి ముగిసిందని, అయితే ఇజ్రాయెల్ ఏదైనా రెచ్చగొట్టే చర్య తీసుకుంటే అది మళ్లీ లక్ష్యంగా ఉంటుందని టెహ్రాన్ పేర్కొంది. అదే సమయంలో, ఇరాన్ దాడికి ధీటుగా సమాధానం ఇస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది.ప్రతీకారంగా ఇరాన్‌లోని చమురు ఉత్పత్తి కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవచ్చని యూఎస్‌ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నింటిలో టెన్షన్‌ని తగ్గించే అంశం అగ్రస్థానంలో ఉందని ఒ రాయిటర్స్ పేర్కొంది. గల్ఫ్ చమురు కేంద్రాలపై దాడి చేస్తామని ఇరాన్ బెదిరించనప్పటికీ, ఇజ్రాయెల్‌కు మద్దతుగా ప్రత్యక్ష జోక్యం ఉంటే ఈ ప్రాంతంలో దాని ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.

 

ప్రపంచ కప్‌లో భారత్‌ ఓటమి.. 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపు
టీ20 ప్రపంచకప్‌లో నాలుగో మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ మహిళల జట్లు తలపడ్డాయి. టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. న్యూజిలాండ్ జట్టు 58 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా కేవలం 102 పరుగులకే ఆలౌటైంది. ముక్యముగా టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు చేతులెత్తేయడంతో చివరకు హర్మన్‌ప్రీత్ సేనకు తొలి మ్యాచ్ లోనే ఓటమిని తప్పించుకోలేకపోయింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఆ తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఏ దశలోనూ టార్గెట్ దిశగా పయనించలేదు. రెండో ఓవర్ తొలి బంతికే మొదలైన వికెట్ల పతనం ఆపై కొనసాగుతూనే ఉంది. టీమిండియా 11 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోగా.. ఇక 70 పరుగులు చేసే సరికే సగం వికెట్లను కోల్పోయింది. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్లు స్మృతి మంధానా (12), షెఫాలీ వర్మ (2), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (15), జెమీమా రోడ్రిగ్స్ (13), రిచా ఘోష్ (12), దీప్తి శర్మ (13) వరుసగా ఒక్కొక్కరు పెవిలియన్ చేరుతూ వచ్చారు. ఈ సమయంలో మరోవైపు న్యూజిలాండ్ బౌలర్స్ రోజ్‌మేరీ మెయిర్ 4, లియా తాహుహు 3, ఈడెన్ కార్సన్ 2 వికెట్లు తీశారు. టీంఇండియాలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ చేసిన 15 పరుగులే టాప్ స్కోర్. ఇకపోతే ఇండియన్ వుమెన్స్ టీమ్ టీ20 వరల్డ్ కప్ 2024లో తన తదుపరి మ్యాచ్ ను అక్టోబర్ 6 (ఆదివారం) నాడు పాకిస్థాన్ తో తలపడనుంది. ఇక గ్రూప్ A లో మరోవైపు పాకిస్థాన్ వుమెన్ టీమ్ తన తొలి మ్యాచ్ లో శ్రీలంకను 31 పరుగులతో చిత్తు చేసి శుభారంభం అందుకుంది. టీమిండియా తాజా ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పాకిస్థాన్ తో ఆడనుందో. చుడాలిమరి ఆ మ్యాచ్ లోనైనా టీంఇండియా బోణీ చేస్తుందో లేదో.

 

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గద్దె గాయత్రి (38) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. కుమార్తె మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు. రాజేంద్రప్రసాద్‌కు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా రాజేంద్ర ప్రసాద్ కు ఆయన కూతురు అంటే ఏంటో మమకారం. చిన్నప్పటి నుండి ఎంతో గారాబంగ పెంచారు రాజేంద్రప్రసాద్. గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ ” నా పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తల్లిని కోల్పోయారు. అప్పటి నుండి తన తల్లిని తన కూతురిలో చూసుకున్నాను” అని అన్నారు. గద్దె గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ మధ్య కొన్నాళ్లు రాజేంద్రప్రసాద్ కు దూరంగా ఉన్న కూతురు మళ్ళి తండ్రితో పాటుగా ఉంటున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఆయనను విడిచి వెళ్లిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ శోకసంద్రంలో మునిగిపోయారు.

 

దేవర 2 ప్లానింగ్ అంతా మార్చేసిన కొరటాల
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా వారం దాటినా కలెక్షన్ల పరంగా సంచలన రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. సినిమా విడుదలైన రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్లపై మాత్రం ప్రభావం చూపలేదు. సినిమాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు తరలివచ్చారు. ఫలితంగా ఈ సినిమా రూ. వారానికి 405 కోట్లు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఈ దసరా సెలవుల్లో వచ్చేవన్నీ లాభమేనని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మరి భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకి కొనసాగింపుగా పార్ట్ 2 ని కూడా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇక పార్ట్ 1 కాస్త నిరాశ పరచడంతో పార్ట్ 2 కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సినీ వర్గాల్లో దేవర పార్ట్ 2 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో దేవర పార్ట్ 2 లో కొరటాల ఇప్పుడు పార్ట్ 1 లో చూపించిన నేపథ్యానికి పూర్తిగా భిన్నమైన బ్యాక్ డ్రాప్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో వచ్చే యాక్షన్ బ్లాక్ లు కూడా అదిరిపోతాయని సమాచారం. ఇక దీనితో పాటుగా పార్ట్ 2 రావడానికి 2027 చివరలో లేదా 2028 వరకు ఆగాల్సిందే అన్నట్టు వినిపిస్తోంది. మరి మొత్తానికి అయితే పార్ట్ 2 పట్ల మరిన్ని స్పెషల్ ప్లానింగ్ లు జరుగుతున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.