NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగేలా చూస్తాం..

తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఏఎస్డీ లిస్ట్ లో ఉన్న 54 వేల మంది ఓటర్ లిస్ట్ లో 4 వేల మంది మాత్రమే ఓటు వేశారు అని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. బెంగళూరు అర్బన్ లో 30 శాతం ఏ.ఎస్.డి ఉంది.. ఇక, స్ట్రాంగ్ రూంలో ఈవీఏంలు పటిష్ఠమైన భద్రంగా ఉన్నాయి.. చాలా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ చేస్తామని పేర్కొన్నారు. ముందుగా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ప్రారంభిస్తాం.. తిరుపతి జిల్లాలో 24 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక, జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.

ఎన్టీఆర్ బర్త్ డే.. జపాన్ లేడీ ఫ్యాన్స్ మాస్ సెలెబ్రేషన్స్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా ఎంతగానో పాపులర్ అయ్యారు.ఎన్టీఆర్ తన మాస్ పెర్ఫార్మన్స్ తో గ్లోబల్ వైడ్ గా ప్రేక్షకులను అలరించాడు.దీనితో ఎన్టీఆర్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా ఒక ట్యాగ్ లైన్ వచ్చింది.తన అద్భుతమైన నటనతో ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కు వుండే క్రేజ్ వేరు.జపాన్ లో ఎన్టీఆర్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూస్తారు.ఎన్టీఆర్ డాన్స్ ను అక్కడి ప్రేక్షకులు ఎంతగానో ఇష్ట పడతారు.అంతే కాదు ఎన్టీఆర్ సినిమాలోని మాస్ సాంగ్స్ ను రీ క్రియేట్ చేస్తూ అక్కడి ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తారు.

పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలు నిషేధం..

ఎన్టీఆర్ జిల్లా మొత్తం సెక్షన్ IPC 144, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించినట్లు తెలిపారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది.. అపోహలకు పోయి ఎలాంటి గొడవలకు దారి తీయొద్దు.. అనుమానాలుంటే పోలీసు నంబర్లకు కాల్ చేయచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఇక, స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్, డ్రోన్లు ఎగురవేసినా, అతిక్రమించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింప చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ వెల్లడించారు.

చేసిన అభివృద్ధి చెప్పుకోలేక పోవడం మా తప్పు..

మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలేక పోవడం మా తప్పు అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి స్వల్ప ఓటింగ్ తేడా తో బీఆర్ఎస్ ఓటమి అన్నారు. 14 సీట్ల లో ఓటమి పాలు అయ్యం అన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ఉదరకొట్టింది కాంగ్రెస్ అన్నారు. అరచేతిలో వైకుంఠం కాంగ్రెస్ చూపించింది.. అధికారం శాశ్వతం కాదు.. ఎప్పుడు ఎవ్వరో ఒక్కరి దిగి పోవాల్సిందే అన్నారు. ఉద్యమ కారులకు దూరం అయ్యామన్నారు. దేశంలో ఎక్కడ చేయనంత ఉపాధి కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు.

రెండు లక్షల ఉద్యోగాలు కల్పనలో బీఆర్ఎస్ కృషి వుందన్నారు. 2014 నుంచి 24 వరకు కేసీఆర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. లెక్కలతో సహా వివరాలు ఇస్తాం ఆ సత్తా మాకు వుందన్నారు. ఇంత కంటే గొప్పగా ఉపాధి కల్పించిన ప్రభుత్వం ఎక్కడన్నా వుందా అంటే కాంగ్రెస్ బీజేపీ ల నుంచి సమాధానం లేదన్నారు. ఇంత చేసిన సోషల్ మీడియా లో దుష్ప్రచారం జరిగిందన్నారు. యువత సోషల్ మీడియా కు ఆకర్షితులు అయ్యారని మండిపడ్డారు. మేము చేసిన అభివృద్ధి చెప్పుకోలేక పోవడం మా తప్పు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రేవ్ పార్టీలో బుక్కై.. బుకాయించిన హేమ

బెంగళూరు సమీపంలో ఆదివారం రాత్రి రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేశారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు పట్టుబడ్డారు. ఆంధ్రా, బెంగళూరుకు చెందిన దాదాపు 100 మందికిపైగా పార్టీకి హాజరయ్యారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మరోసారి రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జూన్ 3 వరకు రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మే 20 వరకు పొడిగించిన రిమాండ్ గడువు నేటితో ముగిసింది. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కవిత.. తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో కవితకు రిమాండ్ ను పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. కాగా.. ఈ కేసులో మార్చి 26 నుంచి కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే..

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం.. చల్లబడిన నగరం

హైదరాబాద్‌ నగరంలోని పలు చోట్ల మళ్లీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో మధ్యహ్నం నుంచి వర్షం మొదలైంది. భాగ్యనగరంలోని బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్, ముసాపేట, ఎర్రగడ్డ, మధురానగర్, యూసఫ్ గూడ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. మిగతాప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

విద్యావంతులు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలి..

ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్, రేవంత్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు మూడు డీఏలు అన్నారు… ఒక్క డీఏ కూడా రిలీజ్ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… ఉద్యోగులను మోసం చేసిందన్నారు హరీష్‌ రావు. విద్యావంతులు, నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచన చేసి ఓటు వేయాలని, కాంగ్రెస్ కు ఓటేయడమంటే కాంగ్రెస్ మోసాన్ని బలపరిచినట్లవుతుందన్నారు హరీష్‌ రావు. ముప్పై రోజులైనా వడ్లు కొనలేదని, తడిసిన ధాన్యం కొనుగోలు చేసే నాథుడు లేడని ఆయన వ్యాఖ్యానించారు. బోనస్ విషయంలో చేతులెత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష తప్పదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు హరీష్‌ రావు.

డీజీపీని కలిసిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్.. అల్లర్లపై నివేదిక అందజేత

ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 13 మంది సభ్యులతో సిట్ బృందాన్ని ప్రభుత్వం నియమించింది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో సిట్ విచారణ పూర్తి చేసింది. సోమవారం సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ అయ్యారు. 150 పేజీలతో సుదీర్ఘ నివేదికను వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీ కి సమర్పించారు. ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు గుర్తించినట్లు సమాచారం.

జూన్‌ 8న ‘చేప ప్రసాదం’

మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది.. బత్తిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది. జూన్ 8న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబీకులచే వార్షిక ‘చేప ప్రసాదం’ ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ప్రతి సంవత్సరం, బత్తిని కుటుంబం ఆస్తమా మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి చేప ప్రసాదం పంపిణీ చేస్తుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జూన్ 8న జరిగే మృగశిర కార్తె సందర్భంగా పంపిణీని కొనసాగించాలని నిర్ణయించారు. వార్షిక ఆచారంగా, దూద్‌బౌలిలోని బథిని కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటిలో కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత, అది చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తుంది. 2023లో సుమారు రెండు లక్షల మందికి చేప ప్రసాదం అందించారు. ఈ ఏడాది వీటి సంఖ్య పెరుగుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కోరారు.