NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

వరద బాధితులకు గుడ్‌న్యూస్‌.. 4 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము జమ..

వరద బాధితులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ రోజు బాధితుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసింది.. విజయవాడలోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో వరద బాధితులకు పరిహారం పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సంభవించిన విపత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఎంత వరకు సాయం చేయాలో అంత వరకు చేశాం అన్నారు.. నాలుగు లక్షల మందికి రూ. 602 కోట్లు బాధితుల అకౌంట్లలో వేశామని తెలిపారు.. ఇప్పటి వరకు నేను చూడని విపత్తు ఇది. బుడమేరులో ఎప్పుడూ చూడని వరద. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో మోడ్రనైజేషన్ పనులు నిలిపేసింది. బుడమేరు కబ్జాకు గురైంది. మరో వైపు కృష్ణా నదిలో పెద్ద ఎత్తున వరద. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా పేర్కొన్నారు.

వరద సాయంపై సీఎం సమీక్ష.. డెడ్‌లైన్‌ విధింపు..

వరద సాయం ఏ మేరకు అందిందనే అంశంపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఇంకా సెటిల్ కాని క్లైమ్‌లను ఈ నెల 30వ తేదీలోగా సెటిల్ చేయాలని ఆదేశించారు.. ఈ నెల 30వ తేదీని డెడ్ లైన్‌గా పెట్టుకుని పని చేయాలన్నారు.. వరద ముంపులో దెబ్బతిన్న వాహనాల భీమా క్లెయిమ్‌ల చెల్లింపు, మరమ్మతులు, గృహోపకరణాల మరమ్మతులు, బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్ పై చర్చ సాగింది.. 11 వేల వాహనాల క్లెయిమ్‌లు వచ్చాయని సీఎంకు తెలిపారు అధికారులు.. ఇప్పటికీ 6500 క్లెయిమ్‌లు పరిష్కరించామని అధికారులు తెలిపారు.. 5 వేలకు పైగా గృహోపకరణాల మరమ్మతులకు ఫిర్యాదులు వచ్చాయన్నారు.. ఎల్జీ, శాంసంగ్ కంపెనీలు త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఆదేశించారు సీఎం.. వరద ముంపు ప్రాంతాల్లో నీటి కాలుష్యం కారణంగా అంటూ వ్యాధులు తలెత్తకుండా బయో టెక్నాలజీ వినియోగించినట్టు తెలిపారు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు. ఫైరింజన్ల ద్వారా అగ్నిమాపక శాఖ 76,731 ఇళ్లను , 331 కిలోమీటర్ల మేర రహదారులను శుభ్ర పర్చినట్టు వెల్లడించారు సీఎం..

మూసీ పరిధిలోని నిర్వాసితులు అనవసరమైన అపోహలకు లోను కావొద్దు..

మూసీ నది సుందరీకరణలో భాగంగా మూసీ రివర్ బెడ్లోని ప్రవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1600 నిర్మాణాలు సర్వే ద్వారా గుర్తించామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించడానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణను రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసి పునరావసం కల్పిస్తామన్నారు. దాదాపు 15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికై రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు చేసిందని తెలిపారు. అలాగే, రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణకై సంబంధిత జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని మూసీ రివర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ ఆదేశాలు జారీ చేశారు.

హర్యానా మెగా ర్యాలీలో కాంగ్రెస్‌ పై విరుచుకుపడ్డ మోదీ

హర్యానాలో ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. దేశంలోని అగ్రనేతలు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బుధవారం సోనిపట్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం హర్యానాకు పెద్ద సహకారం అందిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఆశ్రిత పక్షపాతాన్ని పెంచుతోందని ఆరోపించారు. ప్రధాని తన ప్రసంగంలో రైతులు, దళితులు, కుటుంబ వాదాన్ని ప్రస్తావించారు. గోహనాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. హర్యానాలో ఓటింగ్‌ రోజు దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీకి మద్దతు పెరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ రాజకుటుంబం దేశంలో అత్యంత అవినీతి కుటుంబం. పార్టీ హైకమాండ్ అవినీతికి పాల్పడినప్పుడు, క్రింద దోచుకోవడానికి ఓపెన్ లైసెన్స్ ఉంటుంది. 10 ఏళ్ల క్రితం హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసు అన్నారు. ఇక్కడ రైతుల భూములు దోచుకున్నారు, రాష్ట్రాన్ని దళారీలు, అల్లుడులకు అప్పగించారు. కాంగ్రెస్‌కు ఎక్కడ అవకాశం దొరికినా, ఎక్కడ అడుగు పెట్టినా అవినీతి, బంధుప్రీతి తప్పవని మీ అందరికీ తెలుసు. మన దేశంలోని ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని సృష్టించి, పెంచి పోషిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని మోదీ ఆరోపించారు.

ఏఆర్‌ డెయిరీకి టీటీడీ షాక్.. నెయ్యి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సప్లై చేసిన ఏఆర్ డెయిరీపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.10 లక్షల కేజీల నెయ్యి సప్లైకీ ఏఆర్ డెయిరీకీ ఈ ఏడాది మే 15వ తేదీన సప్లై ఆర్డర్స్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25వ తేదీతో పాటు జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల నెయ్యిని ఏఆర్ డెయిరీ సప్లై చేసిందని ఆయన వెల్లడించారు. ఆడల్ట్రేషన్ టెస్టింగ్ లేకుండా.. గతంలో వున్న పాత విధానాల టెస్టింగ్‌ని నిర్వహించి..ఈ నెయ్యిని టీటీడీ వినియోగించిందన్నారు. లడ్డు నాణ్యత పై భక్తుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో NDBL సహకారంతో ఆడల్ట్రేషన్ టెస్టింగ్ నిర్వహించాలని టీటీడీ నిర్ణయించిందన్నారు. జులై 6,12 వ తేదీల్లో ఏఆర్ డెయిరీ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలోని నెయ్యిని టెస్టింగ్ కోసం NDBL ల్యాబ్ కు పంపామన్నారు. ఈ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటేబుల్, అనిమల్ ఫ్యాట్ కల్తీ జరిగినట్లు ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చిందని ఆయన చెప్పారు. కల్తీ నెయ్యి సప్లై చేసినందుకు జూలై 22,23,27 వ తేదీల్లో ఏఆర్ డెయిరీకీ షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.

‘‘ఇది ఎన్‌కౌంటర్ కాదు’’.. బద్లాపూర్ కేసులో హైకోర్టు ఆగ్రహం..

బద్లాపూర్ ఎన్‌కౌంటర్ మహారాష్ట్రలో సంచలనంగా మారింది. గత నెలలో బద్లాపూర్‌లోని ఓ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న అక్షయ్ షిండే అనే వ్యక్తి నాలుగేళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలో ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆందోళనకారులు బద్లాపూర్ రైల్వే స్టేషన్, రోడ్లను ముట్టడించారు. ఇదిలా ఉంటే నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నిందితుడిని జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. నిందితుడు గన్ తీసుకుని కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా తాము ఫైర్ చేశామని చెప్పారు.

ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్‌పై అక్షయ్ షిండే తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు బాంబే హైకోర్టు విచారించింది. మహారాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఈ ఎన్‌కౌంటర్‌ని నమ్మడం కష్టంగా ఉంది, ఇందులో ఏదో తిరకాసు ఉంది. ఒక సామాన్యుడు రివాల్వర్ లాగా పిస్టల్‌ని కాల్చలేడు. ఒక బలహీనమైన వ్యక్తి పిస్టల్‌ని లోడ్ చేయలేడు’’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని నిందితుడి తల్లిదండ్రులు ఆరోపించడంతో కోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా పనిగణిస్తోంది.

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు..

తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తిరుమల పవిత్రతను దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. సీఎం పదవిలో ఉండి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారన్నారు. ల్యాబ్‌లో గుర్తించిన ఆవు నెయ్యి ట్యాంకర్‌లను వెన్నక్కి తిప్పి పంపామని ఈఓ శ్యామల రావు చెప్పారని ఆయన వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారన్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రసాదంపై చేస్తున్న అసత్య ప్రచారానికి పవన్ కూడా జత కలిశారన్నారు. దున్నపోతు ఈనిందంటే అన్న సామెత మాదిరి పవన్ తీరు ఉందన్నారు.కూటమి చేసిన ఈ అపవిత్ర ప్రచారం నేపథ్యంలో వచ్చే శనివారం ఆలయాల్లో పూజలు చేయటం ద్వారా పరిహారం చేయాలని నిర్ణయించామన్నారు. కూటమి నేతల పాపాల పరిహారం కోసం ఆలయాల్లో పూజలకు వైసీపీ పిలుపునిస్తోందన్నారు.

దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయని ఖర్గే చెప్పారు..

హోటల్ హరిత ప్లాజాలో కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా సమగ్ర కులగణన బీసీ రిజర్వేషన్స్ పెంపుపై రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్.. మాజీ ఎంపీ వీహెచ్.. బీసీ సంఘాల నేతలు.. ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. దేశంలో కులాలు ఉన్నంత వరకు రిజర్వేషన్స్ ఉంటాయని ఖర్గే చెప్పారన్నారు. ధైర్యంగా బీసీల కులగణన గురించి మాట్లాడుతున్న ఛాంపియన్ రాహుల్ గాంధీ అని, ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలనే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చామన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. డిక్లరేషన్ ను ప్రవేశ పెట్టే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి నాకే ఇచ్చారని, డిక్లరేషన్ కు ముందు కొన్ని మార్పుల కోసం కూర్చుంటే మీరు చేయండి నేను ఉన్నాను అని రేవంత్ చెప్పారన్నారు. కాళేశ్వరం ఒక పనికిరాని ప్రాజెక్ట్.. రాష్ట్రం అప్పుల్లో ఉందని, ఎంత ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం కమిట్మెంట్ తో పని చేస్తుందన్నారు మహేష్‌ గౌడ్‌.

దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు..

తిరుమల ప్రతిష్ట మంట గలిసేలా ఆలయాన్ని రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు లాగారని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబును దేవుడు క్షమించడన్నారు. చంద్రబాబు హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. మా హయాంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని తెలిపారు. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో తాజాగా నెయ్యి ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని.. ఈ నెయ్యిని కూడా వాడలేదన్నారు. గతంలో కొన్ని వందలసార్లు ఇలానే నెయ్యిని వెనక్కి పంపటం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్ల వెనక్కి పంపడం జరిగిందన్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారన్నారు.

గాంధీ భవన్‌లో మొదటి రోజు ముగిసిన ముఖాముఖి

గాంధీ భవన్‌లో మొదటి రోజు ముఖాముఖి కార్యక్రమంలో ముగిసింది. ఈ సందర్భంగా 285కు పైగా అప్లికేషన్లు మంత్రి దామోదర రాజనర్సింహ స్వీకరించారు. హెల్త్ ఇష్యూస్, 317 బాధితులు, భూ వివాదం, అక్రమ కేసులు, బదిలీలు అంటూ ఫిర్యాదు అందాయి. బీఆర్‌ఎస్ హయంలో రౌడీ షీట్ పెట్టారంటూ మంత్రి ముఖాముఖిలో సిరిసిల్లకు చెందిన యువకుడు ఫిర్యాదు చేశాడు. కేటీఆర్ తనపై తప్పులు కేసులు నమోదు చేశాడని ఫిర్యాదు చేశాడు సదరు యువకుడు. 30 ఫిర్యాదులను అప్పటికప్పుడు అధికారులకు ఫోన్ చేసి మంత్రి దామోదర రాజనర్సింహ పరిష్కారం చేశారు. గాంధీ, ఉస్మానియా, పోలీస్ స్టేషన్లకు చెందిన అర్జీలపై మంత్రి ఫోన్ చేశారు. 3.30 గంటల వరకు నిర్విరామంగా మంత్రి ముఖాముఖి కొనసాగింది.