NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

యుఎన్‌ఎస్‌సిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై బ్రిటన్‌ మద్దతు..

అమెరికా, ఫ్రాన్స్ తర్వాత UNSCలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం బ్రిటన్ మద్దతును పొందింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC శాశ్వత సీటు) కోసం ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ గురువారం భారతదేశానికి మద్దతు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా భారత్‌కు మద్దతు పలికారు. న్యూయార్క్‌ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 69వ సెషన్‌లో జరిగిన చర్చలో, బ్రిటిష్ ప్రధాన మంత్రి స్టార్మర్ మాట్లాడుతూ.. UNSCని ‘మరింత ప్రాతినిధ్య దేశం’ గా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. UNSC ప్రస్తుతం 5 శాశ్వత, 10 శాశ్వత సభ్య దేశాలను కలిగి ఉంది. ఇవి UN జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకోబడతాయి. దాని 5 శాశ్వత సభ్య దేశాలు రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, ఇవి ఏదైనా నిర్దిష్ట తీర్మానాన్ని వీటో చేసే అధికారం కలిగి ఉన్నాయి. UNSCలో శాశ్వత సభ్య దేశాలుగా రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, అమెరికా ఉన్నాయి. ఈ సందర్బంగా.. బ్రిటీష్ ప్రధాన మంత్రి స్టార్మర్ మాట్లాడుతూ.., “యుఎన్‌ఎస్‌సిలో బ్రెజిల్, ఇండియా, జపాన్, జర్మనీలలో శాశ్వత సభ్యులుగా శాశ్వత ఆఫ్రికన్ ప్రాతినిధ్యం, ఎన్నికైన సభ్యులకు ఎక్కువ సీట్లు ఉండాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు.

ప్రవాసి ప్రజావాణి ప్రత్యేక కౌంటర్.. మొదటి అభ్యర్థన స్వీకరించిన మంత్రి పొన్నం

తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసి ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజావాణి కార్యక్రమం మాదిరిగానే ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు (బుధ, శుక్రవారాలు) జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నా షేక్ హుస్సేన్ కుటుంబం నుండి మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వీకరించారు. సమస్యల వినతి కోసం గల్ఫ్ కార్మికులు భారీగా పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా గల్ఫ్ కార్మికులు సమస్యలపై పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు.

దసరాలోపు రైతులకు రుణమాఫీ చేయాలి.. ప్రభుత్వానికి హరీష్ రావు మరో డెడ్ లైన్..

దసరా పండుగ లోపు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ ఇచ్చారు. ఈరోజు సిద్దిపేట జిల్లా నంగునూరులో రుణమాఫీ కోసం అన్నదాతలు చేపట్టిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు రుణమాఫీ చేసే వరకు సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వనని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు డెడ్ లైన్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 490 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలకు మాయమాటలు చెప్పారు. రైతు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం సాకులు చెబుతోందని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సుమారు 21 లక్షల మంది అన్నదాతల రుణాలు ఇంతవరకు మాఫీ కాలేదని ఆరోపించారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అందలేదని హరీష్ రావు అన్నారు.

ఐటీ పాలసీపై ముగిసిన సీఎం సమీక్ష.. 20 లక్షల మందికి ఉపాధి హామీని నెరవేర్చేలా ప్రణాళిక..!

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ పాలసీపై నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది.. ఏపీని ఐటీ హబ్ చేసేలా పాలసీ రూపకల్పన పై ప్రధానంగా చర్చించారు సీఎం.. ఏపీలో ఏఐ కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలుపై ఉన్నతాధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐటీ సేవల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని భావిస్తోన్న సర్కార్.. ఆ దిశగా ఈ సమావేశంలో కసరత్తు చేసింది.. ఐటీ సేవలు.. ఏపీ ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాలసీ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబాబు.. ఐటీ రంగం ద్వారా భారీగా ఉపాధి కల్పించి.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల మందికి ఉపాధి హామీని నెరవేర్చేలా ప్రణాళిక రూపొందించాలని.. ఆ దిశగా ప్లాన్‌ చేయాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు

మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఇవాళ విజయవాడ నుంచి తిరుపతికి నేటి సాయంత్రం వెళ్లాల్సి ఉంది. గతంలో నేటి రాత్రి తిరుమలలో బస చేసి రేపు(శనివారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జగన్ తిరుమల టూర్ ప్రకటించినప్పటి నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అనవసర సమస్యలు రావొద్దనే ఆలోచనతో తిరుమల పర్యటనను జగన్ రద్దు చేసుకున్నట్లు తెలిసింది. మరికాసేపట్లో జగన్‌ మీడియా ముందుకు రానున్నారు.

తిరుమల సన్నిధిలో ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాలి..

కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని పేర్కొన్నారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారన్నారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నామన్నారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

సాగు నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం.. విడుదలైన జీవో..

రైతు సమస్యలను గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు సాగునీటి వ్యవస్థకు పునరుజ్జీవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విజయవాడలో మీడియా వేదిక మంత్రి రామానాయుడు మాట్లాడుతూ.. సాగునీటి సంఘాల ఎన్నికలకు అంతా సిద్ధమని, జీవో విడుదలైందని తెలిపారు. నవంబర్ మొదటి వారం నాటికి సాగు నీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామన్నారు. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెడతామన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థలో పూడిక, మరమ్మతులు, గేట్లు, గట్ల వంటి వాటికి నిర్వహణ లేదని, పర్యవేక్షణ లేదని ఆయన మండిపడ్డారు. గత వైసీపీ పాలన రైతులకు శాపంగా మారిందన్నారు. నేడు రైతుల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. ప్రతి చివరి ఎకరం వరకు సాగు నీరు అందేలా సాగు నీటి సంఘాల ప్రాతినిధ్యంతో ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్దంగా పని చేస్తుందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది..

రాష్ట్రంలో ఎప్పుడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మండిపడ్డారు. దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని.. దేశంలో ఎక్కడా లేని పరిస్థితులు ఏపీలో చూస్తున్నామన్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారని.. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇస్తున్నారని జగన్ వెల్లడించారు. ఓ వైపు తనను, మరోవైపు వైసీపీ శ్రేణులను తిరుమలకు వెళ్లనివ్వడం లేదన్నారు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్లను తిరుమల తెప్పిస్తున్నారన్నారు. టాపిక్ డైవర్ట్‌ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు. తిరుమలలో వేలాది మంది పోలీసులను మోహరించారన్నారు. అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు. తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారని విమర్శించారు. జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రసాదం కల్తీ అయ్యిందని.. ఆ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని వైఎస్ జగన్ చెప్పారు. ఓ ముఖ్యమంత్రే సాక్షాత్తూ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారన్నారు. లడ్డూ పవిత్రతను దెబ్బతీస్తూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు తప్పుడు ప్రచారం చేశారన్నారు. నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకోసారి రొటీన్‌గా జరిగే కార్యక్రమమని తెలిపారు. 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. లడ్డూ తయారీ టెండర్లలో ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికే టీటీడీ పర్మిషన్ ఇస్తుందన్నారు. తప్పు చేయాలని అనుకున్నా కూడా టీటీడీ బోర్డులో తప్పు చేయలేమన్నారు. ఏ నిర్ణయమైనా బోర్డు సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకుంటారని జగన్ చెప్పారు.

గజ్వేల్ ENC హరిరామ్‌పై ప్రశ్నల వర్షం కురిపించిన కాళేశ్వరం కమిషన్ చీఫ్

గజ్వేల్ ENC హరిరామ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. కమిషన్ చీఫ్ 90కి పైగా ప్రశ్నలను అడిగారు. అయితే.. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ENC హరిరామ్ దాటవేసినట్లు తెలుస్తోంది. రేపు మరోసారి కమిషన్ ముందు ENC హరిరామ్ హాజరుకానున్నారు. ఇవ్వాళ సమాధానం చెప్పని ప్రశ్నలకు రేపు డాక్యుమెంట్స్ సమర్పిస్తామని హరిరామ్ చెప్పారు. అయితే.. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లకు 29వేల 737 కోట్లు రీ పేమెంట్ చేసినట్లు హరి రామ్ కమిషన్‌కు తెలిపారు. బ్యాంక్ల నుంచి తీసుకున్న డబ్బులో 64వేల కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగాయని హరి రామ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రెయిన్ చైల్డ్ ఎవరని హరిరామ్‌ను కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ అడిగారు.