లోకేష్ కౌంటర్ ఎటాక్.. అవి మీకు అలవాటు.. మాకు కాదు..!
ఏపీ శాసనమండలి వేదికగా మంత్రి నారా లోకేష్.. వైసీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది.. వైసీపీ కామెంట్లకు కౌంటర్ ఎటాక్‌కు దిగారు మంత్రి నారా లోకేష్.. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వండి, ఇప్పుడే విచారణకు ఆదేశిస్తా, అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. 19 మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17మంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. వైస్ చాన్సలర్లను మేం బెదిరించడం ఏమిటి? గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయి. ఎవరు బెదిరించారో చెప్పమనండి. గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ను రూంలోకి వెళ్లకుండా తాళం వేశారు. మీరా మాట్లాడేది? మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. వీసీలు తప్పుచేశారు కనుకే రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఎవరు బెదిరించారో చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏపీపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పండి. వీసీ పదవులకు కోసం 500 మంది దరఖాస్తు చేశారు, గత ప్రభుత్వం మాదిరి వీసీ పోస్టులను ఒకేవర్గానికి కట్టుబట్టలేదు. సామాజిక న్యాయం చేశాం. విద్యావేత్తలకు వీసీలుగా నియమించాం. గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలు వేశారు, బెదిరించడం, భయపెట్టడం, బయటకు పంపడం మీ అలవాటు, ముఖ్యమంత్రి సభలకు మీలా మేం స్కూలు పిల్లలను పంపలేదని మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. పరదాలు కట్టుకొని తిరగడం, తీర్పులు చెప్పిన జడ్జిల భార్యలపై పోస్టులు పెట్టడం మీ వాళ్లకు అలవాటు, ఈ కేసులో ఇప్పటికే కొందరు జైలులో ఉన్నారని వ్యాఖ్యానించారు మంత్రి లోకేష్.
త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం తేబోతున్నాం!
త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం తేబోతున్నాం అని, వర్గీకరణలో ఎవరి వాట వాళ్లకు అందుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సుప్రీంకోర్టు కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సభలో అమలుకు నిర్ణయం తీసుకోవడం మాములు విషయం కాదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. మార్చి 3న రవీంద్ర భారతిలో మాదిగల కృతజ్ఞత సభ ఉంటుందని మంత్రి దామోదర తెలిపారు. బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో మాదిగ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు మంత్రి దామోదర, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్యే వీరేశం హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన వారికి మంత్రి దామోదర రాజనర్సింహ నివాళులు అర్పించారు. వర్గీకరణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యుల కాళ్లను మంత్రి కడిగారు. ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఆర్ధిక సాయం అందించనున్న తెలిపారు. మంత్రి దామోదర మాట్లాడుతూ… ‘వర్గీకరణ ఉద్యమం అసహనం, అభద్రతల నుండి వచ్చింది. పోరాటం ఎవరికి వ్యతిరేకం కాదు . వర్గీకరణ కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగం జాతికి కనువిప్పు. ఉప కులాల అందరికీ న్యాయం జరగాలి. సుప్రీంకోర్టు కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే సభలో అమలుకు నిర్ణయం తీసుకోవడం మాములు విషయం కాదు. ఆ నిబద్ధత సీఎం రేవంత్ రెడ్డికి ఉంది. ఎవరు ఎన్ని వంకలు పెట్టినా.. ఏక సభ కమిషన్ అద్భుతమైన నివేదిక ఇచ్చింది. 52 లక్షల జనాభా ఉంటే.. 33 కులాలు ముట్టుకోలేదు. త్వరలోనే వర్గీకరణ చట్టం తేబోతున్నాం. వర్గీకరణలో ఎవరి వాట వాళ్ళకు అందుతుంది. అందుకు రేవంత్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అబద్ధాలు, మోసం ఎక్కువ కాలం పని చేయవు’ అని అన్నారు.
మేం మూడు స్థానాల్లో గెలుస్తున్నాం: కిషన్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధికి బీజేపీకి ఓటు వేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము మూడు స్థానాల్లో గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు వినాలని, అయన పనితీరు ఆధారంగానే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం మాపై విమర్శలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడినట్టు.. ఇప్పుడు మాట్లాడితే ఓట్లు పడతాయని సీఎం అనుకుంటున్నాడని విమర్శించారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ‘కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీకి పాలసీ ఉంటే.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గానీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయడం లేదు. రేవంత్ రెడ్డి మాటను తెలంగాణ ప్రజలు వినాలి, అయన పనితీరు ఆధారంగానే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. దొంగనే.. దొంగ దొంగ అన్నట్టు ఉంది రేవంత్ వ్యవహారం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మాపై విమర్శలు చేస్తున్నారు. చేతనైతే సీఎంగా పని చెయ్యి.. అనవసరంగా బురద చల్లకు. రీజనల్ రింగ్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్.. మధ్యలో నివేంది రేవంత్. అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడితే ఓట్లు పడతాయి అని అనుకుంటున్నాడు’ అని అన్నారు.
క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాం..
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు గడుస్తుంది. టన్నెల్‌లో గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీపై ఇంకా క్లారిటీ లేదు. రెస్క్యూ టీమ్స్ పలుమార్లు టన్నెల్‌లోకి వెళ్లి ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తిరిగి వచ్చాయి. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెస్క్యూ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వ శక్తులా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో అత్యంత నిపుణులైన 10 ఏజెన్సీలు ఈ రెస్క్యూలో పనిచేస్తున్నాయి.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, జియాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ అన్నీ కలిసి పనిచేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
దేశంలో మోడీ పాలన బాగుందని ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బిచ్కుంద మండల కేంద్రంలో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ బీజేపీ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ లను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేశంలో మోడీ పాలన బాగుందని ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని మహబూబ్ నగర్ ఎంపి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కె అరుణ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. శాసన మండలిలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్స్ ల సమస్య లు సాధించుకునేందుకు బీజేపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులు కొట్లడతారని అన్నారు. బీజేపీ అభ్యర్థులకు ఓటు ఎందుకు వేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్న హామీలు నెరవేర్చనందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. గతంలో ఒక సింఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం మూడు జిల్లాలు తిరిగిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి ఎమ్మెల్సీ ఓట్లను అడగాలన్నారు.
ఎమ్మెల్సీగా నా బాధ్యత కర్తవ్యం నెరవేరేవేర్చిన సంతృప్తి ఉంది
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. 2019 కు ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం బరిలో నిలిస్తే రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచారని, ఉద్యోగులు, ఉపాద్యాయులు, నిరుద్యోగులు తరఫున మండలి లో ప్రశ్నించే గొంతుగా అందరి సమస్యలు చర్చకు తీసుకు వచ్చానన్నారు. ఎమ్మెల్సీ గా నా బాధ్యత కర్తవ్యం నెరవేర్చిన సంతృప్తి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక సభ్యుడిగా అత్యధిక సమయాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన అని, సిట్టింగ్ ఎమ్మెల్సీ గా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావించడం సహజమని, అసెంబ్లీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదు , ఎంపీ ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ గెలుపొందడం నిరాశ కు గురిచేయడంతో ఎమ్మెల్సీ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదన్నారు. ఉత్తర తెలంగాణ విద్యా వేత్త నరేందర్ రెడ్డి.. పరిచయం అవరసం లేని వ్యక్తి అని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలో అర్హత కల్పించడం లో లక్ష మందిని తీర్చిదిద్దిన ఘనత నరేందర్ రెడ్డి కి దక్కుతుందన్నారు జీవన్ రెడ్డి.
కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసింది..
తెలంగాణ భవన్‌లో స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన మాజీ జడ్పిటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి.. 15 నెలల కాలంలోనే అధికార పార్టీని వదిలిపెట్టి బీఆర్ఎస్‌లో చేరుతున్నారంటే.. కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉందో చెప్పొచ్చని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోనూ పట్నం నరేందర్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్‌లో చేరారని అన్నారు. 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు కోపం వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
పసి బిడ్డలను అమ్ముకుంటున్న ముఠా అరెస్ట్
రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అంతర్జాతీయ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను ఛేదించి సంచలనం రేపారు. గుజరాత్‌లో జన్మించిన పసి పిల్లలను అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి అమ్మకాల యత్నం చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా సభ్యులు ఆడ శిశువులను రూ. 2.5 లక్షలకు, మగ శిశువులను రూ. 4.5 లక్షలకు విక్రయిస్తుండగా, పోలీసుల దాడిలో వారి పథకం భగ్నమైంది. దీనికి సంబంధించిన సమాచారం ముందస్తుగా అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ (SOT) మరియు చైతన్యపురి పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పవన్ కల్యాణ్ నోట మరోసారి క్షమాపణలు..
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పవన్ నోట మళ్ళీ క్షమాపణలు అనే పదం వచ్చింది. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా గవర్నర్ నిన్న విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని తెలిపారు. ఎన్డీఏ సభ్యులు 164 మంది చాలా బాధ్యతతో ఉన్నారు.. వైసీపీ నేతల తీరుపట్ల తమ తప్పు లేకున్నా గవర్నర్ కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. గొడవలకు, బూతులకు వైసీపీ పర్యాయ పదం అని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఇంత కాలం వారిని తట్టుకుని నిలబడినందుకు సీఎం చంద్రబాబుకు ఎన్నో గట్స్ ఉన్నాయి.. నిన్న నాకు వైసీపీ వైఖరి చూసి వివేకా హత్య, ప్రజావేదిక కూల్చివేత, ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జడ్జీలపై పెట్టిన కామెంట్లు.. దాడులు గుర్తొచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే.. చంద్రబాబును జైల్లో పెట్టిన విధానం గుర్తొచ్చిందని పేర్కొన్నారు.
ముగిసిన పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం..
కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టబద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ప్రచారం ముగిసింది. ఈనెల 27 న టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. గత 15 రోజులుగా ప్రచారాన్ని హోరెత్తించారు అభ్యర్థులు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. పట్టభద్రుల స్థానంలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్య ట్రయాంగిల్ వార్ జరుగనుంది. బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేశారు పార్టీ అగ్రనేతలు.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్… పలువురు మంత్రులు ప్రచారం చేయగా.. బీజేపీ అభ్యర్థికి మద్దతు గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బండి సంజయ్ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రచారం చేశారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 3,55,159 మంది పట్టబద్ర ఓటర్లు, 27088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ స్థానంలో 499 పోలింగ్ కేంద్రాలు, టీచర్ స్థానంలో 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఈనెల 27 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 3 న ఓట్ల లెక్కింపు ఉంటుంది.