విజయసాయిరెడ్డి వీడియో బయటపెట్టిన వైసీపీ:
విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడనడానికి పక్కా ఆధారాలు అంటూ ఎక్స్‌లో వైసీపీ పార్టీ ఓ వీడియో రిలీజ్ చేసింది. టీడీపీ నేతలతో విజయసాయిరెడ్డి రహస్య మంతనాలు చేశారని పేర్కొంది. మద్యం కుంభకోణంలో విచారణకు ముందు మీటింగ్ జరిగిందని వైసీపీ తెలిపింది. తాడేపల్లి పార్క్ విల్లాలోని విల్లా నంబర్ 27కు విజయసాయిరెడ్డి వెళ్లారని, 13 నిమిషాల తర్వాత అక్కడికి టీడీ జనార్దన్ రెడ్డి చేరుకున్నారని, ఇరువురి మధ్య 45 నిమిషాల పాటు చర్చలు జరిగిందని ట్వీట్ చేసింది. మీటింగ్ తర్వాత ప్రెస్‌మీట్‌లో విజయసాయిరెడ్డి తమ పార్టీపై విషం కక్కారని వైసీపీ చెప్పుకొచ్చింది.
రాబోయే ఎలక్షన్‌లలో చాలా పోటీ ఉంటుంది:
రాబోయే ఎలక్షన్‌లలో చాలా పోటీ ఉంటుందని, గ్రామంలోని నాయకులు ప్రజలతో మమేకం కావాలని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. తాడిపత్రి ప్రజలకు జేసీ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, తమ కుటుంబానికి తాడిపత్రి ప్రజలే దేవుళ్లు అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా రాజకీయాల్లో కొనసాగాలంటే ప్రజల్లో ఉండాలని జేసీ చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా అని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు.
రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు:
ఎన్టీఆర్ నుండి చంద్రబాబు నాయుడు వరకు రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు . నాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత రాయలసీమ ప్రజల నుండి ఎటువంటి స్పందన వచ్చిందో, మరల ఇప్పుడు 2024 ఎన్నికల్లో అదే స్థాయిలో ఆదరణ వచ్చిందన్నారు. ఇరిగేషన్ రంగంలో తెలుగు గంగ, జిఎన్ఎస్ఎస్, హంద్రీనీవా, హెచ్ఎల్ సి ఇలా ఎన్నో ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే నిర్మించామన్నారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టుకే అత్యధికంగా బడ్జెట్లో రూ.3240 కోట్లు సీఎం కేటాయించారని మంత్రి నిమ్మల చెప్పుకోచ్చాడు.
బీజేపీ- బీఆర్‌ఎస్ పొత్తు అంశంపై స్పందించిన కిషన్ రెడ్డి:
మేము ఆ రెండు పార్టీలకి జవాబు దారి కాదని కాంగ్రెస్, బీఆర్ఎస్‌ని ఉద్దేశించి కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎన్ని తిట్టినా తమకు పోయేదేమీ లేదని స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెండు పార్టీలో ఒకరికొకరు ఒప్పందం కుదుర్చుకొని బీజేపీపై దాడి చేస్తున్నాయని ఆరోపించారు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దోచుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్- బీజేపీ పొత్తు అంశంపై కిషన్‌రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న నావ.. ఆ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చేశారు. కేసీఆర్ కుటుంబ కలహాలు వాళ్ళు తేల్చుకోవాలని… ఎవరు ఎక్కువ దోచుకొన్నారు… దోచుకున్నది పంచోవడం పైనే ఆ కుటుంబంలో ఘర్షణ మొదలైందని ఎద్దేవా చేశారు. బీజేపీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని.. కవిత చిప్ప మాకు అవసరం లేదు… ఆమె గురుంచి మాట్లాడాల్సిన అవసరం లేదని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఆమె ఏందో తెలుసన్నారు.
కేటీఆర్, కవిత సీన్లు ఒక్కటే:
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయన్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలున్నాయని.. అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే చెల్లెలు గురిపేడుతున్నారన్నారు. ఏపీలో జగన్ పై చెల్లి, షర్మిల బాణం ఎక్కు పెడితే, తెలంగాణలో కేటీఆర్ పై కవిత గురి పెట్టిందని విమర్శించారు. తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడాని, ప్రజల అవసరాల కంటే, కుటుంబ అవసరాలే కీలకం అన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. మొన్న వైఎస్సార్ కుటుంబం.. ఇపుడు కేసీఆర్ కుటుంబం.. అన్నల పైకి చెల్లెలను ఉసి గోల్పడంలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు వ్యతిరేకత మొదలైందని.. రేవంత్ బీద అరుపులు అరుస్తున్నారని విమర్శించారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకతను.. మళ్లించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
భారత ప్రథమ శత్రువు చైనా:
యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-2025, వరల్డ్ వైడ్ త్రెట్ అసెస్‌మెంట్ రిపోర్ట్‌ని విడుదల చేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ తన అస్తిత్వానికి ముప్పుగా భారత్‌ని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మిలిటరీ ఆధిక్యతను తట్టుకునేందుకు పాకిస్తాన్, చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సత్తా చాటింది. పాకిస్తాన్ సైన్యాన్ని కాళ్ల బేరానికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నివేదిక అంశాలు సంచలనంగా మారాయి.
కొడుకును బహిష్కరించిన లాలూ ప్రసాద్ యాదవ్:
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ‘‘బాధ్యతా రహితమైన ప్రవర్తన’’, ‘‘కుటుంబ విలువలు’’, ‘‘ప్రజా మర్యాద’’ పాటించడం లేదని ఆరోపిస్తూ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఆర్జేడీలో, బీహార్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. శనివారం, ఒక ఫేస్‌బుక్ పోస్టులో తేజ్ ప్రతాప్ యాదవ్ తన ప్రియురాలు అనుష్క యాదవ్‌ని పరిచయం చేయడం సంచలనంగా మారింది. తాము 12 ఏళ్లుగా ప్రేమలో, రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు ప్రకటించారు. దీని తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రోజు సోషల్ మీడియా పోస్టులో తన పెద్ద కొడుకును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం సామాజిక న్యాయం కోసం పార్టీ సమిష్టి పోరాటాన్ని బలహీనపరుస్తుందని, తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు లేదా సంప్రదాయాలకు అనుగుణంగా లేదని’’ లాలూ అన్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్‌ని పార్టీ నుంచి తొలగించిన తర్వాత, ఇకపై అతనికి పార్టీలో, కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదని లాలూ చెప్పారు.
ప్రధాని మోడీ, భారత సైన్యాన్ని అభినందిస్తూ ఎన్డీయే తీర్మానం:
ఆదివారం ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాయుధ దళాల పరాక్రమాన్ని, ప్రధాని నరేంద్రమోడీ ధైర్యమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టిన తీర్మానం, ఆపరేషన్ సిందూర్ భారతీయుల ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొంది. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఆయన ఎల్లప్పుడూ సాయుధ దళాలకు మద్దతు ఇస్తున్నారని, ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులకు, వారి స్పాన్సర్లకు తగిన సమాధానం ఇచ్చిందని కొనియాడారు.
ఉక్రెయిన్‌పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి:
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోంది. రష్యన్ దళాలు ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో భీకర దాడి చేసింది. మొత్తం 367 డ్రోన్లను, క్షిపణుల్ని ప్రయోగించింది. ఈ దాడుల్లో ముగ్గురు పిల్లలతో సహా 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. కీవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీలపై దాడులు జరిగాయి. అయితే, ఉక్రెయిన్ వైమానిక దళం 266 డ్రోన్లు, 45 క్షిపణులను కూల్చేవేసింది. ఇప్పటి వరకు ఉక్రెయిన్ యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడిగా పరిగణించబడుతోంది. శుక్రవారం, రాజధాని కీవ్‌ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను రష్యా ప్రయోగించింది. ఓ వైపు ఖైదీల మార్పిడి సమయంలో ఈ దాడి జరగడం గమనార్హం. అయితే, ఈ దాడిపై డొనాల్డ్ ట్రంప్ పాలన సైలెంట్‌గా ఉండటాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. రష్యాపై బలమైన ఆంక్షలు విధించాలని కోరారు. ఒత్తిడి లేకుండా ఏమీ మారదని ఆయన అన్నారు. మరోవైపు, కేవలం నాలుగు గంటల్లోనే రష్యా ఉక్రెయిన్‌కి చెందిన 95 డ్రోన్లను కూల్చేసినట్లు పేర్కొంది. శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణ కోసం ఒత్తిడి చేస్తుండగా ఈ దాడులు జరిగాయి. రెండు దేశాలు ఖైదీలు మార్పిడిని ముగించి, 1000 మందిని మార్పిడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయి.
బంగ్లాదేశ్‌ని అమెరికాకు అమ్మేస్తున్నాడు:
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా, తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్‌పై విరుచుకుపడ్డారు. ఆయన బంగ్లాదేశ్‌ని అమెరికాకు అమ్మేస్తున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని సైన్యం పిలుపునిచ్చిన తర్వాత, తాను రాజీనామా చేస్తానని యూనస్ బెదిరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘ఈ దేశ ప్రజలు జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ పిలుపునకు స్పందించి, ఆయుధాలు చేపట్టి పోరాడి, మూడు మిలియన్ల మందిని విడిపించడానికి తమ ప్రాణాలను అర్పించిన దేశం ఇది. ఆ దేశ నేలలో ఒక్క అంగుళం కూడా ఎవరికీ వదులుకోవాలనే ఉద్దేశ్యం ఎవరికీ ఉండదు. కానీ ఈ రోజు ఎంత దురదృష్టం. అలాంటి వ్యక్తి(యూనస్) అధికారంలోకి వచ్చాడు, మొత్తం దేశ ప్రజలచే పూర్తిగా ప్రేమించబడే వ్యక్తి, ప్రపంచం ప్రేమించబడే వ్యక్తి అయిన ముజిబుర్ రెహమాన్‌కి యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది.?’’ అని ఆమె ప్రశ్నించారు. తీవ్రవాద గ్రూపుల సహాయంతో యూనస్ ప్రభుత్వ నియంత్రణ చేజిక్కించుకున్నారని హసీనా ఆరోపించారు.
కుబేర టీజర్ వచ్చేసింది:
నాగార్జున, ధనుష్ హీరోలుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న మూవీ కుబేర. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. జూన్ 20న మూవీ రాబోతోంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లోఎక్కడా డైలాగులు లేకుండా.. నాదినాది.. నాదే ఈ లోకమంతా అనే పాటతో కట్ చేశారు. దాదాపు రెండు నిముషాల పాటు ఈ టీజర్ నిడివి ఉంది. ఇందులో పాత్రల స్వభావాన్ని చూపించాడు. చూస్తుంటే డబ్బు, భావోద్వేగాలు, మానవ విలువలు అనే కాన్సెప్టుతో తీస్తున్నట్టు అర్థం అవుతోంది.
మా నాన్న నా కూతుర్ని ఎత్తుకోవాలి:
మంచు ఫ్యామిలీలో విభేదాలు మొన్నటి వరకు ఏ స్థాయిలో జరిగాయో మనం చూశాం. గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. విజయ్ కనకమేడల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో మంచు మనోజ్ చేస్తున్న కామెంట్లు తరచూ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గానే ఆయన తన కుటుంబం మళ్లీ కలిసిపోతే చూడాలని ఉందంటూ చెప్పాడు.
ఐపీఎల్‌కి వీడ్కోలు పలకనున్న ధోనీ:
ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలకబోతున్నారనే ఊహాగానాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇదే ధోనీకి చివరి మ్యాచ్ కావచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో ఇది చివరి లీగ్ మ్యాచ్ కావడం, ఈ సీజన్‌లో సీఎస్‌కే ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
