NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారని, సంక్షేమం పట్టించుకోవడం లేదని, అభివృధి ఎక్కడా కనిపించడం లేదని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్ రెడ్డికి 40 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ప్రతీకార కక్ష్యతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించలేకపోతున్నా అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని భూమన ఫైర్ అయ్యారు.

ముగిసిన గంగమ్మ తల్లి జాతర:
రాయలసీమలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. రెండు రోజులపాటు (మార్చి 1, 2) జరిగిన జాతర ఉత్సవాలు నేడు ముగిశాయి. ఆర్తుల అభయప్రదాతగా విరాజిల్లుతున్న గంగమ్మ దేవత అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవాలలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గంగమ్మ అమ్మవారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హరిత దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ పూజారులు, జాతర నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు అమ్మవారికి బోనాలు పట్టి సమర్పించారు. చాందినీ బండ్లు, కుంకుమ బండ్లు కట్టి.. ఆలయం చుట్టూ ప్రదర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన గంగమ్మ జాతరను నిర్వాహకులు ఘనంగా ముగించారు.

మోడీ చాలా మంచోడు:
మోడీ పాపం చాలా మంచిగానే ఉన్నారని.. ఆయన మనకు అంతో ఇంతో చేయాలని ముందుకొస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నారు. కానీ కిషన్ రెడ్డి నే ఓర్వలేక పోతున్నారు. సైంధవుడిగా కిషన్ రెడ్డి ఉన్నాడు.” అని వ్యాఖ్యానించారు. వనపర్తి తనకు చదువుతో పాటు సంస్కారం నేర్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. వనపర్తి విద్యార్థిగా తెలంగాణకు వన్నెతెచ్చాడనే కీర్తి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. గతంలో వనపర్తి రాజకీయాల్లో కక్షలు, ధన ప్రభావం ఉండేది కాదు. ఐదేళ్ల క్రితం ఇక్కడి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే రాజకీయాలను కలుషితం చేశారు. కేసీఆర్‌ పదేళ్లు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మోడీ 12 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నారు. మోడీ పాపం చాలా మంచిగానే ఉన్నారని.. ఆయన మనకు అంతో ఇంతో చేయాలని ముందుకొస్తున్నారు. కానీ కిషన్ రెడ్డి నే ఓర్వలేక పోతున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రూ.21వేల కోట్ల రుణమాఫీ జరిగిందా? లేదా? రైతులే చెప్పాలి. బీఆర్ఎస్, బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోంది. అయినా.. ఎక్కడా కూడా కోతలు విధించలేదు. రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామా? లేదా? మహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నాం. 65 లక్షల మంది మహిళలు స్వయంసహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. సభ్యుల సంఖ్య కోటికి చేర్చాలని ప్రయత్నిస్తున్నాం. కోటి మంది ఆడ బిడ్డలను కోటీశ్వరులను చేయాలని కృషి చేస్తున్నాం.” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణాలో మాముగనూరు రెండోది:
తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే విమానాశ్రయం ఉందని… మాముగనూర రెండోవది అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కవాడిగూడలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “హైదరాబాద్ తరువాత అతిపెద్ద నగరం వరంగల్.. చరిత్రాత్మక నగరం ఓరుగల్లులో విమానాశ్రయం కావాలనే డిమాండ్ ఉంది.. అందుకే కేంద్రం మామునూరులో బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. గత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా గత కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా వచ్చి చర్చించారు.. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం మమునూరు ఎయిర్ పోర్ట్.. స్వాతంత్రం రాకముందు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడింది.. కాకతీయుల చరిత్ర కలిగిన వరంగల్ లో నిర్మించడం హర్షణీయం..” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునురు:
మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మించాలన్నది ఎప్పటి నుండో చిరకాల కోరిక అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్టుకు నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కవాడిగూడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “స్వాతంత్రం రాకముందే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం మామునూరు ఎయిర్ పోర్ట్.. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అవ్వడంతో వరంగల్ విమానాశ్రయానికి తాకిడి తగ్గి హైదరాబాద్ కు పెరిగింది.. మోడీకి ముందు 2014 లో దేశంలో 76 ఎయిర్ పోర్టులు ఉందేవి.. మోడీ ప్రధాని అయ్యాక ఈ పడేండ్లలో 159 విమానాశ్రయాలు పెరిగాయి.. ఉడాన్ స్కీమ్ వల్ల చిన్న నగరాలకు కూడా విమానయాన ప్రయాణం విస్తరించింది.. నువ్వు ఏపీకే కాదు.. తెలంగాణకు, యావత్ దేశానికి మంత్రివి అని చంద్రబాబు నాకు పలు సూచనలు చేశారు.. ఏపీ అభివృద్ధితో పాటే తెలంగాణకు కూడా అభివృద్ధి జరగాలని ఆయన చెప్పారు.. మామునూరు ఎయిర్ పోర్ట్ కు సంబంధించి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 696 ఎకరాల స్థలం ఉంది.. ప్రస్తుత రన్ వే 1600 మీటర్లు ఉంది.. ఎయిర్ బస్ లాంటి విమానాలకు 2800 మీటర్ల రన్ వే అవసరం.. అందుకే ఆలస్యం అయింది.. గతంలో కిషన్ రెడ్డి ఉడాన్ స్కీమ్ లో డెవలప్ చేయాలని ప్రయత్నాలు చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు..” అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి స్పష్టం చేశారు.

పెంపుడు పిల్లి మరణంతో కుంగిపోయి:
పూర్వకాలం నుంచే పెంపుడు జంతువులను సాదుకోవడం అలవాటైపోయింది. కుక్కలు, పిల్లులు, పక్షులను ఇలా పలు రకాల పెంపుడు జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. ఇంట్లో మనిషి మాదిరిగానే భావిస్తుంటారు. వాటికి ఏ చిన్న ప్రమాదం వచ్చినా తట్టుకోలేరు. ఇదే మాదిరిగా ఓ మహిళ పిల్లిని పెంచుకుంది. దానికి ఆహారాన్ని అందిస్తూ, బాగోగులు చూస్తూ ప్రేమగా చూసుకునేది. అయితే పిల్లికి ఏమైందో ఏమోగాని హఠాత్తుగా చనిపోయింది. దీంతో ఆ మహిళ మానసికంగా కృంగిపోయింది. పిల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా తిరిగి బ్రతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు దాని మృతదేహాన్ని తన దగ్గరే ఉంచుకుంది. ఆమె ఆశలు అడియాసలైన తర్వాత మూడవ రోజు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది.

కేంద్ర మంత్రి కుమార్తెకు వేధింపులు:
దేశంలో మహిళలపై వేధింపులు ఎక్కువైపోతున్నాయి. మహిళా రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొన్ని రోజుల క్రితం పూణేలో ఆగి ఉన్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈకేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా మహారాష్ట్రలో కేంద్ర మంత్రి కుమార్తెను కొందరు ఆకతాయిలు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహాశివరాత్రి జాతరలో తన కుమార్తెను కొంత మంది యువకులు వేధించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కేంద్ర యువజన వ్యవహారాల సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆదివారం తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని ముక్తాయ్ నగర్ ప్రాంతంలో ఈఘటన చోటుచేసుకుంది.

ఉక్రెయిన్కి మద్దతుగా ఐరోపా దేశాలు:
అమెరికా పర్యటనను అర్ధంతరంగా క్లోజ్ చేసుకుని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ షెడ్యూల్‌ కంటే ఒక రోజు ముందుగా మార్చ్ 1వ తేదీన బ్రిటన్‌ కు వెళ్లారు. యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తన అధికార నివాసం 10, డౌనింగ్‌ స్ట్రీట్‌ దగ్గర ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు బ్రిటన్‌ ఇక ముందు కూడా అన్ని విధాలా అండగా నిలుస్తుందని ప్రధాని స్టార్మర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగానే ఉక్రెయిన్కి భారీ రుణాన్ని ఇవ్వబోతున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. అయితే, మూడేళ్లుగా తమకు బ్రిటన్‌ అందిస్తున్న మద్దతుకు ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ కృతజ్ఞతలు చెప్పారు. ఇక, ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా వైఖరిలో వచ్చిన పెను మార్పుతో పాటు అధ్యక్షుడు ట్రంప్‌ వ్యవహార శైలి తదితరాలు అంశాలపై ఇద్దరు చర్చించినట్లు సమాచారం. ఈరోజు (మార్చ్ 02) లండన్‌లో యూరప్‌ నేతల సమావేశం జరగనుంది. అందులో జెలెన్‌స్కీ పాల్గొనే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌ యుద్ధం, యూరప్‌ భద్రతే ప్రధాన అజెండాగా ఈ మీటింగ్ లో చర్చించే ఛాన్స్ ఉంది. నిజానికి మార్చి 6వ తేదీన పారిస్‌లో యూరప్‌ శిఖరాగ్ర సదస్సు జరగబోతుంది. అంతకు కేవలం రెండు రోజుల ముందు స్టార్మర్‌ ఆహ్వానంపై యూరప్‌ దేశాధినేతలంతా లండన్‌లో సమావేశం కానుండటం పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

టీమిండియాదే ఫస్ట్ బ్యాటింగ్:
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను మరికొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. డెవాన్ కాన్వే స్థానంలో డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ కూడా ఓ మార్పు చేసింది. హర్షిత్‌ రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. 14వ సారి భారత్ టాస్‌ను ఓడిపోవడం విశేషం. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్ చేరాయి. ఇందులో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఓడిన జట్టు మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. కివీస్‌పై గెలిచి.. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడాలని భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఫాన్స్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

90స్ మేకర్స్ నుంచి మరో వెబ్ సిరీస్:
ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. హోం టౌన్ వెబ్ సిరీస్ లో ప్రసాద్ పాత్రలో రాజీవ్ కనకాల తన పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నారు. ఈ వెబ్ సిరీస్ ను నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఈ సిరీస్ కు సినిమాటోగ్రాఫర్ గా దేవ్ దీప్ గాంధీ కుండు పనిచేయగా..సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. హోం టౌన్ వెబ్ సిరీస్ కథా కథనాలను ప్రతి ప్రేక్షకుడు రిలేట్ చేసుకునేలా ఉంటాయి.

ఓటీటీలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త రికార్డ్:
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాని అనిల్ రావిపూడి డైరెక్టు చేయగా విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏకంగా 303 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దిల్ రాజుకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది. ఇక ఈ సినిమాని జీ తెలుగు ఛానల్లో నిన్న ప్రసారం చేయగా అదే సమయానికి జీ5 ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. ఇక జీ5 ఓటీటీ హిస్టరీలోనే ఇది అత్యంత బ్లాక్ బస్టర్ వ్యూస్ తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 12 గంటలలోనే 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అయినట్లుగా గుర్తించారు.

మరోసారి అస్వస్థతకు గురైన వినాయక్:
తెలుగు సినీ పరిశ్రమకు అసలు సిసలైన మాస్ సినిమా పరిచయం చేసిన దర్శకులలో వివి వినాయక్ పేరు ముందు వరుసలో వినిపిస్తుంది. ఆది, చెన్నకేశవరెడ్డి తర్వాత కాలంలో అదుర్స్ లాంటి మాస్ మసాలా సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆయన కొన్ని ఫ్లాప్ సినిమాలు వరుసగా రావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. చివరిగా ఆయన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చత్రపతి హిందీ సినిమా రీమేక్ చేశారు. ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన హీరోగా అనౌన్స్ చేసిన సీనయ్య సినిమా పట్టాలెక్కుతుందేమో అనుకుంటే అది నిలిచిపోయిందని ప్రకటించారు. ఇక ఆయనకు గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గత ఏడాది ఆయనకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేశారు. అప్పటినుంచి ఆయన రెస్ట్ మోడ్ లోనే ఉన్నారు. తాజాగా ఆయన మరోసారి అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనను ఎక్స్పర్ట్ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అనారోగ్యం పాలైన సంగతి తెలుసుకొని సుకుమార్, దిల్ రాజు సహా గతంలో వినాయక్ తో కలిసి పని చేసిన కొంతమంది ఇంటికి వెళ్లి ఆయనను కలిసి అన్న ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ప్రస్తుతానికి ఆయన సినిమాల మీద కంటే ఎక్కువగా హెల్త్ మీదే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రెస్ట్ మోడ్ లో ఉండాల్సిందిగా డాక్టర్లు సూచించినట్లుగా తెలుస్తోంది.