NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్‌రాజు పదవి కాలం ముగిసింది. ఆ పదవికి ఈసారి అధ్యక్షుడిగా భరత్‌ భూషణ్ ఎన్నికయ్యారు. ఈ సారి పిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్ష పదవిని పంపిణీ రంగం నుంచి ఇచ్చారు. గతేడాది సినీ నిర్మాత అయిన దిల్ రాజుకు అవకాశం ఇచ్చారు. దిల్‌ రాజు పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు. ఏడాదికోసారి తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. మొత్తం సభ్యులు 48 మంది సభ్యులు, ఓటింగ్ లో పాల్గొన్న 46 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో భరత్ భూషణ్ (29 ఓట్లు), ఠాగూర్ మధు (17 ఓట్లు)తో భరత్ భూషణ్ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. మరోవైపు ఉపాధ్యక్ష పదవికి అశోక్‌కుమార్‌, వైవీఎస్‌ చౌదరి పోటీ పడుతున్నారు.ఉపాధ్యకుడు గా అశోక్ కుమార్ (28 ఓట్లు), వైవీఎస్ చౌదరి (18 ఓట్లు) నిర్మాతల నుంచి ఉపాధ్యక్షుడి ఎన్నికల జరుగుతున్నాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకుంటారు. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం

వేల సంవత్సరాల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణకు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ వద్ద కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న  పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం నాకు ఆనందంతో పాటు గౌరవంగా ఉందన్నారు. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు మరియు ఇతరులు ఈ ప్రాంతాన్ని పాలించారని తెలిపారు. ప్రతి ఒక్కరు వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్రను వేశారని తెలిపారు. చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహి సమాధులు, పైగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయంగా ఉందన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలే.. అధికారులకు మంత్రి వార్నింగ్..

పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ జల సౌదలో రాష్ట్రంలోని నీటి పారుదల ఉన్నతాధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ.. ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్ పాల్గొన్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రాజెక్టులలో క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలన్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదన్నారు. నీటి పారుదల శాఖ కు నిధుల కేటాయింపులు బాగున్నాయి.. పనులు వేగవంతం చేయాలని తెలిపారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ సినిమా అప్ డేట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ గెలవడం మంత్రిగా భాద్యతలు చేపట్టడం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రజాపరిపాలనను అందించే దిశగా అడుగులు వేస్తూ రాజకీయంగా బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన చేస్తున్న సినిమాల ప్రశ్నర్ధకంగా మారింది. ఈ మధ్య పిఠాపురం సభలో మాట్లాడుతూ OG చిత్రం పూర్తి చేస్తానని అభిమానుల సమక్షంలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరిన మహిళా బాక్సర్‌ ప్రీతి పవార్‌

భారత బాక్సర్‌ ప్రీతీ పవార్‌ వియత్నాంకు చెందిన వో థి కిమ్‌ అన్‌ను ఓడించి పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 54 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్‌ తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 5-0తో గెలిచి బాక్సింగ్‌లో భారత్‌ ప్రచారానికి శుభారంభం ఇచ్చింది. హర్యానాకు చెందిన ఈ 20 ఏళ్ల బాక్సర్ అనారోగ్యం కారణంగా ఒలింపిక్ క్రీడలకు కొన్ని రోజుల ముందు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆమె మొదటి రౌండ్‌లో బాగా రాణించలేకపోయింది. ఈ సమయంలో వియత్నామీస్ బాక్సర్ ఆమెపై ఆధిపత్యం చెలాయించింది. అయితే, భారత బాక్సర్ దూకుడు వైఖరిని అవలంబించి, తర్వాతి రెండు రౌండ్లలో తన ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా పునరాగమనం చేసింది.

నేడు సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి పర్యటన..

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఇవాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హెలికాప్టర్‌లో కల్వకుర్తికి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం వరకు కల్వకుర్తిని సందర్శిస్తారు. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆవరణలో జైపాల్‌రెడ్డి సంస్మరణ సభ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అలాగే శ్రీశైలం హైవేలోని కొట్రా సర్కిల్‌లో కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి విగ్రహాన్ని రేవంత్‌ ఆవిష్కరిస్తారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి కాంస్య విగ్రహాన్ని కల్వకుర్తిలో సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి పక్కన వెల్దండ మండలం కొట్ర గేటు వద్ద విగ్రహావిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు పాల్గొంటారు. అంతకుముందు బీఎస్‌ఎన్‌ఎల్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

రేవంత్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.. కుల గణన పై హనుమంతరావు

అంబర్ పేట్ లోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు, చీర సారెలను సమర్పిస్తున్నారు. అమ్మవారికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులవి హనుమంతరావు మాట్లాడుతూ.. బోనాల పండగ మా తెలంగాణ సంస్కృతి అమ్మవారికి చీరా సారెలను సమర్పించి సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో అందరిని చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుని ఇంటి ఆడపడుచులను అల్లుళ్లను పిలుచుకొని వారికి చక్కని విందు ఇచ్చి మర్యాదగా చూసుకునే సాంప్రదాయమని వి హనుమంతరావు పండగ విశిష్టతను తెలిపారు.

తమిళనాడులో మరో రాజకీయ హత్య.. ఏఐడీఎంకే నేత మర్డర్..

తమిళనాడులో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్ర బీఎస్‌పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ని హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలు అన్నాడీఎంకేతో పాటు బీజేపీ డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్టాలిన్ సర్కార్ ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసుపై విచారణ జరుపుతోంది. ఇదిలా ఉంటే తాజాగా తమిళనాడులో మరోసారి ఇలాంటి హత్యే జరిగింది. కడలూరులో పళనిస్వామి పార్టీ ఏఐఏడీఎంకే కార్యకర్తను నరికిచంపారు. పుదుచ్చేరి సరిహద్దులో ఈ ఘటన జరిగింది. బాధితుడిని తిరపావులియార్‌కి చెందిన పద్మనాభన్‌గా గుర్తించారు. బాగూర్ గ్రామంలో వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తుల వెంబడించి, దుండగులు చుట్టుముట్టి చంపారు. దుండగుల ముఠా తమ కారుతో ముందుగా పద్మనాభన్ బైకుని ఢీకొట్టి హత్య చేసినట్లు ప్రాథమిక నివేదిక పేర్కొంది. ఈ హత్యకు సంబంధించి విచారణ సాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఆర్థిక బడ్జెట్‌లో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చింది

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి పారుదల అధికారులతో సమీక్ష నిర్వహించామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక బడ్జెట్‌లో నీటిపారుదల రంగం మీద స్పష్టత వచ్చిందన్నారు. 10,820 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కేటాయించిందని, ఎక్కడ పనులు అగాయో.. ఎవరికి పెమేంట్ ఇవ్వాలి అనేది సమీక్షలో చర్చ జరిగిందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. వాన కాలంలో కొన్ని చోట్ల వరద వచ్చే అవకాశం ఉందని, నీటిపారుదల సంబంధించి అన్ని చెరువుల నుంచి జలాశయాల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్చించామన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో కొత్త చాప్టర్ ప్రారంభించాలని.. అది రైతులకు ప్రజలకు మేలు జరగాలని సమీక్ష చేశామని, సంవత్సరంలో ఆరున్నర లక్షల ఎకరాల ఆయకట్టు కు నీరు అందించేందుకు కొత్త ప్రాజెక్టు చేపట్టామన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. మా ప్రభుత్వ హాయంలో ప్రతి సంవత్సరం 6 నుంచి ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాలని ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామని, ప్రతి పదిహేను రోజులకు అధికారులతో సమీక్షించి పనులు పరిశీలన మీద చర్చ చేస్తామని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదల్లో గ్రామాలు

ఏపీలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగుల్చాయి. మరోవైపు.. లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరు జిల్లాలో వర్షాల జోరు తగ్గలేదు. దీంతో.. వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పోంగుతున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో భారీ వర్షాలకు లక్ష్మీపురం పంచాయితీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాలు క్రితం నుండి గెడ్డలు ఉధృతి వల్ల జనజీవనం స్తంభించి పోయింది.. వారపు సంతకు వెళ్లి నిత్యావసర సరుకులు తీసుకొని రావడానికి 30 గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. బైకులను డోలిమోత తీసుకొని వెళ్తున్నారు గిరిజనులు. వాగులు ఉధృతి చూసి కొంతమంది గిరిజనులు వెనుతిరుతుండగా.. మరికొందరు ప్రాణాలకు తెగించి దాటుతున్నారు.

భారత్ ఖాతాలో తొలి పతకం..చరిత్ర సృష్టించిన మను భాకర్

పారిస్ ఒలింపిక్స్ 2024లో స్టార్ షూటర్ మను భాకర్ చరిత్ర సృష్టించింది. 22 ఏళ్ల షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో మను కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. షూటింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన దేశంలోనే తొలి మహిళా అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 221.7 పాయింట్లతో ఆమె చాలా దగ్గర తేడాతో రజత పతకాన్ని కోల్పోయింది. కొరియా షూటర్లు బంగారు, రజత పతకాలు సాధించారు. మనుకి ఇది రెండో ఒలింపిక్స్‌. మను భాకర్ టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు ప్రయత్నించింది. అయితే ఆ ఈవెంట్ సమయంలో పిస్టల్ పనిచేయకపోవడం వల్ల, ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. అప్పుడు ఆమె ఆవేదనకు గురైంది. టోక్యోలో దాదాపు మొత్తం భారతీయ షూటింగ్ బృందం ప్రదర్శన నిరాశపరిచింది.