సీఎం మమతా బెనర్జీకి బెదిరింపులు.. విద్యార్థి అరెస్టు!
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యసిబ్బంది, విద్యార్థులతో సహా పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి హద్దు దాటి వ్యవహరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా పోస్టు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
రక్షా బంధన్ సందర్భంగా చెట్టుకు రాఖీని కట్టిన సీఎం..
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు రక్షా బంధన్, బీహార్ ట్రీ ప్రొటెక్షన్ డే సందర్భంగా పాట్నాలోని రాజధాని వాటికలోని ‘బాంబాక్స్ ఇంపలాటికా చెట్టు’ కు రక్షణ దారాన్ని కట్టారు. ఈ సందర్భంగా రాజధాని ఉద్యానవనంలో ‘దొరండా’ మొక్కను కూడా ముఖ్యమంత్రి నాటారు. రక్షా బంధన్ శుభ సందర్భంగా, ముఖ్యమంత్రి ” బీహార్ ట్రీ ప్రొటెక్షన్ డే”ని ప్రారంభించారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడం, మొక్కలను సంరక్షించడం, మరిన్ని చెట్లను నాటడం దీని లక్ష్యం. వాతావరణ మార్పుల వల్ల భూమికి కలిగే నష్టాన్ని తగ్గించడానికి, చెట్లను నాటడం, వాటిని రక్షించడం చాలా ముఖ్యం. జల్-జీవన్-హరియాలీ తదితర పథకాల కింద చెట్ల పెంపకం పెద్ద ఎత్తున జరుగుతోంది. రాష్ట్రంలో ఎకో టూరిజంను ప్రోత్సహించే దిశగా కూడా పనులు సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రయత్నాల వల్ల పర్యావరణం, జంతు సంరక్షణ, చెట్ల పెంపకంపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
దారుణంగా అత్యాచారం.. శరీరంపై 14 చోట్ల గాయాలు!
కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు చెందిన 31 ఏళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వైద్యురాలిపై అఘాయిత్యం జరిగిన తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తోంది. నిందితులను అస్సలు వదిలిపెట్టొద్దని యావత్ దేశం ఆందోళన చేస్తోంది. అయితే ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం నివేదిక గురించి మరిన్ని వార్తలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యురాలిని దారుణంగా అత్యాచారం చేశారని, ఆమె శరీరంపై 14 చోట్ల గాయాలు ఉన్నాయని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.
ట్రైనీ డాక్టర్ శరీరంపై 14 చోట్ల గాయాలు ఉన్నాయని శవపరీక్షలో గుర్తించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. బలవంతంగా లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని నివేదికలో ఉంది. బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు సహా జననాంగాలపై 14 గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టంలో గుర్తించారు. ఆమె ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లు తెలుస్తోంది. శవపరీక్ష నివేదిక ఆధారంగా ఆమె దారుణంగా అత్యాచారం మరియు హత్యకు గురైందట.
తల్లి అంత్యక్రియలకు చిన్నారి భిక్షాటన.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
తల్లి ఆత్మహత్యతో ఒంటరిగా మిగిలిపోయిన బాలిక దుర్గకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలం బేల్‌తరోడా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మేర గంగామణి (36) శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె ఏకైక కుమార్తె దుర్గ (11) అనాథగా మిగిలింది. తల్లి అంత్యక్రియలకు డబ్బులేకపోవడంతో దుర్గ భిక్షాటన చేసింది. విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. బాలికకు విద్యా,వైద్య, ఇతర అవసరాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు బాలికకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు. వైద్య, ఇతర సమస్యలేమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
వయనాడ్‌లో ‘పోర్క్ ఛాలెంజ్’పై రచ్చ.. ముస్లిం సంస్థలు తీవ్ర ఆగ్రహం
ఇటీవలే కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించిన వయనాడ్‌లో పంది మాంసం తినే ఛాలెంజ్‌పై తీవ్ర రచ్చ నెలకొంది. సహాయక చర్యల కోసం డబ్బు సేకరించేందుకు ప్రారంభించిన ఈ ప్రచారంపై ముస్లిం సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోర్క్ ఛాలెంజ్‌పై వచ్చిన విమర్శలపై డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్‌ఐ) స్పందిస్తూ.. ఇది ఏ మత సమాజాన్ని కించపరిచేలా చేయలేదని పేర్కొంది. “మా ప్రాంతంలో అత్యధికంగా వినియోగించే ఆహార పదార్థాల్లో పంది మాంసం ఒకటి. మా ఉద్దేశం కేవలం సహాయ కార్యక్రమాల కోసం డబ్బును సేకరించడం మాత్రమేనని, ఏ వర్గాన్ని కించపరచడం కాదు” అని డివైఎఫ్‌ఐ కొత్తమంగళం యూనిట్ కార్యదర్శి జియో పియస్ తెలిపారు. కాగా.. ఆదివారం డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పంది మాంసం ఛాలెంజ్‌ను నిర్వహించారు.
గుడ్‌న్యూస్.. ఏపీలో త్వరలో నూతన టెక్స్‌టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ
అధికారులతో ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడుదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త టెక్స్‌టైల్ పాలసీపై చర్చించారు. త్వరలో నూతన ఏపీ టెక్స్ టైల్, అపెరల్, గార్మెంట్స్ పాలసీ తీసుకురానున్నామని మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా టెక్స్‌టైల్ రంగంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ఇందుకోసం మౌలిక వసతుల కల్పనతో పాటు రాయితీలు కూడా విరివిరిగా అందజేస్తామని ఆమె ప్రకటించారు.
సాంకేతిక కారణాలతో కాని వారికి త్వరలో రుణమాఫీ..
డిసెంబర్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పి జూలైలోనే రుణమాఫీ మొదలు పెట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. లక్షా 20 వేల మంది రైతులు ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చారని.. లక్షా 61 వేల రైతుల ఆధార్ కార్డుల్లో, అకౌంట్స్‌లో పేర్లు తప్పులు ఉన్నాయన్నారు. 4 లక్షల 83 వేల మందికి రేషన్ కార్డుల్లో తప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 8 లక్షల అకౌంట్స్ రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నారని.. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వారు పై అమౌంట్ కడితే వెంటనే రుణమాఫీ అవుతుందన్నారు. నాడు బీఆర్‌ఎస్ రుణమాఫీ టోటల్ ఫెయిల్యూర్ అని.. నాడు కేసీఆర్ చేసిన రుణమాఫీ రైతుల బ్యాంకు వడ్డీలకే సరిపోయిందని మంత్రి విమర్శించారు.
పదేళ్లు బీఆర్‌ఎస్‌కి అధికారం ఉన్నా.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు
కేటీఆర్‌కి కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌కి అధికారం ఉన్నా.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం అంటే తొలగిస్తాం అంటున్నాడని ఆయన మండిపడ్డారు. విదేశాల్లో చదువుకున్న వ్యక్తివి.. ఇవేం బుద్దులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సర్కార్ వచ్చిన తర్వాత మీరు ఏం విగ్రహం పెట్టుకుంటారో పెట్టుకోండి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎయిర్ పోర్ట్ పేరు మారుస్తాం అని అనవరస మాటలు మాట్లాడకు అని ఆయన అన్నారు. మీ నాన్నకి రాజకీయం భిక్ష రాజీవ్ గాంధీ తోనే అని, నీ స్థాయి నువ్వే తగ్గించుకునే మాటలు మాట్లాడటం మానుకో అని హనుమంతరావు హితవు పలికారు. త్యాగం చేసిన రాజీవ్ గాంధీ పేరు మారుస్తా అనకు అని, మరోసారి రాజీవ్ గాంధీ గురించి మాట్లాడితే నీకే అవమానం అని ఆయన అన్నారు. మేము కూడా మాట్లాడతాం.. దెబ్బకు దెబ్బ మా కల్చర్ కాదని ఆయన అన్నారు.
కలుషిత ఆహారంతో విద్యార్థులు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిలో జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
జూనియర్ ఆర్టిస్ట్ హత్య.. భర్తే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
సినిమా ఆర్టిస్టు హత్యకు గురయ్యారు. ఆర్టిస్ట్ ని చంపేసి ఆత్మహత్యగా భర్త చిత్రీకరించే ప్రయత్నం చేశారు చివరికి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.. జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ను హత్య భర్త చేసి పారిపోయాడు. పరారీలో భర్త శివరామయ్య కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన 36 సంవత్సరాల మహిళను అతని భర్త గొంతు నులిమి చంపాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని మల్లికార్జున కాలనీకి చెందిన మద్దూరి అనురాధ (36) హత్యకు గురైనట్లు పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. మల్లికార్జున కాలనీలో నివాసం ఉంటున్న మద్దూరి అనురాధ, శివరామయ్య దంపతులు తరచుగా గొడవపడేవారని వివరించారు. చిత్ర పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసిన అనురాధ పై భర్త శివరామయ్య అనేక అనుమానాలు వ్యక్తం చేసేవాడని ఈ విషయంలో అనేక గొడవలు జరిగేవని కూతురు నందిని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు.
