ఇకపై రేషన్ వ్యాన్‌లు ఉండవు:
రాష్ట్రంలో ఇకపై రేషన్ వ్యాన్‌లు ఉండవని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జూన్ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. చౌక దుకాణాలు ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. గతంలో పీడీఎస్ వ్యవస్థను కుట్ర పూరితంగా నాశనం చేశారని, 9 వేలకు పైగా వ్యాన్‌లు ఏర్పాటు చేసి రూ.18 వేల కోట్లు దుర్వినియోగం చేశారని మంత్రి నాదెండ్ల ఫైర్ అయ్యారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు వెల్లడించారు.
ఐసెట్ ఫలితాలు విడుదల:
ఏపీ ఐసెట్ 2025 ఫలితాలు విడుదల అయ్యాయి. ఐసెట్ ఫలితాలు ఏయూ వీసీ ప్రొ.రాజశేఖర్ విడుదల చేశారు. ఏపీ ఐసెట్‌లో 95.86 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. విశాఖకు చెందిన మనోజ్ మేకా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. సందీప్ రెడ్డి, కృష్ణ సాయిలకు వరుసగా ద్వితీయ, తృతీయ ర్యాంకులు దక్కాయి. ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ICET వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. అలానే వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009లో ఫలితాలు పొందవచ్చు.
వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయం:
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులన్నీ తేలితే వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రాష్ట్ర సంపదను దోచుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రూ.3,700 కోట్లు లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా ఆయన ఇంట్లోకి వెళ్లిందన్నారు. 2029 ఎన్నికల తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని యనమల చెప్పారు.
భాగ్యనగరంలో పెళ్లి పేరుతో మాయ లేడీలు:
హైదరాబాద్ నగరంలో మరో కొత్త రకమైన మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి పేరుతో వృద్ధులను టార్గెట్ చేస్తూ ఇద్దరు మహిళలు మోసాలకు పాల్పడుతున్న ఘటన మహాంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంపన్నులు, రిటైర్మెంట్ అయినా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారు మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నారు ఇద్దరు మహిళలు. తాజాగా ఓ వృద్ధుడు వీరి ఉచ్చులో పడ్డాడు. పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆయన పెళ్లి అని నమ్మి మోసపోయాడు. పెళ్లి షాపింగ్ పేరుతో ఇద్దరు మహిళలు అతని నుండి రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు. పెళ్లి కోసం ప్రత్యేకంగా డ్రెస్సులు కూడా కొనిపించుకున్నారు కూడా. ఇక అన్ని సెట్ అనుకోని పెళ్లికి సిద్ధంగా బట్టలు వేసుకుని ఎదురుచూస్తున్న వృద్ధుడుకి, చివరకు పెళ్లికూతురు సమయానికి రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. దీనితో మహాంకాళి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. అక్కడ తనకు జరిగిన మోసాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. మ్యారేజ్ బ్యూరోలు, పెళ్లి ప్రకటనల విషయంలో ముందుగానే పూర్తి సమాచారం సేకరించకపోతే ఇలాంటి మోసాలకు బలికావాల్సిందే.
విచారణ కమిషన్ శీలాన్ని శంకించవలసిన పనిలేదు:
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో తప్పులు జరిగాయనే కారణంతోనే కమిషన్ కొంత సమయం తీసుకుని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు. రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతి చెందిన బాధ్యులను వెలికితీసే ఉద్దేశంతోనే విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్‌లో వివక్షకు అవకాశం లేదు. వివేక్, వంశీలపై ఎలాంటి వివక్ష లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం విచారణలో కేసీఆర్, ఈటెల, హరీష్ రావులపై ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడం ముఖ్యమైన పరిణామంగా అభివర్ణించారు. వారు తప్పు చేయలేదంటే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏంటీ? అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో తప్పు జరిగిన విషయాన్ని కమిషన్ తేల్చిందని తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విచారణ కమిషన్ శీలాన్ని శంకించాల్సిన అవసరం లేదు.. సాంకేతిక సమాచారం కోసం ఆలస్యం జరిగిందని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ ‘చిన్న యుద్ధం’:
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంతో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’ అని అభివర్ణించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందే ప్రధాని నరేంద్రమోడీకి సమాచారం ఉందని ఆరోపించారు. ఆ తర్వాతే ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే మరోసారి అన్నారు. దాడి జరిగే అవకాశం ఉందని ప్రజలకు ముందే ఎందుకు తెలియజేయలేదు అని ప్రశ్నించారు. కర్ణాటకలో జరిగిన సమర్పణే సంకల్ప ర్యాలీలో పాల్గొన్న ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఏప్రిల్ 17న కాశ్మీర్‌లో పర్యటించి ఉండాల్సింది, కానీ నిఘా వర్గాల సమాచారం మేరకు రద్దు చేసుకున్నారని, దీని గురించి మీకు ముందే తెలుసా..? అని ప్రధానిని ప్రశ్నించారు. దీని గురించి ఎందుకు ప్రజలకు సమాచారం ఇవ్వలేదు, ముందే హెచ్చరించి ఉంటే 26 మంది ప్రాణాలను కాపాడగలిగే వాళ్లం అని అన్నారు. ‘‘ఇప్పుడు అక్కడక్కడ చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ చైనా మద్దతుతో భారతదేశాన్ని తక్కువ అంచనా వేస్తోంది’’ అని అన్నారు.
టర్కీ, అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు:
పాకిస్తాన్ మిత్ర దేశాలైన టర్కీ, అజర్ బైజాన్‌లకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచిచూపిస్తున్నారు. ఇప్పటికే, టర్కీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు, అజర్ బైజాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఈ రెండు దేశాలకు సంబంధించిన వీసా అప్లికేషన్స్ 42 శాతం తగ్గినట్లు ఒక నివేదిక తెలిపింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కి టర్కీ, అజర్ బైజాన్ మద్దతు తెలిపాయి. టర్కీ ఏకంగా తన డ్రోన్లను ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి ఇచ్చింది. దీంతో పాటు వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా నియమించింది. అయితే, భారత దాడుల్లో వీరిద్దరు కూడా మరణించారని తెలుస్తోంది.
తల్లి ముందే రెండేళ్ల పాపపై అత్యాచారం:
తల్లి అనే పదానికి మాయని మచ్చని తీసుకువచ్చింది ఓ మహిళ. తన ముందే, తన బిడ్డపై అత్యాచారం చేస్తున్నా చూస్తూ ఉండిపోయింది. తన రెండున్నరేళ్ల కూతురు చనిపోతున్నా పట్టించుకోలేదు. ఈ ఘటన ముంబైలోని మాల్వానీ ప్రాంతంలో జరిగింది. నిందితుడు, సదరు మహిళ ప్రియుడిగా తేలింది. ఈ కేసులో ముంబై పోలీసులు రీనా షేక్ అనే మహిళతో పాటు, ఆమె లవర్ ఫర్హాన్ షేక్‌ని అరెస్ట్ చేశారు. బాలికను చనిపోయిన స్థితిలో ఆస్పత్రికి తీసుకురావడంతో అనుమానించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాలికపై లైంగిక దాడి జరిగిందని, ఊపిరాడక షాక్ కారణంగా మరణించినట్లు వైద్యులు పోలీసులకు తెలిపారు. ఈ కేసును విచారించిన పోలీసులకు తల్లి క్రూరత్వం తెలిసింది. చిన్నారిపై తల్లి సమక్షంలోనే లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. చిన్నారి విషయంలో తల్లి రీనా జోక్యం చేసుకోకపోవడమే కాకుండా, ఆస్పత్రి సిబ్బందిని తప్పుదారి పట్టించిందని, బాలికకు మూర్ఛ వచ్చినట్లు చెప్పిందని పోలీసులు వెల్లడించారు.
గాజాపై కొనసాగుతున్న మారణహోమం;
గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగిస్తోంది. తాజాగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు ఐడీఎఫ్ దళాలు జరిపిన దాడుల్లో 60 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం గాజాలో ఎమర్జెన్సీ ఆస్పత్రులు లేకపోవడంతో క్షతగాత్రులకు వైద్యం అందించడం కష్టంగా మారింది. హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత ఖైదీ-బందీల మార్పిడి ఒప్పందం ముగియడంతో ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. దీంతో ఐడీఎఫ్ మరింత తీవ్రంగా దాడులు చేస్తోంది. ఇటీవల కాలంలో జరిగిన దాడుల కారణంగా వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించనందునే ఈ దాడులను తీవ్రం చేసినట్లు ఇటీవల నెతన్యాహు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో నెతన్యాహు ఫోన్‌లో మాట్లాడిన తర్వాత గాజా మొత్తా్న్ని స్వాధీనం చేసుకుంటామని నెతన్యాహు వెల్లడించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదన్నారు.
మందుకు బానిస అయ్యా:
ఐపీఎల్ తర్వాత టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగుతుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత్ ఇంగ్లాండ్ టూర్‌లో కఠిన సవాళ్లు ఎదుర్కోనుంది. ఇంగ్లాండ్‌లో విధ్వంసకర ఆటగాళ్లున్నారు. బెన్ స్టోక్స్ తిరిగి జట్టులో చేరాడు. దీంతో టీమిండియా పటిష్ట ఇంగ్లాండ్‌ను ఎలా ఎదుర్కొంటున్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీమిండియా అంతు చూసేందుకు స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాను ఓడించడమే పనిగా పెట్టుకుని కొన్ని నెలలపాటు మందు జోలికి వెళ్ళలేదంట. ఇంతకీ ఎం జరిగిందంటే.. గత కొంత కాలంగా బెన్ స్టోక్స్ గాయాలతో జట్టుకు దూరమవుతున్నాడు. గతేడాది డిసెంబర్ తర్వాత స్టోక్స్ పూర్తిగా జట్టుకు దూరమయ్యాడు. కొన్ని నెలలపాటు స్టోక్స్ రీహాబిలిటేషన్ సెంటర్లోనే గడిపాడు. ఈ సమయంలో తొడకండరాల చికిత్సకు తన బాడీ సహకరించలేదట. విపరీతంగా మధ్య తాగడం వల్లనే అతనికి మెడిసిన్ కూడా పనిచేయలేదు. పైగా త్వరలో భారత్ తో టెస్ట్ సిరీస్ ఉంది. ఈ నేపథ్యంలో మద్యానికి దూరంగా ఉండాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఎలాగైనా భారత్‌తో టెస్ట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో త్వరగా కోలుకునేందుకు కష్టమైనా.. మందుకు దూరంగా ఉన్నాడు.
థియేటర్ల మూసివేత టెన్షన్:
తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ ఎగ్జిబిటర్లు తీవ్ర నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు. సినిమాలను అద్దె ప్రాతిపదికన ప్రదర్శించే విధానాన్ని నిలిపివేసి, కేవలం పర్సెంటేజ్ విధానంలోనే చెల్లింపులు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు ఈ షరతును అంగీకరించకపోతే, జూన్ 1, 2025 నుంచి థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. ఈ అంశం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో దిల్ రాజు, సురేష్ బాబు వంటి ప్రముఖ నిర్మాతలతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. అద్దె విధానం వల్ల థియేటర్ల నిర్వహణలో నష్టాలు ఎదురవుతున్నాయని, పర్సెంటేజ్ విధానం ద్వారా మాత్రమే ఆర్థిక సమతుల్యత సాధ్యమవుతుందని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు లేఖ ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది.
10 నిమిషాల కోసం 22 కోట్లు?:
జైలర్ 2’లో బాలకృష్ణ 10 నిమిషాల నిడివి గల ఒక పవర్‌ఫుల్ కామియో రోల్‌లో బాలయ్య కనిపించనున్నారు. ఈ 10 నిమిషాల పాత్రలో ఒక హై-ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్‌తో పాటు, రజనీకాంత్, శివరాజ్‌కుమార్ వంటి మిగతా స్టార్స్‌తో కలిసి ఒక ఆల్-స్టార్స్ కాంబినేషన్ సీన్‌లో బాలయ్య నటించనున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు మాస్ ఎలివేషన్ మూమెంట్స్‌ను అందించేలా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ 10 నిమిషాల పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా 22 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా, సన్ పిక్చర్స్ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైనట్లు సమాచారం.
నెట్‌ఫ్లిక్స్‌లో ‘రానా నాయుడు 2’ వచ్చేస్తోంది:
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన సంచలన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి సీజన్‌కు అద్భుతమైన స్పందన రావడంతో, రెండో సీజన్‌ను మరింత ఉత్కంఠభరితంగా రూపొందించారు. 2023లో నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో బ్రేక్అవుట్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్ 2తో మరోసారి ఆకట్టుకోనుంది. ఈ సిరీస్‌ను సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్ నిర్మించగా, కరణ్ అన్షుమాన్ సృష్టికర్తగా వ్యవహరించారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు. ‘రానా నాయుడు సీజన్ 2’ జూన్ 13, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియా వంటి స్టార్ కాస్ట్‌తో ఈ సీజన్ 2 రూపొందింది.
