Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఇదంతా కక్ష సాధింపే.. కవిత అరెస్టుపై బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఫైర్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై బీఆర్ఎస్ ఎంపీలు తొలిసారి స్పందించారు. కవిత అరెస్ట్ రాజకీయ కక్ష అని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, వావిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ ఇవాల ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేశారని అన్నారు. లొంగిపోయేలా చేసేందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారని నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయాలనే ఆలోచన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు చెప్పారు.

మంగళగిరిని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం!

రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే దేశంలోనే నెంబర్1గా అమరావతిని తీర్చిదిద్దుతానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేసి అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి పట్టణంలోని పీఈపీఎల్ శ్రీ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ లో బ్రేక్ ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం ద్వారా అక్కడ నివాసితులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా 2014లో కట్టుబట్టలతో ఇక్కడకు వచ్చామన్నారు. ఆనాడు అమరావతిని అందరి ఆమోదంతో రాజధానిగా ఏర్పాటుచేసుకున్నాం.. అభివృద్ధి వికేంద్రీకరణకు పెద్దపీట వేశాం.. రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ మాయలో జగన్ కు ఓటు వేశారు అని ఆయన ఆరోపించారు. వైసీపీ వచ్చిన తర్వాత అమరావతిని విధ్వంసం చేశారు.. ఇక్కడ పనులు ఆగిపోవడానికి ఈ ప్రాంత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డే కారణం. కేసులు వేసి రాజధాని ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారు అని తెలిపారు. ఉపాధి కోసం మన ప్రాంత యువత హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే పరిస్థితి నెలకొంది.. ప్రజాప్రభుత్వం వచ్చాక అమరావతికి పూర్వవైభవం తీసుకువస్తాం.. మన ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటుచేసి పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని నారా లోకేష్ వెల్లడించారు.

రెండు ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ఎస్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్నారు. మొత్తం 17 పార్లమెంటరీ స్థానాలకు గానూ పార్టీలు ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే తాజాగా తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది. కాగా.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయనున్న మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కేసీఆర్ ఖరారు చేశారు. అలాగే… మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ, మాజీ ఐఏఎస్ అధికారి పి.వెంకట్రామ్ రెడ్డిని ఖరారు చేశారు.

అలిగిన ఆలపాటి.. రంగంలోకి అధిష్టానం..

సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవుతోన్న తెలుగుదేశం పార్టీ.. ఈ రోజు 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో బరిలోకి దిగనున్న టీడీపీ.. ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. ఈరోజు తాజాగా మరో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు వెల్లడించింది.. అయితే, టీడీపీ తాజా జాబితాలో కొన్ని నియోజకవర్గాల్లో చిచ్చు పెట్టింది.. ఈ జాబితాలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు చోటు దక్కలేదు.. టీడీపీ తనకు టికెట్ కేటాయించక పోవడంపై ఆలపాటి ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.

పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తాం..

పార్టీ మారే వాళ్ళ అక్రమాలను బయటకు తీస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు వస్తున్న నేతలపై కూడా ఆయన స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లకు అభ్యర్థులు లేక… మా వాళ్లను పిలిచి టికెట్లు ఇస్తున్నారని తెలిపారు. కొందరు ఇక్కడ గెలిచి వేరే పార్టీలలోకి వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిరికిపంద లే పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. అక్రమంగా సంపాదించు కున్న సొమ్మును సక్రమం చేసుకునేందుకు పార్టీలు మారుతున్నారని తెలిపారు. అలాంటి వారి అక్రమాలను మేమే బయట పెడతామన్నారు.

బోడె ప్రసాద్‌కు టీడీపీ టికెట్.. మంత్రి జోగి రమేష్‌ సంబరాలు..

కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పేరును ప్రకటించింది టీడీపీ అధిష్టానం.. టీడీపీ తాజాగా విడుదల చేసిన మూడో లిస్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పెనమలూరు సీటుకు బోడె ప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.. అయితే, బోడెకి పెనమలూరు సీటు ఇవ్వడంతో.. ఆ స్థానంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న మంత్రి జోగి రమేష్ సంబరాలు చేసుకుంటున్నారు.. కార్యకర్తలకు స్వీట్లు పంచారు జోగి రమేష్.

ఈడీ అధికారులపై కేజ్రీవాల్ నిఘా..?

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని నిన్న ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా రక్షణ ఇవ్వలేని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే నిన్న సాయంత్ర కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆయన కస్టడీ కోసం రోస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

ఇదిలా ఉంటే నిన్న జరిగిన తనఖీల్లో పలు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేజ్రీవాల్ ఈడీ అధికారులపై గూఢచర్యం చేస్తున్నట్లు ఈ పత్రాలు చూపించాయని తెలుస్తోంది. కేజ్రీవాల్ నివాసంలో సోదాల సమయంలో సుమారు 150 పేజీల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. డాక్యమెంట్లలో ఈడీ టాప్ అధికారుల్లో ఇద్దరి గురించి కీలక సమాచారం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోదాల సమయంలో అధికారుల ప్రత్యేక డైరెక్టర్ ర్యాంక్ అదికారి, జాయింట్ డైరెక్టర్ ర్యాంక్ అధికారికి సంబంధించిన సున్నితమైన సమాచారం కలిగిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇద్దరు అధికారులు గుర్తింపు బయటకు వెళ్లడించలేదు.

ఐపీఎల్ సీజన్ 17లో సరికొత్త నిబంధనలు..

మరికొన్ని గంటల్లో ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-ఆర్సీబీ మధ్య జరుగనుంది. అందుకోసం ఫ్యాన్స్ ఇప్పటికే.. చెన్నై చెపాక్ స్టేడియానికి భారీగా చేరుకుంటున్నారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. ఈ ఐపీఎల్లో బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఐపీఎల్ లో బీసీసీఐ కొత్త టెక్నాలజీ అమలు చేయనుంది. అంపైర్లు తీసుకునే నిర్ణయాల్లో మరింత కచ్చితత్వం, వేగం పెంచేందుకు ఈ సీజన్ నుంచి స్మార్ట్ రీప్లే సిస్టమ్ అమలు చేయనుంది బీసీసీఐ. అంటే ఇద్దరు హాక్ ఐ ఆపరేటర్లు టీవీ అంపైర్ ఉండే గదిలోనే ఉంటారు. ఫీల్డ్ అంతటా ఉన్న 8 హాక్ ఐ స్పీడ్ కెమేరాల నుంచి వచ్చే ఫుటేజ్‌ను తక్షణం అందిస్తారు.

జాతి ప్రయోజనాలు కాపాడుతుంది మా సీఎం రేవంత్

మోడీ మాదిగలకు ఏం చేశారో మందకృష్ణ సమాధానం చెప్పాలన్నారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతి ప్రయోజనాలు కాపాడుతుంది మా సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. సుప్రీంకోర్టులో మా ప్రభుత్వం అడ్వకేట్ ని పెట్టి కొట్లాడుతుందని, మాదిగ బిడ్డను నేను.. నన్ను ఎమ్మెల్యే.. ఏఐసీసీ కార్యదర్శి ని చేసింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీకి జాతిని అంటగట్టే పనిలో మందకృష్ణ ఉన్నారని, పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానన్నారు. కిషన్ రెడ్డి.. వెంకయ్య నాయుడుతో తిరిగి మందకృష్ణ కండ్లకు మసక పట్టిందన్నారు. దళితులు ఊరి చివర ఉండాలని చెప్పిన బీజేపీ కి ఎలా మద్దతు ఇస్తుందన్నారు. మాదిగ కోసం ఒక్కటైనా చేసిందా చెప్పు మందకృష్ణ అని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు..

ఆదాయ పన్ను శాఖ తమపై ప్రారంభించిన రీ-అసెస్మెంట్ ప్రొసీడింగ్స్‌ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ.. ఈ రిట్ పిటిషన్‌ని కొట్టేస్తున్నట్లు తెలిపారు. 2014-15, 2015-16 మరియు 2016-17 సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలుగా అధికారులు తమపై ప్రారంభించిన టాక్స్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్‌లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మార్చి 20న తన ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ తరుపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన వాదనల్ని వినిపించారు.

వాలంటీర్లను టీడీపీ, ఐటీడీపీ భయపెట్టాలని చూస్తుంది..

వైసీపీ నాయకులు కార్యక్రమాల్లో వాలంటీర్లు కనబడితే తమ వాట్సాప్ నెంబర్ కు సమాచారం పంపించమని ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ టీడీపీ నాయకులు ప్రారంభించారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. వాలంటీర్లు సాధారణ మనుషులు కాదా అని ప్రశ్నించారు. వాలంటీర్లను టీడీపీ, ఐటీడీపీ భయపెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అభం శుభం తెలియని వాలంటీర్లపై ఎమ్మెల్యే కాండిడేట్ ఆదిరెడ్డి వాసు కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటును మరోసారి గెలిపించి సీఎంకి కానుకగా ఇవ్వాలి

మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అలాంటి మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటును మరోసారి గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు., మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం బోయిన్‌పల్లిలోని జయలక్ష్మి గార్డెన్స్ లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలంటే అభివృద్ధి కుంటు పడకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజులోనే కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి 159 ఎకరాల కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర అవసరాలకు వినియోగించుకునేలా ఒప్పించడం గొప్ప విషయం అన్నారు.

వైజాగ్ డ్రగ్ కేసులో టీడీపీ నేతల సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది..

వైజాగ్ డ్రగ్ కేసులో గుమ్మడి కాయ దొంగ అంటే బుజాలు తడుముకున్నట్టు ఉంది టీడీపీ పరిస్థితి అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ కు ఆరోపణలు చేయడానికి బుద్ధి ఉండాలి కదా? అని దుయ్యబట్టారు. తమ పై విమర్శలు చేస్తున్నారు.. ఆ కంపెనీలు పురంధేశ్వరి దగ్గరి బంధువులది అని అంటున్నారని సజ్జల పేర్కొన్నారు. వైజాగ్ డ్రగ్ కేసులో టీడీపీ నేతల సంబంధం ఉన్నట్టు బలంగా అనిపిస్తుందని తెలిపారు. వైజాగ్ డ్రగ్ కేసులో ఎవరు ఉన్నారో విచారణ చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను కోరుతామని తెలిపారు. SCB పెట్టిన తర్వాత 11 వేల ఎకరాల్లో గంజాయి ధ్వంసం చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలోనేనని గుర్తు చేశారు. వైజాగ్ డ్రగ్ కేసులో తమపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

నన్ను నమ్ముకున్న వారిని ఎప్పుడూ వదులుకోను.. వాళ్లు మోసం చేశారు..!

కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో కొందరు నేతలు తనను అడ్డం పెట్టుకుని బాగా సంపాదించుకున్నారని ఆరోపించారు. వాళ్ళు ఎంతెంత సంపాదించారో తన దగ్గర జాబితా ఉందన్నారు. ఈరోజు తనను వదిలి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నుంచి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాంటి నేతలను వైసీపీలో చేర్చుకుని తప్పు చేశానని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీ మమ్మల్ని తప్పుపడుతూ.. వాళ్ళు సత్యమంతులాగా మట్లాడుతున్నారు

బీజేపీ దేశాన్ని దోచుకుంటుందని, కాంగ్రెస్ అకౌంట్లు సీజ్ చేసింది మోడీ సర్కారు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకౌంట్ సీజ్ చేసి 100 కోట్లు విత్ డ్రా చేసుకుందని, 14 లక్షల రూపాయలు.. ఎంపీ లు క్యాష్ రూపంలో ఇచ్చారు అని అకౌంట్స్ క్లోజ్ చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా అకౌంట్స్ క్లోజ్ చేయడం బీజేపీ రాజకీయ దిగజారుడు తనం కి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఉన్న డబ్బులు ఖర్చు చేయకుండా ఆంక్షలు పెట్టడం ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు.

 

Exit mobile version