NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

అక్రమ సంబంధం అనుమానం.. ప్రియుడిపై 20సార్లు కత్తిపోట్లు

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు భర్త. కాగా.. రెండ్రోజుల తర్వాత ఈ హత్య ఉదంతం బయట పడింది. వివరాల్లోకి వెళ్తే.. భర్త కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఈ క్రమంలోనే తన భార్యతో ప్రియుడు మనోజ్‌కు ఫోన్ చేయించాడు. అయితే ఈ విషయం తెలియక వస్తున్న ప్రియుడు మనోజ్‌పై భర్త మహేంద్ర కుమార్‌ తన వద్ద తుపాకీకి ఉండే కత్తితో దాదాపు 20 సార్లు పొడిచాడు. దీంతో.. మనోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అంతేకాకుండా.. మనోజ్ తో పాటు వచ్చిన అతని స్నేహితుడు రోహిత్ లోధిని కానిస్టేబుల్ చంపేశాడు. అయితే.. శుక్రవారం రాత్రి లఖింపూర్‌లోని నాగ్వా వంతెన సమీపంలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసు దర్యాప్తులో కానిస్టేబుల్ ఈ హత్యను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి చంపాడని తేలింది.

బీఆర్‌ఎస్‌ అధినాయకుడికి దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలను తీవ్రంగా విమర్శించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు బీదర్‌లో దొంగనోట్ల ముద్రణ ప్రెస్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ ముద్రించిన నకిలీ నోట్లే ఎన్నికల సమయంలో పంపిణీ చేసినట్లు ఆరోపించారు. తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో తీవ్రంగా అప్పులపాలైందని, ప్రస్తుతం రాష్ట్రంపై రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని ప్రభుత్వమే అంగీకరిస్తోందని తెలిపారు. ప్రభుత్వ భూములు అమ్మకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని, కమీషన్ల వ్యవస్థ మరింత పెరిగి 15 నుంచి 18 శాతానికి చేరిందని ఆరోపించారు.

భర్త దారుణహత్య.. జైలులో డ్రగ్స్ డిమాండ్ చేస్తున్న భార్య, లవర్..

మీటర్‌లో హత్యకు గురైన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో పనిచేస్తున్న సౌరభ్, తన కుమార్తె పుట్టిన రోజు కోసం ఇండియాకు వచ్చిన తరణంలో మార్చి 04న అతడి భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి దారుణంగా హత్య చేశారు. శరీరాన్ని ముక్కలు చేసి డ్రమ్‌లో వేసి, సిమెంట్‌తో కప్పేశారు. వీరిద్దరని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే, వీరిద్దరు జైలులో కూడా డ్రగ్స్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ బానిసలు కావడంతో, అవి లేకపోవడంతో తీవ్రంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం. జ్యుడీషియల్ కస్టడీలో ఉంచినప్పటికీ తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారని జైలు వర్గాలు చెప్పాయి. నిందితులు ఇద్దరిని జైలులోని డీ అడిక్షన్ సెంటర్‌లో పరిశీలనలో ఉంచారు. వీరి పరిస్థితి మరింత దిగజారితే వైద్య పర్యవేక్షణలో ఉంచవచ్చు. ఈ లక్షణాలు స్థిరీకరించడానికి 8-10 రోజులు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు, డ్రగ్స్ లేనిదే ఆహారం తీసుకోమని చెబుతున్నట్లు తెలుస్తోంది.

రిటైర్మెంట్‌ పుకార్లపై ఎంఎస్ ధోనీ క్లారిటీ..

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తన రిటైర్మెంట్ గురించి మరోసారి ఓపెన్ అయ్యాడు. 43 ఏళ్ల ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్ తనకు చివరి సీజన్ అవుతుందని క్రికెట్ అభిమానులు భావించినప్పటికీ.. రిటైర్మెంట్‌ను ప్రకటించలేదు. 2025 సీజన్ కూడా ఆడనున్నాడు. ఈ ఎడిషన్‌ ముగిసిన తర్వాత ఆటకు గుడ్‌బై చెబుతాడని మళ్లీ గుసగుసలు మొదలయిన నేపథ్యంలో మారోసారి క్లారిటీ ఇచ్చాడు.

డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజస్వరూపం బహిర్గతం

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగంలో కీలక అంశాలు వెలువడ్డాయి. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ రెండు పార్టీలు పోటీపడి మాట్లాడిన తీరు, దేశంలో లేని సమస్యను సృష్టించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడం, వారి అసలు ఉద్దేశ్యాన్ని బహిర్గతం చేసిందని తెలిపారు.

డీలిమిటేషన్ అంశంపై ఇప్పటివరకు పార్లమెంట్‌లో కానీ, కేబినెట్‌లో కానీ ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టంగా తెలిపారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్న తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడులో డీఎంకే పాలన అవినీతితో నిండిపోయిందని, స్టాలిన్ కుటుంబ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దాచిపెట్టేందుకు డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర.. మున్సిపల్ ఛైర్మన్ శాంత

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ శాంత చేపట్టిన నిరసన దీక్ష నాల్గవ రోజుకు చేరింది. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నేను చేసిన తప్పేంటో చూపించండి అంటూ వైసీపీ కౌన్సిలర్లకు ఛైర్మన్ శాంత సవాల్ విసిరారు. తనను తొలగించేందుకు కౌన్సిలర్లకు భారీగా డబ్బు ముట్టిందని ఆరోపించారు. ప్రతీ కౌన్సిలర్‌కు లక్షన్నర ఇచ్చారని, వైస్ చైర్మన్‌కు ఐదు లక్షలు ముట్టాయి అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

డీలిమిటేషన్ అంశంపై కేకే కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పొలిటికల్ యూనిటీ (రాజకీయ ఏకీకరణ) గురించి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉందని ఆయన పేర్కొన్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం గురించి మాట్లాడుతూ, ఈ మీటింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. కే. కేశవరావు మాట్లాడుతూ, డీలిమిటేషన్ అనేది కేవలం పార్లమెంట్‌లో సీట్ల పెంపు గురించి కాదని, ప్రతి రాష్ట్రానికి బలమైన ప్రతినిధిత్వం ఉండాలని కోరే ప్రక్రియ అని వివరించారు. ప్రతి జనాభా గణన తర్వాత ఇదే వివాదం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తుందని గుర్తు చేశారు. ప్రధానంగా ఫెడరలిజం నశిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “మోడీ – అమిత్ షా ఫెడరలిజాన్ని పూర్తిగా మర్చిపోయారు. సెంట్రల్ లిస్ట్‌ను పెద్దది చేశారు, స్టేట్ లిస్ట్‌ను తగ్గించారు. ఫలితంగా, రాష్ట్రాల హక్కులు పోతున్నాయి” అని కేశవరావు వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ ఆరోపణలపై కేటీఆర్‌ ఘాటు సమాధానం

కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన దొంగనోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ తాము దొంగనోట్లను ముద్రించారని ఆరోపించడం విచిత్రమని వ్యాఖ్యానించారు. బండి సంజయ్‌ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్, “మీరు కేంద్రమంత్రిగా ఉండి మమ్మల్ని దొంగలు అంటారు. అయితే, అప్పుడు కర్ణాటకలో మీరే అధికారంలో ఉన్నారు కదా? దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాల్సింది మీరే!” అని వ్యాఖ్యానించారు. నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీ నేతలకు అలవాటైపోయిందని ఆరోపించారు.

దేశంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) చేపట్టకూడదన్నదే తమ పార్టీ యొక్క స్పష్టమైన డిమాండని కేటీఆర్ తెలిపారు. “దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. అందుకే, ఈ సమస్యను చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు హాజరయ్యాం,” అని వివరించారు.

రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ.. సంతోషం వ్యక్తం చేసిన మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. రుషికొండ బీచ్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చి, బ్లూఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక శాఖ అధికారులను సమర్థంగా దిశానిర్దేశం చేసి, తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించామని చెప్పారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు విశేష కృషి చేసిన పర్యాటక శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్ హరేంద్రీ ప్రసాద్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పోలీస్, అటవీ శాఖల అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ముంబై ఇండియన్స్ టీంలో కీలక బౌలర్ దూరం.. మూల్యం తప్పదా?

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన రెండు జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. 18వ సీజన్‌లో భాగంగా నేడు రెండు టీంలు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు తలపడినప్పుడల్లా.. అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ రోజు కూడా అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. గత 12 సంవత్సరాలుగా ముంబై ఇండియన్స్ జట్టు తొలి మ్యాచ్‌లో గెలవకపోవడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా లేకుండా ముంబై ఇండియన్స్ ముందుకెళ్తోంది. ఇది టీంకి కలిసి రాకపోవచ్చని క్రికెట్ నిపుణులు అంచనా..