మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత:
బుధవారం సాయంత్రం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అతడిని అడ్డుకున్నారు. తాత, నానమ్మ సమాధులను చూసేందుకు ఎవరి అనుమతి కావాలి? అంటూ పోలీసులను మనోజ్ ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ నేపథ్యంలో యూనివర్సిటీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ లోపలికి వెళ్లనీయకపోవడంతో మోహన్ బాబు బౌన్సర్లతో మనోజ్ బౌన్సర్లు గొడవ పడ్డారు. ఇరు వర్గాల బౌన్సర్లు ఒకరినొకరు కొట్టుకున్నారు. బౌన్సర్లు రాళ్ల దాడులు చేసుకున్నారు. దాంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాత, నానమ్మ సమాధుల వద్దకు వెళ్లొద్దని కోర్టు ఆర్డర్‌లో లేదని, తాను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా అని పోలీసులతో మనోజ్ చెప్పారు. తనకు గొడవ చేయాలనే ఉద్దేశం లేదని, అనవసరంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. అనుమతిస్తే సమాధుల వద్దకు వెళ్లి దండం పెట్టుకుని వచ్చేస్తా అని పోలీసులను మనోజ్ కోరారు. ఉద్రిక్తల మధ్య తాతయ్య, నానమ్మ సమాధి వద్దకు మనోజ్‌ను పోలీసులు పంపారు.
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.. అయితే, స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ రోజు కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‌లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది ధర్మాసనం.
రేపు ఈడీ విచారణకు కేటీఆర్:
రేపు ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. నంది నగర్ నివాసం నుంచి 10 గంటలకు బయలుదేరనున్నారు కేటీఆర్. ఫార్ములా-ఈ కార్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్‌ను విచారించనున్నారు. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ఈ నెల 9న ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.. విచారణ అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఇచ్చిన 4-5 ప్రశ్నలను.. అలా తిప్పి, ఇలా తిప్పి అడిగారు.. విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్ చెప్పారు. ఏసీబీ వాళ్లకు కూడా ఈ కేసులో ఏమి లేదని తెలుసని.. ఇంకా తనపై వంద కేసులు పెట్టినా ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. ఇదొక లొట్టపీసు కేసు మాత్రమేనని విమర్శించారు.
తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు:
తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఎప్ సెట్ (ఈఏపీసెట్).. ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష.. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే.. మే 12న ఈ సెట్, జూన్ 1న ఎడ్ సెట్, జూన్ 6న లా సెట్, పీజీ ఎల్ సెట్, జూన్ 8, 9న ఐసెట్, జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈ సెట్, జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
రైతు ఖాతాలోకి పొరపాటున రూ.16 లక్షలు:
రాజస్థాన్ అజ్మీర్ జిల్లాకు చెందిన ఓ రైతు బ్యాంక్ ఖాతాలో పొరపాటున రూ. 16 లక్షలు వచ్చాయి. అయితే, వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు సదరు రైతు ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు బ్యాంక్ పోలీసులను ఆశ్రయించింది. కిషన్‌గఢ్‌లోని అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. చోటా లాంబా గ్రామానికి చెందిన రైతు కనరామ్ జాట్ తన ఖాతాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లక్షల్లో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయింది. దీంతో ఆనందంతో సదరు రైతు, పర్సనల్ లోన్ తీర్చేందుకు రూ. 15 లక్షలు వాడుకున్నాడు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి పంట బీమా ప్రీమియంగా ఈ మొత్తాన్ని, పొరపాటున రైతు జాట్ ఖతాలోకి బదిలీ చేసినట్లు బ్యాంక్ కనుగొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజన్ జితేంద్ర ఠాకూర్ మంగళవారం సాయంత్రం అరణి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 31న రైతు ఖాతాలోకి డబ్బులు చేరాయి. జనవరి 2 నుంచి 4 మధ్య జాట్ ఒక్కొక్కటిగా రూ. 5 లక్షల చొప్పున వేర్వేరు లావాదేవీలు చేశాడు. మొత్తం 15 లక్షలను వినియోగించుకున్నాడని బ్యాంక్ మేనేజర్ జితేంద్ర ఠాకూర్ వెల్లడించారు.
న్యూఢిల్లీ అభ్యర్థిగా కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు:
మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగారు. నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ముందు కేజ్రీవాల్ తన భార్య సునీతతో కలిసి హనుమాన్, వాల్మీకి ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆప్ కార్యాలయం నుంచి న్యూఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. “నేను నామినేషన్ దాఖలు చేశాను. దయచేసి చేసిన పనికి ఓటు వేయండి. ఒక వైపు పనిచేసే పార్టీ మరొక వైపు దుర్వినియోగం చేసే పార్టీ ఉంది… కాబట్టి పనికి ఓటు వేయండి అని ఢిల్లీ ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను. విద్య, వైద్యం, విద్యుత్, నీరు, రోడ్లు, వీటికి ఓటు వేయండి. చాలా పనులు జరిగాయి. ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి కాబట్టి ప్రజలు కష్టపడి ఓట్లు వేస్తారని ఆశిస్తున్నాను.’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
విచారణకు ఆదేశించిన పీఎం షెహబాజ్:
అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా చేసిన 9/11 ఉగ్రదాడిని తలపించేలా, ఇటీవల పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) చేసిన సోషల్ మీడియా పోస్ట్ నవ్వులపాలైంది. పాకిస్తాన్ పరువు తీసింది. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ని విమానాలు ఢీకొన్న తరహాలోనే పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ని ఢీకొనేందుకు వెళ్తున్నట్లుగా పీఐఏ ఓ సోషల్ మీడియా పోస్ట్‌ని షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌ని ఏకిపారేశారు. జనవరి 10న పీఐఏ తన ఎక్స్‌లో.. ఫ్రాన్స్ జెండా బ్యాక్‌గ్రౌండ్‌గా ఈఫిల్ టవర్ వైపు వెళ్తున్న పీఐఏ విమానం ఉన్న ఫోటోని షేర్ చేసి..‘‘పారిస్ మేము ఈ రోజు వస్తున్నాం’’ అంటూ కామెంట్స్ రాసింది. ఇది 9/11 దాడుల్ని గుర్తుకు తెచ్చేలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ కొన్ని రోజుల్లోనే 21 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.
మార్క్ జుకర్‌బర్గ్ సంచలన వ్యాఖ్యలు:
ఇటీవల భారతలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే మెటా రియాక్ట్ అవుతూ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపింది. అనుకోకుండా జరిగిన పొరపాటును మీరు క్షమించాలని పేర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వాదనను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీవ్రంగా ఖండించారు. గతేడాది భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయంటూ జుకర్‌బర్గ్ తప్పుగా చెప్పారు అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిపై ఓటర్లు విశ్వాసం ఉంచి వరుసగా మూడోసారి విజయం కట్టుబెట్టారనే విషయాన్ని గుర్తు చేశారు. దీంతో అనుకోకుండా జరిగిన పొరపాటును క్షమించాలని భారత ప్రభుత్వానికి మెటా క్షమాపణలు చెప్పుకొచ్చింది.
డాకు నిలువు దోపిడీ:
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యతో కలిసి నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. నందమూరి బాలకృష్ణని ఇప్పటివరకు చూపించని విధంగా బాబీ చూపించాడు అంటూ బాబీ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నందమూరి అభిమానులు. ఏకంగా కొంతమంది అయితే నాగవంశీకి గుడి కడతామని కూడా కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి కూడా వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రెండు రోజుల వసూళ్లు గట్టిగా రాగా మొత్తం మూడు రోజులకు గాను ఏకంగా 92 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. కింగ్ ఆఫ్ సంక్రాంతి గా సినిమా టీం ప్రచారం చేసుకుంటున్న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మూడు రోజులలో 92 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.
వెంకీ మామ క్రేజ్..టికెట్లు లేవ్:
వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తుంది. ఇప్పటికే సినిమాకి 46 కోట్ల రూపాయలు మొదటి రోజు కలెక్షన్స్ వచ్చాయని సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. 46 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడంతో షేర్ కూడా గట్టిగానే వచ్చినట్లు భావిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే ఇది అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన సినిమా అని చెబుతున్నారు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో సినిమాకి టికెట్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పల్లెటూర్లలోని కొన్ని థియేటర్లలో ఫిక్స్డ్ సీట్లతో పాటు కొన్ని ప్లాస్టిక్ కుర్చీలను కూడా వేసి షోలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి ఫీట్ ఎప్పుడో బెనిఫిట్ షోలకు అది కూడా పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే కనిపించేది. కానీ ఒక సీనియర్ హీరో సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో మళ్లీ అదే ఫీట్ రిపీట్ అవుతుంది.
బీజీటీలో అతను ఆడకపోయి ఉంటే మేము గెలిచే వాళ్లం:
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ ముఖ్యమైన పాత్ర పోషించాడని భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. బోలాండ్‌ను జట్టులో ఎంపిక చేయకపోయి ఉంటే.. భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 1-3 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో భారత్ 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన పెర్త్ టెస్టులో.. ఆస్ట్రేలియా బోలాండ్‌ను ప్లేయింగ్ 11లో చేర్చలేదు. అయితే అడిలైడ్ టెస్టులో జోష్ హేజిల్‌వుడ్ గాయపడడంతో స్కాట్ బోలాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
భారత వన్డే చరిత్రలో రికార్డు స్కోరు:
వన్డే క్రికెట్ చరిత్రలో భారత మహిళల జట్టు రికార్డు స్కోరు నమోదు చేసింది. రాజ్‌కోట్ వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 రన్స్ చేసింది. ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు 370/5. ఈ రికార్డును స్మృతి సేన బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా మహిళా క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. 2018లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 491/4 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల జట్టు పేరుపై ఉంది. ఇండోర్ వేదికగా 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో భారత్ 5 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (135: 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఓపెనర్ ప్రతీకా రావల్ (154: 129 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీలతో చెలరేగడంతో భారత్ రికార్డు స్కోర్ నమోదు చేసింది.