Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

5 లక్షల మంది, 6600 బస్సులు:
ఏపీ రాజధాని అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమం రేపు జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ టూర్ గంటా 25 నిమిషాలు పాటు ఉండనుంది. 58 వేల కోట్ల విలువైన పనుల శంఖుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రధాని మోడీ చేతుల మీద జరగనున్నాయి. అమరావతి పునఃనిర్మాణ పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు, ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రానున్నారు. సభకు 6600 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క బస్సులో 120 ఆహార పొట్లాలు,100 అరటి పండ్లు, 120 నీటి సీసాలు, 60 ఓఆర్ఎస్ ప్యాకెట్‌లు, 60 మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి. బస్సులు రేపు మధ్యాహ్నం 12 గంటలకు సభకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. దారిలో అల్పాహారం, సభకు వచ్చే సమయానికి భోజనం చేసి ప్రాంగణంలోకి చేరుకుంటారు. సభ నుంచి ప్రజలు తిరిగి బస్సు వద్దకు వచ్చే సమయానికి రాత్రి డిన్నర్‌కు సంబంధించిన ఆహారం ఆయా బస్సుల వద్దకు చేర్చే బాధ్యత పౌరసరఫరాల శాఖ తీసుకుంది. సభకు ఎలాంటి వాటర్ బాటిళ్లు తీసుకురాకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రైతుల్ని పారిశ్రామిక వేత్తలను చేస్తాం:
రైతుల్ని పారిశ్రామిక వేత్తలను చేస్తాం అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్త ఉండాలని, దీనిని సాధించేందుకు అండగా ఉంటామన్నారు. మహిళలు కూడా పరిశ్రమలు పెట్టి ఆదాయాన్ని ఆర్టించాలని, మహిళలను కూడా అన్ని విధాలా ప్రోత్సహిస్తామన్నారు. పారిశ్రామిక పార్కులలో పరిశ్రమలను తెచ్చే బాధ్యత ఎమ్మెల్యేలదే అని, పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. యువత ఆలోచనా విధానంలో మార్పు రావాలిని .. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రజావేదికపై సీఎం మాట్లాడారు.

దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ హీరో:
రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రధాన అంశం కుల గణన.. కుల గణన చేయాలని రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు.. ఇప్పుడున్న కేంద్రం కుల గణన చేస్తామని ప్రకటన చేయడం స్వాగతిస్తున్నాం.. రాహుల్ గాంధీ ముందు చూపుతో ఉన్నాడు అనడానికి కుల గణన ఒకటి.. దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ హీరో.. రాష్ట్రంలో కుల గణన చేసినందుకు రేవంత్ రెడ్డి హీరో అని కొనియాడారు. ఇప్పుడు బీజేపీ వాళ్లు సంకలు గుద్దుకున్న లాభం లేదు.. రాహుల్ గాంధీకి ఎంత ముందు చూపు ఉందో అర్ధం అవుతుంది.. మోడీ చేయకపోతే.. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఆయనే చేసే వాడు అని జగ్గారెడ్డి తెలిపారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత:
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మస్కట్ నుంచి వచ్చిన విమాన సిబ్బంది వద్ద బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి బంగారం తెచ్చి గ్రౌండ్ స్టాప్ కు ప్యాసింజర్లు అందించారు. ఎయిర్ పోర్ట్ నుంచి బంగారాన్ని బయటికి తీసుకొచ్చేందుకు గ్రౌండ్ స్టాప్ ప్రయత్నించగా.. 3.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. బంగారం స్మగ్లర్ కి సహకరించిన గ్రౌండ్ స్టాప్ ని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి పార్కింగ్ వరకు బంగారం తీసుకొచ్చి అప్పగిస్తుండగా పట్టుకుని.. 3.5 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు 3 కోట్ల 45 లక్షల రూపాయలు ఉంటుందని అంచానా వేశారు.

అట్టారీ-వాఘా వద్ద ఉద్రిక్తత:
పాకిస్తాన్ మరింత దిగువ స్థాయికి చేరుకుంటోంది. సొంత దేశ పౌరుల్ని కూడా సరిహద్దు దాటి రానివ్వడం లేదు. ఇండియా నుంచి స్వదేశమైన పాకిస్తాన్ వెళ్తున్న పౌరుల్ని రానీవ్వడం లేదు. దీంతో అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పాకిస్తాన్ తన రీసీవింగ్ కౌంటర్లను మూసేసిందని భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. దీని ఫలితంగా చాలా మంది పాకిస్తాన్ జాతీయులు సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. వృద్ధులు, మహిళలు, పిల్లలతో సహా పాకిస్తాన్ పౌరులు ఇప్పుడు ఆశ్రయం, ఆహారం లేకుండా చిక్కుకున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి అకస్మాత్తుగా ఇలా చేయడంపై సొంతదేశ ప్రజలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ తీరుపై అట్టారి పోస్ట్ వద్ద భద్రతను పెంచారు. మరోవైపు, పాకిస్తాన్ వైఖరికి విరుద్ధంగా, భారత ప్రభుత్వం తదుపరి నోటీసులు వచ్చే వరకు పాకిస్తాన్ పౌరులు అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా తిరిగి వెళ్లడానికి అనునమతించింది. గతంలో, హోంమంత్రిత్వ శాఖ ఏప్రిల్ 30లోగా భారత్‌లో ఉంటున్న పాకిస్తాన్ జాతీయులు తిరిగి వెళ్లాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ ఆదేశాలను సవరించింది.

చంపింది “పహల్గామ్” టెర్రరిస్టులే:
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. అయితే, పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులే, 2024లో జరిగిన Z-మోర్హ్ టన్నెల్ ప్రాజెక్ట్‌పై దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 2024లో జమ్మూ కాశ్మీర్‌లోన గండేర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్‌లో నిర్మితమవుతున్న Z-మోర్హ్ టన్నెల్ ప్రాజెక్టుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఆరుగురు కార్మికుల్ని, ఒక వైద్యుడిని చంపేశారు. ఈ దాడిని కూడా లష్కరే తోయిబా మద్దతు ఉన్న టీఆర్ఎఫ్ ఉగ్రవాదులే నిర్వహించారు. పహల్గామ్ దాడిలో పాల్గొన్న అనేక మంది ఉగ్రవాదులు గతంలో Z-మోర్హ్ టన్నెల్ దాడిలో పాల్గొన్నట్లు సంబంధిత నిఘా వర్గాలు చెబుతున్నాయి.

హఫీజ్ సయీద్‌కి పాక్ ఆర్మీతో నాలుగంచెల భద్రత:
భారత మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది, ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ అయిన హఫీస్ సయీద్‌కి పాకిస్తాన్ ప్రభుత్వం విస్తృత భద్రతను కల్పించింది. ముఖ్యంగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతను మరించి పెంచింది. 26 మందిని టూరిస్టులు మరణించడానికి లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ కారణం. దీంతో, భారత్ పాకిస్తాన్‌తో పాటు ఈ కుట్రకు పాల్పడిన ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను విడిచిపెట్టమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే లాహోర్‌లోని సయీద్ ఇంటి చుట్టూ ఇప్పుడు నిఘాను పెంచింది. పాకిస్తాన్ సాయుధ దళాలు 24 గంటల పాటు సయీద్‌ని రక్షిస్తున్నాయి. లాహోర్‌లోని బిజీ ఏరియాగా పేరున్న మొహల్ల జోహార్ టౌన్‌లో హఫీస్ హై సెక్యూరిటీ కలిగిన ఇంటిలో ఉంటున్నాడు. ఏప్రిల్ 22 తర్వాత సయీద్‌కి భద్రతను పెంచారు. పాక్ సైన్యం, ఐఎస్ఐ, లష్కరే తోయిబా ఉగ్రవాదులు సంయుక్తంగా అతడి రక్షణను పర్యవేక్షిస్తున్నారు. ఇతడి ఇంటిని పర్యవేక్షించడానికి డ్రోన్లను మోహరించడంతో పాటు 4 కి.మీ వ్యాసార్థంలో ఉన్న అన్ని రోడ్లలో హై రెజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.

అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక సూచన:
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి కోరారు. షాబాజ్, జైశంకర్‌లతో విడివిడిగా చర్చలు జరిపిన తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి అమెరికా మద్దతు ఇస్తుందని, పహల్గామ్ దాడి దర్యాప్తులో సహకరించాలని పాకిస్తాన్‌ను కోరిందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లో, దక్షిణాసియాలో ఇటీవలి పరిణామాలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి దృక్పథాన్ని ప్రధానమంత్రి వివరించారని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. సింధు జల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేయడం అనే అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది.

బీసీసీఐకి బిగ్ షాక్:
మ్యాచ్ అనంతరం మైదానంలో రోబో చంపక్ చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. క్రికెటర్లతో ఆడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. ఎవరేం చెప్పినా చేస్తూ.. మాట వింటుంది. ఆ మధ్య సునీల్ గవాస్కర్ ఈ చిట్టి రోబోతో చేసిన సందడి నెట్టింట వైరల్ గా మారింది. ధోనీ, కేఎల్ రాహుల్, అయ్యర్, పాండ్యా ఇలా ప్రతిఒక్కరు ఆ చిట్టి రోబోకి ఫ్యాన్ అయిపోయారు. ఈ రోబో ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్ల ఫొటోలు, వీడియోలు తీస్తూ సందడి చేస్తోంది. కానీ బీసీసీఐని చిక్కుల్లో పడేసింది. ఏకంగా ఢిల్లీ హైకోర్టు నుంచి నోటీసులు పంపేలా చేసింది. నిజానికి ఈ రోబో డాగ్ తప్పేమీ లేదు. బీసీసీఐ ఫ్యాన్‌ పోల్‌ ద్వారా దానికి చంపక్‌ అన్న పేరు పెట్టింది. అయితే ఆల్రెడీ కిడ్స్ కు సంబంధించి చంపక్ అనే మ్యాగ్జైన్ ఉండటంతో.. ఆ మ్యాగజైన్ నిర్వాహకులు ఆ రోబోపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పర్మిషన్ తీసుకోకుండా చంపక్ అనే పేరుని వాడుకుని వాళ్ళ ట్రేడ్‌మార్క్‌ ని ఉల్లంఘించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై స్పందించిన ఢిల్లీ కోర్టు జూలై 9 లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ బీసీసీఐని కోర్టు ఆదేశించింది. మరి బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

నా భార్య ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా:
సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ .. ఆయన స్టైలిష్ లుక్‌ తో ఇప్పటికి కూడా యంగ్ అండ్ సీనియర్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బంగారం స్మగ్లింగ్ అంశం తో ముడిపడి ఉన్న యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నటనలోనే కాదు.. ఆయన వ్యక్తిత్వం, ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ముఖ్యంగా రజనీ ఎప్పుడూ మన సంస్కృతి, సంప్రదాయలకు చాలా విలువిస్తాడు. అయితే తాజాగా తన భార్య లత నిర్వహించిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. ‘ నేటి యువత పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా ఫాలో అవుతుంది. ఈ మొబైల్ కారణంగా యువతకు, కొందరు పెద్దలకు మన దేశ సంప్రదాయాల గురించి తెలియడం లేదు. వారంతా భారతదేశ గొప్పతనం, వైభవం గురించి తెలుసుకోకుండా పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తున్నారు. విదేశీయులు వారి సంప్రదాయాల్లో ఆనందం, శాంతిని కనుగొన లేక పోవడం వల్ల మన దేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ధ్యానం, యోగా ద్వారా ఆనందాన్ని, శాంతి కనుగొన్నారు. దీనిపై అందరికీ అవగాహన కల్పించేందుకు నా భార్య లత ఒక గొప్ప ప్రయత్నం మొదలు పెట్టింది. దేవుడి దయతో ఆ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నాడు.

ఇందులో నిజం ఎంత?:
స్టార్ బ్యూటీ కియారా అద్వానీ గురించి పరిచయం అక్కర్లేదు.. ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ అనే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశాన్ని పొందింది..ఈ చిత్రం కూడా మంచి హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు అందుకుంది. అలా బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ తో తన క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రజంట్ ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస హిట్‌లు అందుకుంటుంది. ఇక హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రెండు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న కియారా 2023 ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కాగా ప్రజంట్ కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ లో బేబీ బంప్ ఫోటోలు కనిపించడంతో ఆమె కవల పిల్లలకు జన్మనిస్తుందని నెటిజన్స్ భావిస్తున్నారు. అంతేకాకుండా ఇంతకు ముందు ఆమె ఇంటర్వ్యూలో పాల్గొని..‘నాకు ఇద్దరు ఆరోగ్యమైన వంతమైన పిల్లలు కావాలి. అందులో ఒకరు అబ్బాయి మరొకరు అమ్మాయి కావాలని’ కోరుకుంది. దీంతో ఇప్పుడు ఆమె కోరిక ప్రకారం కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే ఎదురు చూడక తప్పదు.

వారి నుండి చాలా విషయాలు నేర్చుకున్నా:
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్రపంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 ప్రారంభ‌మైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ‌, మ‌హారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ స‌మ్మిట్ ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు జరుగనుంది. అయితే ఇప్పటికే ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ న‌టులు ఆమిర్ ఖాన్‌, అక్షయ్ కుమార్, మోహ‌న్‌లాల్ త‌దిత‌రులు చేరుకున్నారు. వీరికి నిర్వాహ‌కులు ఘ‌న స్వాగ‌తం పలికారు. ఇక ముంబయి వేదికగా జరిగిన ఈ ‘వేవ్స్’ చిరు మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ. ‘ చిన్నతనంలో నేను డ్యాన్స్ చేసి నా కుటుంబం, స్నేహితులను ఎంటర్‌టైన్ చేసేవాని. అలా నటనపై మొదలైన ఆసక్తి నన్ను చెన్నై వెళ్లేలా చేసింది. కానీ నేను అడుగు పెట్టే సమయానికి ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ ఉన్నారు. ఇప్పటికే పలువురు సూపర్ స్టార్స్ ఉన్నారు కదా. ఇంకా నేనేం చేయగలను? అని అనుకునేవాడిని. ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకున్న. అలా 1977లో నటనలో శిక్షణ పొంది మేకప్ లేకుండా సహజంగా నటించాలని మిధున్ చక్రవర్తి నుంచి నేర్చుకున్నా. స్టంట్స్ విషయంలో అమితాబ్ బచ్చన్, డ్యాన్స్ విషయంలో నా సీనియర్ కమల్ హాసన్ నాకు స్ఫూర్తి గా నిలిచారు. వారి సినిమాలు చూస్తూ, నటన పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకున్న. నా కెరీర్‌కు అది చాలా ప్లేస్ అయ్యింది’ అని పేర్కొన్నారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Exit mobile version