NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

సర్వేపల్లిలో జరిగిన అక్రమాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం..

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట, వీరంపల్లి ప్రాంతాల్లోని పలు పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపఅ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ కు సంబంధించి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగింది అని ఆరోపించారు. ఒక మొక్క కొట్టకుండా.. రోడ్డు వేయకుండానే కోట్ల రూపాయలలో నిధులు స్వాహా చేశారు.. ఒకే పనికి ఒక్కో ఏడాది వేరు వేరుగా నిధులు కేటాయించి దోచేశారని మండిపడ్డారు. ఒక పార మట్టి తీయకుండ బిల్లులు చేసుకున్నారు.. 5 ప్యాకేజీలతో మాజీ మంత్రి కాకాణి నిధులు దోచుకున్నారు.. వైసీపీ నేతల పాపాలకు రైతులు మూడు లక్షల ఎకరాల్లో మొదటి పంట పండిచుకో లేకపోయారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు.

మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల హరీష్ రావు ఫైర్..

అసెంబ్లీలో బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. నిండు అసెంబ్లీ సాక్షిగా బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం. ముఖ్యమంత్రి వెంటనే బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని., పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించామని., ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని ఆయన అన్నారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయం అని ఆయన అన్నారు.

పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..

పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్ల కాలంలో పరిశ్రమల శాఖ పనితీరుపై రివ్యూ చేశారు. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న పారిశ్రామిక వేత్తలు వైసీపీ ప్రభుత్వంలో వెనక్కి వెళ్లారని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రభుత్వం సహకరించకపోవడం, వివిధ కారణాలతో వేధింపులకు పాల్పడడంతో భూ కేటాయింపులు జరిగిన తరువాత కూడా వెళ్లిపోయిన పలు కంపెనీలు.. ఇండస్ట్రీ కోసం కేటాయించిన భూముల దుర్వినియోగం అయ్యాయని అంగీకరించిన అధికారులు.. రాష్ట్రం విడిచిపోయిన కంపెనీలను తిరిగి రప్పించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

మువ్వన్నెల జెండా రంగుల విద్యుత్ కాంతులతో కళకళలాడుతున్న శ్రీశైలం డామ్!

గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. మంగళవారం వరకు 5 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు.. తాజాగా మరో ఐదు గేట్లను ఎత్తారు. దీంతో మొత్తంగా 10 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్‌వైపు ప్రవహిస్తోంది. కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది.

కృష్ణమ్మ పరవళ్లు తొక్కడాన్ని చూసేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. అయితే అందరినీ శ్రీశైలం డామ్‌పై ఉన్న విద్యుత్ కాంతులు ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం రాత్రి మువ్వన్నెల జెండా రంగుల విద్యుత్ కాంతుల వెలుగుల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఈ సుందర దృశ్యం మహా అద్భుతంగా ఉంది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌..

1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూడాన్ యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్ గా నియమితులయ్యారు. నెల రోజుల క్రితం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేశారు. మనోజ్ సోనీ స్థానంలో ప్రీతీ సుడాన్ ఆగస్టు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త యూపీఎస్సీ ఛైర్‌ పర్సన్ ప్రీతి సుదాన్ గురించి చూస్తే.. ప్రీతి సుడాన్ 2022 సంవత్సరంలో యూపీఎస్సీలో చేరారు. తాజాగా ఆమె చైర్‌ పర్సన్ పదవికి నియమితులయ్యారు. హర్యానా నివాసి ప్రీతి సుడాన్ 1983లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. యూపీఎస్సీ మాత్రమే కాదు, ప్రీతి సుడాన్ మహిళా, శిశు అభివృద్ధి & రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు.. ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రీతి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్. 37 సంవత్సరాల విస్తృత అనుభవంతో జూలై 2020లో కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. యూపీఎస్సీలో చేరిన తర్వాత ఆమె చాలా ముఖ్యమైన నిర్ణయాలలో సరైన పనులను నిర్వహించారు. ప్రీతీ సుడాన్ ప్రధానమైన బేటీ బచావో, బేటీ పడావో ప్రచారం, ఆయుష్మాన్ భారత్ మిషన్ కాకుండా నేషనల్ మెడికల్ కమిషన్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ కమీషన్ పనికి దోహదపడింది. ఇది కాకుండా, ఈ-సిగరెట్‌లపై నిషేధంపై చట్టం చేసిన ఘనత ప్రీతి సుడాన్‌ కు దక్కింది. ప్రీతి సుడాన్ విద్యార్హత గురించి చూస్తే., ఆమె ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్ డిగ్రీని పొందింది. ఇది కాకుండా, ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, సోషల్ సైన్స్ LSE, లండన్ నుండి సోషల్ సైన్స్‌లో MSc చేసారు.

ఫైనల్కు స్పప్నిల్ కుసాలే.. ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు పీవీ సింధు..

పారిస్ ఒలింపిక్స్ లో మరో భారత ఆటగాడు పతకం సాధించడంలో దగ్గర్లో ఉన్నారు. 50 మీటర్ రైఫిల్ 3 పాజిషన్స్ ఈవెంట్ లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరారు. 590 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. కాగా.. రేపు మధ్యాహ్నం 1 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి టాప్-3లో నిలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది. కాగా.. 3 పొజిషన్ షూటింగ్ అంటే పడుకుని, మోకాళ్లపై కూర్చుని, నిలబడి షూట్ చేయడం. మరోవైపు.. ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ గ్రూప్ దశలో సింధు వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. ఎస్టోనియాకు చెందిన క్రిస్టీన్ కుబాను 21-5, 21-10 తేడాతో ఓడించి నాకౌట్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ 34 నిమిషాల పాటు సాగింది. సింధు తొలి గేమ్‌ను 14 నిమిషాల్లో, రెండో గేమ్‌ను 19 నిమిషాల్లోనే గెలుచుకుంది. దీంతో పీవీ సింధు రౌండ్ -16 (ప్రీ క్వార్టర్స్)కు చేరుకున్నారు.

మహిళలు, చిన్నారుల భద్రత కోసం రూ.13,412 కోట్లు ఖర్చు

దేశంలోని మహిళల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మహిళా భద్రతా పథకాల కింద మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులను నిర్వహించే పరిశోధకులతోపాటు ప్రాసిక్యూటర్ల సామర్థ్యం పెంపొందించేందుకు శిక్షణ ఇచ్చే నిబంధన ఉందా? ఏయే కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటూ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు బండి సంజయ్ బదులిచ్చారు. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హోం మంత్రి ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఆ వివరాలను సభలో వివరించారు. అవేమిటంటే… ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం కోసం రూ.3375 కోట్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కోసం రూ.531.24 కోట్లు, స్కీం ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ కోసం రూ.280 కోట్లు, జైళ్ల ఆధునీకరణ కోసం రూ.950 కోట్లు, రాష్ట్ర సైన్స్ ఫోరెన్సిక్ లాబరేటరీల పటిష్టత కోసం రూ.106.75 కోట్లు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీలు, ఫోరెన్సిక్ డేటా సెంటర్, 6 సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీల ఆధునీకరణకు రూ.354.25 కోట్లు, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కోసం రూ.2840 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

రేవంత్ రెడ్డి ఒకప్పుడు నాకు మంచి స్నేహితుడు.. కానీ..!

తెలంగాణ అసెంబ్లీ సమవేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంగ్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డిని కేటీఆర్ ఏకవచనంతో సంబోధించడంపై అధికార పక్ష ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడని, 18 ఏళ్ల నుంచి తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ.. గత పదేళ్లుగా మా మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని, చిన్న వయసులోనే సీఎం అయ్యారు. ఆయన అదృష్టవంతుడు అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అయితే.. ఇదిలా ఉంటే.. గ‌త‌ పది సంవత్సరాల్లో ఏం మంచి జ‌రిగిందో చెబుదామంటే రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి కేసీఆర్ ఫోబియా ప‌ట్టుకుందని ఆయన సెటైర్‌ వేశారు.

అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్‌పై చర్యలు తీసుకుంటాం..

అబద్ధాలు ప్రచారం చేస్తున్న గోబెల్స్‌పై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. ఆగస్టు 1నే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తామన్నారు. ఆరోగ్య శ్రీపై తప్పుడు కూతలు మానుకోవాలన్నారు. గత ప్రభుత్వ చేతగాని తనంతోనే అప్పుల ఊబిలో రాష్ట్రం ఉందని. బిల్లులు కట్టకపోవడంతో నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ నిలిపివేశాయని ఆయన అన్నారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్‌ది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

చాలా మంది రైతులకు రుణ మాఫీ జరగలేదు

చాలా మంది రైతులకు రుణ మాఫీ జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా ప్రజలకి , రైతులకు సీఎం ,కాంగ్రెస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భవిష్యత్ లో చాలా మంది రైతులకు బ్యాంక్ లు రుణాలిచ్చే పరిస్థితి లేదని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. లక్షలాది రూపాయలతో రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు… వేలాది లీటరు లతో పాలాభిషేకం చేయించుకుంటున్నారని, కౌలు రైతులకు, రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పారని ఆయన అన్నారు. రైతులకు పంట బొనస్ ఇవ్వలేదని, ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం… ఆ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు.