Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

టీచర్స్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో బెంగాల్ మంత్రికి ఈడీ నోటీసులు..

టీచ‌ర్స్ రిక్రూట్‌మెంట్ కుంభ కోణంలో ప‌శ్చిమ బెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హాకు ఎన్ ఫోర్స్మెంట్ (ఈడీ) ఇవాళ (మంగ‌ళ‌వారం) నోటీసులు జారీ చేసింది. మార్చి 22న సిన్హా నివాసంపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, మార్చి 27వ తేదీన ద‌ర్యాప్తు సంస్ధ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సిన్హాకు సమన్లు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది. ఇక, మంత్రి చంద్రనాథ్ సిన్హా ఇంట్లో దాడుల నేప‌ధ్యంలో ప‌లు ఆస్తి ప‌త్రాల‌ను, మొబైల్ ఫోన్‌తో పాటు 40 లక్షల రూపాయల న‌గ‌దును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బీజేపీ కీలక సమావేశం.. సీనియర్‌ నేతలు డుమ్మా..

విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు సిద్ధార్థ నాథ్ సింగ్, అరుణ్ సింగ్ హాజరయ్యారు. ఇక, తాజాగా బీజేపీ సీటు దక్కించుకున్న ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.. అయితే, బీజీపీ పదాధికారుల సమావేశానికి సీనియర్‌ నేతలు డుమ్మా కొట్టడం చర్చగా మారింది.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీనియర్‌ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా ఈ కీలక సమావేశానికి దూరంగా ఉన్నారు.. ఎన్నికల్లో సీట్లు ఆశించి భంగ పడ్డారు ఈ పడిన నలుగురు నేతలు. అయితే, ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని సత్యకుమార్‌ను, అనపర్తి నుంచి బరిలోకి దిగాలని సోము వీర్రాజు ముందు ప్రతిపాదనలు పెట్టింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. కానీ, అనపర్తి నుంచి పోటీ చేయడడానికి సోము వీర్రాజు విముఖత చూపిస్తున్నారట.. మరోవైపు.. జ్వరం కారణంగానే ఈ రోజు సోము వీర్రాజు సమావేశానికి హాజరు కాలేదంటున్నారు బీజేపీ నేతలు.. కానీ, ముఖ్య నేతల గైర్హాజరుపై బీజీపీ నేతల్లో చర్చ మాత్రం నడుస్తోంది..

సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఆందోళన..

దేశ రాజధాని ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)‌, ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా( బీజేపీ) పార్టీల ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆప్‌ శ్రేణులు గత మూడు రోజులుగా నిరసన చేస్తుండగా.. ఇక, కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ నేడు ( మంగళవారం ) బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో మూడు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న ఆప్‌ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ తర్వాత వదిలి వెళ్తున్నారు.

బొజ్జలపై మధుసూదన్ రెడ్డి ఫైర్.. కేసు పెట్టాలి..!

శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జ్‌ బొజ్జల సుధీర్ రెడ్డిపై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు.. వాలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని హితవుపలికారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నది వాలంటీర్ వ్యవస్థ కదా? అని ప్రశ్నించారు. వాలంటీర్లను అవమానించడం సరికాదు.. కరోనా సమయంలో విదేశాలలో ఉన్నవారి తల్లిదండ్రులకు సహాయపడింది వాలంటీర్ వ్యవస్థ అన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డిపై వాలంటీర్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని సూచించారు. కరోనా సమయంలో టీడీపీ జన్మ భూమి కమిటీలు ఏమైయ్యాయని నిలదీశారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఓ ఎర్రచందనం స్మగ్లర్‌ అంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి.. కాగా, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న వలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్‌రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారంటూ విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు.. కరోనా వంటి విపత్కర సమయంలో ధైర్యంగా సేవలు అందించారన్న విషయాన్ని మర్చిపోయి.. వారిని జిహాదీ తీవ్రవాదులు, టెర్రరిస్టులతో పోల్చడం ఏంటి అంటున్నారు.. మరోవైపు.. బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యాఖ్యలపై కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు భగ్గుమన్నారు.. తమకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చర్చకు సిద్దమా..? హరీష్ రావుకు జూపల్లి సవాల్..!

పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాలువలు తొవ్వకుండానే కేసీఆర్ ప్రాజెక్టు ప్రారంభించారని, హరీష్ రావు ఎక్కడికి వస్తావో చెప్పు ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ళలో ప్రజాధనం దోచుకుతిన్నారని మండిపడ్డారు. మళ్ళీ దోచుకునేందుకు హరీష్ రావు సచివాలయం ముట్టడి అంటున్నారని తెలిపారు. నీటి ఎద్దడికి బీఆర్ఎస్ కారణమని క్లారిటీ ఇచ్చారు. నీటి నిల్వలను ముందే ఎందుకు పెంచలేదు? అని ప్రశ్నించారు. వర్షాకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. పంట నష్టం పై ప్రభుత్వం సర్వే చేస్తుందన్నారు.

“మాతో చేరడానికి వరుణ్ గాంధీకి స్వాగతం”.. కాంగ్రెస్ ఆఫర్..

బీజేపీ నేత వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతోంది. తమ పార్టీలో చేరాలని సూచిస్తోంది. ఇటీవల బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల 5వ జాబితాలో వరుణ్ గాంధీని తప్పించింది. ఉత్తర్ ప్రదేశ్ పిలిభిత్ ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీని కాదని, ఆ స్థానాన్ని మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాదకు కేటాయింది. గత కొంత కాలంగా వరుణ్ గాంధీకి ఈ సారి ఎంపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం నేపథ్యంలో బీజేపీ అన్నంత పనిచేసింది. అయితే, ఆయన తల్లి మేనకాగాంధీని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ బరిలోకి దించింది.

కచ్చితంగా మెదక్ గడ్డపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతుంది

కచ్చితంగా మెదక్ గడ్డపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతుందని హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన సంగారెడ్డిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో మెదక్ నుంచి పోటీ చేద్దామని సర్వేలు చేసుకుని BRS గెలుస్తుందని తెలిసి వెళ్లిపోయారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థి రఘునందన్ పనిమంతుడు అయితే దుబ్బాకలో గెలిచేవాడు కదా అని ఆయన సెటైర్లు వేశారు. ముస్లింలకు కాంగ్రెస్ కేబినెట్‌లో మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు అర్థం అవుతున్నాయని, 6 గ్యారెంటీలు వంద రోజుల్లో చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట మార్చిందన్నారు హరీష్‌ రావు.

అన్నదాతల చెంతకు గులాబీ బాస్

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల ఎకరాల్లో పంటలకు నష్ట వాటిల్లింది. అయితే.. ఈ నేపథ్యంలోనే రంగంలోకి గులాబి బాస్‌ దిగనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతల చెంతకు కేసీఆర్‌ రానున్నారని, ఎండిన పంటలను కేసీఆర్‌ పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో కేసీఆర్‌ పర్యటిస్తారని ఆయన తెలిపారు.

మోడీ హ్యాట్రిక్​ ప్రధాని కాబోతున్నారు

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు రావడం ఖాయమని, మోడీ ప్రధానిగా హ్యాట్రిక్​ కొట్టబోతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి అన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సికింద్రాబాద్​ పార్లమెంట్​ నియోజకవర్గం పరిధిలో ఆయా కాలనీల్లో పర్యటించారు. అంబర్​ ట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్, సత్యా నగర్, రత్న నగర్ లో, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వెంకటగిరిలో ఆర్ట్రియా 10 అపార్ట్​ మెంట్, కామపురి కాలనీలో శ్రీ సాయిరాం మనోహర్ అపార్ట్​ మెంట్స్, శ్రీనగర్ కాలనీలోని ఎస్​ బీహెచ్ కాలనీ, ఉషా ఎంక్లేవ్, సాయికిరణ్ అపార్​ మెంట్స్, కామపురి కాలనీలో కృషి మిడాస్ తదితర ప్రాంతాల్లో బర్యటించి కాలనీవాసులతో సమావేశమయ్యారు.

ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు లక్ష్మీ నారాయణన్ శేషు అలియాస్ లొల్లు సభ శేషు కన్నుమూశారు. విజయ్ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన ‘లొల్లు సభ’ షో ద్వారా ఫేమస్ అయిన శేషు కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే అప్పటి నుంచి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రేపు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన వయసు 60 కాగా ఆయనకు ముగ్గురు కొడుకులు. శేషు స్మాల్ స్క్రీన్‌పై పాపులర్ కామెడీ షో లొల్లు సభతో మంచి ఫేమస్ అయ్యారు.

 

Exit mobile version