Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్ న్యూస్

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ఎల్లుండి తెలంగాణకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్..!

తెలంగాణ రాష్ట్రానికి ఎల్లుండి (జూన్ 19న) కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాబోతున్నారు. ఇక, కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో వారికి స్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. భారీ ర్యాలీతో పాటు బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇక, ఎల్లుండి ( బుధవారం) మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్టు లో కిషన్ రెడ్డీ, బండి సంజయ్ లకి బీజేపీ శ్రేణులు భారీగా స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ తీయనున్నారు. ఆ తర్వాత సన్మాన సభలో పాల్గొంటారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు దర్శించుకోనున్నారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. గంజాయి సేవించిన డీజే సిద్ధూ..!

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. DJ సిద్ధార్థతో సహా మరో వ్యక్టి కొకైన్ & గంజాయి సేవించినట్లుగా నార్కోటిక్స్ బ్యూరో నిర్ధారణ చేసింది. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. మాదాపూర్ & గచ్చిబౌలి పబ్ లో డ్రగ్స్‌తో సంబంధం ఉన్న 16 మందిని ఎన్సీబీ పిలిపించి పరీక్షలు నిర్వహించింది. యూరిన్ బ్లడ్ టెస్ట్ లో డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షల రిపోర్టులో వెల్లడైంది. డీజే సిద్ధార్థతో పాటు మరో వ్యక్తిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో U/s. 27 NDPS చట్టం, 1985 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, పబ్స్ దగ్గర డ్రగ్స్ వినియోగదారులపై పోలీసులు నిఘా పెట్టారు. పబ్బుల వద్ద డ్రగ్స్ డిటెక్టివ్ పరికరాలతో నార్కోటిక్ బ్యూరో అధికారులు పరీక్షలు నిర్వహించారు. డీజే సిద్ధార్థతో పాటు మరో వ్యక్తి స్వరూప్ ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. పరీక్షల్లో డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా డీజే సిద్ధార్థ కదలికలపై ఫోకస్ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. డ్రక్స్ కేసులో ఇంక ఎవరెవరికి ప్రమేయం ఉందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రతీ పెండింగ్‌ ప్రాజెక్టును పరిశీలిస్తా.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పనిచేస్తా..

తాను ఇంకా చార్జ్‌ తీసుకోలేదు.. కానీ, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రతీ ప్రాజెక్టును పరిశీలించి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలో అధినేత చంద్రబాబు ఆదేశానుసారం పనిచేస్తానని తెలిపారు మంత్రి నారా లోకేష్.. రాష్ట్ర మంత్రి హోదాలో మొట్టమొదటిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్.. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని, తమ మైనార్టీ నాయకులపై వైసీపీ ముకలు గాయపరిచి దాష్టీకానికి గురి చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌కు కోర్టు రూ.1620 కోట్ల జరిమానా

దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీకి కోట్ల రూపాయల దెబ్బ తగిలింది. టాటా గ్రూపునకు చెందిన ఐటీ కంపెనీకి అమెరికా కోర్టు కోట్ల రూపాయల మేర భారీ జరిమానా విధించింది. ఈ సమాచారాన్ని కంపెనీ స్వయంగా కలిగి ఉంది. వాస్తవానికి, అమెరికన్ ఐటి సేవల సంస్థ డిఎక్స్‌సి (గతంలో సిఎస్‌సి అని పిలిచేవారు) వాణిజ్య రహస్యాన్ని దుర్వినియోగం చేసినందుకు టిసిఎస్‌పై అమెరికన్ కోర్టు 194 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.1620 కోట్ల జరిమానా విధించింది. సీఎస్ఈకి 56 మిలియన్ డాలర్ల నష్టపరిహారం, 112 మిలియన్ డాలర్ల ఆదర్శప్రాయమైన నష్టపరిహారం చెల్లించాలని టీసీఎస్ ని కోర్టు కోరింది.

స్టాక్ మార్కెట్లకు టీసీఎస్ అందించిన సమాచారం ప్రకారం.. దానిపై విధించిన జరిమానా 194.2 మిలియన్ డాలర్లు. ఇందులో 561.5 మిలియన్ డాలర్ల పరిహార నష్టాలు, 112.3 మిలియన్ డాలర్ల నష్టాలు, 25.8 మిలియన్ డాలర్ల ముందస్తు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ కరెన్సీలో జరిమానా మొత్తం సుమారు రూ. 1,622 కోట్లు.

ఐఐటీ ఖరగ్‌పూర్ లో ఉరి వేసుకున్న విద్యార్థిని..

ఐఐటీ ఖరగ్‌పూర్ నాలుగో సంవత్సరం విద్యార్థిని హాస్టల్‌లో సోమవారం ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని దేవికా పిళ్లై (21)గా సీనియర్ పోలీసు అధికారి గుర్తించినట్లు తెలిపారు. హాస్టల్ భవనం సీలింగ్‌ కు విద్యార్థిని వేలాడుతూ కనిపించింది. ఇది ఆత్మహత్యా లేక మరేదైనా అన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ మరణంపై దర్యాప్తు మొదలు పెట్టారని అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖరగ్‌పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించినట్లు వారు తెలిపారు. ఈ వార్తను ధృవీకరిస్తూ, ఐఐటీ ఖరగ్‌పూర్ మూలం ప్రకారం, బయోటెక్నాలజీ విభాగంలో నాలుగో సంవత్సరం విద్యార్థి అయిన పిళ్లై ఉదయం సరోజినీ నాయుడు హాస్టల్ హాల్ పైకప్పుకు ఉరివేసుకుని కనిపించింది. దాంతో మేము పోలీసులకు సమాచారం అందించాము. అపై వారు మృతదేహాన్ని క్రిందికి తీసుకువచ్చారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత., మేము మరిన్ని వివరాలను అందిస్తామని కాలేజీ యాజమాన్యం తెలిపింది.ఈ సంఘటన ఇది ఆత్మహత్య కేసా.. కాదా.. అని తెలిపారు. కేరళకు చెందిన పిళ్లై నాలుగో సంవత్సరం విద్యార్థిని అని పోలీసు అధికారి తెలిపారు.

ఆర్టీసీ సిబ్బందిని అభినందించిన సీఎం రేవంత్‌ రెడ్డి

కరీంనగర్ బస్ స్టేషన్‌లో గర్భిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న టీజీఎస్‌ఆర్టీసీ మహిళా సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.  ‘కరీంనగర్ బస్ స్టేషన్ లో గర్బిణికి కాన్పు చేసి మానవత్వం చాటుకున్న  #TGSRTC మహిళా సిబ్బందికి నా అభినందనలు.  మీరు సకాలంలో స్పందించడం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విధి నిర్వహణలో కూడా మీరు ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.’ అని ఆయన ట్వీట్టర్‌ (X) వేదికగా పేర్కొన్నారు.  ఊరెళ్దామని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చిన ఓ గర్భిణికి అక్కడే నొప్పులు మొదలవడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది చీరలు అడ్డుపెట్టి డెలివరీ చేశారు. 108 వచ్చే లోపు సాధారణ ప్రసవం చేసి తల్లిని, బిడ్డను ఆసుపత్రికి తరలించారు.

ఫలక్‌నుమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నాయకురాలు మాధవి లత ఆదివారం హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో స్లమ్ ఏరియాను పరిశీలించి జీవన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. “ఇక్కడ ఒక స్లమ్ ఏరియా చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. సరైన నీటి సౌకర్యం లేదు. డ్రైనేజీ నీరు , త్రాగునీరు (మిక్సింగ్) కలిసి ఉంటాయి. ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ నీటికి ఔట్‌లెట్ లేదు. ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి సౌకర్యం లేదు… వెళ్లి ప్రాథమిక పాఠశాల పరిస్థితిని చూడండి…దాని బాత్‌రూమ్ సరిగా పనిచేయడం లేదు… దానిలోని ఒంటరి ఉపాధ్యాయుడు డ్యూటీకి సరిగ్గా రిపోర్ట్ చేయడం లేదు. దీనిపై ఫిర్యాదు చేస్తాం…’’ అని లత మీడియాకి తెలిపారు.

ఈ నెల 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు.. ముగ్గురికి ఒకే చోట పేషీలు ఇవ్వాలని కోరిన జనసేన

ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 19వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. పవన్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జయకేతనం ఎగురవేశారు. సెక్రటేరియట్‌లో పవన్‌ కల్యాణ్‌కు సెకండ్ బ్లాక్ 212 రూం కేటాయించినట్టు సమాచారం. పవన్ ఛాంబర్, పేషీ, వ్యక్తిగత సిబ్బంది కోసం మూడు రూంలు కేటాయించినట్లు తెలిసింది.

పోలవరం అనేక సంక్షోభాలను ఎదుర్కొంది.. ప్రాజెక్టును గందరగోళంగా చేశారు..

ఏపీకి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి.. అధికారులతో పోలవరం ప్రాజెక్టు, స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు.

ఐసీయూలో తండ్రి.. కూతుళ్లిద్దరూ ఏం చేశారంటే..!

ఆ తండ్రి.. తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు గ్రాండ్‌గా చేయాలని భావించాడు. అందుకు తగినట్టుగా వివాహ ఏర్పాట్లు చేశాడు. పెళ్లి కార్డులు పంచాడు. బంధువుల్ని పిలిచాడు. ఇంకోవైపు వివాహ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ఇల్లంతా సందడి.. సందడిగా ఉంది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ.. అంతలోనే ఊహించని పరిణామం ఆ కుటుంబాన్ని దు:ఖంలో పడేసింది. ఉన్నట్టుండి ఆ తండ్రికి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో విలవిలలాడిపోయాడు. హుటాహుటినా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అంతే తన తండ్రిని సంతోష పెట్టేందుకు ఐసీయూలోనే వివాహం చేసుకుని కోరిక నెరవేర్చారు.

మణిపూర్‌లో జరిగిన హింసపై అమిత్ షా సమీక్ష..

ఏడాది కాలంగా జాతి హింసకు గురవుతున్న మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సమీక్షించనున్నారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భద్రతా బలగాలకు చెందిన సీనియర్ అధికారులు హాజరుకానున్నారు. అందుకోసమని.. ఆదివారం రోజున మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే సమీక్ష కోసం వచ్చారు. ఈ క్రమంలో.. ఈశాన్య రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు. మణిపూర్‌లో 2023 మే 3న షెడ్యూల్డ్ తెగ హోదా కోసం.. మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర తర్వాత హింస చెలరేగింది. అప్పటి నుండి హింస కొనసాగుతూనే ఉంది. ఈ హింసలో కుకీ, మెయిటీ వర్గాలకు చెందిన 220 మందితో పాటు కొందరు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మణిపూర్ జనాభాలో మెయిటీలు దాదాపు 53 శాతం ఉన్నారు. వీరు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తుంటారు. మరోవైపు.. నాగాలు, కుకీలను కలిగి ఉన్న గిరిజనులు 40 శాతం ఉన్నారు. వీరు కొండ జిల్లాలలో నివసిస్తుంటారు.

 

Exit mobile version