Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

జగన్ సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు?:
ముందు వేసుకున్న ప్లాన్‌ ప్రకారమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ర్యాలీలు చేస్తున్నారన్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రైతుల సమస్య పరిష్కరించాలన్న ఆలోచనే జగన్‌కు అస్సలు లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారమే రోడ్లపై మామిడిని పోశారని, క్రిమినల్‌ మైండ్‌తోనే ఇలాంటి పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా పని చేసిన వ్యక్తి.. ఇలాంటి పనులతో సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్‌, అనగాని సత్యప్రసాద్‌తో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

ఆగష్టు రెండో వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు:
వచ్చే నెల రెండో వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండనుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రత్యేక చర్చలు జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో బనకచర్ల ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక చర్చ ఉండనుందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలోనే ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. గతంలో అసెంబ్లీ సమావేశాలకు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

8 మంది ఆచూకీపై అధికారులు కీలక నిర్ణయం:
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో ఇది వరకు 44 మృతదేహాలు గుర్తించిన విషయం తెలిసిందే. లభించని ఆ 8 మంది విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో 8 మంది ఆచూకీ లభించడం కష్టమేనని నిర్ణయానికి వచ్చారు. రాహుల్‌, వెంకటేష్‌, శివాజీ, విజయ్‌, జస్టిన్‌, అఖిలేష్‌, రవి, ఇర్ఫాన్‌లు పూర్తిగా కాలి బూడిదైపోయి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆచూకీ లభించని ఆ 8 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇస్తామని బాధిత కుటుంబాలకు చెప్పారు. డీఎన్‌ఏ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. ప్రమాదంలో ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు తక్షణ పరిహారం ప్రకటించారు. ఒక్కొక్కరికి తక్షణ సహాయం కింద 15 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. 8 మంది ఆచూకి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే చెబుతామని అధికారులు స్పష్టం చేశారు. అప్పటి వరకు బాధిత కుటుంబాలు స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యలు చివరి ఆచూకీ వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

అంత్యక్రియలు ఆపిన పోలీసులు.. అసలేం జరిగింది:
కల్తీ కల్లు కేసు వ్యవహారంలో కల్లు కాంపౌండ్ ఓనర్ నిర్వాకం బయటపడింది. కల్తీ కల్లు తాగి స్వరూప అనే మహిళ అస్వస్థకు గురైంది. నాలుగు రోజుల క్రితమే నిజాంపేటలోని హోలీ స్టిక్ హాస్పిటల్లో చేరింది. నిన్న చికిత్స పొందుతూ ఆమె మరణించారు.. విషయం తెలుసుకున్న కల్లు కాంపౌండ్ ఓనర్ గుట్టు చప్పుడు కాకుండా బయటకి రాకుండా యత్నించారు. అంత్యక్రియలు చేసేందుకు స్వరూప మృతదేహాన్ని కొడుకు, కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. కల్తీ కల్లు తాగే మరణించిందని కేపీహెచ్‌బీ (KPHB) పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు వెంటనే అంత్యక్రియలు జరుగుతున్న స్పాట్‌కి చేరుకున్నారు. అంత్యక్రియలను మధ్యలోనే ఆపేశారు. స్వరూప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. స్వరూప కొడుకు దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పొలంలో కుప్పకూలిన జాగ్వార్ ఫైటర్ జెట్:
రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్ప కూలింది. ఈ ఘటనలో భారత వైమానిక దళం (IAF) కు చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. గత ఐదు నెలల్లో జాగ్వార్ విమానాలు కూలిపోవడం ఇది మూడో సారి అని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానం ఓ పొలంలో కూలింది. పైలట్ల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. ఈ ప్రమాద ఘటనను భారత వైమానిక దళం ధ్రువీకరించింది. “ఒక సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాజస్థాన్‌లోని చురు సమీపంలో ఒక ఐఏఎఫ్ జాగ్వార్ శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. పౌర ఆస్తికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి విచారణ కోర్టును ఏర్పాటు చేస్తున్నాం. పైటర్ల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తాం” అని ప్రకటన పేర్కొంది.

చైనాకు షాక్ ఇచ్చిన అరుణాచల్ సీఎం:
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాకు మింగుడు పడలేని వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వచ్చాయి. అరుణాచల్‌కు చైనాతో సరిహద్దు లేదని, కేవలం టిబెట్‌తో మాత్రమే సరిహద్దు ఉందని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణాచల్ ప్రదేశ్ చైనాతో 1200 కి.మీ సరిహద్దు పంచుకుంటుందని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అనగా, దీనికి పెమా ఖండు స్పందిస్తూ.. ‘‘నేను ఈ విషయంలో మిమ్మల్ని కరెక్ట్ చేయాలి, మేము చైనాతో కాదు టిబెట్‌తో సరిహద్దు పంచుకుంటున్నాము’’ అని అన్నారు.

నిమిషా ప్రియను కాపాడే అవకాశం ఉందా:
యెమెన్ దేశంలో కేరళకు చెందిన నర్సు ఉరికంబం ఎక్కేందుకు సిద్ధమైంది. 2017లో ఆ దేశ జాగీయుడైన తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కారణంగా జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. 36 ఏళ్ల నిమిషాకు 2020లో అక్కడి న్యాయవ్యవస్థ మరణశిక్షను విధించింది. అయితే, నిమిషాను కాపాడేందుకు ససేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్‌ అధికారులు, యెమెన్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడున్న చివర ఆప్షన్ ఏంటంటే, నిమిషా ప్రియాను కాపాడేందుకు బాధితుడి కుటుంబాన్ని ‘‘బ్లడ్ మనీ’’కి ఒప్పించడమే. ఈ ఆఫర్ అంగీకరించేలా ఆ కుటుంబాన్ని యెమెన్‌కు చెందిన ప్రభావవంతమైన వ్యక్తుల సాయంతో ప్రయత్నిస్తున్నారు. మెహదీ కుటుంబానికి ఇచ్చిన ఆఫర్‌లలో, ఆ కుటుంబానికి 1 మిలియన్ డాలర్ల సాయం అందించడంతో పాటు, ఆ కుటుంబం సిఫారసు చేసిన వ్యక్తికి లేదా ఏ ఇతర వ్యక్తికైనా కేరళలో ఉచిత చికిత్స అందించడం, ఇందులో ప్రయాణ ఖర్చుల్ని కూడా భరించడం ఉంది. దీనికి తోడు మెహదీ సోదరుడు యూఏఈ, సౌదీ అరేబియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. నిమిషా ప్రియాను రక్షించేందుకు భారత ప్రభుత్వం చేయాల్సిందంతా చేసినట్లు, సేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్‌ సభ్యులు చెప్పారు. అయితే, ఈ ఆఫర్‌పై మెహదీ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు.

విద్యార్థులు గర్భం దాల్చితే రూ.లక్ష ప్రోత్సాహకాలు:
జనాభా పెరుగుదలను అరికట్టడానికి ప్రభుత్వాలు కృషి చేస్తాయి. కానీ, అక్కడ మాత్రం తమ దేశ జనాభాను పెంచుకునేందుకు ఏకంగా నగదు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ గర్భం దాల్చితే ఏకంగా రూ. లక్ష ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇంతకీ ఎక్కడ? ఎందుకు? అని ఆలోచిస్తున్నారా? రష్యాలో తీవ్రమైన జనాభా సంక్షోభం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. గత దశాబ్దంలో జనన రేటులో గణనీయమైన తగ్గుదల, ఉక్రెయిన్ యుద్ధంలో వేలాది మంది యువత మరణం, పెరుగుతున్న వలసల రేటు రష్యా జనాభాను సంక్షోభంలోకి నెట్టాయి.

ఎట్టకేలకు ‘బ్యాడ్ గర్ల్’ కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్:
తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన ‘బ్యాడ్ గర్ల్’ చిత్రానికి చివరికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ వైపు బోల్డ్ కాన్సెప్ట్, మరోవైపు సెన్సార్ వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ చిత్రానికి ఎట్టకేలకి విడుదల దారులు తెరుచుకున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ మేధావి వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వర్షా భరత్ దర్శకత్వం వహించారు. కథానాయికగా అంజలి శివరామన్ నటిస్తోంది.

కియారా ఎమోషనల్ పోస్ట్ వైరల్:
బాలీవుడ్‌ టూ కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్ 2’ . యష్ రాజ్ స్పై యూనివర్స్‌ల్లో భాగంగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టార్ యాక్షన్ థ్రిల్లర్‌లో, ఒకవైపు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మరోవైపు తెలుగు స్టార్ ఎన్టీఆర్ కనిపించనున్నారంటే అంచనాలు ఎలా ఉండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, గ్లామరస్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా, హృతిక్ రోషన్ ఒక స్పెషల్ పోస్టుతో తన ఎగ్జైట్మెంట్‌ను షేర్ చేసింది.

కెప్టెన్‌గా చరిత్ర సృష్టించనున్న శుభ్‌మన్ గిల్:
ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన శుభ్‌మన్‌ గిల్.. 585 పరుగులు చేశాడు. గిల్ మరో 9 పరుగులు చేస్తే.. ఇంగ్లండ్‌లో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్‌గా నిలుస్తాడు. 2018లో విరాట్ కోహ్లీ 593 పరుగులు చేశాడు. విరాట్ రికార్డును గిల్ బ్రేక్ చేయనున్నాడు. 71 పరుగులు చేస్తే కోహ్లీ పేరిటే ఉన్న ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు (655) చేసిన కెప్టెన్‌గా గిల్ నిలుస్తాడు. మంచి ఫామ్‌లో ఉన్న గిల్ మూడో టెస్టులో విరాట్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.

 

 

Exit mobile version