NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది..

లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయన్నారు.

లక్షల మంది రైతుల ఇండ్లలో సంతోషం.. ఇది మా ప్రభుత్వ చరిత్ర..

లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేశారు. ఈనేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మా జన్మ ధన్యమైందన్నారు. లక్షలు మంది రైతుల ఇండ్లలో సంతోషంతో మా జన్మ ధన్యమైందని తెలిపారు. రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యం అని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్పోరేట్ కంపెనీలు లక్షలాది కోట్లు బ్యాంకులకు ఎగవేస్తున్నారని అన్నారు. బ్యాంకులను మోసం చేయాలని ఉద్దేశంతోటే రుణాలు తీసుకుంటున్నారు, కానీ రైతు తీసుకున్న అప్పు కట్టి తీరతారు అని తెలిపారు. మీరు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నప్పుడు అందరూ అవహేళన చేశారని, గతంలో మాఫీ చేస్తానన్న వాళ్ళు లక్ష రూపాయలకు మిత్తి మిగిలేటట్టు వ్యవహరించారని అన్నారు. 7000 కోట్లు రైతులపై మొండి బకాయిలుగా వదిలేసింది గత ప్రభుత్వమని మండిపడ్డారు. పదేళ్లలో 25 వేల కోట్లు కూడా గత ప్రభుత్వం చెల్లించలేకపోయిందన్నారు. కొందరు మాపై శాపనార్ధాలు పెట్టారని అన్నారు.

గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..

గిరిజన సంక్షేమ శాఖపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.. గిరిజన ప్రజలకు విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో నేడు ఉన్న పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిన విధానాన్ని సీఎం చంద్రబాబుకు స్వయంగా వివరించారు అధికారులు. గత ప్రభుత్వానికి గిరిజన సంక్షేమమనేది అత్యంత అప్రధాన్యత శాఖగా చూసిందని అధికారులు సీఎం చంద్రబాబు దగ్గర వెల్లడించారు.. 2014 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.. 2014-19 మధ్య కాలంలో గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాలను వైఎస్‌ జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వెల్లడించారు.. అలాగే గిరిజనులకు సత్వర వైద్యం కోసం తెచ్చిన పథకాలను గత ప్రభుత్వం రద్దు చేసిన విధానంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు, అరకు కాఫీ మార్కెటింగ్, ఇతర గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై చర్చ.

చరిత్ర సృష్టించిన మను భాకర్, సరబ్జోత్ సింగ్.. మను ఖాతాలో మరో పతకం

వావ్ మను భాకర్, వావ్ సరబ్జోత్ సింగ్… వీరిద్దరూ పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మను భాకర్, సరబ్జోత్ సింగ్.. ఓహ్ యే జిన్, లీ వోన్హోలను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరిద్దరూ 16-10 తేడాతో ఈ పోరులో విజయం సాధించారు. పారిస్ ఒలింపిక్స్ 2024 నాలుగో రోజు అభిమానుల కళ్లు మరోసారి మను భాకర్‌పై పడ్డాయి. ఆమె ఈరోజు (జూలై 30) 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్‌లో భారతదేశానికి చెందిన సరబ్జోత్ సింగ్‌ తో కలిసి ఆడేందుకు వచ్చింది. అంతకుముందు, పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ షూటర్‌గా నిలిచింది. మను ఫైనల్‌లో మొత్తం 221.7 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా..ప్రస్తుతం రెండో పతకం వచ్చింది. అలాగే, ఒలింపిక్స్‌ చరిత్రలో షూటింగ్‌లో భారత్‌కు ఇది ఐదో పతకం.

మద్యం స్కాంలో సంచలన అంశాలు.. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవలకపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేశారు.. అందులో భాగంగా.. వైసీపీ సర్కార్‌ హయాంలో మద్యం అమ్మకాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేశారు.. అవినీతి, అవకతవకలు జరిగాయంటూ దుయ్యబట్టారు.. ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ నిర్వాకాలు బయటపెట్టారు.. అయితే, మద్యం స్కాంలో ప్రభుత్వం దృష్టికి సంచలన వాస్తవాలు వస్తున్నాయట.. మద్యం శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలకంటే భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు బయటపడుతున్నాయట.. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం అక్రమ సరఫరా జరిగినట్టు అభియోగాలు మోపుతున్నారు.. డిపోల నుంచి కాకుండా నేరుగా మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచే దుకాణాలకు మద్యం బాటిళ్లను తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి..

ఏపీలో పోలీసులకు వీక్ ఆఫ్లు.. కొనసాగుతున్న సన్నాహాలు..?

విశాఖపట్నంలో నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి నివారణ మీద సమీక్ష చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ సంక్షేమం మీద రివ్యూ చేశాం.. పోలీసు విభాగం ఇన్వెస్టిగేషన్ టూల్ లేవు.. ఎక్కడ ఏం జరిగిన దాని వెనుక గంజాయి ఉంది.. ఈ ఐదు జిల్లాలో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నాం.. ఏజెన్సీలో గంజా పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని చెప్పుకొచ్చారు. గంజా నివారణపై మంత్రివర్గ ఉప సంఘం నియమించారు.. అందులో హోం మంత్రి, విద్యా శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అబ్కారీ మంత్రితో కూడిన ఈ ఉపసంఘం పని చేస్తోంది అని పేర్కొన్నారు. ఇక, గంజా వివరాలు ఇస్తే వారికి బహుమతి ఇస్తాం.. అన్ని జిల్లాలో కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు.

రైతన్నలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు

లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే దానిలో కేబినెట్ మంత్రిగా భాగస్వామ్యం ఉండడం నా జీవితంలో మరపురాని ఘట్టమన్నారు.

88కు చేరిన మృతుల సంఖ్య.. రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం

వయనాడ్‌లో రుతుపవన వర్షాల కారణంగా సంభవించిన పలు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ దాదాపు 88 మంది మరణించారు. 116 మంది తీవ్ర గాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం కాపాడారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జూలై 30, 31న రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, వేడుకలను వాయిదా వేసింది. ఈ ప్రమాదంలో వందలాది మంది మట్టి, శిథిలాల కింద చిక్కుకుపోయారు. పదుల సంఖ్యలో మృతదేహాలను 30 కిలోమీటర్ల అవతల ఉన్న చలయార్ నదిలో తేలియాడుతుండగా పోలీసులు గుర్తించారు. ముండకై తేయాకు పరిశ్రమ పనిచేస్తున్న ఆరు వందల మంది కార్మికులు గల్లంతు అయ్యారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఇప్పటి దాక కార్మికుల జాడ తెలియలేదు.

ఏపీకి ఇచ్చిన రూ. 15 వేల కోట్లు గ్రాంట్ కాదు అప్పు..?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్ లు మొదలు పెట్టారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఒకటి రెండు కాదు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు.. చంద్రబాబు అబద్ధంలో పుట్టి అబద్దంలోనే జీవిస్తూ ఉంటాడు.. కేంద్రం రూ. 15 వేల కోట్లు గ్రాంట్ అని చంద్రబాబు చెప్పారు.. అయితే అదంతా అప్పే.. కేంద్రం ఇప్పిస్తుంది అనేది వాస్తవం అని ఆయన పేర్కొన్నారు. ఫించన్ కూడా రానున్న రోజుల్లో చాలా మందికి అనర్హుల పేరిట ఏరి వేస్తారు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్ అని ముందే చెప్పాం.. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు అంటే భయం వేస్తోంది అంటున్నారు.. ఇలాంటి మాటలు చెబుతున్న చంద్రబాబు మొహం చూస్తే ప్రజలకు రోత పుడుతోంది అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌ పాతబస్తీలో నోరో వైరస్‌.. క్లారిటీ ఇచ్చిన DPH అధికారులు

వాంతులు, వికారం , విరేచనాలు వంటి లక్షణాలతో వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ అని కూడా పిలువబడే కడుపు ఫ్లూకి కారణమయ్యే సాధారణ ఇంకా అంటువ్యాధి అయిన నోరోవైరస్ వ్యాప్తి చెందుతుందనే నివేదికలపై ప్రజలు, ముఖ్యంగా పాతబస్తీ వాసులు భయపడవద్దని హైదరాబాద్‌లోని సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు కోరారు. నోరోవైరస్ , భయాందోళనలకు సంబంధించిన వదంతులను నమ్మవద్దని, మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ (డిపిహెచ్) డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ ప్రజలను కోరారు. “ఇప్పటివరకు పాత నగరంలో ఒక్క వ్యక్తి కూడా నోరోవైరస్ కోసం పాజిటివ్ పరీక్షించలేదు, అయినప్పటికీ లక్షణాలు ఒకే విధంగా ఉన్నాయి. ఓల్డ్ సిటీ కుటుంబాలు వ్యాప్తి చెందుతోందని , ఈ వ్యాధి ప్రాణాంతకం అని పుకార్లను నమ్మవద్దని నేను కోరుతున్నాను, ”అని డాక్టర్ నాయక్ అన్నారు.