NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

మొట్టమొదటి రీయూజబుల్ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగించిన ఇండియా

భారతదేశం తన మొట్టమొదటి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ 1 ను ప్రయోగించింది. చెన్నైలోని తిరువిడండై నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. రూమి 1ని తమిళనాడు స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా, మార్టిన్ గ్రూప్ అభివృద్ధి చేశాయి. మొబైల్ లాంచర్ సహాయంతో ప్రారంభించబడింది. 3 క్యూబ్ ఉపగ్రహాలు, 50 PICO ఉపగ్రహాలతో రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ప్రయోగం తర్వాత, హైబ్రిడ్ రాకెట్ పోలోడ్‌ను సముద్రంలోకి విడుదల చేసింది. దీనిని మళ్లీ కొత్త ప్రయోగానికి ఉపయోగించబడుతుంది. రూమి-1 ఇంజిన్‌లో లిక్విడ్ ఆక్సిడైజర్, ఘన ఇంధనం ఉపయోగించబడ్డాయి. రాకెట్ ఎయిర్‌ఫ్రేమ్ కార్బన్ ఫైబర్, గ్లాస్ ఫైబర్‌తో తయారు చేయబడింది. దీనితో పాటు, దేశీయంగా అభివృద్ధి చేసిన పైరో టెక్నాలజీ, పారాచూట్ డిప్లాయ్‌మెంట్ సిస్టమ్ కూడా ఉపయోగించబడింది.

సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. జగన్‌ ఆలోచనలు అంచనా వేయలేం..!

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు.. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంచనాలు వేయడం కష్టం అన్నారు.. విశాఖపట్నం రాజధాని పేరు చెప్పి 500 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాడు.. తప్ప రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఈ పరిస్థితులను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని వెల్లడించారు.. ఇక, ప్రపంచ దేశాలను ఆ ఆకర్షిస్తున్న విశాఖలో ఫార్మా ప్రమాదాలు యాదృచ్ఛికంగా జరగడం ఆందోళనకరం అన్నారు.. శ్రీకాకుళంలో విశాఖ కంటే ముందే ఫార్మా ఇండస్ట్రీలు ఏర్పాటు అయినా.. విశాఖలోనే ఎందుకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయో విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.. ఇప్పటికైనా ఈ ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పంచాయితీ నిధులను గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు సోము వీర్రాజు.

బీ అలర్ట్.. ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు..

గత కొంతకాలంగా అనేక చోట్ల ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతు కోట్ల రూపాయలు కోళ్లగొడుతున్నాయి ముఠాలు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి చెందిన కొందరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. ఈ ముఠాల కోసం ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సైబర్ క్రైమ్ పోలీసుల బృందాలు వెళ్లాయి. సైబర్ ముఠాలకు అకౌంట్స్ సప్లయ్ చేస్తున్న వారితో పాటు అకౌంట్ హోల్డర్లలను సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ముఠాలకు సంబంధించిన కీలక నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. దేశవ్యాప్తంగా మొత్తం 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. గుజరాత్ లో స్పెషల్ ఆపరేషన్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 36 మంది నిందితులను అరెస్టు చేసారు. అందులో ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్ తో పాటు ఒక చార్టెడ్ అకౌంట్ ను కూడా అరెస్ట్ చేసారు. 11 ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ 4 ట్రేడింగ్ ఫ్రాడ్స్,4 ఫెడెక్స్ ఫ్రాడ్స్, కొరియర్ ఫ్రాడ్స్, నాలుగు కేవైసీ ఫ్రాడ్స్ లో వారిని అరెస్ట్ చేసారు.

అనుకోకుండా ఒక మాట తొర్లాను.. కేటీఆర్ కామెంట్స్..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేడు రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా.. ఆయనను అడ్డుకునేందుకు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు విశ్వ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కేటీఆర్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకరంగా వారు నిరసన వ్యక్తం చేశారు. ఇకపోతే, రాష్ట్ర ‍మహిళా కమిషన్‌ (బుద్ధ భవన్‌) ఆఫీసు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనకు ఉమెన్ కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో మహిళా కమిషన్‌ ముందు వివరణ ఇచ్చేందుకు ఆయన ఆఫీసుకు వెళ్లిగా నిరసన సెగ తగిలింది.

మహిళపై పోలీసుల పక్షపాత వైఖరిని ఖండిస్తున్నాం

మహిళపై పోలీసుల పక్షపాత వైఖరిని ఖండిస్తున్నామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ప్రతి పక్ష పోషిస్తున్నారా అర్థం కాట్లేదని, మమ్ముల్ని జుట్టు పట్టుకుని బూట్లతో తన్నారని ఆమె ఆరోపించారు. సీపీ విచారణ చేసి యూనిఫాం వేసుకున్న దొంగ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు బ్రేక్ డాన్స్ లు వేస్తారన్న కేటీఆర్ ఇంట్లో కూడా బ్రేక్ డాన్స్ లు వేస్తున్నారా అని ఆమె మండిపడ్డారు. కేటీఆర్ కల్చర్ బ్రేక్ డాన్స్ కల్చర్,పబ్ ల కల్చర్ అని ఆమె విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ను చూస్తే మహిళలు తల దించుకొని పోతరని, కేటీఆర్ మహిళలపై కించపరిచే విధంగా మాట్లాడిండు అని ఆమె మండిపడ్డారు.

కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్‌ ల్యాబ్‌లో కెమికల్ పౌడర్ వాసన పీల్చి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గల కారణం కెమికల్ పౌడర్ అని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులను బాపట్ల ఏరియా హాస్పిటల్‌కి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు.. విషయం తెలుసుకున్న వెంటనే హటావుటిన జిల్లా జాయింట్ కలెక్టర్ బి సుబ్బారావు, విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటన ఎందువల్ల జరిగింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాఫీ పొడి, షుగర్‌తో పాటు, సోడియం, ఇతర కెమికల్స్ కలిపిన పౌడర్‌ను, ఓ విద్యార్థి తీసుకువచ్చి సహచర విద్యార్థులకు వాసన చూపించాడని, దీంతోనే విద్యార్థులకు అనారోగ్య సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు.

“నేరస్థుడి మృతదేహానికి స్మశానవాటికలో స్థలం ఇవ్వం”.. నిందితుడి గ్రామస్థుల తీర్మానం!

అస్సాంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లాం శనివారం ఉదయం పోలీసుల అదుపు నుంచి తప్పించుకున్నాడు. నాగావ్ జిల్లాలోని డింగ్ వద్ద చెరువులో దూకి మరణించిన విషయం తెలిసిందే. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశామని.. తెల్లవారుజామున 3.30 గంటలకు ‘క్రైమ్ సీన్’ని విచారించడానికి నేరస్థలానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తఫ్జుల్ ఇస్లాం పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని చెరువులో దూకాడని పేర్కొన్నారు. వెంటనే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా.. సుమారు రెండు గంటల తర్వాత అతని మృతదేహాన్ని వెలికితీశారు.

ప్రభుత్వం స్పందించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు..

పులివెందుల ఎమ్మెల్యే అనకాపల్లి వచ్చి ప్రమాదంపై మంత్రులు ,ప్రభుత్వం స్పందించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని.. ఎసెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తం అయిందన్నారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేయకపోతే మృతుల సంఖ్య పెరిగేదన్నారు. వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయన్నారు. క్షతగాత్రులను తక్షణమే హాస్పటల్స్‌కు తరలించామని మంత్రి తెలిపారు.

పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం

పూణే జిల్లాలోని పౌడ్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా ముగ్గురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలి కూడా బలంగా వీస్తోంది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీ పంకజా దేశ్‌ముఖ్‌ ప్రకటన వెలువడింది. దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. “పూణేలోని పౌడ్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ హెలికాప్టర్ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందినది. అది ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తోంది. హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. ఈ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ పేరు ఆనంద్ సదర్. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చేరాడు. అందులో డీర్ భాటియా, అమర్‌దీప్ సింగ్, ఎస్పీ రామ్ అనే మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.” అని పేర్కొన్నారు.

చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్‌లోని కట్టడాలను కూల్చివేశాం..

గచ్చిబౌలిలోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్‌లోని కట్టడాలను కూల్చివేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదని.. హైకోర్టులో స్టే ఇచ్చినట్టుగా చెప్తుంది పూర్తిగా అవాస్తవమన్నారు. ఎఫ్టీఎల్‌లో కట్టడాలు ఉన్నందునే కూల్చి వేయడం జరిగిందన్నారు. చెరువుని పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారని.. చట్ట ప్రకారమే హైడ్రా వ్యవహరించి కట్టడాలను కూల్చివేసిందని ఆయన వెల్లడించారు. కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం ప్రయత్నించిందని.. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్‌ను అధికారులు గతంలోనే తిరస్కరించారని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ పైన ఇప్పటికే లోకాయుక్తతో పాటు హైకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ఎన్‌ కన్వెన్షన్‌లో పూర్తిగా అన్ని కట్టడాలను నేలమట్టం చేశామని.. ఎన్ కన్వెన్షన్ ప్రస్తుతం జీరోగా మారిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.